S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోలీసుస్టేషన్ల పరిధి పెంపు!

అనంతపురం, జూలై 4:అనంతపురం నగరంలోని పోలీసుస్టేషన్ల పరిధి మారబోతోంది. పెరుగుతున్న జనాభా, నగరం, రూరల్ ప్రాంతాల విస్తీర్ణంతో పాటు పెరుగుతున్న నేరాల సంఖ్య దృష్ట్యా పరిపాలనా సౌలభ్యం కోసం స్టేషన్ల పరిధిని నిర్ణయించడంపై కసరత్తు సాగుతోంది. నూతనంగా నగరానికి నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ రావడంతో స్టేషన్ల పరిధిని పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఎస్పీ రాజశేఖరబాబు పట్టణ డిఎస్పీ మల్లికార్జున వర్మ, నగరంలోని పలు పోలీసు స్టేషన్ల సిఐలతో సమీక్షించారు. త్వరలో పోలీసు స్టేషన్ల పరిధిని నిర్ణయించేందుకు కార్యచరణ రూపొందించనున్నారు. ప్రస్తుతం పాతూరులో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్, కోర్టు రోడ్డులో రెండో పట్టణ పోలీసు స్టేషన్, టిటిడి సమీపంలోని హెచ్‌ఎల్‌సి కాలనీలో మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఉన్నాయి. పట్టణ నాలుగవ పోలీసు స్టేషన్ మంజూరు కాగా దానిని సుమారు నాలుగు నెలల క్రితం నగరంలోని జాతీయ రహదారిని పక్కన రుద్రంపేట వద్ద అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఈ స్టేషన్ పరిధిని నిర్ణయించలేదు. ఇందులో కొందరు పోలీసు సిబ్బందిని కూడా రెగ్యులర్‌గా నియమించలేదు. వీటితో పాటు కోర్టు రోడ్డులో ట్రాఫిక్ పోలీసు స్టేషన్, మహిళా పోలీసు స్టేషన్, క్లాక్ టవర్ సమీపంలోని ఆర్డీఒ, తహశీల్దార్ కార్యాలయాల మధ్య రూరల్ పోలీసు స్టేషన్ ఉన్నాయి. పాతూరులో సిసిఎస్ పోలీసు స్టేషన్ కూడా ఉంది. అలాగే త్రీ టౌన్ పోలీసు స్టేషన్ సమీపంలో సైబర్ క్రైమ్స్ పోలీసు స్టేషన్‌ను కూడా నూతనంగా ఏర్పాటు చేశారు. వీటికి అనుబంధంగా మరికొన్ని నేర నియంత్రణ విభాగాలు పని చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నాలుగు పట్టణ పోలీసు స్టేషన్ల పరిధి సమంగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో పోలీసు స్టేషన్ల పరిధిని మార్పు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో టూ టౌన్ పరిధిలోని కొంత ప్రాంతాన్ని నాల్గవ పోలీసు స్టేషన్ పరిధిలోకి, రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను టూ టౌన్‌లోకి మార్చే అవకాశం ఉంది. వీలుంటే ఒకటో పోలీసు స్టేషన్ పరిధిని కూడా కొంత మార్పు చేసే అవకాశం ఉంది. త్రీ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోకి మరికొన్ని ప్రాంతాలను కలిపే అవకాశాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు స్టేషన్ల పరిధికి సంబంధించి వివరాలను పోలీసు ఉన్నతాధికారులు త్వరలో నిర్ణయించి వెల్లడించే అవకాశం ఉంది.