S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భారత హాకీ జట్టుకు నిరాశ

మనె్హయిమ్ (అమెరికా), జూలై 19: అమెరికాలో పర్యటిస్తున్న భారత మహిళా హాకీ జట్టుకు ఆదిలోనే నిరాశ ఎదురైంది. మంగళవారం ఇక్కడ జరిగిన ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టు 2-3 గోల్స్ తేడాతో ఆతిథ్య అమెరికా చేతిలో ఓటమిపాలవడమే ఈ నిరాశకు కారణం. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అమెరికా జట్టు ఈ మ్యాచ్‌లో చాలా చక్కగా రాణించింది. కాథ్లీన్ షార్కీ 6వ నిమిషంలోనే అమెరికాకు తొలి గోల్‌ను అందించింది. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ ప్రథమార్థం ముగిసే సమయానికి గోల్స్ నమోదు కాలేదు. మ్యాచ్ ద్వితీయార్థం ప్రారంభమైన కొద్దిసేపటికే (31వ నిమిషంలో) కాటీ బామ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో అమెరికా ఆధిక్యత 2-0కు పెరిగింది. దీంతో రెచ్చిపోయి ఆడిన భారత జట్టుకు 33వ నిమిషంలో ప్రీతీ దూబే తొలిగోల్‌ను అందించగా, 38వ నిమిషంలో దిపిక మరో గోల్ సాధించి స్కోరును సమం చేసింది. దీంతో విజయంపై భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే 48వ నిమిషంలో అమెరికా క్రీడాకారిణి కెల్సీ కొలోజెచిక్ అద్భుతమైన గోల్ సాధించి భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. ఆ తర్వాత గోల్స్ కోసం భారత క్రీడాకారిణులు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ సఫలీకృతం కాలేకపోయారు. దీంతో అమెరికా జట్టు 3-2 తేడాతో విజయం సాధించి భారత్‌కు షాక్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణులు చాలా చక్కగా ఆడారని, విజయం సాధించడంలో విఫలమైనప్పటికీ ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడ్డారని జట్టు ప్రధాన కోచ్ నీల్ హాగుడ్ చెప్పాడు. వచ్చే నెల జరిగే రియో ఒలింపిక్స్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్న భారత జట్టుకు అమెరికా పర్యటనలో అన్ని మ్యాచ్‌లు చాలా ముఖ్యమైనవేనని, జట్టులోని లోపాలను విశే్లషించుకుని తదుపరి మ్యాచ్‌లలో మరింత మెరుగ్గా ఆడేందుకు భారత జట్టు కృషి చేస్తుందని ఆయన తెలిపాడు. భారత్-అమెరికా జట్ల మధ్య తదుపరి మ్యాచ్ గురువారం జరుగనుంది.

రష్యాలో సీమా పూనియా.. ఎఎఫ్‌ఐ ఆగ్రహం
న్యూఢిల్లీ, జూలై 19: రియో ఒలింపిక్స్ కోసం రష్యాలో శిక్షణ పొందాలని టాప్ డిస్కస్ త్రోవర్ సీమా పూనియా నిర్ణయించుకోవడంపై భారత అథ్లెటిక్ సమాఖ్య (ఎఎఫ్‌ఐ) ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. రష్యా ప్రస్తుతం పీకల్లోతున డోపింగ్ కుంభకోణంలో కూరుకుపోవడమే ఈ ఆగ్రహానికి కారణం. అయితే రష్యాలో తన శిక్షణ గురించి ఎఎఫ్‌ఐతో పాటు క్రీడా మంత్రిత్వ శాఖకు ఇంతకుముందే తెలియజేశానని సీమా పూనియా స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితం ఆసియా క్రీడల్లో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్న సీమా పూనియా (32) ప్రస్తుతం రష్యాలోని అదిగెయా రాష్ట్రానికి చేరుకుని ఆ రాష్ట్ర రాజధాని మేకోప్‌లో శిక్షణ పొందుతోంది.
అక్కడ ఆమె రష్యా కోచ్, మాజీ ఒలింపిక్ డిస్కస్ త్రోవర్ వితాలీ పిశ్చాల్నికోవ్‌తో కలసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.

