S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చాంబర్ ఆఫ్ కామర్స్ చిటపటలు!

శ్రీకాకుళం: బ్రిటిష్ దొరల పాలన పోయింది...వారి వ్యూహాలు మాత్రం ప్రస్తుత రాజకీయాల్లో సజీవంగా కన్పిస్తుంటాయి.. రాజకీయ చైతన్యం కలిగిన శ్రీకాకుళం జిల్లాల్లో బి.సి.లదే హవా.. పేరుకు బలహీనవర్గాలైనా వారి ఆధిపత్యమే సాగుతోంది. జిల్లా సామాజికవర్గంలో అత్యధికంగా ఉన్న సామాజికవర్గాలైన కళింగ, తూర్పుకాపు, పోలినాటి వెలమ కులాలకు చెందిన వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. సంఖ్యాపరంగా అత్యల్పంగా ఉన్న కొన్ని సామాజికవర్గాలకే అధికార పగ్గాలు అప్పగించి వారి అందలాలకు నిచ్చెనలుగా ఉపయోగపడుతున్న బలహీన వర్గాలకు శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు రాష్ట్రానికే స్పూర్తినిచ్చేలా ఉన్నాయి. వర్తమాన రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న కింజరాపు, ధర్మాన, గుండ, కూన, కిమిడి...అంతా బిసీ నేతలే. అధికార కుర్చీ అందుకోవడం కోసం వీరంతా బలమైన ప్రత్యర్ధులను సైతం విభజించి పాలించడంలో ఒకే వైఖరికి వస్తారు. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్ తొలి ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బలమైన సామాజికవర్గాలు అదే ఫార్ములాను అమలు చేసేందుకు పార్టీలకు అతీతంగా పూనుకున్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో కళింగకోమట్లు నిర్ణయాత్మకమైన శక్తి. గడచిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం వెనుక కళింగకోమట్ల కఠోరశ్రమ ఎవ్వరూ కాదనలేని నిజం. అయితే, అదే బలాన్ని చూపిస్తూ కళింగకోమట్లు కార్పొరేషన్‌‘్ఛర్’ తమకే ఇవ్వాలంటూ పట్టుపట్టిన అంశాన్ని ముందుగా పసిగట్టిన అధికార, ప్రతిపక్ష జిల్లా బలమైన సామాజికవర్గాల నేతలంతా ఒకేతాటిమీదకు వచ్చి తాజా డ్రామాకు తెరలేపినట్లు కన్పిస్తోంది. వందరోజుల్లోనే బి.సి. హోదా ఇచ్చినందుకు ఆనందంతో పరవశించిన కళింగకోమట్లు ఇప్పటికే ఉచ్చులో చిక్కుకున్నట్లు తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి. నిన్న జిల్లా కళింగకోమట్ల ఎన్నిక...నేడు శ్రీకాకుళం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటుతో రసవత్తరంగా కోమట్ల మధ్య సిగపట్లు రంగం ఆరంభమైంది. ఎ.పి.ఫేడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డిస్ట్రక్ చైర్మన్‌గా చేజిక్కించుకున్న కళింగకోమట్ల నాయకుడు కోరాడ హరగోపాల్‌కు, రాష్ట్ర కళింగకోమట్ల సంఘం అధ్యక్షుడు, శ్రీకాకుళం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు అంధవరపు వరహానర్సింహం(వరం) మధ్య వైరాన్ని రగల్చడంలో పార్టీలకు అతీతంగా ధర్మాన, గుండ వర్గాలు విజయం సాధించినట్లు రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. శ్రీకాకుళం మున్సిపల్ రాజకీయాల్లో అనాధిగా కళింగకోమట్లు తమ పట్టుని రుజువుచేసుకున్నారు. వరం కుటుంబం శ్రీకాకుళం మున్సిపాలిటీపై నాలుగు తడవులు ఆధిపత్యం చలాయించారు. ప్రస్తుతం మేయర్ పీఠం కోసం కూడా కలలుకంటుంది. కాని - మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆశీర్వాదాన్ని పొంది ఎలాగైనా తొలి మేయర్‌గా గుండ కుటుంబానికి అరుదైన గౌరవాన్ని అందించాలని చూస్తున్నారు. ఇందుకు పార్టీలకు అతీతంగా కింజరాపు, కూన, కిమిడిల మద్దతుకూడా కూడగట్టడమే మిగిలింది. తాజాగా వెలమ సామాజికవర్గం గుండకు లైన్‌క్లీయర్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే, కాపు, కాళింగ సామాజికవర్గాలు తమకు ధీటైన నాయకుడు లేడుకనుక గుండకే తమ మద్దతును ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార సామాజికవర్గాలన్నీంటికీ మింగుడుపడని వ్యవహారంగా కళింగకోమట్లు తమకు మేయర్ పీఠం కావాలంటూ వేదికమీదకు రావడం ఇబ్బందిగా మారింది. దీంతో కళింగకోమట్ల సామాజికవర్గంలో చిచ్చు రగిలిస్తే తప్ప తమ కార్యం సఫలం చేసుకోలేమని పావులుకదుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా వెలమ సామాజికవర్గానికి చెందిన చల్లా రాజమణి కళింగకోమట్ల అభ్యర్థి పైడిశెట్టి జయంతి చేతిలో ఓటమి చవిచూసిన సంగతి వెలమ సామాజికవర్గం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది. అందుకే - అందివచ్చిన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుని కళింగకోమట్ల మధ్య చిచ్చుపెట్టేందుకు పార్టీలతోపనిలేకుండా ప్రణాళికలు రచిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇంతేకాకుండా కాపు, తెలగ సామాజికవర్గాలు తమను బిసీలలో కలిసిన సందర్భంలో హైకోర్టులో కేసులు వేసాయంటూ కళింగకోమట్ల యువతలో విపరీత ప్రచారానికి తెరతీసి దాని పరివాసానంగా కాపు, కళింగ, వెలమ సామాజిక వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించే పన్నాగం ఇప్పటికే పూరె్తైయ్యింది. రానున్న మున్సి‘పోల్స్’లో చరిత్ర పునరావృతం అయ్యేలా.. సంఖ్యాబలం ఉన్నప్పటికీ, ఐక్యమత్యం లేకపోవడంతో పల్లకి ఎక్కాల్సిన కళింగకోమట్ల సామాజికవర్గం బోయిలుగా మారే ప్రమాదం లేకపోలేదంటూ రాజకీయ విశే్లషకులు హెచ్చరిస్తున్నారు.