S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తీవ్రవాద కదలికలపై నిఘా ఏదీ..?

నిజామాబాద్, జూలై 2: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితాలో కొనసాగుతున్న నిజామాబాద్ జిల్లాలో ఐఎస్‌ఐ కదలికలపై ఇటీవలి కాలంలో పోలీసు వర్గాల నిఘా సన్నగిల్లినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఏ మూలన, ఎలాంటి తీవ్రవాద సంఘటన జరిగినా దాని వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిజామాబాద్ జిల్లాకు సంబంధాలు ఉన్నట్టు అనేక సందర్భాల్లో వెల్లడైంది. మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలకు ఆనుకుని ఉండడంతో ఐఎస్‌ఐ తీవ్రవాదులు తమ కార్యకలాపాల నిర్వహణ, విస్తరణ కోసం ఈ ప్రాంతాన్ని షెల్టర్‌జోన్‌గా ఉపయోగించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులోనూ తేలింది. ఇదివరకు స్థానికంగా చోటుచేసుకున్న సంఘటనలతో పాటు నిఘా వర్గాల దర్యాప్తులో జిల్లాలో ఐఎస్‌ఐ కదలికలు కొనసాగిన విషయం బట్టబయలవడంతో నిజామాబాద్‌ను తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితాలో చేర్చారు. అయినప్పటికీ గత కొనే్నళ్ల నుండే ఐఎస్‌ఐ కార్యకలాపాలపై నిఘాను కొనసాగించే విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున మారణకాండ సృష్టించేందుకు సన్నాహల్లో ఉన్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) పకడ్బందీగా వ్యవహరించి వారిని ముందస్తుగానే అదుపులోకి తీసుకోవడంతో పెనుముప్పు తప్పినట్లయ్యింది. ఈ ఉదంతంతో రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు మళ్లీ వేళ్లూనుకుంటున్నాయని ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతుండగా, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా స్థానికంగానూ జిల్లాపై మరోమారు ‘ఉగ్ర’నీడలు అలుముకునే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత దశాబ్దన్నర కాలం క్రితం జిల్లాలోని బోధన్ పట్టణంలో తొలిసారిగా ఐఎస్‌ఐ ఆనవాళ్లు బయటపడ్డాయి. సైకిల్ స్టోర్ యజమాని రామకృష్ణారావును కాల్చి చంపిన సంఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులకు ఈ ఉదంతం వెనుక ఐఎస్‌ఐ హస్తమున్నట్టు వెల్లడి కావడంతో, అప్పటి జిల్లా ఎస్పీ రవిశంకర్ అయ్యన్నార్ తీవ్రవాద కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే 2002 నవంబర్ 23వ తేదీన ఐఎస్‌ఐ తీవ్రవాది ఆజంఘోరిని జిల్లా పోలీసులు వెంబడించి జగిత్యాల వద్ద ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఘోరీ వద్ద లభించిన డైరీ ఆధారంగా అప్పట్లో మొత్తం 14మందికి ఐఎస్‌ఐ కార్యకలాపాలతో సంబంధాలున్నాయని గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో నలుగురు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు కాగా, మిగితా వారు భైంసా, నిర్మల్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వ్యక్తులుగా నిర్ధారణ అయ్యింది. ఈ సంఘటన అనంతరం పాకిస్తాన్ నుండి వచ్చిన ఐఎస్‌ఐ ఏజెంట్ ఆషిక్‌అలీ నిజామాబాద్ శివారులోని సారంగపూర్‌లో పట్టుబడ్డాడు. స్థానికంగానే ఎవరైనా యువతితో వివాహం చేసుకుని ఇక్కడే మకాం వేసి ఐఎస్‌ఐ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నంలో ఉన్న తరుణంలోనే పోలీసులకు చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉదంతం మరువకముందే నగరంలోని మాలపల్లి ప్రాంతానికి చెందిన లష్కర్-ఎ-తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై అబ్దుల్జ్రాక్ మసూద్‌ను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో సాయిబాబా మందిరం సమీపంలో జరిగిన స్కూటర్ బాంబు పేలుడు సంఘటనతో రజాక్‌మసూద్‌కు సంబంధాలు ఉన్నాయని అభియోగం మోపారు. ఇలా అనేకానేక తీవ్రవాద సంఘటనలతో నిజామాబాద్ జిల్లా విడదీయరాని బంధాన్ని పెనవేసుకుంది. ఆజంఘోరీ డైరీలోని వివరాల ఆధారంగా అరెస్టు కాబడి జీవిత ఖైదు విధించబడిన వారంతా గత ఏడేళ్ల క్రితమే పై కోర్టుకు అప్పీల్ చేసుకుని జైలు జీవితం నుండి విడుదలయ్యారు. వీరిలో పలువురు సాధారణ జీవితం గడుపుతున్నప్పటికీ, ఒకరిద్దరి ఆచూకీ మాత్రం తెలియడం లేదని సమాచారం. వాస్తవానికి ఆజంఘోరి ఎన్‌కౌంటర్ సమయంలోనే జిల్లాకు చెందిన మరో ఇద్దరికి ఐఎస్‌ఐతో సంబంధం ఉన్నట్టు గుర్తించినప్పటికీ, వారు పోలీసుల చేతికి చిక్కకపోవడంతో చార్జ్‌షీట్‌లో వారి పేర్లను చేర్చలేదని తెలుస్తోంది. సదరు వ్యక్తుల ఆచూకీ ఇప్పటికీ పోలీసులకు తెలియరాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు అధికారులు నిఘాను కట్టుదిట్టం చేసి అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెనుప్రమాదం వాటిల్లే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.