భారీ తేడాతో
గెలిస్తేనే..
లేదంటే ర్యాంకుకు ముప్పే
దుబాయి, జూలై 19: ఐసిసి టెస్ట్ టీమ్ ర్యాంకింగ్‌లలోప్రస్తుతం ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, భారత్‌లు తమ స్థానాలను పదిలపర్చుకోవడంతో పాటు మరికొన్ని పాయింట్లు సంపాదించుకోవాలంటే శ్రీలంక, వెస్టిండీస్‌లపై జరగనున్న సిరీస్‌లలో ఘన విజయాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెల 21న ఆంటిగ్వాలో జరగబోయే తొలి టెస్టుతో వెస్టిండీస్-్భరత్‌ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా, మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఈ నెల 26నుంచి పల్లెకెలెలో శ్రీలంకతో తలపడనుంది. ప్రస్తుతం భారత్ ఐసిసి టీమ్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌కన్నా 44 పాయింట్ల ఆధిక్యంలో ఉండగా, ఆస్ట్రేలియా ఏడోస్థానంలో ఉన్న శ్రీలంకకన్నా 33 పాయింట్ల ఆధిక్యత కలిగి ఉంది.
ఒక వేళ ఆస్ట్రేలియా, భారత్‌లు గనుక తమప్రత్యర్థులపై సునాయాస విజయాలు నమోదు చేయని పక్షంలో వాటి పాయింట్లు తగ్గిపోతాయి. ఉదాహరణకు ప్రస్తుతం 112 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న భారత్ అదే స్థాయిలో కొనసాగడం లేదా మరింత మెరుగుపర్చుకోవాలంటే వెస్టిండీస్‌ను 3-0 తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఒక వేళ 3-1, లేదా 2-0 తేడాతో ఓడించినా దాని పాయింట్లు 110కి పడిపోతాయి. మరో వైపు వెస్టిండీస్ గనుక 3-1 లేదా 2-0 తేడాతో సిరీస్ గెలుచుకుంటే దాని పాయింట్లు 79కి పెరగడమే కాకుండా భారత్ పాయింట్ల సంఖ్య 96కు పడిపోతుంది. అలాగే ప్రస్తుతం 118 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా అదే స్థాయిలో కొనసాగాలంటే శ్రీలంకపై కనీసం 2-0 తేడాతో గెలవాలి. ఒక వేళ శ్రీలంక గనుక 1-0 తేడాతో గెలిచినా ఏడు పాయింట్ల లాభంతో మొత్తం 92 పాయింట్లకు చేరుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా 111 పాయింట్లకు పడిపోతుంది. మరోవైపు పాకిస్తాన్-ఇంగ్లండ్‌ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మూడు సిరీస్‌లు పూర్తయ్యే సరికి టెస్టు టీమ్‌ల పట్టికలో స్థానాలు తారుమారయ్యే అవకాశాలున్నాయి.

డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్‌లో
స్పెయిన్‌పై భారత్ పోరు
లండన్, జూలై 19: డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్‌లో భాగంగా స్వదేశంలో జరుగనున్న పోరులో భారత జట్టు ‘యూరోపియన్ పవర్‌హౌస్’గా ప్రసిద్ధి పొందిన స్పెయిన్ జట్టుతో తలపడనుంది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం చండీగఢ్‌లో జరిగిన డేవిస్ కప్ ఆసియా/ఓషియానియా గ్రూప్-1 రెండో రౌండ్‌లో భారత జట్టు 4-1 తేడాతో దక్షిణ కొరియా జట్టును మట్టికరిపించి వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా, యూరప్/ఆఫ్రికా జోనల్ పోరులో స్పెయిన్ 4-1 తేడాతో రొమేనియా జట్టుపై విజయం సాధించి ప్లే-ఆఫ్‌కు చేరుకుంది. డేవిస్ కప్ టోర్నమెంట్‌లో ఇంతకుముందు స్పెయిన్‌తో మూడుసార్లు తలపడిన భారత జట్టు రెండు సార్లు పరాజయాలను ఎదుర్కొని ఒకసారి విజయం సాధించింది. ఇంతకుముందు 1965లో చివరిసారి స్పెయిన్‌తో తలపడినప్పుడు భారత జట్టు 2-3 తేడాతో ఓటమి పాలైంది.

