S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కోర్టులో విప్లవ ప్రచారం (భగత్‌సింగ్-35)

తిరుగుబాట్లు, ధిక్కారాలు తెల్లదొరలకు కొత్తకావు. కుట్రలు, కుతంత్రాలతో మాయచేసి భారతదేశాన్ని ఆక్రమించినది మొదలుకుని ఎందరో దేశభక్తులు వారికి ఎదురు తిరుగుతూనే ఉన్నారు. దొరికిన వారిని దొరికినట్టు కారాగారాల్లో బంధించి, చిత్రహింసలు పెట్టి, తప్పుడు కేసులు మోపి ఉరికంబాలెక్కించి అవిధేయతను విదేశీ రాకాసులు యధేచ్ఛగా అణచివేస్తూనే ఉన్నారు. బలవంతుడిదే రాజ్యం కాబట్టి తిరగబడ్డవారిని ఎంతలా కాల్చుకుతిన్నా, ఎన్ని ఘాతుకాలకు పాల్పడ్డా అదంతా చట్టబద్ధమైన న్యాయ పరిపాలనలో భాగంగానే బ్రిటిషు సర్కారు చిత్రించగలిగింది.
ఇనే్నళ్లకు ఇప్పుడు ఊహించని ఉపద్రవం. ఆఫ్టరాల్ ఒక్కడు... నిండా పాతికేళ్లు లేని యువకుడు... సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక మామూలు మనిషి... బుద్ధిబలం ఉపయోగించి, కడు ఒడుపుగా రాజకీయ తంత్రం పన్ని, ఆకలినే ఆయుధంగా చేసుకుని, పదుగురినీ కూడగట్టి దేశమంతటా మహా సంచలనం తెచ్చాడు. ఉరి తీయడానికి ముందు తప్పనిసరి తతంగంగా బ్రిటిషు ప్రభుత్వం అతడిని కోర్టు బోను ఎక్కిస్తే... అతగాడు తన తెలివితేటలతో మొత్తం సర్కారునే ప్రపంచ ప్రజావళి ముందు దోషిగా బోనులో నిలబెట్టాడు.
జైళ్లలో తమ బారినపడ్డ ఖైదీలు తల ఎగరేస్తే, ఆ పొగరు ఎలా దించాలో, యమయాతనలతో, పాశవికమైన దాడులతో ఒళ్లు ఎలా హూనం చేయాలో పోలీసులకు బాగా తెలుసు. జైలు నాలుగు గోడల మధ్య ఎవరి మీద ఎన్ని కిరాతకాలకు పాల్పడ్డా అడిగిన వారు లేరు. మేజిస్ట్రేట్లూ రాజభక్తులే కాబట్టి ఖైదీల ఒంటి మీద ఎన్ని గాయాలున్నా సాధారణంగా పట్టించుకోరు. రాజకీయ ఖైదీలపై అఘాయిత్యాలు మామూలే కనుక కోర్టుల్లో వారిని చూసినవారూ ఏమీ చేయలేకపోయేవారు.
దేశంలో ఇప్పటిదాకా జరిగిన విచారణలు ఒక ఎత్తు. లాహోర్ కుట్రకేసు విచారణ ఇంకో ఎత్తు. భగత్‌సింగ్ చాకచక్యం వల్ల కుట్రకేసు విచారణ కాస్తా రాజ్యహింసపై విచారణగా మారింది. యావద్దేశం ఈ విచారణపై దృష్టి నిలిపింది. విద్యార్థులు, ఉడుకురక్తపు యువకులు, అన్నివర్గాల దేశభక్తులూ ఆంక్షలను లెక్కచెయ్యక విరగబడటంతో కోర్టు పరిసరాలు జనంతో కిటకిటలాడేవి. జాతీయవాద పత్రికలు వెయ్యి కళ్లతో కనిపెట్టి ప్రతిదీ పూసగుచ్చినట్టు వివరించేవి. వారాల తరబడి సాగుతున్న సామూహిక నిరాహారదీక్షలకు సంఘీభావం తెలుపుతూ వాటిని మాన్పించటానికి సర్కారు దౌర్జన్యాలను ఖండిస్తూ మోతీలాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, జవాహర్‌లాల్ నెహ్రు వంటి అగ్ర నాయకులు ప్రకటనలు చేశారు. జైలుకు వెళ్లి సమ్మె కట్టిన ఖైదీలను వారు పరామర్శించేవారు.
