S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అందరి భవిష్యత్‌కే హరితహారం

నల్లగొండ, జూలై 2: కరవు, పర్యావరణ సమస్యలను దూరం చేసి సమాజంలోని అందరి భవిష్యత్‌ను పరిరక్షించేందుకు తెలంగాణలో అడవుల విస్తీర్ణం 25శాతం నుండి 33శాతం పెంచేందుకు సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం హరిత హారం కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం జడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతు హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమం కేవలం అధికారులకు, ప్రభుత్వానికి మాత్రమే సంబంధించింది కాదని సమాజహితం కోసం అందరి బాధ్యతగా హరితహారాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. సిఎం కెసిఆర్ వారం రోజుల్లో జిల్లా నుండే రెండోదఫా హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారన్నారు. నాటుతున్న మొక్కలన్నీ సంరక్షించబడటం లేదన్న చర్చల కంటే ప్రతి ప్రజాప్రతినిధి, నాయకుడు, అధికారి తనవంతుగా హరిత హారంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, మొక్కల సంరక్షణకు సహకరించాలన్నారు. తనవంతుగా సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 10వేల మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను చేపట్టబోతున్నానని అందరికి ఆదర్శంగా ఉండేలా తాను ఈ ప్రయత్నాన్ని చేపట్టానన్నారు. అటవీశాఖ నాటిన మొక్కలకు, ఉన్న మొక్కలకు భారీ వ్యత్యాసం ఉందని, రాచకొండ గుట్టలతో పాటు ఫారెస్టు ప్రాంతాల్లో, రహదారుల వెంట భారీ వృక్షాలను అక్రమంగా నరికి విక్రయించడాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కాలుష్య కారకమైన పరిశ్రమలను గుర్తించి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుని పర్యావరణ పరిరక్షణ దిశగా హరిత హారంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు. పత్తి సాగు చేయవద్ధంటు రైతు సంక్షేమం కోసమే ప్రభుత్వం ప్రచారం చేపట్టిందన్నారు. వేలం వెర్రిగా పత్తి సాగు చేసి రైతులు ఆర్ధికంగా చితికిపోతున్నారని, వారి సంక్షేమానికే ప్రభుత్వం పత్తి సాగు వద్ధంటుందన్నారు. నిప్పు ముట్టుకోవద్ధంటు చెప్పాక కూడా ముట్టుకుని వైద్యం చేయమన్నట్లుగా పత్తి వేయవద్ధన్నా కూడా వేసి నష్టాల పాలై ప్రభుత్వాన్ని ఆదుకోమనడం సబబుకాదన్నారు. పప్పు్ధన్యాల పంటలను కోతులు, మనుబోతుల నుండి కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుని వాటిని ఇతర పెద్ద అడవుల్లోకి వదలివేసే చర్యలు చేపడుతామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజా ప్రయోజనం, పరిపాలన సౌలభ్యం కోసమే తప్ప రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజలు, పార్టీలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు.
మొక్కల సంరక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
అంతకుముందు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కోట్లలో మొక్కలు నాటితే వేలు కూడా దక్కడం లేదని ఖర్చు వృథా అవుతుందన్నారు. హరితహారంలో అంతా భాగస్వామ్యం కావాలని నాటే మొక్కల పరిరక్షణ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. అలాగే రాచకొండ గుట్టలతో పాటు ఫారెస్టు ప్రాంతాల్లో అక్రమరవాణా అవుతున్న వృక్షసంపద అక్రమ నరికివేత, విక్రయాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. చౌటుప్పల్, తడ్కపల్లిలో కాలుష్యకారక ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోకుండా కాలుష్య నియంత్రణ బోర్డు ప్రేక్షకపాత్ర వహిస్తూ సమాజానికి చేటు చేస్తుందని తప్పుబట్టారు. కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి స్పందిస్తూ కాలుష్యకారక పరిశ్రమలపై ఆకస్మిక తనిఖీలు చేపడుతామని, కాలుష్య నివారణ చట్టాల అమలులో వెనుకాడబోమన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రేయిన్‌గేజ్ మీటర్లను అన్ని మండలాల్లో నెలకొల్పాలని, పంచాయతీల వారీగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లేనట్లయితే గతంలో మాదిరిగా కరవు మండలాల ఎంపికలో అన్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఎన్.్భస్కర్‌రావు, ఎమ్మెల్సీ పూల రవిందర్‌లు మాట్లాడుతూ హరిత హారం మొక్కల సంరక్షణపై పలు సూచనలు చేశారు. జడ్పీటీసిలు బొల్ల శివశంకర్, జాజుల అంజయ్య, దూదిమెట్ల సత్తయ్య, పరమేశ్, ఎంపిపిలు చింతల ప్రభాకర్‌రెడ్డి, బుజ్జిలు మాట్లాడుతూ కోతులు, మనుబోతుల బెడదను తొలగించాలని కోరారు. ఎంపిపిలు, జడ్పీటీసిలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మాదిరిగా ప్రాదేశిక నియోజకవర్గ ఫండ్‌ను కేటాయించాలని కోరారు. డ్వామా పిడి దామోదర్‌రెడ్డి హరితహారం లక్ష్యాలను, సన్నాహాలను, జెడిఏ నరసింహరావు వ్యవసాయ శాఖ ఖరీఫ్ సన్నాహాలను సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో జడ్పీ సిఈవో రావుల మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, ఎంపిపిలు రెగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, పాశం రాంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శివాజీ, శ్రీరాముల నాగరాజు, మొగిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఇతర జడ్పీటీసిలు, ఎంపిపిలు, జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.