S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నమ్మిన వారికి. (కథ)

ఉద్యానవనంలో చల్లగాలులను ఆస్వాదిస్తున్న ఒక యువకుని దగ్గరికి ఒక ముసలి పేద బ్రాహ్మణుడు అరుదెంచాడు. ప్రకృత్యారాధనలో వున్న ఆ యువకుడు చాలాసేపు అతనిని గమనించలేదు. చివరికి గమనించిన తరువాత ఆ పెద్దాయన పైన విసుక్కున్నాడు.
‘విశ్వం! నాకు కావలసింది నీ దగ్గర ఉన్నది. కాని అది నీ దగ్గర ఉన్నదని నీకే తెలియడం లేదు’ చిరునవ్వుతో చెప్పాడు ఆ పెద్దాయన.
ఆ యువకుడు ఉలిక్కిపడ్డాడు ఆ పిలుపునకు. ఆశ్చర్యంగా అడిగాడు.
‘అరె! ఎవర్నువ్వు? నా పేరు ఎలా తెల్సుకున్నావు?’
‘నాకు అన్నీ తెలుసు. ఆ ఎరుక నీకు కూడా కలిగిద్దామనే నా ప్రయత్నం. నాతో వస్తావా మరి?’ ఆయన అడిగాడు.
‘తిక్కవాడిలాగున్నావు? ఎవరి వెంట పడితే వారి వెంట రావడానికి నీ కంటికి ఎలా కనిపిస్తున్నానేంటి? నేనేం పనీపాట లేని బిచ్చగాడి ననుకున్నావా?’
‘కాదు కాబట్టే పనిగట్టుకుని నిన్ను అడుగుతున్నాను. నా వెంట వస్తే నీకు బ్రహ్మవిద్య నేర్పిస్తాను. దానితో నీ జన్మ మారిపోతుంది!’
‘ఆ విద్యనే నీ దగ్గర ఉంటే నువ్వు ఈ అవతారంలో ఎందుకుంటావు పెద్దాయనా! నా కాలం పాడుచెయ్యక దయచెయ్యి. బ్రహ్మ విద్యట బ్రహ్మవిద్య. నేనసలు బ్రహ్మనే నమ్మను’ కొంచెం కోపంగా చెప్పాడు విశ్వం.
‘దేవుడు లేడని ఎందుకు నిర్ణయానికొచ్చావు?’ చిరునవ్వుతో అడిగాడు ముసలాయన.
‘ఇంక దేవుడెందుకు? ఇన్ని అన్యాయాలు జరుగుతూంటే చూసి సహించే దేవుడు ఉన్నా లేనట్టే!’ ఆవేశపడిపోయాడు యువకుడు.
‘చూడు విశ్వం! ఆ సూర్యుడు అన్ని చోట్లా తన కిరణాలను ప్రసరిస్తున్నాడు. ఆ మురికి కాలువపైన, ఆ నదిపైన, ఈ సుగంధ పరిమళాల తోటలపైన తన కిరణాలను ప్రసరిస్తున్నాడు. కాని ఆ కాలువలోని మురికి కాని, ఆ నదిలోని తియ్యదనం కాని, ఆ తోటల పరిమళాలు కాని ఆ కిరణాలకు అంటవు. సూర్యుడికి చేరవు అవునా? చంద్రుడు అందరిపైన అన్నింటిపైన చల్లని కిరణాలను వెదజల్లుతాడు. ఆ చల్లని వెలుతురులో జరిగే ఘోరాలకు కాని, పుణ్యాలకు కాని ఆ చంద్రుడు ఎలా బాధ్యత వహించడో భగవంతుడు కూడ లోకంలో జరిగే వేటికీ కారకుడు కాదు’ ముసలి బ్రాహ్మణుడు వివరించాడు.
ఆ యువకుడు కాసేపు ఆలోచించాడు. ‘నాకు ఆకలేస్తే అన్నం పెట్టగలడా!’
‘ఆ! ఎవరో ఒకరి రూపంలో వచ్చి నీకు భోజనం సమకూరుస్తాడు’
‘అట్లాగ! అయితే ఈ జనసమర్థ పట్టణంలో వద్దు. నిర్జనంగా వున్న కొండకోనల్లోకి వెళదాం! అక్కడ మీ దేవుడు నాకు అన్నం పెడతాడేమో చూద్దాం!’
మరుసటి రోజు అనుకున్నట్లుగా ఉదయం బయలుదేరి పట్టణానికి దూరంగా నరసంచారం జరుగని కొండలలోకి చేరుకున్నారు. చుట్టూతా చూసి ఆ యువకుడు అక్కడికి ఎవరూ రాలేరని సంతృప్తి చెందాడు.