జైలులో ఏమి జరిగినా, మరునాడు ముద్దాయిలను కోర్టులో హాజరుపరచక తప్పదు. తమపై ఎటువంటి దాడులు, దౌర్జన్యాలు జరిగాయో ఖైదీలు కోర్టులో ఏకరువు పెట్టేవారు. వాటికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఒంటి మీద గాయాలు. బలవంతంగా ఆహారం ఎక్కించడాన్ని తీవ్రంగా ప్రతిఘటించి, ఆహారం లేనందున నీరసించి, కదలలేని స్థితికి చేరిన ఖైదీలను కోర్టుకు హాజరుపరచటం కష్టం. తీవ్ర అస్వస్థత కారణంగా నిందితులు కోర్టుకు రాకపోతే విచారణ కుదరదు. వాయిదా తప్పదు. అలా వాయిదాలు పడుతూ పోవటంవల్ల కేసు ముందుకు సాగదు.
భగత్‌సింగు, అతడి సహచరుల పోరాటానికి మద్దతుగా దేశమంతటా ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. తీవ్ర ప్రతికూలతకు తాళలేక బ్రిటిషు ప్రభుత్వం దిగి వచ్చి 1929 సెప్టెంబరు 2న పంజాబ్ జైల్ ఎంక్వయిరీ కమిటీని నియమించింది. రాజకీయ ఖైదీల సమస్యలు సానుకూలంగా పరిష్కారమయేట్టు చూస్తామని ఆ కమిటీ మెంబర్లు హామీ ఇవ్వగా యతింద్రనాథ్ దాస్ మినహా సమ్మెదారులు ఆందోళన విరమించారు. అప్పటికి భగత్, దత్‌లు ఆకలి సమ్మె కట్టి 81 రోజులయింది.
కమిటీ ఇచ్చిన మాట నీటిమూటే అయింది. మాయమాటలతో సమ్మెను మాన్పించడానికి చూపిన శ్రద్ధలో నూరో వంతును హామీని నిలబెట్టుకునే విషయంలో సర్కారువారు కనపరచలేదు. దాంతో విరమించిన మూడో నాడే (సెప్టెంబర్ 5న) భగత్, దత్‌లు నిరశన వ్రతాన్ని మళ్లీ కొనసాగించారు. ఎ.ఐ.సి.సి. తీర్మానం చేసి, భగత్ తండ్రి కిషన్ సింగ్ ద్వారా నచ్చచెప్పించగా అక్టోబరు 5న 113 రోజుల నిరాహారదీక్షను చాలించారు. ఆకలి సమ్మెలో ఐరిష్ విప్లవకారుడు నెలకొల్పిన 97 రోజుల ప్రపంచ రికార్డును భగత్‌సింగ్ దాటేశాడు.
కాంగ్రెసు వారు మొగమాటపెట్టి భగత్ సమ్మెనైతే మాన్పించగలిగారు గాని రాజకీయ ఖైదీలకు తగిన సౌకర్యాలు కలిగించేలా జైలు ఎంక్వయిరీ కమిటీ సిఫారసులను ప్రభుత్వం చేత అమలు చేయించలేకపోయారు. విసిగి వేసారి భగత్‌సింగ్ 1930 జనవరిలో మళ్లీ రెండు వారాలు ఆకలి సమ్మె చేశాకగానీ తెల్లదొరతనం దారికి వచ్చి, ఆ సిఫారసులను అమలుపరుస్తూ రూల్సు ఫ్రేమ్ చేయలేదు. ఈ సుదీర్ఘ సాత్విక పోరాటంతో భగత్‌సింగ్ పేరు దేశమంతటా మారుమోగింది. తన కోసం, తన పైని కేసు నుంచి బయటపడటం కోసం కాక దేశంలోని రాజకీయ ఖైదీలందరి న్యాయమైన హక్కుల కోసం అతడు ప్రాణాన్ని పణం పెట్టి పోరాడి, మదించిన తెల్లదొరతనాన్ని మెడలు వంచిన తీరుకు జాతి జనులు యావన్మందీ ముగ్ధులయ్యారు.
కాని - భగత్‌సింగ్ ఆకలి పోరాటం సాగినంత కాలమూ తెల్లవాళ్ల గుండెలు గుబగుబలాడుతూనే ఉన్నాయి. ఖర్మం చాలక అతడికి ఏమైనా అయితే, ప్రజల్లో కట్టలు తెంచుకునే ఆగ్రహావేశాలను తట్టుకోవటం తమ వల్ల కాదని వారు భయపడ్డారు. అయినా ఒక ప్రజా యోధుడికి తలవంచితే రవి అస్తమించడనుకునే తమ మహా సామ్రాజ్యానికి పరువు తక్కువ అన్న బింకంతో మొండికి పడ్డారు.
