S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కోర్టులో ‘వందేమాతరం’ (భగత్‌సింగ్-33)

‘ఈ రోజు కోర్టులో భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లు ఇద్దరూ చాలా బలహీనంగా కనిపించారు. నిన్న సాయంత్రం వీరికి బలవంతంగా ఆహారం ఎక్కించడానికి ఎనిమిదేసి పఠాన్లను నియోగించారని తెలిసింది. పఠాన్లు వారిని బలవంతంగా నేల మీద పడేసి కాళ్లు, చేతులు, ఛాతి, గొంతు నేలకు అదిమిపెట్టగా.. ముక్కులోంచి, గొంతులోంచి రబ్బరు ట్యూబు ద్వారా పాలు ఎక్కించారట. పఠాన్ల చేతిలో ఖైదీలిద్దరూ బాగా దెబ్బలు తిన్నారు. భగత్‌సింగ్ ఒంటి మీద గాయాలు ఉన్నాయి’ అని 1929 జూలై 12న ‘ట్రిబ్యూన్’ పత్రిక ప్రత్యేక ప్రతినిధి రిపోర్టు.
అప్పటికి భగత్‌సింగ్ నిరాహారదీక్ష బూని నాలుగు వారాలైంది.
ఆ రోజుల్లో దేశంలో చాలామందికి విప్లవకారులంటే రకరకాల దురభిప్రాయాలు ఉండేవి. అరాచకవాదులు; బాధ్యత ఎరుగని ఆతతాయిలు; వ్యక్తిగత హింసకు దిగటం, పగపట్టిన వారిని కాల్చి పారిపోవటమే తప్ప ధైర్యంగా రంగంలో నిలబడి, ప్రజల పక్షాన పోరాడలేరు; అహింసకు కట్టుబడి మహాత్ముడి ఒద్దికలో దేశం సాగిస్తున్న సత్యాగ్రహ సమరానికి వీరొక న్యూసెన్సు - అన్న భావన విద్యాధికుల్లో చాలామందికి ఉండేది. సత్యాగ్రహ పోరాటాలు, ఉపవాస దీక్షలు కేవలం కాంగ్రెసుకూ, గాంధీవాదులకే హక్క్భుక్తం కాదనీ... అవసరమైనప్పుడు విప్లవకారులు కూడా ప్రాణాలకు తెగించి అహింసాత్మకంగా పోరాడగలరనీ భగత్, దత్‌లను చూశాక జనాలకు అర్థమైంది. రాజకీయ ఖైదీలను క్రిమినల్స్‌లా చూడకుండా సముచిత గౌరవం ఇవ్వాలన్న డిమాండుతో భయానక బాధలకోర్చుకుని పళ్లబిగువున వారు సాగిస్తున్న ఆకలి సమ్మె వివరాలు, విశేషాలు పత్రికల్లో చదివేకొద్దీ యావద్భారతాన వారిపట్ల అభిమానం, సంఘీభావం వెల్లువెత్తాయి. భగత్‌సింగ్ పేరు ఇంటింటా మారుమోగింది.
అసెంబ్లీ బాంబు కేసు ప్రాథమిక విచారణ కోసం ఢిల్లీ జైలును మేజిస్ట్రేటు కోర్టుగా మార్చిన విధంగానే లాహోర్ కుట్ర కేసులో స్పెషల్ మేజిస్ట్రేటు కోర్టు విచారణను లాహోర్ సెంట్రల్ జైలులో లాగించారు. అప్పటికే భగత్‌సింగ్ జాతీయ వీరుడు, యువతరానికి ఆరాధ్యుడు అయిపోయినందువల్ల మామూలు న్యాయస్థానంలో విచారణ జరిపితే పరిస్థితి తమ అదుపులో ఉండదని అధికారులు భయపడి, ఖైదీలను ఉంచిన జైలులోనే విచారణ జరిపించారు. భగత్‌సింగ్‌కి గల ప్రజాభిమానాన్ని చూసి బ్రిటిషు దొరతనం ఎంత బెంబేలెత్తిందంటే 1929 జూలై 10న కోర్టు విచారణ మొదలుపెట్టినప్పుడు ఆఖరికి నిందితుల తరఫు న్యాయవాదులను కూడా కోర్టు హాలులోకి అనుమతించలేదు. చట్టప్రకారం నిందితులకున్న హక్కులను మీరెలా నిరాకరించగలరని పెద్ద గొడవ పెట్టుకుంటేగానీ న్యాయవాదులకు ప్రవేశం దొరకలేదు. భగత్‌సింగ్ తల్లిదండ్రుల వంటి కొద్దిమంది కుటుంబ సభ్యులు మినహా బయటి వారెవరినీ కోర్టు దరిదాపులకు రానివ్వలేదు.
