S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

ఎం.కనకదుర్గ, తెనాలి
ఇటీవల జరిగిన జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో పొరుగు రాష్ట్రాల వారు సంప్రదాయక దుస్తుల్లో వచ్చారు. మీడియాతో వారి మాతృభాషలో చక్కగా మాట్లాడారు. అదే ఫంక్షన్‌లో మన తెలుగువారు సూటు, బూటు ధరించి విదేశీ నాగరికతను అనుకరించారు. ఇంగ్లీషులో మాట్లాడి పరభాషాధీనతను చాటుకున్నారు. ఈ మధ్య అనేక ఫంక్షన్‌లలో తెలుగువారు తెలుగు తప్ప మిగతా భాషలలో అనర్గళంగా మాట్లాడుతున్నారు...
అదే మన సిగ్గులేని ప్రత్యేకత.

ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశం జిల్లా
పార్టీ ఫిరాయింపుల నిషేధం చట్టం వున్నా చాలామంది పార్లమెంటు శాసనసభ్యులు పార్టీ మారుతున్నారు. వారు సభ్యత్వం కోల్పోవటం లేదు. అలాంటప్పుడు ఆ చట్టం వలన ప్రయోజనం ఏమిటి?
ఉంది. ఎంతో కొంత.

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి
ఆంధ్రభూమి కార్టూన్‌లు, కనీ కనిపించకుండా, చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. ‘వెర్రి నవ్వు పుట్టిస్తున్నాయి’. మీకు పర్మినెంట్ ఆర్టిస్టు మరియు కార్టూనిస్టు ఎప్పుడు దొరుకుతారు?
ప్రయత్నిస్తున్నాం.

ప్రతిరోజూ టీవీల్లో ప్రతి ఛానల్ వారు అవార్డ్స్, సినీ ఆల్బమ్స్, ఫంక్షన్స్ చూపిస్తున్నారు. లక్షలాది జనం - బాలలు, మహిళలు, సినీ పిచ్చోళ్లైన యువకులు, కాటికి కాళ్లు చాపే వృద్ధులు అవి చూసి కేరింతలు, డాన్సులు, సీట్లలోంచి లేచి గెంతుతున్నారు. తారలతోపాటు నిర్మాతలు, సంగీత దర్శకులు, నాట్యాలు చేస్తూ వెకిలి వేషాలు వేస్తూ జుగుప్స కల్గిస్తున్నారు. దీన్ని ఏమనాలి?
బుల్లితెర బులపాటం!

దేశంలోని అత్యున్నత న్యాయ వ్యవస్థను పరిరక్షించే సి.జె.్ఠకూర్ కంటతడి పెట్టడం చూస్తే ప్రధానమంత్రి నుండి ముఖ్యమంత్రుల వరకు, జడ్జిమెంట్స్ ఇలా ఉండాలని శాసిస్తున్నారని, ఇరకాటంలో పెడ్తున్నారని నా అభిప్రాయం? మీరేమంటారు?
జడ్జి ఏడ్వటం ఎబ్బెట్టు.

ఉపాధ్యాయుల సత్యన్నారాయణ మూర్తి, వక్కలంకతోట
కొత్త న్యాయమూర్తులను నియమించినంత మాత్రాన కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతాయని మీరు భావిస్తున్నారా?
పరిస్థితిలో పెద్ద తేడా ఉండదు.

ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
నితీష్‌కుమార్ (బీహార్ ముఖ్యమంత్రి) రాసి పెట్టుంటే తానే ప్రధాని అవుతారట. రాసి పెట్టి ఉంటుందంటారా? మీ భవిష్యవాణి ఏమిటి?
ప్రజలకు రాసి పెట్టుంటే అవుతాడు.

ఎమ్.రామారావు, నూజివీడు
వేదాల గురించి ప్రజలకు తెలియదు. వేదాలలో ఉన్న విషయాలను అందరూ తెలుసుకోవాలని చాలామంది కుతూహల పడుతున్నారు. శాస్త్ర విజ్ఞానం ప్రపంచమంతటా అనేక భాషలలోకి అనువదించబడి చివరకు పాఠ్యాంశాలుగా కూడ వివరించి ప్రజలను విజ్ఞానవంతులుగా చేస్తున్నారు. మన పేపరులో ఋగ్వేదాది వేదాలను ప్రజలకు అర్థమయ్యే తెలుగు భాషలో సీరియల్‌గా వాటి అనువాదాన్ని ప్రచురించకూడదా?
రాయగలిగిన సమర్థులు దొరికితే - తప్పక! సంతోషంగా.

కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి
సంవత్సర చందా చెల్లిస్తే పత్రికను రోజూ చెన్నై అడ్రస్‌కు పోస్టులో పంపుతారా?
పంపగలం.

పుష్యమీ సాగర్, హైదరాబాద్
బంగారు భవిష్యత్‌కు బాటలు వెయ్యాల్సిన విద్యార్థి లోకం... రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారి తమ జీవితాలను ఉరికొయ్యలకు తగిలించి కన్నతల్లులకు క్షోభ కలిగించడం భావ్యం కాదు కదా.. ఈ స్థితి ఎప్పుడు మారుతుంది?
ఉన్నత విద్యా సంస్థల్లో రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు చోటు లేకుండా చట్టం చేసి, గట్టి కట్టుదిట్టాలు చేయగలిగినప్పుడు. దానికి చాలా దమ్ముండాలి.

పి.వి.శివప్రసాదరావు, అద్దంకి
మా ఎమ్మెల్యేలను కొంటున్నారని ఇక్కడ జగన్, అక్కడ బాబు గోల! వారి తప్పిదాల వల్లనే మా పార్టీలోకి వస్తున్నారని ఎదురు పక్షాల వాదన. కొత్త నీరు రాకవలన పాత నీటికి నిలువనీడ లేక మాకు స్థానం లేదనే వారి నియోజకవర్గాల అనుచరులు, కార్యకర్తల గోల! ఇప్పుడు 2026 వరకు అసెంబ్లీ స్థానాలు పెంచేది లేదని ఓ వార్త. ఏమిటండీ ఈ గందరగోళం?
పార్టీల స్వయంకృతం. పత్తిత్తులు ఎవరూ లేరు.

బొగ్గు కుంభకోణంలో దాసరి నిందితుడా? నిర్దోషా? శాఖలపై అవగాహన లేనివారికి, అంటే కొత్తవారికి మంత్రి పదవులు ఇస్తే సిబ్బంది తప్పుదోవ పట్టించితే, కుంభకోణాలకు అవకాశం లేదంటారా? అందువలన ఎం.పి, ఎమ్మెల్యేలక్కూడా పదవులు ఇచ్చే ముందు శాఖకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ పాసవ్వాలని చట్టం చేస్తే మంచిదా? కాదా?
కొత్తవాడైనా శ్రద్ధ, పట్టుదల ఉండి కష్టపడితే ఏ శాఖ మీదైనా పట్టు తెచ్చుకోగలడు. కాని చాలామంది మంత్రులకు ఆ ఓపిక, తీరిక ఉండవు. మంత్రిగా బాధ్యత అప్పగించే ముందు దానికి కావలసిన అనుభవం, పరిజ్ఞానం, సామర్థ్యం ఆయా శాల్తీలకు ఉన్నాయా అని చూసే మంచి అలవాటు ప్రభుత్వాధినేతలకు సాధారణంగా ఉండదు. పైవాడి బుద్ధి సరిగా ఉన్నప్పుడు కిందవాళ్లూ తిన్నగా ఉంటారు. మీరన్న ఎంట్రెన్సు టెస్టు అయ్యే పనికాదు.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
ఈ వారం ముఖాముఖి పేజీలో రెండు కార్టూన్లూ, మరో నాలుగు ప్రశ్నలను ఓవర్‌టేక్ చేసేశాయి. ఈ మధ్య ఫుల్‌పేజీయే ఇస్తున్నారు. ఈ వారం ఆ మాత్రం నాలుగు మంచి ప్రశ్నలు లేవా? మీ ముఖాముఖి పేజీకి అంత క్రేజ్ ఉంది.
ప్రశ్నలు కొల్లలుగా ఉంటాయి. కాని ఎక్కువగా కొద్దిమంది నుంచే వస్తాయి. అడిగిందే అడుగుతే ఇచ్చిన జవాబునే ఇవ్వలేము. ఎప్పుడూ వేసిన వాళ్లవే వేయలేము. ఇలా అనేక ఇబ్బందులు. నాకూ పూర్తి పేజి నింపాలనే ఉంటుంది.

*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com