S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అటు సైబరాబాద్..ఇటు మహబూబ్‌నగర్

షాద్‌నగర్, జూలై 3: అధికారులు దూరదృష్టి లేకుండా తీసుకున్న నిర్ణయాలతో షాద్‌నగర్ నియోజకవర్గంలో అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న షాద్‌నగర్ పోలీస్ సర్కిల్ పరిధిని ఆకస్మాత్తుగా సైబరాబాద్ వెస్ట్‌జోన్‌లో కలుపుతూ ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం నాయకులను, ప్రజలను విస్మయానికి గురి చేసింది. షాద్‌నగర్ సర్కిల్ పరిధిలో ఉన్న బాలానగర్‌ను మినహాయించి షాద్‌నగర్, కొత్తూరు, కొందుర్గు, కేశంపేట పోలీస్ స్టేషన్లను సైబరాబాద్ వెస్ట్ జోన్‌లో కలుపుతూ..శంషాబాద్ డివిజన్ కింద ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక్కడ పని చేస్తున్న పోలీసు అధికారులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎన్నోరోజులుగా దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతున్నా నేతల దృష్టికి రాకపోవడంతో దీనిపై సందిగ్దావస్థలో ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్‌ను కూడా ఒక దశలో గోల్కోండలో కలుపుతారని పుకార్లు షికార్లు చేసినా చివరకు అలాంటిదేమి లేదని చెబుతున్నారు. ఇదే విషయంపై మొన్న షాద్‌నగర్‌లో జరిగిన ఒక సమావేశంలో మహబూబ్‌నగర్ శాసనసభ్యుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలోని ఒక్క గ్రామాన్ని కూడా ఇతర జిల్లాలోకి పోనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితులలో నియోజకవర్గంలోని ప్రజలు ఎటూ తేల్చులేకపోతున్నారు. ఒక్క షాద్‌నగర్ సర్కిల్ పరిధినే సైబరాబాద్‌లో కలిపి జిల్లాను మాత్రం మహబూబ్‌నగర్‌లో ఉంచడం పట్ల అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై పలు పార్టీల నాయకులు కూడా ఈనిర్ణయం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్‌నగర్ సర్కిల్‌ను సైబరాబాద్‌లో కలుపడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయని అన్నారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల అభిప్రాయాల మేరకే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకుడు శ్రీవర్దన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము అందుకు వ్యతిరేకమని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి అన్నారు.