S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇక దామోదరం సంజీవయ్య జిల్లా!

కర్నూలు, జూలై 21 : జిల్లా పేరును మార్పు చేస్తూ దామోదరం సంజీవయ్య జిల్లాగా నూతనంగా నామకరణం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సిసిఎల్‌ఎ నుంచి కలెక్టరేట్‌కు ఆదేశాలు అందాయి. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం దృష్టి సారించడంతో పాటు జిల్లా పేరు మార్పు కోసం ప్రజల విన్నపాన్ని పరిశీలిస్తోం ది. పేరు మార్పునకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని కోరుతూ సిసిఎల్‌ఎ నుంచి ఆదేశాలు అందడంతో చిరకాలంగా ప్రజల్లో ఉన్న కోరిక తీరే రోజు సమీపంలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జిల్లాను రెండుగా విభజించి కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పాటుకు ప్రభు త్వం కసరత్తు చేస్తోంది. కొత్తగా ఏర్పడే నంద్యాల జిల్లాకు కూడా నవనంది జిల్లాగా నామకరణం చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడవుతోంది. నంద్యాల జిల్లా పేరు మార్పుపై ప్రజాభిప్రాయాలు తీసుకున్న తరువాతే తుది నిర్ణయం తీసుకుంటారని అధికారులు పేర్కొంటున్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని చాలా కాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజా, కుల సంఘాల నుంచి ప్రభుత్వానికి వందలాది విన్నపాలు వెళ్లాయి. రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఘనత దామోదరం సంజీవయ్య దక్కించుకున్నారు. అంతేగాక కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన తొలి దళిత నేత కూడా దామోదరం సంజీవయ్య కావడం విశేషం. కర్నూలుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపాడు గ్రామానికి చెందిన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ నాయకుడిగా అన్ని వర్గాల ప్రజల అభిమానం పొందిన వ్యక్తిగా గుర్తింపుపొందారు. జిల్లాకు ఆయన పేరు పెట్టడంలో ప్రజల నుంచి ఏకగ్రీవ ఆమోదం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు..
* నేడు మల్లన్న సన్నిధికి..
* జూరాల నుంచి నీరు విడుదల..
కర్నూలు, జూలై 21 : ఎగువన ఉన్న జలాశయాల్లో నీరు చేరడంతో కృష్ణా ప్రవాహం శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా జూరాల నుంచి గురువారం దిగువకు 11వేల క్యూసెక్కుల నీరు విడుల చేయడంతో శుక్రవారం నాటికి కృష్ణా జలాలు శ్రీశైలం జలాశయం చేరుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండడంతో వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72టిఎంసిలు కాగా 123.67టిఎంసిల నీరు వచ్చి చేరింది. నారాయణాపూర్ జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 37.65టిఎంసిలకు గాను 36.74 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఇక జూరాల జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 9.66టిఎంసిలు కాగా 7.84టిఎంసిలకు చేరుకుంది. ఈ జలాశయానికి ఎగువ నుంచి 58,485క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ఉదయం 9,201 క్యూసెక్కులు విడుదల చేయగా సాయంత్రం సమయానికి 11వేల క్యూసెక్కులకు పెంచినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నీరు శుక్రవారం మధ్యాహ్నం తరువాత శ్రీశైలం చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల జలాశయంలో మరో 1.5 టిఎంసిల నీరు చేరితే ఎగువ నుంచి వచ్చే మొత్తం నీరు దిగువకు విడుదల చేస్తారని సాగునీటి శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి జూరాల నుంచి 20వేల క్యూసెక్కులకు పైగా దిగువకు నీరు విడుదల అవుతుందని పేర్కొంటున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.87టిఎంసిలు కాగా ప్రస్తుతం కేవలం 23.71టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను 788 అడుగులకు దిగువన నీరు ఉంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 820 అడుగులకు చేరుకుంటే పుష్కర స్నానాలకు ఇబ్బంది ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తే ఆగస్టు 10వ తేదీ నాటికి శ్రీశైలం జలాశయం నీటి మట్టం 840 నుంచి 845 అడుగులకు పైగా చేరవచ్చని భావిస్తున్నారు.

