S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కేన్స్ కళకళ.. బాలీవుడ్ తళతళ

ప్రపంచ సినిమా పండుగ వేళ వచ్చేసింది..
మరో మూడు రోజుల్లో జరిగే ఆ వేడుక కోసం పారిస్‌లోని కేన్స్ ముస్తాబవుతోంది. ఎర్రగా కళకళలాడుతున్న కార్పెట్‌పై తళతళ మెరిసేందుకు మన తారలు నడకలు నేరుస్తున్నారు. వెండితెరపై సరికొత్త రూపంలో ఆవిష్కారమయ్యే సృజనాత్మక చలనచిత్రాల మధ్య జరిగే పోటీని తిలకించి, విశే్లషించి, శోధించాలని తపించే సినీ పండితులు పారిస్‌కు పయనమయ్యారు. పోటీలో లేకపోయినా తమతమ ప్రతిభాపాటవాలను మిగతా ప్రపంచానకి చాటిచెప్పాలని ఉవ్విళ్లూరే సినీ ప్రపంచం కేన్స్‌కు తరలివెళుతోంది. మే 11నుంచి పదిరోజులపాటు జరిగే ఈ వేడుక ప్రత్యేకతలు తెలుసుకుంటే సగటు సినీ అభిమాని గుండె ఉప్పొంగిపోతుంది.
సినిమా ఓ దృశ్యకావ్యం
సినిమా 24 విభాగాల సమాహారం..
సినిమా కొందరికి ఊపిరినిస్తుంది..
సినిమా మరికొందరికి జీవితం..
సరికొత్త ఆలోచనలకు సెల్యులాయిడ్ రూపమిచ్చి...జనం చేత సెహభాష్ అన్పించుకోవాలనుకోవడం మరికొందరికి ఇష్టం.
సృజనకు పదునుపెట్టి, వెండితెరపై మనసుపెట్టి, అద్భుతాలు సృష్టించడం మరికొందరికి ఇష్టం.
కళలు, సంస్కృతిని కాపాడి భావితరాలకు పరిచయం చేసేందుకు సినిమా ఓ ఆయుధమని, ఓ మంచి మాధ్యమమని నమ్మిన ఓ రాజకీయ నాయకుడు.. జీన్ జె కన్న కలల ప్రతిరూపమే నేటి కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్. నిన్నమొన్నటివరకు ప్రపంచ సినీ పండుగగా చెప్పుకున్న ఈ వేడుక ఒలింపిక్స్ తరువాత ప్రసార మాధ్యమాలు ఎక్కువగా ఆసక్తిచూపే పండుగంటే నమ్మాల్సిందే.
ఎవరీ జీన్ జె?
ఫ్రాన్స్ ప్రభుత్వంలో లలిత కళలు, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన జీన్ జె ఆలోచనాధోరణి విభిన్నం. సినిమా అంటే ఆయనకు ప్రాణం. యూరోప్ జీవనశైలి, సంస్కృతి అంటే వల్లమాలిన అభిమానం. ఆ సంస్కృతికి అద్దం పట్టే సినిమాల ప్రదర్శన, విస్తృతి, ప్రచారానికి తగిన వేదిక, అవకాశాలు దొరకడం లేదన్న ఆవేదన ఆయన మనసును తొలిచేసేది. ఇది 1936నాటి మాట. అప్పటికి సినిమా ప్రపంచానికి పెద్ద ఆకర్షణ బెర్లిన్ ఫిలిమ్ ఫెస్టివల్, వెనిస్ ఫిలిమ్ ఫెస్టివల్ మాత్రమే. ఫ్రాన్స్ చిత్రాల ప్రదర్శనకు తగిన అవకాశం అక్కడ దక్కడం లేదన్నది జె మనసులో గూడుకట్టుకుంది. కొన్ని సిద్ధాంతాల చిత్రాలకే అక్కడ అవకాశాలు లభిస్తున్నాయన్న భావన ఆయనలో పెరిగింది. అమెరికా సహా మరో రెండు ప్రధాన దేశాలదీ అదే భావన. ఆ రెండు చిత్రోత్సవాలను తలదనే్నలా ఫ్రాన్స్‌లో సినీ సంబరాలు నిర్వహించాలని తలపెట్టిన జే చేసిన ప్రయత్నానికి అమెరికా బృందం వత్తాసు పలికింది. 1939లో తొలిసారిగా చిత్రోత్సవాన్ని నిర్వహించాలని భావించినప్పటికీ, యుద్ధం, బడ్జెట్, ఇతర కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. చివరకు 1947లో తొలిసారిగా లాంఛనంగా ప్రారంభించారు. ‘ఫెస్టివల్ డు ఫిల్మ్ డి కేన్స్’ పేరుతో నిర్వహించిన ఈ చిత్రోత్సవంలో 16 దేశాల నుంచి సినీవర్గాలు హాజరయ్యాయి. ఆ తరువాత ఆ వేడుకకు ‘ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్’గా పిలవడం ప్రారంభమైంది. 2002వరకు అదే ఆనవాయితీ ఉండేది. ఆ తరువాత ఈ వేడుక ‘కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్’గా రూపాంతరం చెందింది.