స్పెషల్ మేజిస్ట్రేటు రాయ్ సాహెబ్ శ్రీకిషన్ గారు నికార్సయిన రాజభక్తుడు. ఆయనకు రాయ్ సాహెబ్ బిరుదునిచ్చిందే తెల్లవారి తొత్తుగా ఆయన అమోఘ సేవలను గుర్తించి. ప్రత్యేక న్యాయాధికారిగా ఆయన ఈ మారు పెద్దగా కష్టపడవలసిన పనిలేదు.
అది హత్యానేరం లాంటి మామూలు క్రిమినల్ కేసు కాదు. సాండర్స్ హత్య, అసెంబ్లీ చాంబరులో బాంబులు... లాహోర్, ఆగ్రా, సహరాన్‌పూర్‌లలో బాంబు తయారీ కర్మాగారాలు, బాంకు దోపిడీ యత్నాలు వంటి అనేక అభియోగాలను కలిపి ‘లాహోర్ కుట్ర కేసు’ అనే దాన్ని పేనారు. మొత్తం 25 మంది మీద కుట్ర అభియోగం మోపారు. అందులో ఆరుగురు చంద్రశేఖర్ ఆజాద్, భగవతీ చరణ్‌వోరా, కాళీచరణ్, యశ్‌పాల్, సత్ గురీ దయాళ్, కైలాష్‌లు పరారీలో ఉన్నారు. మిగతా పందొమ్మిది మంది (్భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురు, శివవర్మ, యతీంద్రనాథ్ దాస్, జయదేవ్ కపూర్, బటుకేశ్వర్ దత్, అజయ్ ఘోష్, విజయకుమార్ సిన్హా, జతీంద్రనాథ్ సన్యాల్, ఇంకో తొమ్మండుగురు) మీద విచారణ జరగవలసి ఉంది.
అది ఎంత లక్షణంగా జరుగుతుందన్న దాని మీద ఎవరికీ అనుమానం లేదు. హత్య, కుట్ర, రాజద్రోహం వంటి తీవ్రాభియోగం మోపబడిన నిందితుల సగటు వయసు 22. న్యాయసూత్రాల ప్రకారం సక్రమంగా విచారణ జరిగితే ఏ ఒకరి మీదా అభియోగం నిలబడదు. 600 మంది సాక్షులనైతే ప్రభుత్వం కష్టపడి సిద్ధం చేసింది. వారిలో ఎక్కువ మంది దొంగ సాక్షులు. మిగతా వారు చెప్పగలిగిన దానిలోనూ పస లేదు. సమర్థుడైన డిఫెన్సు లాయరు సునాయాసంగా తుత్తునియలు చేయగలిగిన బనాయింపు సాక్ష్యాలే అవి. విచారణకు అనుసరిస్తున్న విధి విధానాలూ న్యాయ పరీక్షలో నిలబడగలిగినవి కావు.
ఏం లాభం? సవ్యమైన న్యాయపరీక్ష జరిగే ఆశ లేదు. నిందితుల తరఫు న్యాయవాదులు ఎంత గొప్పగా వాదించినా అంతిమ న్యాయ నిర్ణయం మీద దాని ప్రభావం ఉండదు. ఎందుకంటే నిందితులను ఏమి చేయాలో, ఎలా వదిలించుకోవాలో పరాయి ప్రభుత్వం ముందే నిశ్చయించుకుంది. బ్రిటిషు వారు గొప్పగా చెప్పుకునే న్యాయ విధానం, నిష్పాక్షిక దృక్పథం వంటివి బ్రిటిషు వారికే తప్ప భారతీయ దేశభక్తులకు ససేమిరా వర్తించవు. వారి విషయంలో ఆంగ్ల సామ్రాజ్య వ్యవస్థది రాక్షస వైఖరి.