ప్రభుత్వమే మొండి అనుకుంటే దానికి మించిన జగమొండి భగత్‌సింగ్! మీరు చేయగలిగింది మా మీద దౌర్జన్యమే కదా? చేయండి; మీ లాఠీలు విరిగే దాకా కొట్టండి. మా ఒళ్లు హూనమైనా, ఎముకలు విరిగినా, ప్రాణాలు పోతున్నా మేము మాత్రం మీకు లొంగం. అనుకున్నది చేస్తాం. మీ అంతు చూసే తీరతాం - అన్నది అతడి పంతం. దానికి తగ్గట్టే వ్యూహం పన్నాడు. బ్రిటిషు దమననీతికి ప్రతీక అయిన కోర్టు హాలును విప్లవ ప్రాపగాండాకు చక్కని వేదికగా వాడుకున్నాడు.
సాధారణంగా క్రిమినల్ కేసుల్లో డిఫెన్సు పక్షం ప్రాసిక్యూషన్ చేసిన అభియోగాలు నిజం కాదని ఖండిస్తుంది. అటువంటి నేరాన్ని ముద్దాయిలు చేయలేదని నిరూపించజూస్తుంది. ప్రాసిక్యూషన్ సాక్షులు చెప్పేది తప్పు అనే ఎంతసేపూ వాదిస్తుంది. అది శిక్ష తప్పించుకోవాలని చూసే నిందితులు చేసే పని. భగత్‌సింగ్‌కు శిక్ష అంటే వెరపు లేదు. ఉరికంబమంటే భయంలేదు. కేసు నుంచి ఎలాగైనా బయటపడాలన్న ఆలోచన అసలే లేదు. అతడికి, అతడి సహచరులకు బ్రిటిషు రాజ్య వ్యవస్థ అన్నా, దాని చెప్పుచేతల్లోని న్యాయ విధానమన్నా గౌరవం, విశ్వాసం ఏ కోశానా లేవు. సర్కారు తమ మీద పగబట్టిందని వారికి తెలుసు. అది తమను వేటు వేసేలోగా దాని నిజ స్వరూపాన్ని, తమ నిజాయతీని, విప్లవ నిరతిని లోకానికి చాటటమే వారి ధ్యేయం.
దానికి తగ్గట్టే డిఫెన్సు ఆడారు. ఒకప్పుడు విప్లవకారులతో ఉండి, విప్లవ కార్యకలాపాల్లో పాల్గొని, ఇప్పుడు ప్రభుత్వపు ఉచ్చులో పడి, అప్రూవర్లుగా మారిన జైగోపాల్, హన్స్‌రాజ్ వోరా వంటి సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ఎక్కువగా భగత్‌సింగ్, సుఖ్‌దేవ్‌లే చేసేవారు. విప్లవకారులు ఏమి చేసేవారు, ఆయుధాలను ఎలా సమకూర్చుకునేవారు, ఎలా బతికేవారు, ఎలా దాడిచేసేవారు, ఏ సిద్ధాంతాల కోసం పనిచేసేవారు అన్నవి తమ మాజీ సహచరుల నోటితో చెప్పించేవారు. ఆ వివరాలన్నీ బయటికి వస్తే ముద్దాయిల మీద అభియోగం మరింత బలపడుతుందనీ, తెలిసీ తెలియక వెర్రిప్రశ్నలేసి భగత్‌సింగ్, సుఖ్‌దేవ్‌లు తమ గోతిని తామే తవ్వుకుంటున్నారని ప్రభుత్వ పక్షం వారు మురిసేవారు. విప్లవ పార్టీ కార్యకలాపాలు, ఆలోచనలు, విధానాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పేందుకే ప్రాణం మీద తీపి బొత్తిగా లేని ముద్దాయిలు కోర్టు వేదికను తెలివిగా వాడుకుంటున్నారని వారు గ్రహించటానికి చాలా సమయం పట్టింది.
