S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో-మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

వాండ్రంగి కొండలరావు, పొందూరు, శ్రీకాకుళం జిల్లా
హిందూమతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఇతర మతాల నుంచి హిందూమతంలోకి వచ్చే వారెవ్వరూ బహుశా లేరు. ఎందుకీ పరిస్థితి వచ్చిందంటారు?
హిందూ మతస్థులు ఆ విషయం మీద శ్రద్ధ పెట్టక. వివిధ కారణాల వల్ల బయటికి పోయిన వారిని వెనక్కి తీసుకురావటం ఎంత అవసరమో గుర్తించక. కాలానికి తగ్గట్టు ఆచారాలను, సంప్రదాయాలను సంస్కరించి, నయానో భయానో అందరినీ ఒక దారికి తెచ్చి మతాన్ని కాపాడగల దార్శనిక ప్రజ్ఞావంతులు హిందూ సమాజంలో లేక.

డి.ఎస్.శంకర్, వక్కలంక
కోర్టులలోని కేసులు త్వరితగతిన పరిష్కరించబడాలంటే, ఒక కోర్టులో వేసిన కేసుపై తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుపై ఇంకొక (పై) కోర్టులో అప్పీలు చేసుకోరాదన్న ఆర్డినెన్స్ తెస్తే? ఏమంటారు?
కింది కోర్టు తప్పు చేస్తే పై కోర్టుకు మొర పెట్టుకునే అవకాశం పోతుంది. అయితే అపీళ్ల పేరుతో తెలివిమీరిన లిటిగెంట్లు న్యాయాన్ని అపహాస్యం చేయకుండా గట్టి కట్టడులు చేయవచ్చు.

పి.రామకృష్ణ, రాజమండ్రి
చంద్రబాబు తన వైఫల్యాలన్నీ జగన్ ఖాతాలో చేర్చటం ఎంతవరకూ సబబు? (మహానాడులో తన వారి ముందు జగన్‌ను దూషించిన నేపథ్యంలో)
ఇద్దరూ ఇద్దరే. ఎవరినీ వెనకేసుకు రానక్కర్లేదు.

రైల్వేలకు సంబంధించి తమిళనాట కనిపించే అభివృద్ధి ఆంధ్రలో కనపడదు. వివిధ ప్రాజెక్టులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. తమిళనాడు రాజకీయ నాయకులకు ఉన్నదీ మన నాయకులకు లేనిదీ ఏమిటి?
రాష్ట్ర ప్రయోజనాల దగ్గరికి వచ్చేసరికి అక్కడ అందరిదీ ఒకటే మాట. ఇక్కడ ఎవరి గోల వారిది.

dsambasivarao6@gmail.com
అక్షరం శక్తి స్వరూఫం అంటారు కాని నేటి సమాజంలో మఠాధిపతుల నుండి స్వామీజీల వరకు శ ను ష గా ఉచ్ఛరిస్తున్నారు. గొప్ప ప్రవచనకర్తలని అందరూ అనుకునేవారు కూడా కలసి అనే పదాన్ని సైతం కలషి అంటారు. వారే అలా అంటే అలానే పలుకవలనేమో అనిపించుచున్నది. నన్ను క్షమించి వివరణ ఇవ్వగలరు.
ఔను. ఈ లోపం చాలామందిలో కనపడుతుంది. ప్రతి పదాన్ని స్వచ్ఛంగా పలికేవాళ్లని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

ఎం.కనకదుర్గ, తెనాలి
ప్రమాణ స్వీకార సమయంలో దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞలు చేసినవారే తదనంతరం ఉల్లంఘనలకూ పాల్పడుతుంటే, వారిపై చర్యలు తీసుకునే విధంగా రాజ్యాంగాన్ని తిరిగి రాయలేమా? ఎన్నికలలో గెలిచినంత మాత్రాన తిరిగి ఎన్నికలు వచ్చేంతవరకూ వారేం చేసినా చెల్లే విధంగా రాజ్యాంగం హక్కులు కల్పించడం అహేతుకం కాదా? కాలం చెల్లిన రాజకీయ, ఎన్నికల విధానాన్ని మార్పులు చేస్తూ రాజ్యాంగం మారిస్తే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలంగా పరిఢవిల్లుతుంది కదా?
దానికి రాజ్యాంగానే్న మార్చనవసరం లేదు. ఉన్న చట్టాలను కట్టుదిట్టంగా అమలుపరచగలిగితే చాలు. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ తన బాధ్యత గుర్తెరిగి మెలిగేట్టు నియంత్రించగల స్థితికి పౌర సమాజం, పౌర చైతన్యం ఎదిగితే తప్ప ఏమీ జరగదు.

కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి
తాగిన మైకంలో కారు నడిపి ఒక అభాగ్యుడి మరణానికి కారకుడైన ‘పెద్దమనిషి’ని భారత క్రీడా వ్యవస్థకు సంబంధించిన సంఘానికి భారతదేశ అనధికార ప్రతినిధిగా నియమించడం ఎంతవరకు సమంజసం?
తాగింది కారు.. అతడు కాదు అని కోర్టువారు తేల్చారు కదా?

సి.ప్రతాప్, శ్రీకాకుళం
బీజాక్షరాలు లేకుండా ఏదైనా దేవుని నామం ఉచ్చరిస్తూ జపం చేసుకుంటే ఫలితం కలగదని ఒక వ్యాఖ్యానంలో విన్నాను. ఆధ్యాత్మిక, ధార్మికవేత్తగా మీ అభిప్రాయం ఏమిటి?
ఏదో ఫలితాన్ని ఆశించి చేసే జపాల విషయంలో అది కరెక్టే. ప్రతిఫలాపేక్ష లేకుండా దైవధ్యానమే ధ్యేయంగా చేసుకునే జపాలకు భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత ఉంటే చాలు.

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి, బందరు
ఈ రోజుల్లో ఆయా పత్రికల విలేఖర్లు పుస్తక ఆవిష్కరణ సభలకు వచ్చి కరపత్రాలు తీసుకొని, కాఫీలు, టిఫిన్లు సేవించి, సభా ప్రారంభంలోనే వెళ్లిపోతున్నారు. మరుసటి రోజు పత్రికల్లో కరపత్రంలోని వక్తల గురించి (వారు రాకపోయినా వారి ప్రతిభా విశేషాలు) - ఇంద్రుడు, చంద్రుడు అని వ్రాస్తుంటే, నేను ముక్కుపై వేలేసుకుంటున్నాను. వీరు ఎవరిని వంచిస్తున్నారు? శ్రోతలనా? పత్రికా యాజమాన్యానినా?
పాఠకులను

జీడిగుంట చలపతిరావు, హైదరాబాద్
తెలుగు రాష్ట్రాలలో కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు మార్కెట్‌లో బ్రెడ్, బ్లడ్, ఫుడ్, మందు, మందులు, వంటలకు వాడే నూనెలు, తిరుపతి వెంకన్నకు లడ్డూల తయారీకి నెయ్యి కూడా కల్తీమయంగా తయారయింది. నేరగాళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. చట్టాలు కఠినతరం చేసి వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేవా మన ప్రభుత్వాలు? సమాజాన్ని చైతన్యపర్చడానికి కనీసం మీరు కలంతో పోట్లు పొడవడానికి సిద్ధంకండి. వార్తలతోపాటు వాతలు కూడా పెట్టండి.
ఇలాంటి మొండి రోగాలు వాతలతో కుదరవు. ప్రజా చైతన్యం కావాలి. కనీసం కొద్దిమంది విద్యావంతులైనా వట్టి మాటలు, సోషల్ మీడియాలో పోచుకోలు కబుర్లు కట్టిపెట్టి వినియోగదారుల ఉద్యమాన్ని పటిష్ఠంగా నడిపించాలి. అందరూ కలిస్తే తప్ప ఏదీ సాధించలేము. పాతుకుపోయిన అవినీతి తాటాకు చప్పుళ్లకు బెదరదు. లొంగదు.

జై శేఖర్, ఏలూరు
మే 29వ సంచిక, ‘మనలో మనం’లో ఒక పాఠకుడు, టిప్పు సుల్తాన్ హిందువుల మీద, ఎన్నో రకాల అత్యాచారాలు, దుర్మార్గాలు జరిపాడు అని మీరు, ఆంధ్రభూమిలో రాశారని తెలియజేశాడు. అది నిజం అయితే, వాటిని మీరు పుస్తక రూపం చేశారా?
‘ఇదీ చరిత్ర’ పుస్తకంలో ఉంది.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com