S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానవత్వం ప్రదర్శించే రైలు కంపెనీ

ఇండియా, పాకిస్తాన్, చైనా లాంటి అభివృద్ధి చెందే దేశాల్లో రైలు పెట్టెలు కిక్కిరిసి ఉండటమే కాక, ఒకోసారి రైలు డబ్బాల మీద కూడా ప్రయాణీకులు ఎక్కి ప్రయాణించే దృశ్యాలు కనపడుతూంటాయి. బీద దేశాల్లో ప్రయాణీకులు ఎక్కువ. రైళ్లు తక్కువ. చైనాలో కొత్త సంవత్సరం సందర్భంగా కోట్ల మంది తమ స్వగ్రామాలకి ప్రయాణిస్తారు. ఆ వారమంతా రైళ్ల డబ్బాల మీద కూడా వారు ప్రయాణిస్తూంటారు. కాని కేవలం ఒకే విద్యార్థిని కోసం ప్రత్యేకంగా రైలు నడిపే దేశం ఒకటి ఉందని మీకు తెలుసా?
అది జపాన్. దక్షిణ జపాన్‌లోని హోకైడో ద్వీపంలోని కామి అనే గ్రామం పాఠశాల కూడా లేని సాధారణ గ్రామం. ఆ గ్రామానికి ప్రయాణీకుల రద్దీ లేకపోవడంతో దానికి ఉన్న రైలుని షిరాటాకి అనే స్టేషన్‌లోనే ఆపేసి తర్వాతి కామికి నడపకుండా ఆ స్టేషన్‌ని మూసేయాలని హకాడియో రైల్వే కంపెనీకి చెందిన అధికారులు భావించారు. ఐతే కామి నించి నిత్యం కనా అనే విద్యార్థిని పక్క ఊరైన షిరాటాకిలోని స్కూల్‌కి ఆ రైల్లోనే వెళ్లొస్తూంటుంది. ఆ ఊళ్లోని యువత అంతా కాలేజీలకి పై చదువుకి వేరే ఊళ్లకి వెళ్లిపోయారు. ఆ ఊరు నించి షిరాటాకి వెళ్లి చదివే ఆఖరి విద్యార్థిని కనానే. రైలుని రద్దు చేస్తే ఇక ఆమె స్కూల్‌కి వెళ్లే అవకాశాన్ని కోల్పోతుంది. ఆమెకి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వయసు రాకపోవడంతో రోడ్డు మార్గం మీద ప్రయాణించలేదు.
ఇది తెలిసి ఫేస్‌బుక్, ఇతర ఇంటర్నెట్ మీడియాల్లో జపనీస్ ప్రజలు ఈ విషయం మీద అసంతృప్తిని వ్యక్తం చేశారు. తైవాన్ దినపత్రిక ఏపిల్ డైలీలో కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు. ఇది హకోడియా రైల్వే కంపెనీ దృష్టికి వచ్చింది. వారు పునరాలోచన చేసి కేవలం కనా కోసం రెండు రైళ్లని నడపాలని నిర్ణయించారు. ఒకటి స్కూలుకి తీసుకెళ్లేది. మరొకటి తిరిగి తెచ్చేది. అందువల్ల ఆమె విద్య కుంటుపడదు. జపనీస్ ప్రజలు హకాడియో రైల్వే కంపెనీ ఔదార్యానికి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
జపాన్‌లో విద్యకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆమె స్కూల్‌కి వెళ్లే సమయంలో అంటే, ఉదయం సరిగ్గా ఏడు గంటల నాలుగు నిమిషాలకి ఆ స్టేషన్ నించి రైలు బయలుదేరుతుంది. మళ్లీ సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాలకి ఆమె స్కూల్ నించి తిరిగి వచ్చే సమయంలో ఆమెని ఎక్కించుకుని కామి స్టేషన్‌కి చేరుకుంటుంది. ఇంజన్‌కి కేవలం రెండు పెట్టెలనే తగిలిస్తారు. రైలు పెట్టెలో కేవలం కానా మాత్రమే కూర్చుంటుంది. ఆమె తప్ప ఆ స్టేషన్‌కి ఆ ఊళ్లో వారు ఇంకెవరూ వెళ్లరు. కామి స్టేషన్‌లోని రైల్వే టైం టేబుల్‌లో కేవలం ఆ రెండు రైళ్ల టైమింగ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఈ రైల్వేస్టేషన్‌లో ఒకే ఉద్యోగి పని చేస్తున్నాడు. అతను కూడా ఈ స్టేషన్ నించే పక్క ఊరికి వెళ్లి చదువుకున్నాడు. అలా 2012 నించి 26, మార్చి 2016లో కనా స్కూల్ విద్య ముగిసే దాకా ఈ రైళ్లని నడిపారు. తన కోసం రైలు నడిచిన నాలుగేళ్లల్లో కనా ఒక్కసారి కూడా స్కూల్‌కి వెళ్లడం మానలేదు.
అది మంచు పడే ఊరు. మంచు కురిసినప్పుడు ఆమె తండ్రి కనాని సమయానికి రైల్వేస్టేషన్ బయట కారులో తెచ్చి దింపుతాడు. మంచు కురుస్తున్నప్పుడు నల్ల కళ్లజోడు పెట్టుకుని, చలి దుస్తులు వేసుకుని ఆమె స్టేషన్ ప్లాట్‌ఫాం మీద రైలు కోసం వేచి ఉంటుంది. ఉదయం కూడా ఆ రైలింజన్ హెడ్‌లైట్లు వెలిగించే ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రయాణించడానికి అనువుగా గ్రామంలోని కొందరు స్వచ్ఛంద సేవకులు నిత్యం రైలు పట్టాల మీది మంచుని తొలగిస్తారు. రైల్వేస్టేషన్ చుట్టూ పడే మంచుని కూడా వీరు తొలగిస్తున్నారు.
