S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీశైలం జలాశయానికి నీటి చేరిక సాధ్యమేనా!

కర్నూలు, జూలై 2 : శ్రీశైలం జలాశయంలో ఈ ఏడాది జలకళ కనిపించడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో కురిసే వర్షాల స్థాయిలో ఉత్తర భారతంలో కనిపించవన్న నిపుణుల అభిప్రాయంతో శ్రీశైలం జలాశయం దిగువన ఉన్న రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల ఫలితంగా దక్షిణ భారత దేశంలో 18 నుంచి 20శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని, ఇదే సమయంలో ఉత్తర భారత దేశంలో సాధారణ వర్షపాతం నమోదు కానుందని గతంలో వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. వారి అంచనాల ప్రకారమే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపించడంతో ఉత్తరాది వర్షాలపై ఆధారపడిన శ్రీశైలం జలాశయం నిండుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి 151 టిఎంసిల నీరు మాత్రమే లభ్యమవుతుందని అంచనా వేసి ఆ మేరకు నీటి కేటాయింపులు పూర్తి చేశారు. ఇక మహారాష్టల్రో కురిసే వర్షాలపై ఆధారపడిన కృష్ణా నదిలో నీటి ప్రవాహ ఉద్ధృతిని కట్టడి చేసే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండితేనే శ్రీశైలం జలాశయానికి నీరు చేరుతుంది. శ్రీశైలం జలాశయానికి చేరే నీటిలో మొదటి ప్రాధాన్యత కింద ఈ ఏడాది కృష్ణా పుష్కరాల కారణంగా దిగువన నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలకు తరలించే అవకాశాలు ఉండటంతో జలాశయం నీటి మట్టం పెరిగే విషయంలో సందిగ్ధత నెలకొంది. మరోవైపు తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత గణనీయంగా తగ్గిందన్న అధికారుల అంచనాలతో తుంగభద్ర జలాశయం గేట్లు తెరుచుకోవడంపై ఇప్పుడే ఎలాంటి అంచనాలకు రాలేమని అధికారులంటున్నారు. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 104 టిఎంసిలు కాగా ప్రస్తుతం డెడ్ స్టోరేజీ స్థాయిలో ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. తుంగభద్ర జలాశయం నిండాలంటే ఎగువన ఉన్న పలు ఎత్తిపోతల పథకాల ద్వారా తరలించే నీరు పోనూ దిగువకు వచ్చే నీటి పరిమాణంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే మొత్తం ఖరీఫ్ సీజన్‌లో జలాశయంలో నీటి లభ్యత 151 టిఎంసిలు మాత్రమేనని దాదాపు నిర్ధారణకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే ఈ ఏడాది తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు వచ్చే నీరు చాలా తక్కువగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చని సాగునీటి రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. తుంగభద్ర, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి నీటి ఉద్ధృతి పెరిగితేనే ఈ ఏడాది సకాలంలో శ్రీశైలం జలాశయానికి నీరు చేరి రైతులకు ఉపయోగపడతాయని నిపుణులు భావిస్తున్నారు.

నంద్యాల పశువుల ఆసుపత్రి
స్థలానికి ఎసరు!
* విక్రయానికి రంగం సిద్ధం..
* గతంలోనూ ప్రయత్నించి విఫలం..
నంద్యాల, జూలై 2 : నంద్యాల పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండు ఎదురుగా, ఓ హోటల్ పక్కనే ఉన్న 2.5 ఎకరాల విస్తీర్ణంలో వున్న పశువుల ఆసుపత్రి స్థలం అమ్మకానికి సిద్ధమైంది. ఎకరా స్థలం రూ. 30 నుండి రూ. 40 లక్షల వరకు ధర పలికే రెండున్నర ఎకరాల స్థలం అమ్మి వచ్చిన నిధులతో నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పదే పదే అంటుండడం విశేషం. వైకాపా ఎమ్మెల్యేగా గెలిచిన భూమా రెండు సంవత్సరాల అనంతరం అధికార పార్టీ తెలుగుదేశంలోకి మారిన విషయం విధితమే. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వం నుండి నిధులు సాధించి అభివృద్ధి చేయాల్సింది పోయి ప్రభుత్వ స్థలాన్ని అమ్మి అభివృద్ధికి ఖర్చు చేస్తాననడం ఎంత వరకు సమంజసమని నంద్యాల పట్టణ ప్రజలు, మేథావులు అంటున్నారు. నంద్యాలకు రానున్న కాలంలో జిల్లా అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు మున్సిపాలిటి నుండి కార్పొరేషన్ కూడా అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నంద్యాల జిల్లా అయితే పలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు స్థలం అవసరం అవుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే ఈస్థలం చాలా విలువైన స్థలంగా భావిస్తున్నారు. నంద్యాల పట్టణంలోనే అత్యంత రద్దీగా ఉండే స్థలమేకాక వ్యాపారాత్మకంగా చాలా గిరాకి ఉన్న స్థలంగా వాణిజ్య వేత్తలు అంచనా వేస్తున్నారు. రోడ్డు వైపు ఎక్కువ స్థలం ఉండడంతో సెంటు రూ. 