‘ఏది మీ దేవుడిని నాకు అన్నం పెట్టమను’ అడిగాడు చిలిపిగా ముసలాయన వంక చూసి.
‘అలాగే, నిష్ఠగా ఈ మంత్రం జపించు’ అంటూ అతని చెవిలో ఒక మంత్రం ఉపదేశించాడు. కళ్లు మూసుకుని తదేక ధ్యానంతో జపించమన్నాడు.
ఒక గంట జపించి ఇంకా భోజనం రాలేదేమని అడిగాడు విశ్వం.
‘నీ దృష్టి మంత్రం మీద లేదు. అన్నం మీద ఉంది, అలా కాదు, పరమ నిష్ఠతో ఆ మంత్రాన్ని జపించు’ అని బోధించాడు పెద్దాయన.
విశ్వంకు ధ్యానం కుదిరి తీక్షణంగా మంత్రం జపించసాగాడు. మధ్యాహ్నం దాటిపోయింది. కడుపులో కరకర ఆకలేస్తున్నది ఇద్దరికి. అయినా మంత్రం జపించడంలో మునిగిపోయాడు విశ్వం.
కాసేపటికి కొమ్ము బూరలు ఊదుతూ, మద్దెలలు వాయిస్తూ ఒక గుంపు అటుగా వచ్చింది. వారిని చూస్తే ఆటవిక జాతిలా కనిపిస్తున్నారు. వారు బళ్ల మీద ఎన్నో పాత్రలు పట్టుకొస్తున్నారు.
ధ్యానభంగమై విశ్వం మేల్కొన్నాడు. ముసలి బ్రాహ్మణుడు లేచి నిలబడ్డాడు.
‘దొరా! ఇక్కడ విశ్వం ఎవరు? ప్రొద్దుటి నుంచి అతని కోసం వెతుకుతున్నాము’ కోయ దొరల పెద్ద ముసలి బ్రాహ్మణుడిని అడిగాడు. ‘అలాగే ఆయనతోపాటు నారాయణ అని ఒక పెద్దాయన ఉండాలి. వారిని మీరు చూశారా?’ అతను అడిగాడు తిరిగి.
విశ్వం నిర్ఘాంతపోయి ముసలి బ్రాహ్మణుడి వంక చూశాడు.
‘మీరు అడుగుతున్న నారాయణుడిని నేనే. ఈ యువకుడే విశ్వం. వారితో మీకు ఏం పని పడింది?’ నవ్వుతూ అడిగాడు పెద్దాయన.
‘అయ్యా! ఇది మా కొండదేవర ఆజ్ఞ! ఉదయం మా రత్తాలు ఒంటిమీదికొచ్చి విశ్వం, నారాయణలు ఆకలికి తాళలేకుండా ఉన్నారు. వెంటనే పంచభక్ష్య పరమాన్నాలు పట్టుకు పొండని ఆజ్ఞాపించాడు. వెంటనే వంట చేసి ఆధరువులను బండిలో వేసుకుని మేమందరం బయలుదేరి మీ కోసం వెతుకుతున్నాము. క్షమించండి. మిమ్మల్ని కనుక్కోవడం ఆలస్యమైంది’ కోయదొర చెప్పాడు.
క్షణాల్లో ఆకుల్లో అన్ని పదార్థాలు వడ్డించి వారిని కూర్చోబెట్టి కడుపునిండా భోజనం పెట్టారు.
వారికి శ్రమ లేకుండా వారిని బండి ఎక్కించి తీసకువచ్చి పట్టణం దాపుల్లో వదిలిపెట్టారు.
జరిగిన దానికి విశ్వం ఒక రకమైన పులకరింతలో ఉండిపోయాడు. పట్టణంలో ప్రవేశించిన తరువాత నారాయణ అడిగాడు.
‘విశ్వం! దేవుడున్నాడని ఇప్పటికైనా నమ్ముతావా?’
‘ఆ! నమ్మక ఛస్తానా! ముక్కుమొహం తెలియని వారికి మన పేర్లు తెలియడం, మన ఆకలి బాధలు తెలియడం ఇది కలయో వైష్ణవ మాయలాగానో ఉంది’ విశ్వం చెప్పాడు.
‘నమ్మక చెడితే భగవంతుడి తప్పు కాదు. ఆయనని నమ్మి చెడినవాడు లేడు’ నారాయణ చెప్పాడు.

-విశాలి