పుష్కరాల భద్రతలో జాగిలాలు!
* నల్లమలలో కూంబింగ్..
కర్నూలు, జూలై 21: కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల భద్రతకు పోలీసు యంత్రాంగం పెద్దపీట వేస్తోంది. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను సైతం భద్రతకు వినియోగిస్తున్నారు. వీరితో పాటు పోలీసుల జాగిలాల సేవలను వినియోగించుకోనున్నారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్ దుశ్చర్యల దృష్ట్యా పుష్కరాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా పుష్కరాలు నిర్వహించే కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలకు పొరుగున్న ఉన్న జిల్లాల నుంచి పోలీసులను తరలించనున్నారు. బాంబులు, ప్రమాదకర రసాయనాలను గుర్తించడంలో శిక్షణ పొందిన జాగిలాలతో పుష్కరఘాట్లు, విజయవాడ, అమరావతి నగరాల్లోని కీలక ప్రాంతాలను క్షుణ్ణంగా సోదాలు నిర్వహించనున్నారు. పుష్కరాల సమయంలో జనసమ్మర్ధంగా ఉండే ప్రాంతాలకు జాగిలాలను తీసుకెళ్లడం ద్వారా భక్తుల ముసుగులో తిరిగే అనుమానిత వ్యక్తులను గుర్తించే వీలుంటుందని భావిస్తున్నారు. కాగా పుష్కరాల నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంతో పాటు విజయవాడ, అమరావతి నగరాల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో కూంబింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమలలో ఆగస్టు 1వ తేదీ నుంచి కూంబింగ్ ప్రారంభించే అవకాశముంది. గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూంబింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. పుష్కరాల్లో ఎలాంటి అపశృతులు దొర్లకుండా ఉండేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లకు తోడు డిజాస్టర్ మేనేజిమెంటుకు చెందిన సుశిక్షితులను అందుబాటులో ఉంచనున్నారు. పుష్కర స్నానాలకు తరలివవచ్చే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా విఐపి ఘాట్లలో ఏర్పాట్లు చేస్తున్నారు.

తుంగభద్ర దిగువ కాలువకు
600 క్యూసెక్కుల నీరు విడుదల
ఆదోని, జూలై 21:కర్నాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి దిగువ కాలువకు కర్నాటక, ఆంధ్ర రాష్ట్రాల నీటి వాటాగా 1315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తుంగభద్ర డ్యాం అధికారులు పేర్కొన్నారు. గురువారం దిగువ కాలువకు నీరు విడుదల చేశారు. మొదటి విడతగా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విడతల వారీగా నీటి విడుదల పెంచుతారు. 1315 క్యూసెక్కుల్లో ఆంధ్ర వాటాగా 625 క్యూసెక్కులు, కర్నాటక వాటాగా 690 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. గురువారం పూజ చేసి కాలువకు నీరు విడుదల చేశారు. ఈనీరు నాలుగైదు రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుకు చేరుకుంటుంది.

మాజీ ఎమ్మెల్యే మురళి అరెస్టు
కర్నూలు, జూలై 21 : కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణను గురువారం కర్నూలు రెండవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తనను అదనపు కట్నం కోసం వేధిస్తూ మానసికంగా, శారీరకంగా హింసించారని ఆయన భార్య యుగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కోడుమూరు నుంచి 2009లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మురళీకృష్ణ 2014 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ మూడు నెలల క్రితం వైకాపాలో చేరి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించారు. భార్య కేసు కంటే ముందు ఆయన అప్పు వసూలులో దంపతులను ఇబ్బందులకు గురి చేశారన్న అభియోగాలను ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఆయుర్వేద వైద్యురాలైన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో
బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి మృతి
* సకాలంలో వైద్యం అందించలేదని బంధువుల ఆందోళన
* ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం
ఆదోని, జూలై 21: సకాలంలో వైద్యులు స్పందించి వైద్యం అందించకపోవడం వల్లే శివన్న మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆదోని ఆసుపత్రి వద్ద గురువారం ఆందోళనకు దిగారు. ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని ఇందిరానగర్‌కు చెందిన బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి శివన్న(54) గురువారం ఉదయం తన కుమారుడు సుధాకర్, భార్య రూతమ్మ, రిటైర్డు రైల్వే ఉద్యోగి మల్లికార్జునతో కలిసి బైపాస్ రోడ్డులో వాకింగ్ చేసి వస్తుండగా ఆటో ఢీకొంది. దీంతో శివన్నకు తీవ్ర గాయాలై ఆపస్మారకస్థితికి చేరుకున్నాడు. వెంటనే ఆయనను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా చికిత్స పొందుతూ శివన్న మృతి చెందాడు. సకాలంలో డాక్టర్ వైద్యం అందించకపోవడం వల్లే శివన్న మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి అద్దాలు పగులగొట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రికార్డు పుస్తకాలను కింద పడేశారు. ఇంతలో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నారని ఎస్‌ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