‘ఇది మేము ప్రభుత్వానికి, రైల్వే కంపెనీకి కృతజ్ఞత చెప్పే విధానం’ అని ఆ గ్రామస్థులు టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.
చైనా టీవీలో, అనేక యూరోపియన్ టీవీల్లో ఈ ఉదంతాన్ని ప్రత్యేకంగా షూట్ చేసి ప్రదర్శించారు. స్టూడెంట్ కనె్సషన్‌తో కనా ప్రయాణించడంతో ఈ రైలు ప్రయాణం వల్ల హకోడియో రైలు కంపెనీకి నష్టమే తప్ప లాభం లేదు.
‘ప్రభుత్వం నాకు ఇంత సహాయం చేస్తున్నప్పుడు నేను నా దేశం కోసం ఎందుకు మరణించకూడదు?’ అని కనా తన ఫేస్‌బుక్‌లో కృతజ్ఞతగా రాసింది. దానికి బదులుగా ఓ ప్రభుత్వాధికారి ఇలా జవాబు రాశాడు.
‘జపాన్‌లో మారుమూల నివసించే ప్రజలకి కూడా సేవ చేయడం మంచి పరిపాలన కిందికి వస్తుంది. ప్రతీ జపనీస్ పౌరుడి బాగోగులు చూడాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది అన్నది మేము విస్మరించం. ఒకర్ని కూడా వదలం’
‘జపాన్‌లోని జననాల సంఖ్య బాగా తగ్గుతోంది. వృద్ధుల సంఖ్య బాగా పెరుగుతోంది. 2060కల్లా జపాన్‌లో నేటి జనాభాలో మూడో వంతు తగ్గచ్చని అంచనా. ఇందువల్ల ఇళ్లు కూడా ఖాళీ అయి నిరుపయోగంగా ఉన్నాయి. ప్రయాణీకుల సంఖ్య తగ్గడంతో జపనీస్ రైల్వేల మీద కూడా పెనుభారం పడుతోంది. ఐనా కూడా మేము ఈ రైలుని నడుపుతున్నాం. కొనే్నళ్లుగా మేము ఇరవై రైళ్లని రద్దు చేశాం. దానివల్ల ఒక్కరికి కూడా నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడ్డాం’ అని హకాడియో రైల్వే కంపెనీ అధికారి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
26 మార్చి 2016 ఆఖరి రోజున కనా తల్లిదండ్రులు రైలు దిగిన తమ కూతురికి పూలగుత్తితో స్వాగతం, ఇంకో పూలగుత్తితో ఇంజన్ డ్రైవర్‌కి వీడ్కోలు పలికారు. వారి కుటుంబ సభ్యులు రైల్వే కంపెనీ అధికారులకి పూల గుత్తులని పంపి తమ కృతజ్ఞతలని తెలియజేశారు.
సింగపూర్ దినపత్రిక ‘ది స్ట్రైట్ టైమ్స్’లో కూడా జపాన్ రైల్వే కంపెనీ ఉదారత గురించి రాస్తూ దీన్ని ప్రపంచ ప్రభుత్వాలన్నీ నేర్చుకోవాలని రాశారు.
జపనీస్ రైల్వేస్ నడిపే పద్ధతిలో మానవత్వం అధికం. ఇటీవల కోబేలోని రైల్ సుమా అక్వా లైఫ్ పార్క్ సమీపంలో నెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ పట్టాల కింద చిన్న సొరంగాలని ఏర్పాటు చేసింది. అక్కడ పట్టాలు దాటుతూ అనేక తాబేళ్లు రైళ్ల కింద పడి మరణిస్తూండటంతో వాటి భద్రత కోసం టర్టిల్ టనె్నల్స్ పేరిట వీటిని ఏర్పాటు చేశారు. ఈ సొరంగాలని రైల్వే రీసెర్చ్ శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. ఇలా అవి దాటడానికి యు ఆకారంలో ఐదు టనె్నల్స్‌ని నవంబర్ 2015లో నిర్మించారు. సమీపంలోని సముద్రం నించి మే-సెప్టెంబర్ నెలల్లో బయటకి వచ్చే తాబేళ్లు ఓ సరస్సుకి చేరుకుంటాయి. వాటి మార్గానికి మధ్య రైలు పట్టాలు ఉన్నాయి. 2002-2014 మధ్య సిగ్నల్స్‌లో చిక్కుకున్న తాబేళ్ల వల్ల రైళ్లు పదమూడుసార్లు ఆగిపోయాయి. రైల్వే అధికారులు సొరంగాల్లో చిక్కుకుని కదల్లేని తాబేళ్లని స్వచ్ఛందంగా రక్షించి అక్వేరియాలకి తరలిస్తూంటారు.
అసాహి షిబున్ అనే జపనీస్ దినపత్రిక ఈ స్వచ్ఛంద సేవకుల ఫొటోలని ప్రచురించి గౌరవించింది. నారా రైల్వే స్టేషన్‌లో కూడా ఇలాంటి టనె్నల్స్‌ని నిర్మించారు. పైన అత్యంత వేగంగా వెళ్లే రైలు, కింద సొరంగంలో అత్యంత నెమ్మదిగా నడిచే తాబేళ్లు ప్రపంచంలో మరెక్కడా లేవు. కొన్ని యూరోపియన్ దేశాలు కూడా రైలు పట్టాల మీదకి పాకే జీవుల విషయంలో ఈ పద్ధతిని అనుసరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

పద్మజ