కేన్స్ చిత్రోత్సవం వైభవం...
తొలిసారి జరిగిన కేన్స్ చిత్రోత్సవానికి పదహారు దేశాలనుంచి మాత్రమే ప్రతినిధులు హాజరయ్యారు. యూరోప్ దేశాలకు చెందిన సినిమాల ప్రదర్శనే అప్పటి లక్ష్యం. ఆ తరువాత కొన్ని మార్పులు చేశారు. ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన సినిమాలనైనా ఇక్కడ ప్రదర్శించి, ప్రచారం చేసుకుని, వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించడంతో ఒక్కసారిగా కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రాధాన్యత పెరిగిపోయింది. పోటీ విభాగంలో మాత్రం ఐరోపా దేశాల సినిమాలకే అవకాశం ఇస్తున్నారు. ముఖ్యంగా ఫ్రెంచ్ చిత్రాలదే పైచేయిగా ఉంటుంది. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆకర్షణ ఉందో చెప్పడానికి కొన్ని అంకెలు చెబితే సరిపోతుంది. ఒలింపిక్స్ తరువాత అతిపెద్ద ఆకర్షణ ఉన్న వేడుక ఇదే. గతేడాది జరిగిన కేన్స్ వేడుకకు 4 వేలమంది జర్నలిస్టులు వచ్చారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 120 దేశాల నుంచి సినీ పండితులు, విశే్లషకులు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారంటే నమ్మాల్సిందే. ఇలా గతేడాది హాజరైనవారి సంఖ్య దాదాపు10,500మంది. వివిధ భాషలు, దేశాలకు చెందిన 1500 సినిమాలను ప్రదర్శించారు. ఈ సినిమా పండుగలో పాల్గొనాలని, రెడ్‌కార్పెట్‌పై సందడి చేయాలని ప్రతి సినీజీవి తహతహలాడతారంటే అతిశయోక్తికాదు. ఏటా ఈ చిత్రోత్సవానికి అయ్యే ఖర్చు దాదాపు 20 మిలియన్ యూరోలు. ఈ బడ్జెట్‌లో సగం కంటే ఎక్కువ మొత్తాన్ని ప్రజల నుంచి విరాళాలుగా సేకరిస్తుంది ఫ్రాన్స్ ప్రభుత్వం. నేషనల్ సినిమా సెంటర్ అనే సంస్థ ద్వారా మాత్రమే ఈ విరాళాలు అందుకుంటుంది. మిగతా భాగాన్ని సంబంధిత మంత్రిత్వశాఖ, స్థానిక సంస్థలు భరిస్తాయి.
కార్యక్రమాల తీరు ఇదీ...