50 లక్షల వరకు బహిరంగ వేలంలో పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద రెండున్నర ఎకరాల స్థలం రూ. 100 కోట్ల విలువ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నంద్యాల అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు ఈ స్థలాన్ని దీర్ఘకాలిక లీజుపై తీసుకొనేందుకు పావులు కదిపారు. అయితే నంద్యాల పట్టణంలో అంతర్గతంగా విబేధాలు రావడం, అంతలోనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రమాదంలో మృతి చెందడం, ఆయన అనంతరం రోశయ్య ముఖ్యమంత్రిగా రావడంతో నంద్యాల వైశ్య ప్రముఖులు కొందరు పావులు కదిపి ఆ స్థలం దక్కకుండ చేయడంలో విజయం సాధించారు. అప్పుడే ముఖ్యమంత్రి రోశయ్య విలువైన ప్రభుత్వ స్థలాన్ని అమ్మడానికి వీలు లేదంటూ తన దగ్గరికి వచ్చిన దస్త్రంపై నోట్‌రాసి దానికి ముగింపు పలికారు. మళ్లీ ఇప్పుడు ఆ స్థలాన్ని అమ్మేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపారు. పశు సంవర్థక శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఈ స్థలం అమ్మేందుకు వీలు కాదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థలంలో ఎలాంటి కట్టడాలు ఉన్నాయి, వాటి విలువ తదితర విషయాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు నంద్యాల పశు సంవర్థక శాఖ అధికారుల నుండి సమాచారం తెప్పించుకున్నారు. నంద్యాల శాఖ అధికారులు కూడా స్థలంపై వంద సంవత్సరాలకు ఈసి తీసుకున్నట్లు తెలిసింది. రెండు సంవత్సరాల క్రితం ఇదే స్థలంలో రూ.50 లక్షల ఖర్చుతో రైతు శిక్షణా కేంద్రం కోసం నూతన భవనం నిర్మించారు. అలాగే పాడుబడిపోయిన పశువుల ఆసుపత్రి స్థానే రూ.3 కోట్ల అంచనాతో పశువుల ఆసుపత్రి నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పశు సంవర్థక శాఖ ఉన్నతాధికారులు భవిష్యత్తు అవసరాల కోసం ఈ స్థలాన్ని అమ్మకూడదంటూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొత్తం మీద అత్యంత విలువైన ఈ స్థలాన్ని ఎలాగైనా అమ్మాలని కృతనిశ్చయంతో ఉన్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి నచ్చజెప్పి ఈ స్థలాన్ని బహిరంగ వేలం ద్వారా అమ్మించేందుకు దస్త్రాన్ని ముందుకు కదిలిస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ స్థలాన్ని అమ్మకపోవడమే మంచిదని అటు ప్రభుత్వ అధికారులు, ఇటు మేథావులు, పట్టణ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
బడుగు, బలహీనవర్గాల
అభ్యున్నతే లక్ష్యం
* ఆర్డీఎస్ కుడి కాలువ సర్వేకి నిధులు మంజూరు
* మంత్రి పరిటాల సునీత
నందవరం, జూలై 2: రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వం కృషి చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం నందవరంలో ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా సభలో మంత్రి మాట్లాడుతూ ఆర్డీఎస్ కుడి కాలువ పనులకు సర్వే నిమిత్తం ప్రభుత్వం నుండి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం పను లు పూర్తయ్యేందుకు తమ వంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కాలువ పనులు పూర్తయితే నందవరం మండలంలోని రైతులకు తాగునీరు సమస్య లేకుండా పంట పొలాలు అన్నీ సస్యశ్యామలం అవుతుందన్నారు. అలాగే నియోజకవర్గంలో సివిల్ సప్లయి గోడౌన్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోరారని ఆమె తెలిపారు. అయితే సివిల్ సప్లయి గోడౌన్ నిర్మాణం కోసం స్థలం చూపిస్తే గోడౌన్ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ముస్లిం కుటుంబం పండుగ సంతోషాన్ని చూడాలన్న ఉద్దేశంతో సిఎం చంద్రబాబు ప్రతి ముస్లిం కుటుంబానికి చంద్రన్న రంజాన్‌తో ఫాను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం నుండి వచ్చే లబ్ధి పొంది ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ప్రభుత్వం నుండి నిధులు వెచ్చించి అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. ప్రభుత్వం మంజూరు చేసే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల కోసం ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా పింఛన్ మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్‌పర్సన్ పుష్పావతి, ఆర్డీఓ ఓబులేసు, ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డు చైర్మన్ సంజన్నచౌదరి, తహశీల్దార్ హుసేన్‌సాబ్, ఎంపిపి నరసింహారెడ్డి, మండల టిడిపి నాయకులు మాధవరావ్ దేశ్, నందవరం సర్పంచ్ రామన్నగౌడ్, నాగరాజుగౌడ్, మండల కన్వీనర్ చిన్నరాముడు, కాశీంవలీ, వెంకటరామిరెడ్డి, రఘుమూర్తిస్వామి, గడ్డం బజారి, తదితరులు పాల్గొన్నారు.