కెవిపి ప్రైవేట్ బిల్లుకు మద్దతివ్వాలి
* ఐకమత్యంగా ఉద్యమం చేపట్టాలి..
* డిసిసి అధ్యక్షుడు బివై రామయ్య
కర్నూలు సిటీ, జూలై 21:ప్రజల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా సాధన కోసం కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు రాష్ట్రానికి చెందిన ఎంపిలు, రాజ్యసభ సభ్యులు మద్దతు ఇవ్వాలని డిసిసి అధ్యక్షుడు బివై. రామయ్య సవాల్ చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం రామయ్య పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, అయితే సిఎం చంద్రబాబు ఈ విషయంపై నోరు విప్పడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా పై గట్టిగా డిమాండ్ చేస్తే తన అవినీతి బాగోతాన్ని కేంద్రం బయటపెడుతుందనే భయంతోనే గళం విప్పకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన బిల్లును అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇచ్చి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు. అయితే అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, ఖచ్చితంగా పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు బిజెపి అధికారంలోకి వస్తే పదేళ్లు అమలు చేస్తామని ప్రగల్బాలు పలికారన్నారు. ప్రస్తుతం మాట మారుస్తూ ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయని చెప్పటం శోచనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రత్యేక హోదాపై మాట మార్చడంతో రాజ్యసభ సభ్యులు కెవిపి రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెడుతున్నారని, పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాలని లేనిపక్షంలో జిల్లాలోని ఎంపిలు, రాజ్యసభ సభ్యుల ఇళ్ల మందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని కెవిపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ బిల్లు పెడుతున్నారన్నారు. అయితే కొందరు ఎంపిలు దేశ చరిత్రలో ఎప్పుడైనా ప్రైవేట్ బిల్లును రాజ్యసభలో పెట్టారా అని ప్రశ్నించడం ఎంతవరకూ సమంజసమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం లాగా పార్టీలకతీతంగా ప్రత్యేక హోదా సాధన కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అమలు చేయని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులను ఏపిలో తిరగకుండా అడ్డుకోవాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, ఆకెపోగు వెంకటస్వామి, సర్దార్ బుచ్చిబాబు, సలాం, శ్రీనివాసరెడ్డి, తిప్పన్న, ఖలీల్ అహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.