ఆ సంగతి భగత్‌సింగ్‌కి బాగా తెలుసు. న్యాయం ఆశించగల అవకాశం ఇసుమంతైనా లేనప్పుడు మొక్కుబడిగా జరిపించే విచారణ తతంగంలో పాల్గొనడం అంటే దానికి లేని గౌరవాన్ని, విశ్వసనీయతను చేజేతులా ఆపాదించడమే. అందుకే భగత్‌సింగ్ తన కేసును గట్టిగా నడపగలిగి కూడా ఆ పని చేయదలచలేదు. పార్లమెంటు బాంబు కేసులో తండ్రి బలవంతం మీద అసఫాలీని తన తరఫు న్యాయవాదిగా అతడు నియమించుకున్నాడు. ఈ మారు అదీ చేయలేదు. అసఫాలీ సామర్థ్యం మీద నమ్మకం లేక కాదు. దేశభక్తులపై పగబట్టిన బ్రిటిషు రాజ్య వ్యవస్థ మీద, దాని తాబేదారు అయిన న్యాయవిధానం మీద బొత్తిగా విశ్వాసం లేక.
“I had only one idea before me throughout the trial, i.e. to show complete indifference towards the trial inspite of the serious nature of the charges against us. I have always been of opinion that all political workers should be indifferent and should never bother about the legal fight in the law courts and should boldly bear the heaviest possible sentences inflicted upon them. They may defend themselves but always from purely political considerations and never from a personal point of view.”
[The Trial of Bhagat Singh, A.G.Noorani,
pp.52-53]

విచారణ నడిచినంత కాలమూ నా ఉథ్దేశం ఒక్కటే! మా మీద అభియోగాల తీవ్రత ఎంతటిదైనా విచారణ పట్ల పూర్తిగా ఉదాసీనత చూపాలనే అనుకున్నాను. రాజకీయ కార్యకర్తలందరూ ఇలాగే ఉండాలి. న్యాయస్థానాల్లో లీగల్ పోరాటం సంగతి ఎప్పుడూ పట్టించుకోకూడదు. ఎంత కఠిన శిక్షలనైనా ధైర్యంగా భరించాలి. వ్యక్తిగత కోణం నుంచిగాక రాజకీయ కోణం నుంచే వారు తమ నడతను సమర్థించుకోవాలి - అని ఆ దరిమిలా తండ్రికి రాసిన ఉత్తరంలో భగత్‌సింగ్ చెప్పాడు.
కుట్ర కేసు నిందితుల్లో భగత్, దత్‌లను లాహోర్ సెంట్రల్ జైలులోనూ, మిగిలిన వారిని బోర్‌స్టల్ జైలులోనూ ఉంచారు. అందరూ కలుసుకోవటం జూలై 10న కోర్టు హాలులోనే. కష్టపడి కట్టుకున్న పోరాటపు గూడు కాస్తా ఉన్నట్టుండి ఛిన్నాభిన్నం కావడాన్ని చాలామంది తట్టుకోలేక పోయారు. పోలీసులు వరసపెట్టి దాడులు చేసి ముఖ్యులు దాదాపుగా అందరినీ పట్టుకోవటంతో... తమవారని నమ్మిన సహచరులే పోలీసుల పంచన చేరి గుట్టుమట్లు బయటపెట్టటంతో సహచరులు డీలా పడ్డారు. అంతా అయిపోయిందని బెంబేలెత్తవలసిన పని లేదని వారికి గుండెదిటవు కలిగించటం మొదట చేయాల్సిన పని. అలాగే కేసును ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా వాదించాలి, ఎలా పోరాడాలి అన్న వ్యూహరచన జరగాలి. కొన్ని ముఖ్య నిర్ణయాలు చేయాలి. చంద్రశేఖర్ ఆజాద్ దగ్గర లేడు. అన్నీ చూసుకోవలసింది భగత్‌సింగ్, సుఖదేవ్‌లే.