ఈ చిత్రోత్సవం మిగతావాటితో పోలిస్తే విభిన్నమైనది. ఐదు అంశాల ప్రాతిపదికన ఈ వేడుక నిర్వహిస్తారు. అఫీషియల్ సెలక్షన్, అన్‌సెర్టెయిన్ రిగార్డ్ పేరుతో రెండు విభాగాలుగా ఎంపిక ఉంటుంది. అందులో మళ్లీ పోటీ విభాగం, పోటీ పడని విభాగం అని ఉంటాయి. చిత్రోత్సవంలో పోటీపడే సినిమాలన్నింటినీ మొదటి విభాగంలో ప్రదర్శిస్తారు. పోటీలో లేకపోయినా తమ సినిమాలను మిగతా ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నవారు తమతమ చిత్రాలను ప్రదర్శించడంకోసం రెండో విభాగంలో పాల్గొంటారు. ఇక షార్ట్ ఫిల్మ్‌ల ప్రదర్శన, పోటీకి వేరే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రముఖులు రెడ్‌కార్పెట్‌పై సందడి చేసే అవకాశం కల్పిస్తారు. ఇక్కడ ప్రతిభకే పట్టంగడతారు. నైపుణ్యం, ఆకర్షణ, సినిమాలకు దక్కిన ఆదరణ ఆధారంగా అవకాశాలు దక్కుతాయి. అలాగే పాతతరం సినిమాలను పునరుద్ధరించి ప్రదర్శించేందుకు ప్రత్యేక అవకాశం కల్పిస్తూ మరో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక విమర్శకులు, విశే్లషకుల కోసం కొన్ని రోజులు కేటాయిస్తారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమతమ పెట్టుబడులు, వ్యాపారం, విక్రయం, చిత్ర నిర్మాణంపై సలహాలు, సంప్రదింపులు జరుపుకునేందుకు లెక్కకుమిక్కిలిగా చర్చాగోష్టులు, ముఖాముఖీలు ఏర్పాటు చేస్తారు. ఉదయం, మధ్యాహ్నం, అర్ధరాత్రి ప్రత్యేక ప్రదర్శనలు, రెడ్‌కార్పెట్‌పై నడకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పరిచయాలు, సినిమాల ప్రదర్శన ఉంటాయి. సాధారణ సినీ ప్రేక్షకుల కోసం ఆరుబయట ప్రదర్శనలూ ఉంటాయి. ఇక్కడ సాధారణంగా ఫ్రెంచ్ సినిమాలే ప్రదర్శిస్తారు.
మొత్తంమీద ఈ చిత్రోత్సవంలో అత్యున్నతమైన అవార్డును ‘పామ్‌డిఓర్’గా పిలుస్తారు. ఇంగ్లీషులో ‘గోల్డెన్ పామ్’గా చెబుతారు. ఉత్తమ చిత్రానికి, ఉత్తమ షార్ట్ ఫిలిమ్‌కు వేర్వేరుగా అవార్డులు ఇస్తారు. మరికొన్ని అవార్డులు ఉన్నప్పటికీ ‘గోల్డెన్ పామ్’ దక్కినవారికే తిరుగులేని ఆదరణ ఉంటుంది. కొత్తగా సినీరంగంలోకి వచ్చినవారికి, తొలి సృజనాత్మక ప్రయత్నాల ప్రదర్శనకూ ఇక్కడ వేదిక కల్పిస్తారు. సినీరంగానికి సంబంధించిన కొత్త, పాత తరాలకు సమాన ప్రాధాన్యం ఇస్తారు.
నిరంతరం పనిచేసే బృందం
కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కోసం నిరంతరం పనిచేసేందుకు 30మందితోకూడిన బృందం ఉంటుంది. పోటీ జరగడానికి కొన్ని నెలలముందు మరో 300మంది చేరతారు. పోటీ జరుగుతున్న పదిరోజులూ మొత్తం 700మంది సేవలందిస్తారు.
ఈ ఏడాది విశేషాలు
గతేడాదికన్నా ఈసారి పెద్దసంఖ్యలో అతిథులు వస్తారని అంచనావేశారు. 130 దేశాలనుంచి 11వేలమంది ప్రతినిథులు హాజరయ్యే అవకాశం ఉంది. వీరందరికీ వసతి, భోజన సౌకర్యాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. హాలీవుడ్ సహా అన్ని దేశాల సినీరంగానికి చెందిన మహామహులు, రాజకీయ నేతలు ఈ వేడుకకు వస్తారు. మే 11నుంచి 22 వరకు జరిగే ఈ చిత్రోత్సవానికి ఆస్ట్రేలియన్ డైరక్టర్ జార్జ్ మిల్లర్ అధ్యక్షత వహిస్తారు. మిల్లర్ తెలుసుకదా.. హాలీవుడ్‌లో కనకవర్షం కురిపించిన సంచలన మాడ్‌మాక్స్ సినిమాల సృష్టికర్త. ఈ ఏడాది చిత్రోత్సవ జ్యూరీ అధ్యక్షుడు ఆయనే. ఫ్రెంచ్ నటుడు లారెంట్ లాఫెట్టె ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తారు. జపాన్, అమెరికా సినీ దిగ్గజాలు మిగతా కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా, అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. కేన్స్ చిత్రోత్సవ వెబ్‌సైట్‌లో ఈసారి అదనంగా ఆరు భాషలను చేర్చారు. ఇంతవరకూ ఈ వెబ్‌సైట్‌లో ఫ్రెంచ్, ఇంగ్లీషు మాత్రమే ఉండేవి. ఇప్పుడు స్పానిష్, చైనీస్, జపనీస్, పోర్చుగీస్, అరబిక్, రష్యన్ భాషలకూ చోటు కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు మరింత దగ్గరవ్వాలన్న తలంపుతో ఈ చర్య తీసుకున్నట్లు నిర్వాహక మండలి చెబుతోంది.