తుంగభద్ర బోర్డు
ఎస్‌ఇ అవినీతిని ఎండగడతాం:ఎమ్మెల్యే సాయి
ఆదోని టౌన్, జూలై 21:తుంగభద్ర డ్యాం ఎస్‌ఇ అవినీతి, అక్రమాల వల్ల ఎల్లెల్సీ, హెచ్‌ఎల్‌సికి సాగు, తాగునీటి సరఫరాలో తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఎస్‌ఇ తీరు గర్హనీయమని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఆంధ్ర వాటా కింద 2 టీఎంసీల నీరు ఉన్నా తాగడానికి కూడా వదలకుండా రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. పరిశ్రమలకు సాగునీరు అమ్ముకుంటూ ఎస్‌ఇ అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎల్లెల్సీ పరిధిలోని 118 కిలోమీటర్ వద్ద కర్నాటకకు సాగునీరు అందించడానికి అక్రమంగా స్లూయిస్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీనికి ఎలాంటి అనుమతి లేదన్నారు. ఈ స్లూయిస్‌ను ఏర్పాటు చేస్తే సుమారు 7500 ఎకరాలకు అక్రమంగా సాగునీరు అందించినట్లు అవుతుందన్నారు. ఇదే విషయాన్ని నీటి పారుదలశాఖ మంత్రి ఉమామహేశ్వర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు. తాగునీరు విడుదల చేయాలని గత 20 రోజులుగా డిమాండ్ చేస్తున్నా గురువారం ఎల్లెల్సీకి నీరు విడుదల చేశారన్నారు. ఇప్పటికైనా ఎస్‌ఐ తన అవినీతి అక్రమాలకు స్వస్తి చెప్పకపోతే తుంగభద్ర బోర్డు కార్యాలయాన్ని ఆదోని, ఆలూరు, మంత్రాలయం ఎమ్మెల్యేలతో కలిసి ముట్టడిస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. సిఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు.

భారీ వర్షం.. చెరువుకు జలకళ
* 83.4 మిమీ వర్షపాతం నమోదు
పత్తికొండ, జూలై 21: పత్తికొండ చెరువుకు గురువారం పెద్దఎత్తున వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో చెరువు జలకళ సంతరించుకుంది. దాదాపు 10 సంవత్సరాల తరువాత చెరువుకు భారీ స్థాయిలో నీళ్లు రావటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత నెలలో కురిసిన వర్షానికి చెరువుకు కొద్దిగా నీళ్లు వచ్చాయి. బుధవారం రాత్రి మండలంలో కురిసిన 83.4 మిమీ వర్షానికి వాగు లు, వంకలు పొంగిగి ప్రవహించాయి. రాత్రి 7 గంటల నుండి 10 వరకు ఏకధాటిగా కురిసిన వర్షంతో వంకలు, వాగులు, పొంగి ప్రవహించాయి. ఆ నీరం తా పత్తికొంత చెరువుకు చేరింది. చెరువులో 80 శాతం నీరు చేరింది. ఇన్నాళ్లకు చెరువులో నీళ్లు చూస్తున్నామని రైతులు రంగన్న, మల్లికార్జున ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా చిన్నపూజర్ల కార్తీలో వర్షం రావడంతో పంటల దిగుబడి అధికంగా ఉంటుందని మందగిరి రైతులు సంజప్ప, నాగరాజు అన్నారు. గత ఐదు సంవత్సరాలగా ఈ కార్తిలో వర్షాలు రాలేదని అందుకే పంటలు సరిగాపండలేదన్నరు. ఈ ఏడాది మంచి వర్షం రావడంతో పంట దిగుబడులు అధికంగా ఉంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆదోని డివిజన్‌లో విస్తారంగా వర్షాలు
ఆదోని : ఆదోని డివిజన్‌లోని 17 మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పత్తికొండలో అత్యధికంగా 83.6 మిమీ వర్షం కురిసింది. ఆదోని మండలంలో 22.2 మిమీ. కౌతాళంలో 10 మిమీ, ఎమ్మిగనూరులో 11.2, మంత్రాలయంలో 9.4, నందవరంలో 3, కోసిగి లో 15.6, పెద్దకడబూరులో 18.2, ఆలూరులో 6, ఆస్పరిలో 24మీ, చిప్పగిరిలో 15.6, హాలహర్విలో 11.2, హొళగుందలో 8.2, తుగ్గలిలో 24.6, దేవనకొండలో 31.2, మద్దికెరలో 19.5, గోనెగండ్ల మండలంలో 19.6 మిమీ వర్షం కురిసింది.

ఎమ్మిగనూరు సివిల్ జడ్జిపై వేటు!
ఎమ్మిగనూరు, జూలై 21: హైకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు సివిల్ జడ్జి రవిశంకర్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు జిల్లా జడ్జి నిరుపమా చక్రవర్తి సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేసినట్లు సమాచారం.