‘మొదటి మూడు రోజులూ మేము కోర్టు ప్రొసీడింగ్సును బొత్తిగా పట్టించుకోలేదు. మాలో మేము దీర్ఘంగా చర్చించుకున్నాం. నిరాహారదీక్ష మూలంగా భగత్‌సింగ్ చాలా బలహీనంగా, స్ట్రెచ్చర్ మీద తీసుకురావలసిన స్థితిలో ఉన్నాడు. అయినా ఎలాగో వాలుకుర్చీలో చేరగిలబడి మా చర్చను నడిపించాడు... మన పని అయిపోయింది అన్న నిస్పృహ నుంచి ముఖ్యంగా మనందరం బయటపడాలి అని అతడు నొక్కి చెప్పాడు.
ఎవరినైనా కాపాడటానికి అవకాశం చిక్కితే వారిని కాపాడవలసిందే. కాని మొత్తంగా కేసును రాజకీయపరంగానే నడపాలి. బ్రిటిషు ప్రభుత్వ బూటకపు న్యాయాన్ని ఎండగట్టటానికి అందే ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి. విప్లవకారుల గుండె బలమెలాంటిదో లోకానికి చాటాలి. మనమిచ్చే స్టేట్‌మెంట్ల ద్వారా, కోర్టులో, జైలులో మన చేతల ద్వారా మనం రాజకీయ ఖైదీలందరి తరఫున పోరాడాలి. ప్రభుత్వాన్ని ధిక్కరించాలి. కోర్టులన్నా, పోలీసులన్నా మనకు ఎంత చులకన భావం ఉన్నదో తెలియజెప్పాలి. బయట మనం చేస్తూ వచ్చిన పనిని ఈ రకంగా కొనసాగించాలి. మన చర్యల ద్వారా ప్రజలను జాగృతపరచాలి - అని భగత్‌సింగ్ ఉద్బోధించినట్టు ఆ సమయాన అక్కడే ఉన్న సహనిందితులు అజయ్ ఘోష్, శివవర్మ గుర్తు చేసుకున్నారు.
[Bhagat Singh and His Comrades, Ajoy Ghosh, pp.24-28
Samsritiyan, Shiv Varma, pp.43-44]

తన తరపున వాథించటానికి ప్లీడరు ఎవరినీ నియమించని భగత్‌సింగ్ అవసరమైనప్పుడు సలహా ఇవ్వడానికి లాలా దునిచంద్‌ను లీగల్ ఎడ్వయిజరుగా పెట్టుకున్నాడు. ఆయన సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవాడు. అలాగే వ్యూహ రచనకు తాను సుఖ్‌దేవ్, విజయకుమార్ సిన్హాలతో భగత్‌సింగ్ ఒక కమిటీని ఏర్పాటు చేశాడు.
కుర్చీలు, బల్లలు, వార్తాపత్రికలు, నాణ్యమైన ఆహారం వంటి సదుపాయాలను విచారణ ఖైదీలకు సాధించడానికి ఆందోళన జరపాలనీ -
కోర్టు హాలులో సందర్శకుల మీద ఆంక్షలను వ్యతిరేకించాలనీ -
అప్రూవర్లు, ఇతర ముఖ్య సాక్ష్యుల బండారాన్ని బయటపెట్టేలా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనీ -
పార్టీ ఆశయాలు, విప్లవ ధ్యేయాలు ప్రజలకు తెలిసేలా కోర్టు రూములో ప్రదర్శనలు జరపాలనీ - కమిటీ నిర్ణయించింది.
ప్రభుత్వ దుర్నీతిని, విప్లవకారుల లక్ష్యశుద్ధిని ప్రజలకు బోధపరచటానికి అఖిల భారత స్థాయిలో 14 మందితో డిఫెన్స్ కమిటీ ఏర్పడింది. దానికి ఫిరోజ్‌చంద్ కార్యదర్శి. పండిట్ కె.సంతానం కోశాధికారి. సైఫుద్దీన్ కిచ్లూ, గోపిచంద్ భార్గవ, కిషన్ సంఘ్ తదితరులు సభ్యులు. కమిటీకి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. పేద, మధ్యతరగతి వర్గాల నుంచి పదివేల రూపాయలకు పైగా స్వచ్ఛంద విరాళాలు పోగయ్యాయి. లాహోర్ కుట్ర కేసుకు వచ్చిన అంతర్జాతీయ ప్రసిద్ధి మూలంగా జపాన్, కెనడా, దక్షిణ అమెరికాల నుంచి కూడా విరాళాలు అందాయి.