అలాగే మేజిస్ట్రేటును, ప్రభుత్వ న్యాయవాదిని భగత్‌సింగ్ సూటి ప్రశ్నలతో ఇరుకున పెట్టి, వారి బోలుతనాన్ని బ్రిటిషు వారి దుర్నీతిని గొప్పగా ఎండగడుతూంటే చూసి, ఆ వైనాలను పత్రికల్లో చదివి ప్రజలు ఆనందించేవారు. తమను నవ్వులపాలు చేశారన్న ఉక్రోషంతో పోలీసులో, మేజిస్ట్రేటో దురుసుగా వ్యవహరిస్తే అది కూడా విప్లవకారుల పట్ల సానుభూతిని పెంచేది.
సుభాస్ చంద్రబోస్, మోతీలాల్ నెహ్రూ, జవాహర్‌లాల్ నెహ్రూ, బాబా గుర్దిత్‌సింగ్, రఫీ అహ్మద్ కిద్వాయి, కె.ఎఫ్.వారిమన్ లాంటి జాతీయ ప్రముఖులు వీలున్నప్పుడల్లా కోర్టుకు హాజరై విచారణను తిలకించేవారు. భగత్‌సింగ్, అతడి సహచరుల దేశభక్తిని, చిత్తశుద్ధిని, వారి వాదనలోని న్యాయాన్ని గట్టిగా సమర్థించి, వారిపై ప్రభుత్వం సాగిస్తున్న పాశవిక చర్యలను నిష్కర్షగా నిరసించేవారు. అదో చిత్రమైన స్థితి. బోనులో నిలబడ్డ నిందితులు హీరోలు అయ్యారు. వారిని బోనులో నిలబెట్టిన ప్రభుత్వమూ, దాని తైనాతీలేమో ప్రజల దృష్టిలో విలన్లుగా నగుబాటుపాలయ్యారు.
మచ్చుకు ఒకనాటి విచారణ తీరును చిత్తగించండి.

అది 1929 అక్టోబరు 19. కేసు విచారణ మొదలుకాగానే నిందితులు ‘్భరత్ న రహ్ సకేగా గులాంఖానా’ అని ఒక దేశభక్తి గీతం బిగ్గరగా పాడారు.
ఆ రోజు సుభాష్ చంద్రబోస్ కోర్టుకు వచ్చాడు. గదర్ తిరుగుబాటులో ‘కామగత మారు’ ఫేమ్ బాబా గుర్‌దిత్‌సింగ్ ఆయన వెంట ఉన్నాడు. పర్మిట్లు ఉన్నప్పటికీ లోనికి పోనివ్వకుండా వారిద్దరినీ జైలు గేటు దగ్గరే రెండు గంటలపాటు ఆపేశారు. అడ్వొకేట్ అమ్‌లోక్‌రామ్ ఆ సంగతి మేజిస్ట్రేటుకు చెప్పాడు. ‘ఓహో! వాళ్లూ తమాషా చూడటానికి వచ్చారా? సరే! రానివ్వండి’ అన్నాడు మేజిస్ట్రేటు. కాని, కోర్టు హాలులో నిందితులను కలవడానికి సుభాష్ బాబును మేజిస్ట్రేటు అనుమతించలేదు.
సుభాష్ బోస్, బాబా గుర్దిత్‌లు కోర్టు రూములోకి రాగానే బోనులోని నిందితులు లేచి ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ ‘ఇంపీరియలిజం డౌన్‌డౌన్’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. బోస్ చేతులు జోడించి వారికి అభివాదం చేశాడు. ప్రెస్ ఎంక్లోజర్‌లో ఆయనను, బాబాకు ఆసనాలు చూపించారు.
కాసేపటికి సహరాన్‌పూర్ డి.ఎస్.పి. (పి.డబ్ల్యు 230) సాక్ష్యం ఇస్తూండగా నిందితుడు యతీంద్ర సన్యాల్ లేచి మేజిస్ట్రేట్‌ను అడిగాడు:
‘సర్! (దివంగత యతీన్‌దాస్ తమ్ముడు) కిరణ్ చంద్రదాస్ బయట వేచి ఉన్నాడు. అతడిని లోనికి రానివ్వండి’
మేజిస్ట్రేటు: నేను పాస్ ఇచ్చాను.
సన్యాల్: సోదా చెయ్యకుండా అతడిని లోపలికి రానివ్వమంటున్నారు. ఇది జాతి ఆత్మగౌరవానికి అవమానం.
భగత్‌సింగ్: సోదా చెయ్యకుండా కొందరిని కోర్టులోకి రానిచ్చారు. కిరణ్‌కి మాత్రం సోదా తప్పదంటున్నారు. కారణం తెలుసుకోవచ్చా?
