S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

నెల్లూరు, జూలై 2: విద్యార్థులు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని నగర డిఎస్‌పి జివి రాముడు పిలుపునిచ్చారు. మన ఊరు - మన పోలీసు కార్యక్రమంలో భాగంగా రెండవ నగర పోలీసులు తమ పరిధిలోని బోడిగాడితోట, వైకుంఠపురం చుట్టుపక్కల ప్రాంతాలను దత్తత తీసుకున్నారు. అక్కడ సమస్యలను పరిష్కరించటం కోసం తొలుత విద్యాభివృద్ధితోనే ప్రజల్లో సరైన అవగాహన సాధించవచ్చు అనుకుంటూ మున్సిపల్ పాఠశాలకు మరమ్మతులు చేయించి అందుకు అవసరమైన వౌలిక సదుపాయలను కల్పించారు. శనివారం బోడిగాడితోట పాఠశాలలోని 130 మంది విద్యార్థులకు అవసరమైన పలకలు, నోటు పుస్తకాలు, పెన్సిళ్లు, స్కూల్ బ్యాగ్‌లతోపాటు క్యారమ్స్, చదరంగం బోర్డులు, వాలీబాల్, బాస్కెట్‌బాల్, స్కిప్పింగ్ పరికరాలను నగర డిఎస్‌పి రాముడు, రెండవ నగర ఇన్‌స్పెక్టర్ వి సుధాకర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యతోనే ఎటువంటివారైనా ఉన్నత స్థానానికి చేరుకోగలరని అన్నారు. ఎస్‌పి విశాల్‌గున్ని ఆదేశాల మేరకు రెండవ నగర పోలీసు స్టేషన్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు సిబ్బంది తమ చేతనైన స్థాయిలో ప్రాంతాలను దత్తత తీసుకుని శాంతి భద్రతల పరిరక్షణతోపాటు స్థానిక సమస్యలు పరిష్కరించటానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెండవ నగర ఎస్‌ఐలు వి శ్రీహరి, తిరుపతయ్య, స్టేషన్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

దబ్బల మృతి పార్టీకి
తీరని లోటు : జగన్
సూళ్లూరుపేట, జూలై 2: అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందిన వైకాపా కేంద్ర కమిటీ సభ్యులు దబ్బల రాజారెడ్డి అంత్యక్రియలు సూళ్లూరుపేటలో శనివారం జరిగాయి. ఆయన మృతివార్త తెలుసుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సూళ్లూరుపేటకు విచ్చేసి ఆయన భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్ హైదారాబాదు నుండి విమానంలో రేణిగుంటకు చేరుకొని అక్కడనుండి రోడ్డుమార్గాన శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు దబ్బల ఇంటికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దబ్బల మృతి పార్టీకి తీరని లోటు అని, ఆయన కుటుంబ సభ్యులను పార్టీపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జగన్‌తోపాటు ఎంపిలు మేకపాటి రాజామోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కిలివేటి సంజీవయ్య, మేకపాటి గౌతంరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైకాపా కేంద్ర కమిటీ సభ్యులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి, సివి శేషారెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత వేనాటి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపి నెలవల సుబ్రహ్మణ్యం, కొండేపాటి గంగాప్రసాద్, పెంచలకోన ఆలయ చైర్మన్ తానంకి నానాజి, టిడిపి నాయకులు ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి, వేనాటి సుమంత్‌రెడ్డి, వేనాటి సతీష్‌రెడ్డి, వేనాటి సురేష్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య, కాంగ్రెస్ నేత బద్దెపూడి వేణుగోపాల్‌రెడ్డి దబ్బల భౌతికాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం దబ్బల భౌతిక కాయాన్ని ఇంటినుండి ప్రత్యేక వాహనంలో హిందూ శ్మశానం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఈద్గా ఏర్పాటుకు కృషి
* ఎంపి వరప్రసాద్ స్పష్టం
నాయుడుపేట, జూలై 2: పట్టణ పరిధిలోని ముస్లింలకు ఈద్గా ఏర్పాటుకు కృషి చేస్తానని తిరుపతి ఎంపి వరప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన పట్టణ పరిధిలోని జామియా మసీదులో రంజాన్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. విందు అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 10వేల మంది ముస్లీంలు గల నాయుడుపేటలో ఈద్గా లేకపోవడం శోచనీయమని, ఈద్గా ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి ఫ్లోర్‌లీడర్ ఎస్‌కె రఫీ, కౌన్సిలర్లు వరకళాచంద్ర, షేక్ జరీనా, ముస్లింలు పాల్గొన్నారు.
వేడుకగా రామలింగేశ్వరుని రథోత్సవం
విడవలూరు, జూలై 2: మండలంలోని రామతీర్థం గ్రామంలో వెలసిన కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి రథంపై ఊరేగించారు. ఆలయ అర్చకులు శ్రీకాంత్‌శర్మ, శ్రీనివాసశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన రహదారి పొన్నపూడి రోడ్డుసెంటర్, పాతూరు, హైస్కూలు రోడ్డు, ప్రాధమిక ఆరోగ్యకేంద్రం మీదుగా రథోత్సవం జరిగింది. ఈసందర్భంగా మహిళలు రథం ముందు ముగ్గులు వేసి టెంకాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఆలయ చైర్మన్ విజయ్‌కుమార్, ఏఓ తదితరులు పాల్గొన్నారు. కొడవలూరు, విడవలూరు, అల్లూరు ఎస్‌ఐలు వెంకటరావు, వాసు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఆలయ సమీపంలో కమ్యూనిటీ హాలు వద్ద పోలీస్ ఔట్‌పోస్టును ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ వెంకటరావు తెలిపారు. కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం సిఐలు మాధవరావు, రంగారావు ఆధ్వర్యంలో నెల్లూరు సబ్ డివిజన్ పోలీసులు, నగర పోలీసుల ఆధ్వర్యంలో ఉత్సవాల సందర్భంగా బందోబస్తును ఏర్పాటు చేశామని, శనివారం నుంచి 3రోజుల పాటు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు నెల్లూరు 2వ డిపో మేనేజర్ కెవి మురళీకృష్ణ తెలిపారు.
రైల్వేను ప్రైవేటీకరిస్తే ఊరుకోం
గూడూరు, జూలై 2: చరిత్ర కలిగిన భారతీయ రైల్వేలను ఎఫ్‌డిఐల పేరుతో యాజమాన్యం ప్రైవేటీకరించడానికి సిద్ధపడితే కార్మికులు చూస్తూ ఊరుకోరని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైల్వేలో పనిచేస్తున్న కార్మికులతో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు ఈనెల 11వ తేదీన జరగబోయే రైల్వే కార్మికుల బంద్‌కు తాను మద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. రైల్వే కార్మికులు జూన్ 9న జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన రైల్వేను ప్రైవేటీకరించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ 36 యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్నాయని, ఇందులో భాగంగా శనివారం గూడూరు రైల్వే కార్మికులకు సమ్మె అవసరంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో కలిసి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని విభాగాల్లో కార్మికులను కలుసుకొని కరపత్రాలను పంచిపెట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 11న జరిగే సమ్మెకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంవి నాయక్, కార్తీక్, ఎం పెంచలయ్య, ధనపాల్ తదితరులు పాల్గొన్నారు.