S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిండు గోదారి నిలకడగా నీటిమట్టం

రాజమహేంద్రవరం, జూలై 2: గోదావరి నదికి జలకళ సంతరించుకుంది. అఖండ గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం వద్ద గంట గంటకూ నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. శనివారం రాత్రి కాటన్ బ్యారేజ్ వద్ద 8.5 అడుగుల నీటి మట్టం నమోదైంది. 1,24,255 క్యూసెక్కుల నీటిని సముద్రంలోనికి విడుదల చేశారు. బ్యారేజ్ దిగువ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో కాటన్ బ్యారేజ్ నుండి డెల్టా కాలువలకు నీటి సరఫరా బాగా తగ్గించారు. ఈస్ట్రన్ డెల్టాకు వెయ్యి క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ వెస్ట్రన్ డెల్టాకు సరఫరా పూర్తిగా నిలుపుదల చేశారు. ఏజన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో నదిలో వాన నీటి ప్రవాహం పెరిగింది. రాజమహేంద్రవరం రైల్వే వంతెన వద్ద 13.4 అడుగుల నీటి మట్టం నమోదుకాగా, భద్రాచలం వద్ద 17.7 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. క్రమేణా స్వల్పంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి. బ్యారేజ్‌కున్న 175 గేట్లను స్వల్పంగా ఎత్తివేసి వచ్చిన జలాలను వచ్చినట్లుగా దిగువకు విడిచిపెడుతున్నారు. కాళేశ్వరం వద్ద 5.75 మీటర్లు, పేరూరు వద్ద 9.31, కూనవరం వద్ద 6.08, కుంట వద్ద 5.42, పోలవరం వద్ద 5.07 మీటర్ల నీటి మట్టంలో ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. రానున్న 24 గంటల్లో మరింత పెరగవచ్చునని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.

భక్తజన సంద్రం
మందపల్లిలో
పోటెత్తిన భక్తులు

కొత్తపేట, జూలై 2: శనిత్రయోదశి సందర్భంగా మండల పరిధిలోని మందపల్లి శనీశ్వరస్వామి దేవస్థానం శనివారం భక్తజన సంద్రంగా మారింది. అమావాస్య ముందర త్రయోదశి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శనిత్రయోదశి నివారణార్ధం క్షీరాభిషేకాలు నిర్వహించారు. రాష్ట్రంలోనే ఏకైక శనేశ్వర ఆలయం కావడంతో సుమారు 60 వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి నుండి భక్తులు ఆలయానికి తరలి రాగా ముందే దేవస్థానం అధికారులు భక్తుల రాకను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు పూజలు నిర్వహించుకున్నారు. భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటు చేసింది. భక్తుల ద్వారా దేవస్థానానికి సుమారు 18 లక్షల మేర ఆదాయం వచ్చినట్టు ఇఓ వి భీముల్లు తెలిపారు. ఆలయంలో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం చైర్మన్ బండారు సూర్యనారాయణమూర్తితో పాటు పలువురు పాలక మండలి సభ్యులు ఆలయంలో భక్తుల కోసం శ్రమదానాన్ని నిర్వహించారు.