అజయ్ ఘోష్: సోదా లేకుండానే మొదట పాస్ ఇచ్చారు. సిఐడి వాళ్లు చెప్పేసరికి మాట మార్చారు. కిరణ్‌ను ఎందుకు సోదా చెయ్యాలి యువరానర్?
మేజిస్ట్రేటు: అతడు యతిన్‌దాస్ తమ్ముడు కాబట్టి.
భగత్‌సింగ్: మీ లాజిక్ మాకు అర్థం కావటంలేదు. ఇది అతడికే కాదు; ప్రతి భారతీయుడికి అవమానం. యతీంద్రనాథ్ దాస్ స్మృతికి మీరే నివాళి అర్పించారు. మళ్లీ మీరే అతడి తమ్ముడిని రానివ్వమంటున్నారు.
విజయకుమార్ సిన్హా: మీరు ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారు. ఇది బహిరంగ విచారణ కాదు. ఫార్సు. అనవసరంగా సతాయిస్తున్నారు.
సన్యాల్: మీరు సిఐడి ఎత్తును ఎదుర్కొనలేనంత నిస్సహాయులైతే రాజీనామా చెయ్యాలి. అదే మీకు గౌరవప్రదం.
మేజిస్ట్రేటు: మంచి సూచన.
సన్యాల్: కిరణ్‌ని కోర్టులోకి రానిస్తే బ్రిటిష్ ప్రభుత్వం ముక్కలవుతుందా?
భగత్‌సింగ్: బోస్‌బాబుకు ఈ అభిప్రాయమే కలుగుతుంది. మేజిస్ట్రేటు పోలీసుల చేతిలో కీలుబొమ్మ కాకూడదు. పోలీసులే అతడి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
అజయ్‌ఘోష్: మేజిస్ట్రేటు కుర్చీలో పోలీసు ఆఫీసరును కూచోబెడితే ఇంకా బాగుంటుంది.
మేజిస్ట్రేటు: బయటి నుంచి వచ్చేవారిని పోలీసులే నియంత్రిస్తారు.
భగత్‌సింగ్: కిరణ్ వస్తున్నది కోర్టుకు. పోలీసుస్టేషనుకు కాదు. పోలీసుల ఆర్డరును మేజిస్ట్రేటు తలదాల్చటం కాదు... పోలీసులే మేజిస్ట్రేటు ఆర్డరును తలదాల్చాలి.
ఇంకో రోజు (అక్టోబర్ 24న) స్టూడెంటు విజిటర్లను కోర్టు హాల్‌లోకి రానివ్వలేదు. దానిపై భగత్‌సింగ్ మేజిస్ట్రేటును ఇలా తగులుకున్నాడు: ‘నిందితుల్లో కొందరు విద్యార్థులున్నారు. వారిని బోనులో ఉండనిచ్చినప్పుడు కోర్టులోకి మాత్రం విద్యార్థులను ఎందుకు రానివ్వరు? క్రిమినల్ ప్రొఫెసర్ కోడ్ 352 సెక్షను (ఇప్పుడు అది 327 సెక్షను) ప్రకారం క్రిమినల్ కోర్టును నిర్వహించే ప్రదేశాన్ని ఓపెన్ కోర్టుగానే పరిగణించాలి.ఉన్న స్థల పరిమితికి లోబడి పబ్లిక్‌ను అనుమతించాలి. ఒక వర్గం పబ్లిక్‌కు ప్రవేశాన్ని మీరెలా ఆపగలరు? మీ ఉత్తర్వు చట్ట విరుద్ధం. నిందితుల్లో విద్యార్థులున్నప్పుడు, వారికి గల విద్యార్థి మిత్రులు కేసు పట్ల ఆసక్తి చూపటం సహజం. మీరు పునః పరిశీలించండి.’
కోర్టు ఒప్పుకోలేదు.
ఇంకో ముచ్చట. రాజ్‌గురును మొదటిసారి రిమాండు కోసం తన దగ్గరికి తెచ్చినప్పుడు ఇదే మేజిస్ట్రేటు అడిగాడట: ‘నీ పేరు రాజగురు కదా? ఇలాంటి చిత్రమైన అభియోగం నీ మీద వచ్చిందేమిటి?’ అని. దానికి అతడి జవాబు: ‘ఔను రాజగురునే. రాజుకు బుద్ధి చెప్పటం నా పని’
[Bhagat Singh, The Eternal Rebel, M.S.Waraich, pp.127-129]
[Trial of Bhagat Singh, A.G.Noorani, pp.103-105]
*

ఎం.వి.ఆర్.శాస్ర్తీ