S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిద్దరోతున్న నిఘా!

అనంతపురం, జూలై 2 : జిల్లావ్యాప్తంగా విచ్చలవిడిగా మద్యం అక్రమ విక్రయాలు, ఎమ్మార్పీకి మించి అధిక ధరలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ నిద్రమత్తులో జోగుతోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది. జిల్లాలో అనంతపురం, పెనుకొండ ఎక్సైజ్ (యూనిట్లు) ఉన్నాయి. వీటి పరిధిలో 238 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో అనంతపురం పరిధిలో 140, పెనుకొండ పరిధిలో 98 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఇష్టారాజ్యంగా బెల్టుషాపుల నిర్వహణ, అధిక ధరలకు మద్యం విక్రయించడం పరిపాటిగా మారింది. ఏడాది కాలంలో అధిక ధరలకు సంబంధించి కేసులు జిల్లా మొత్తం 25 లోపే నమోదు చేయడం విశేషం. అపరాధ రుసుం సైతం రూ.20-25 లక్షల మధ్యే ఉన్నట్లు సమాచారం. అనంతపురం ఎక్సైజ్ పరిధిలోని మద్యం దుకాణాల్లో సమయపాలన ఉల్లంఘనపై 8 కేసులు, బిల్లు బుక్స్ సక్రమంగా నిర్వహించకపోవడం, ఇతరత్రా ఉల్లంఘనల కింద సుమారు 56 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు బెల్టు షాపుల్ని, అధిక ధరలకు మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేమని అడిగిన వారిపై వారి అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి తన అనుచరుల సాయంతో మద్యం దుకాణదారులను బెదిరించి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరో ప్రజాప్రతినిధి కుమారుడు ఎక్సైజ్ కమిషనరేట్‌లో తన పలుకుబడి ఉపయోగించి ఏకంగా ఓ మహిళా ఎక్సైజ్ సిఐని బదిలీ చేయించారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. అలాగే కదిరి, నల్లమాడ, పెనుకొండ, హిందూపురం, అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, మడకశిర, ధర్మవరం తదితర ప్రాంతాల్లో మద్యం అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగానే ఎక్సైజ్ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఎక్సైజ్ స్టేషన్ స్థాయి నుంచి జిల్లాకేంద్రంలోని ఉన్నతాధికారుల వరకూ మద్యం దుకాణదారుల నుంచి నెలసరి మామూళ్ల పంపకాలు సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కదిరిలోని మద్యం దుకాణాలన్నీ ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బెల్టుషాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేయడానికి జంకుతున్నట్లు సమాచారం.
అనంతపురం ఎక్సైజ్ యూనిట్‌లో..
అనంతపురం ఎక్సైజ్ యూనిట్ పరిధిలో అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, గుత్తి, ఉరవకొండ, శింగనమల, కణేకల్లు ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్లు ఉన్నాయి. వీటిన్నింటిలోనూ గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ ఎమ్మార్పీ కేసులు 14, సమయం ఉల్లంఘన కేసులు 8, ఇతరత్రా కేసులు కలిపి మొత్తం 64 కేసులు నమోదు చేశారు. ఒక్క అనంతపురం నగరంలో ఎమ్మార్పీ కేసులు కేవలం 13 మాత్రమే నమోదు చేసి సుమారు రూ.13 లక్షలు అపరాధ రుసుం వసూలు చేశారు. ఇతర కేసులకు రూ.2.55 లక్షలు కౌంపౌండ్ వసూలు చేశారు. ఇక నగర పరిధిలోని సుమారు 34 మద్యం దుకాణాల నుంచి వేలాది రూపాయలు నెలావారీ మామూళ్లతో లక్షలు సమర్పించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో బెల్టుషాపులతోపాటు హోటళ్లు, దాబాల్లో అనధికారికంగా మద్యం అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. నగర పరిధిలోని జాతీయ రహదారిలో ఉన్న పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది కొరతను కొందరు ఉన్నతాధికారులు సాకుగా చూపుతున్నారు. తమ ఎక్సైజ్ పరిధిలో దాడులు కొనసాగిస్తూ, కేసులు నమోదు చేస్తున్నట్లు ఈఎస్ అనిల్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.