బాలీవుడ్ తళతళలు
కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో రెడ్‌కార్పెట్ అంశంపై మీడియా చూపించే శ్రద్ధ మరే కార్యక్రమంపైనా ఉండదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు రెడ్‌కార్పెట్‌పై హొయలుపోయేందుకు తహతహలాడతారు. పరిమిత నిబంధనల మేరకు అవకాశం ఇస్తారు. ఎక్కువమందికి ఈ అవకాశం దక్కుతూంటుంది. రెడ్‌కార్పెట్‌పై క్యాట్‌వాక్ చేసేందుకు అవకాశం వచ్చే నటీనటులు పేరుమోసిన డిజైనర్లు రూపొందించిన దుస్తులను ధరిస్తారు. ఆయా దుస్తులనుబట్టి తారలు, వారి డిజైనర్లకు పేరుప్రఖ్యాతలు లభిస్తాయి. ఈ వేడుకలో ఆకర్షణీయ అంశం ఇదే. మనదేశం నుంచి ఇప్పటివరకు బాలీవుడ్ తారలు భారీ సంఖ్యలోనే పాల్గొన్నారు. కొందరు పోటీపడని విభాగంలో సినిమాల ప్రదర్శనకు వచ్చి రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు. మరికొందరు సినిమాల ప్రదర్శన, చర్చాగోష్టి, విమర్శ విభాగంలో పాలుపంచుకున్నారు. బాలీవుడ్‌నుంచి ఐశ్వర్యరాయ్, మల్లికా షెరావత్, సోనమ్ కపూర్, విద్యాబాలన్, కత్రినాకైఫ్, రిచాచద్దా, శ్రే్వయా త్రిపాఠి, ప్రిదాపింటో, షర్మిలాఠాగూర్, అమితాబ్, జయబాదురి, అభిషేక్‌బచ్చన్, కరణ్‌జోహార్, జోయాఅక్తర్, దిబాకర్ బెనర్జీ, నందితాదాస్, శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్‌కపూర్, తేజస్విని కొల్హాపురి, అమిషాపటేల్, పూజాగుప్త, అర్జున్‌రామ్‌పాల్, మెహర్ జస్సియా, సబ్యసాచి ముఖర్జి, నవాజుద్దీన్ సిద్ధిఖి, అనురాగ్ కాశ్యప్, అతడి భార్య కల్కి కొచిలిన్, మనోజ్‌బాజ్‌పాయ్, హుమ ఖురేషి రెడ్‌కార్పెట్‌పై సందడి చేసినవారిలో ఉన్నారు. రోజుకు మూడుసార్లు రెడ్‌కార్పెట్‌ను మార్చడం ఇక్కడి సంప్రదాయం. మొత్తంమీద రోజూ 2 కి.మీ రెడ్‌కార్పెట్‌ను ఉపయోగిస్తారు. ఇటీవలికాలంలో ఇక్కడ ప్రదర్శించిన భారతీయ సినిమాల్లో ‘గ్యాంగ్ ఆఫ్ వాస్సెపూర్’, ‘ది లంచ్‌బాక్స్’, ‘మాన్‌సూన్ షూట్ అవుట్’ వంటివి ఉన్నాయి. గతేడాది విద్యాబాలన్, సోనమ్‌కపూర్, కత్రినాకైఫ్, ఐశ్వర్యరాయ్ రెడ్‌కార్పెట్‌పై తళతళలాడారు. ఈసారికూడా ఐశ్వర్య సహా పలువురు తారలు కేన్స్‌కు బయలుదేరుతున్నారు.