‘పరోక్ష ఓటింగ్’ విధానానికి
తెరదించనున్న డిడిసిఎ

న్యూఢిల్లీ, జూలై 19: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును సంస్కరించేందుకు జస్టిస్ ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చేసిన ప్రధాన సిఫారసులను ఆమోదిస్తూ సుప్రీం కోర్టు సోమవారం చరిత్రాత్మమైన తీర్పును వెలువరించడంతో డిడిసిఎ (్ఢల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) ఎట్టకేలకు వివాదాస్పద ‘పరోక్ష ఓటింగ్’ విధానాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్గ రాజకీయాలతో సతమతమవుతున్న డిడిసిఎని పరోక్ష ఓటింగ్ మరింత కుంగదీస్తుండటంతో ఆ విధానాన్ని రద్దు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. దేశంలోని ఏ క్రికెట్ సంఘంలోనూ పరోక్ష ఓటింగ్ విధానం ఉండటానికి వీల్లేదని సెక్షన్ 12(1(4)) స్పష్టం చేస్తోందని సర్వోన్నత న్యాయస్థానం తన 24 పేజీల తీర్పులో పేర్కొంది. ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలకమైన అధికారులు 50 నుంచి 1000 వరకు పరోక్ష ఓట్లను కలిగి ఉండటం, అసోసియేషన్ ఎన్నికల్లో ఈ ఓట్లే ముఖ్యపాత్రను పోషిస్తుండటంతో డిడిసిఎకి సుప్రీం కోర్టు తీర్పు తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించనుంది.
పరోక్ష ఓట్లను కలిగివున్న ఓటర్లు డిడిసిఎ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భౌతికంగా హాజరు కావాల్సిన అవసరం లేదు. పేపర్‌పై సంతకం చేసి అభ్యర్థులకు ఇవ్వడం ద్వారా వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పరోక్ష ఓటింగ్ విధానం వీలు కల్పిస్తోంది. కంపెనీల చట్టం కింద వీరికి పరోక్ష ఓటింగ్ హక్కు సంక్రమించిందన్న కారణంతో డిడిసిఎ ఎప్పుడూ ఈ విషయంలో మినహాయింపులను పొందుతోంది. అయితే ఈ విధానం దుర్వినియోగమవుతోందన్నది చాలా ఏళ్ల నుంచి బహిరంగ రహస్యమే. దీనిపై డిడిసిఎతో పాటు బిసిసిఐ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న సికె.ఖన్నా స్పందిస్తూ, సుప్రీం కోర్టు తీర్పు చట్టబద్ధమైనదని, కనుక ఆ తీర్పునకు కట్టుబడి ఉంటామని చెప్పాడు. ‘జస్టిస్ లోధా కమిటీ నివేదికను మేము అధ్యయనం చేస్తున్నాం. కానీ సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి, దానికి కట్టుబడి ఉంటాం’ అని ఆయన మంగళవారం పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు.
ఇదిలావుంటే, బిసిసిఐ, దాని అనుబంధ పాలక మండళ్లలో ఏ వ్యక్తి అయినా ఒక పదవిలో మాత్రమే ఉండాలని సుప్రీ కోర్టు తీర్పునివ్వడంతో ఖన్నా డిడిసిఎ ఉపాధ్యక్ష పదవిని వదులుకోవాల్సి ఉంది. గత 25 ఏళ్లలో ఆయన వివిధ పదవులను అనుభవించడమే ఇందుకు కారణం. అయితే బిసిసిఐ ఉపాధ్యక్షుడిగా ఖన్నా తన పదవీ కాలాన్ని పూర్తిచేసేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో డిడిసిఎ పదవికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారా? అని ఖన్నాను ప్రశ్నించగా, ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేయదల్చుకోలేదని చెప్పాడు.