స్వాతంత్య్ర యోధులను విచారించే నైతిక హక్కు విదేశీ ప్రభుత్వానికి లేదు.

ఆ ప్రభుత్వ తాబేదారు అయిన మేజిస్ట్రేటు బూటకపు విచారణను తాము గుర్తించనేబోమన్నది భగత్ బృందం నిర్ణయం. పగవాళ్లు పిలిచినప్పుడల్లా మనం కోర్టుకు పోవలసిన పని లేదు. కావాలనుకున్న రోజు కోర్టును బహిష్కరిద్దాం. ఇష్టమైన రోజున కోర్టుకెళదాం. వెళ్లిన సందర్భాల్లోనూ ప్రొసీడింగ్సును పెద్దగా పట్టించుకోకుండా నినాదాలు మాత్రమే చేద్దాం. విప్లవ గీతాలు పాడుదాం. అవకాశం వచ్చినప్పుడల్లా మన సిద్ధాంతాన్ని, విధానాలను ప్రచారం చేద్దాం. స్వాతంత్య్రం, విప్లవం ద్వారానే దేశానికి విముక్తి సాధ్యమని తెలియజెపుదాం - అని అందరూ కూడబలుక్కున్నారు. అలాగే చేశారు.
విప్లవకారులకు మీడియా నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ సహకారం లభించింది. నిందితులు కోర్ట్ హాల్‌లో అడుగు పెడుతూనే ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్య ముర్దాబాద్ నినాదాలు బిగ్గరగా చేసి, ‘వందేమాతరం’ ఆలపించేవారు. ‘సర్‌ఫరోషికి తమన్నా అబ్ హమారే దిల్‌మే హై’ ‘కభీ వో దిన్ భీ ఆయేగా కి జబ్ ఆజాద్ హమ్ హోంగే’ గీతాలను ఎవరొద్దన్నా, ఎంత వారించినా, ఇష్టమొచ్చినట్టు కొట్టినా లెక్కచేయక గట్టిగా పాడుతూంటే కోర్టులో ఉన్నవారందరికీ ఒళ్లు రోమాంచితమయ్యేది. దేశభక్తి భావంతో ఛాతీలు ఉప్పొంగేవి. ఈ విశేషాలు, కోర్టులో విప్లవకారుల ఆసక్తికర సంవాదాలు, వీరోచిత ప్రతిఘటనలు ‘ట్రిబ్యూన్’ ‘అభ్యుదయ’ వంటి పత్రికలు కళ్లకు కట్టినట్టు వర్ణించేకొద్దీ దేశవాసుల ఒళ్లు పులకరించేది. అవకాశం ఉన్న ప్రతివారూ పనులు మానుకుని విచారణ చూద్దామని కోర్టుకు విరగబడసాగారు.
***

హంతకుడు దొరికాడు
భగత్, దత్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష వేయటం సమంజసం కాదు. అది చాలా అన్యాయం - అని ‘ట్రిబ్యూన్’ లాంటి పత్రికలు సంపాదకీయాల్లో ఆక్షేపించాయి. జీవిత ఖైదుని విధిస్తున్నట్టు జడ్జి గంభీరంగా ప్రకటిస్తూంటే భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్‌లు నవ్వుతూ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని నినదించటం చూస్తూంటే స్వాతంత్య్ర స్ఫూర్తి మా నరనరాల్లోనూ ప్రవహించింది. ఇన్ని శ్రమలకోర్చి, త్యాగాలు చేసి సాధించిన స్వాతంత్య్రం ఈనాడు ఏ పరిస్థితుల్లో ఉందో చూస్తే.. ఏమీ అర్థంకాని పరిస్థితి. అప్పటికీ ఇప్పటికీ మారిందల్లా ఒక్కటే. ఆనాడు బ్రిటీష్ దొరలు పాలిస్తే.. నేడు కుట్రపూరిత రాజకీయాల్తో సామాన్యుడు నలిగిపోతూనే ఉన్నాడు.
-పి.రాంబాబు (అనకాపల్లి)

ఎం.వి.ఆర్.శాస్ర్తీ