*

కేన్స్... ఓ పట్టణం
మెడిటేరియన్ సముద్రతీరంలో కొలువైన ‘కేన్స్’ అత్యంత సంపన్నులు నివసించే చిన్న పట్టణం. విలాసవంతమైన హోటళ్లు, రిసార్టులు, అందమైన బీచ్, యాచింగ్ క్లబ్‌లతో నిండిపోయిన ఈ పట్టణ జనాభా కేవలం 75వేలు. చిత్రోత్సవాలు, అంతర్జాతీయ సమావేశాలు, పర్యాటకుల రాకపోకలకు కేన్స్ నిలయం. అంతర్జాతీయ చిత్రోత్సవంగా విరాజిల్లుతున్న కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఈ పట్టణం వేదికగా మారిన తరువాత దీని ప్రాధాన్యత పెరిగిపోయింది. ఇక్కడి జనాభా లక్షలోపే ఉన్నా చిత్రోత్సవానికి వచ్చే ప్రముఖుల రాక, సినీవర్గాలతో కిటకిటలాడుతుంది. అక్కడివారికి మిగతా సంవత్సరం అంతా వచ్చే ఆదాయానికి వందరెట్లు ఎక్కువగా ఈ చిత్రోత్సవం జరిగే పదిరోజుల్లో వస్తుంది. ఇక ఇక్కడికి ప్రైవేటు విమానాల్లో వచ్చే హాలీవుడ్ ప్రముఖుల సంఖ్య చెప్పడం అంత సులువేం కాదు.
--
ఐశ్వర్య ద గ్రేట్
కేన్స్ చిత్రోత్సవానికి హాజరైన భారతీయ తారల్లో ఐశ్వర్యకు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు ఆమె 15సార్లు ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. గర్భవతిగా ఉన్నప్పుడు మినహా వరుసగా ఆమె హాజరవుతూనే ఉన్నారు. ఈసారికూడా ఆమె కేన్స్‌లో రెడ్ కార్పెట్‌పై తళుక్కున మెరవనున్నారు.
--
గోల్డెన్ పామ్
కేన్స్ చిత్రోత్సవంలో పోటీ సినిమాల విభాగంలో ప్రదర్శించిన చిత్రాల్లో ఉత్తమమైనదానికి ఇచ్చే అత్యున్నత అవార్డు ‘గోల్డెన్ పామ్’. ఫ్రెంచ్‌లో దీనిని ‘పామ్ డిఓర్’గా వ్యవహరిస్తారు. ‘పామ్’ ఆకును పోలిన విధంగా ఉన్న బంగారు పతకాన్ని విజేతకు ఇస్తారు. షార్ట్ఫిలిమ్ విభాగంలోనూ ఈ అవార్డు ఉంటుంది. ఈ పతకాన్ని మొదట్లో 18 క్యారెట్ల బంగారంతో చేసేవారు. ఇప్పుడు 24 క్యారెట్ల బంగారంతో చేస్తున్నారు. ఈ అవార్డును మొదట్లో ‘గ్రాండ్‌ప్రిక్స్ డు ఫెస్టివల్’గా పిలిచేవారు. 1955లో దానిని ‘పామ్ డిఓర్’గా మార్చారు. మళ్లీ 1964లో పాత పేరునే పెట్టి 1974వరకు కొనసాగించారు. ఆ తరువాత మళ్లీ ‘పామ్‌డిఒర్’గా పిలవడం ప్రారంభించారు. ‘పామ్’ ఆకు ఆకారం, పరిమాణం, రూపురేఖల్లో ఎప్పటికప్పుడు స్వల్ప మార్పులు చేస్తూవచ్చారు. బెర్లిన్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డును ‘గోల్డెన్ బేర్’గా, వెనిస్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో‘గోల్డెన్ లయన్’గా, కేన్స్‌లో ‘గోల్డెన్ పామ్’గా పిలుస్తారు.
--
వేదిక ప్రత్యేకతలు..
కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ నిర్వహించే వేదిక పేరు ‘పాలెస్ డి ఫెస్టివల్స్ డిసే కాంగ్రెస్’. కేన్స్‌లో ఈ భవన నిర్మాణాన్ని 1949లో ప్రారంభించారు. ఆరంతస్తుల్లో, 25వేల చదరపు మీటర్ల వైశాల్యంలో వందలాది గదులు, 18 ఆడిటోరియాలతో దీనిని 1982 నాటికి పూర్తిచేశారు. ప్రపంచంలో లభించే అత్యాధునిక సౌకర్యాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. నాలుగైదు సందర్భాల్లో మినహా, ఇక్కడే ఎక్కువసార్లు చిత్రోత్సవాలను నిర్వహించారు.

-ఎస్.కె.ఆర్.