మహిళలకు పెద్దపీట
* బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమలతారెడ్డి
ఆదోని, జూలై 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమలతారెడ్డి అన్నారు. గురువారం బిజెపి కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బిజెపి సభ్యత్వం గిన్నిస్ బుక్‌లో ఎక్కడంలో మహిళల పాత్ర ఉందని అన్నారు. మోదీ ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. భేటీ బచావో, భేటిపడావో, ఉజ్వల యోజన తదితర పథకాలు ప్రవేశ పెట్టిందని అన్నారు. మహిళల్లో చైతన్యం రావాలని అప్పుడే ఆర్థికంగా రాజకీయంగా మహిళలు ఎదుగుతారన్నారు. కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్రప్రధాన కార్యదర్శి కునిగిరి నీలకంఠ, బిజెపి పట్టణ అధ్యక్షులు కునిగిరి నాగరాజు, ప్రధాన కార్యదర్శి విజయ్‌కృష్ణ, ఉపాధ్యక్షురాలు సుశీల, నాయకులు దత్తా, రాఘవేంద్ర, బిజెవైఎం నాయకులు దుర్గాప్రసాద్, వీరేష్, గోవిందరాజులు, పాండు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బిజెపి మహిళా మోర్చా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా నాగలక్ష్మి, ప్రధాన కార్యదర్శులుగా సులోచన, వినీతగుప్త, ఉపాధ్యక్షురాలుగా జయలక్ష్మీ, జయశ్రీ, దానమ్మ, కార్యదర్శిగా సావిత్రి, పూర్ణిమ, ఇందిర, కోశాధికారిగా హిందుమతి, కార్యవర్గసభ్యురాలుగా మంజుల, లక్ష్మీ, లక్ష్మీబాయి, రత్నమాల, అనిత, రాజేశ్వరి, మీనాక్షి, జయలక్ష్మీ ఎన్నికయ్యారు.

