S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పురం కొత్త కమిషనర్ కోసం వేట!

హిందూపురం టౌన్, జూలై 4: జిల్లాలో రెండో అతి పెద్ద పట్టణం, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ,, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన హిందూపురం మున్సిపల్ కమిషనర్‌గా తమకు అనుకూలమైన అధికారిని తీసుకువచ్చేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ ఎస్‌వి శివారెడ్డిని స్వంత శాఖకు సాగనంపారు. అప్పట్లో నెల్లూరు డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న ఎవివి భద్రరావును ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకొచ్చారు. పురపాలక శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న భద్రరావు రెండేళ్ల పాటు సమర్థవంతంగా విధులను నిర్వహించారు. పాలకుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగారు. మరో వైపు ఎక్కడా సమస్యలు తలెత్తకుండా వ్యవహరించారు. గత నెల 30న భద్రరావు పదవీ విరమణ చేశారు. దీంతో కొత్త కమిషనర్‌ను తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కొత్త కమిషనర్ కోసం ఓ ముఖ్య నేత గత నెల రోజులుగా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎవరయితే కమిషనర్‌గా బాగుంటారోనన్న తర్జనభర్జనలు జోరుగా సాగుతున్నాయి. ఎవరెవరి పేర్లో తెరమీదకు తెచ్చినా అంతే వేగంగా వెనక్కు పోతున్నాయి. పురపాలక శాఖకు చెందిన ఓ ఇద్దరు కమిషనర్లు ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పురపాలక శాఖ అధికారులు కాకుండా ఇతర శాఖల నుండి డిప్యూటేషన్‌పై ఇక్కడికి కమిషనర్‌గా తీసుకువచ్చేందుకు ముఖ్య నేత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర శాఖల నుండి తీసుకువచ్చేందుకు ఉన్న నియమ, నిబంధనలను రాష్ట్ర సచివాలయంలో పూర్తి చేయించేందుకు ఫైళ్లు తయారవుతున్నట్లు సమాచారం. మరో గతంలో ఇక్కడ తహశీల్దార్‌గా పనిచేసి పదోన్నతిపై వెళ్ళిన ఓ అధికారి కమిషనర్‌గా వచ్చేందుకు అధికార పార్టీ నాయకులను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రస్తుతం తహశీల్దార్‌గా పనిచేస్తున్న విశ్వనాథ్‌ను కమిషనర్‌గా తీసుకువస్తే ఎలా ఉంటుందని తెదేపా నాయకులు ఆలోచనలు చేశారు. తమకు అనుకూలంగానే ఉన్నా నిబంధనల ప్రకారమే పనిచేస్తారని విశ్వనాథ్‌కు పేరు ఉండటం, కమిషనర్‌గా వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం తదితర కారణాలతో ఆయన్ను ప్రక్కన పెట్టినట్లు సమాచారం. సహకార శాఖకు చెందిన ఓ ముఖ్య అధికారి ఇక్కడి కమిషనర్‌గా రావడం దాదాపు ఖాయమన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఎఫ్‌ఏసి బాధ్యతలు కూడా కేటాయిస్తూ ఉత్తర్వులు రాకపోవడం గమనార్హం. ఏదేమైనా కమిషనర్ పదవీ విరమణ చేయడం, ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేకపోవడం తదితర కారణాలతో పూర్తి స్థాయి కమిషనర్‌ను సాధ్యమైనంత త్వరగా నియమించక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్ ఎవరన్న ఉత్కంఠ అటు ఉద్యోగుల్లోనూ ఇటు మున్సిపల్ పాలకవర్గంలో కొనసాగుతోంది. ఉన్నతాధికారులు కొత్త కమిషనర్‌ను నియమిస్తారా, లేక ఉన్న సీనియర్ అధికారికే అదనపు బాధ్యతలు అప్పగిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.