మిడుతూరుకు ‘ఎత్తిపోతల’ సమస్య!
* పుష్కలంగా నీటి వనరులు..
* వాడుకోలేని దీనస్థితిలో రైతాంగం..
మిడుతూరు, జూలై 21:‘కనుచూపు మేరలో సాగునీరు.. అయినా ఆ నీటిని వాడుకునే హక్కు లేదు. ఇక్కడి రైతుల త్యాగఫలం ఇతర ప్రాంతాల రైతులకు సాగుజలం. పొలాలు త్యాగం చేసిన రైతులకు సాగునీరు కన్పిస్తున్నా భూములు తడుపుకొనేందుకు లేదు.. ఇక్కడి పొలం అంతా వర్షాధారంపైనే ఆధారపడి వుంది. ఇక ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు గుర్తొచ్చేది మండలానికి ఎత్తిపోతల సమస్యే. ఎలాగైనా ఎత్తిపోతల పథకం సాధిస్తామని ఢంకా భజాయిస్తారేగానీ అందుబాటులో వున్న నీటిని ఉపయోగించుకునే ప్రయత్నం మాత్రం చేయడంలేదు’..
మండలంలో అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, దీనిని ఆనుకుని ఎస్‌ఆర్‌బిసి కాలువ ఉన్నాయి. ఈ రెండింటిలో ఎప్పుడూ నీరు పుష్కలంగా వుంటుంది. అయినా మండల ప్రజలు ఈ నీటిని వాడుకునే హక్కు లేదు. మండలంలోని అలగనూరు రిజర్వాయర్‌కు ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. 2005లో దివంగత సిఎం వైఎస్ రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేశారు. అలగనూరు గ్రామ రైతుల నుంచి 2,649 ఎకరాలు, ప్రభు త్వ భూమి 936 ఎకరాలు సేకరించి జపాన్ ఆర్థికసాయం తో 3 టిఎంసిల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ఈ నీరు కడప జిల్లాకు తరలిస్తారు. రిజర్వాయర్ పక్కనే వున్న ఎస్‌ఆర్‌బిసి కాలువ నీరు తమిళనాడు రాష్ట్రానికి, కడప జిల్లాకు తరలిస్తారు. అంతేకానీ ఈ నీటిని ఇక్కడి రైతులు వాడుకునేందుకు ఎటువంటి అవకాశం లేదు. మండలంలో బోరు బావుల కింద 1200 హెక్టార్లు, చెరువుల కింద 800 హెక్టార్లు, మిగిలిన 15వేల హెక్టార్ల పొలం అంతా వర్షాధారం పైనే ఆధారపడి వుంది. మండలానికి ఎటువంటి ఎత్తిపోతల పథకంగానీ, సాగునీరు అందించే వనరులు కానీ లేవు. ఇనే్నళ్లు గడుస్తున్నా రిజర్వాయర్ నుంచిగానీ, ఎస్‌ఆర్‌బిసి నుంచి స్థానికంగా వుండే పంట పొలాలకు చుక్కనీరు తరలించే అవకాశం లేదు. ఈ నీరంతా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడంతో, ఇక్కడి రైతుల త్యాగఫలం ఇతర ప్రాంతాల రైతాంగానికి సాగుజలమై వారికి వరంగా మారింది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా సాగునీటి ప్రాజెక్టులపైనే దృష్టి పెడతాం, రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తామని మాటలు కోటలు దాటిస్తారే కానీ, ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వున్న ఈ రోజుల్లో కూడా అతి సమీపంలో వున్న నీటిని తరలించి వాడుకునే సౌకర్యం లేకపోవడం ఇక్కడి రైతుల దురదృష్టం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి సారించి సమస్య పరిష్కరిస్తే మండలంలోని పొలం అంతా సాగునీటితో సస్యశ్యామలమై తమ జీవితాల్లో వెలుగులు నింపినవారవుతారని రైతులు కోరుతున్నారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
శిరివెళ్ల, జూలై 21: మండల పరిధిలోని కోటపాడులో గురువారం విద్యుదాఘాతంతో మురళీకృష్ణ(21) మృతి చెందినట్లు ఎస్‌ఐ సు ధాకర్‌రెడ్డి తెలిపారు. కోటపాడులో మారెమ్మగుడి గోడలపై బొమ్మలు వేస్తుండగా అవసరం కోసం ఇనుపకడ్డీ తీసుకువస్తుండగా విద్యుత్ తీగలకు తగిలి షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
మహానంది, జూలై 21: మండలంలోని తిమ్మాపురం ఎస్సీ కాలనీకి చెందిన మచిలిపోగు శ్రీనివాసులు(35) విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు తెలిపారు. ఇంటి సమీపంలో కేబుల్‌లైన్ జీవైర్ తెగి కింద పడడంతో దాన్ని పట్టుకున్న శ్రీనివాసులు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. పక్కనే ఉన్న ప్రశాంత్ (ప్రభాత్) గాయపడినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

దొంగల ముఠా అరెస్టు
ఆత్మకూరు, జూలై 21:ఆత్మకూరు డివిజన్‌లో జరిగిన దొంతనాలపై దర్యాప్తు చేపట్టి కొందరు దొంగలను అదుపులోకి తీసుకుని వారి నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ డి.దివాకరరెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గురువారం సిఐ విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అందిన సమాచారం మేరకు ఆత్మకూరు ఎస్‌ఐ రమేష్‌కుమార్‌తో పాటు వెళ్లి నందికొట్కూరు బస్టాండ్ సమీపంలో ఉన్న మాధవరం సురేష్, బాలరాజు, ప్రకాష్‌రావు, బొల్లవరం రవికూమార్, శివన్న, కరీమ్, ఉసేన్‌లను అదుపులోకి తీసుకుని కేసు లు నమోదు చేశామన్నారు. అలాగే వారి నుంచి ఒక జత చిన్న పిల్లల గాజులు, 5 జతల చెవి కమ్మలు, 2 బంగారు గొలుసులు, 2 బంగారు ఉంగరాలు, 10 తులాల వెండి, రూ. 10వేల నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరు ఆత్మకూరు డివిజన్‌లో దొంగతనాలకు పాల్పడినట్లు సిఐ తెలిపారు.