S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాబు పాలనలో ప్రజలకు తప్పని అవస్థలు

శ్రీకాకుళం(రూరల్), జూలై 21: నెరవేరని హామీలతో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకొన్న చంద్రబాబు ప్రజలను అవస్తలు పాలు చేసేలా పాలన సాగిస్తున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రిధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. గురువారం రూరల్ మండలంలోని బట్టేరులో గడపగడపకు వైసిపి కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డిశాంతితో కలిసి ఆయన నిర్వహించారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, రూ.2.70లక్షలతో పక్కా ఇళ్లు వంటి హామీలు నెరవేర్చడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఎటువంటి అభివృద్ధి సంక్షేమకార్యక్రమాలు అమలు చేయకుండా అమరావతి నిర్మాణం అంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగంచేసేలా విదేశీ ప్రయాణాలు చంద్రబాబు సాగించడం విచారకరమన్నారు. బిజేపికి మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం కేంద్రం నుంచి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, సాధించలేని అసమర్థులని ఆయన ద్వజమెత్తారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు సంబంధించిన కరపత్రాలను వైసిపి శ్రేణులు పంపిణీ చేశాయి. ఈయనతోపాటు మూకళ్లతాతబాబు, జెడ్పిటీసీ సభ్యులు చిట్టి జనార్థనరావు, మహిళా నేత మూకళ్ల సుగుణ సర్పంచ్‌లు, ఎంపిటీసీలు ఉన్నారు.

ఎఫ్‌సిఐకి రాష్ట్రంలో ప్రధాన కేంద్రం కేటాయించండి
శ్రీకాకుళం(టౌన్), జూలై 21: రాష్ట్ర విభజన అనంతరం నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా ఎఫ్‌సిఐ ప్రధాన కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌ను శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహననాయుడు కోరారు. గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఆహాల సలహా మండలి సమావేశంలో ఎంపి పాల్గొని రాష్ట్రంలో ఆహార ఉత్పత్తుల గొడౌన్ల సమస్యను మంత్రి దృష్టికీ తీసుకువచ్చారు. అలాగే ఎఫ్‌సిఐ గొడౌన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పని ఉంటేనే జీతం చెల్లిస్తున్నారని తద్వారా వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వారి సమస్య పరిష్కారం అయ్యేందుకు పనివున్నా లేకున్నా జీతం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ తప్పక చర్యలు తీసుకుంటామని హామీనిచ్చినట్లు ఎంపి ఆంధ్రభూమికి ఫోన్‌లో తెలిపారు. అలాగే ఆహార ధాన్యాల ఉత్పత్తుల్లో వరిని రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్‌మెంటు చేస్తుందని, కేంద్రమే పూర్తిస్థాయిలో చేపడితే బాగుంటుందని మంత్రి దృష్టికి తీసుకు వచ్చామన్నారు.

శక్తివంతమైన నైపుణ్యాలు అవసరం
శ్రీకాకుళం(రూరల్), జూలై 21: ప్రతీ ఒక్కరి జీవితం అనేక సమస్యల సమాహారం, వాటి నుండి బయటపడేందుకు శక్తివంతమైన నైపుణ్యాలు విద్యార్థి స్థాయినుండే అవసరమని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఇంచార్జ్ వీసి ఎం.చంద్రయ్య తెలిపారు. గాయిత్రీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగిస్తూ, ఈరోజు అమెరికా, రష్యా వంటి దేశాలు మన దేశం వైపుగా చూస్తున్నాయని ఇందుకు కారణం భారతీయ యువశక్తి అన్నారు. స్ర్తిలు భారతీయ విలువలపట్ల శ్రమతో కూడిన శ్రద్ధను కనబరుస్తున్నారన్నారు. ప్రతీ విద్యార్థిని శ్రమించే తత్వం అవసరమన్నారు. విద్యార్థులంతా ఐకమత్యంలో కలిసిమెలిసి ఉండి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని గౌరవ అతిధిగా హాజరైన విద్యా సంస్థల అధినేత జివి స్వామినాయుడు అన్నారు. సభాకార్యక్రమాలను అధ్యక్షుడిగా ప్రిన్సిపల్ పులఖంఢం శ్రీనివాసరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆచార్యులు చంద్రయ్యను, రాష్ట్ర స్థాయి సాహితీ పురష్కార గ్రహీత, కథారచయిత బమిడిపాటి గౌరీ శంకర్‌లను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. కళాశాల బయాలజీ విభాగం నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఐక్యూ ఏసి సమన్వయ కర్త అంప్లాం శ్రీనివాసబాబు, బయాలజీ విభాగాధిపతులు సునీతారాణి, చంద్రవౌళి, హనుమంతు భాస్కర్, ప్రకాశ్, కె వి వి సత్యన్నారాయణ, మహేశ్, యోగా గురు రామారావు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న
జిరాయితీ భూముల పరిశీలన
నరసన్నపేట, జూలై 21: జిల్లాలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న జిరాయితీ భూములకు సంబంధించి పక్కాగా పరిశీలన చేసేందుకు గాను చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్డివో బి.దయానిధి తెలిపారు. గురువారం మండలంలోని పలు జిరాయితీ భూములను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిరాయితీ భూములకు ఆనుకొని జాతీయ రహదారి రావడం జరిగిందని రహదారికి ఇరుపక్కల ఉన్న భూముల సర్వేనెంబర్లు జాతీయ రహదారిలో పడిపోవడంతో ఆ ప్రాంత రైతులు అమ్మకాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. దీనిపై పలువురు రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని సెక్షన్ 28 ‘ఎ’ రైతులకు సంబంధించిన భూమిని అప్పగించడం జరుగుతుందని అయితే సర్వే పూర్తయిన తరువాత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని స్పష్టంచేశారు. అలాగే పల్స్ సర్వేకు సంబంధించి జిల్లా కలెక్టర్ మండలానికో ప్రత్యేకాధికారిణిని నియమించారని, వెర్సన్‌లో కూడా మార్పులు తీసుకువచ్చారని దీని వలన సర్వే వేగవంతం అయ్యే అవకాశం ఉందని స్పష్టంచేశారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ జల్లేపల్లి రామారావు, ఆర్.ఐ తిరుపతిరావు, సర్వేయర్ వెంకటరమణ, వి ఆర్‌వో చక్రదర్ తదితరులు పాల్గొన్నారు.

నౌతలలో డెంగ్యూ కలకలం
సారవకోట, జూలై 21: మండలంలోని నౌతల గ్రామంలో డెంగ్యూ జ్వరం కలకలం రేపింది. గ్రామానికి చెందిన పల్లి అప్పన్న కుమారుడు మనోజ్‌కుమార్(5) డెంగ్యూ జ్వరానికి గురై విశాఖపట్నంలోని రాధాకృష్ణ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక ప్రాధమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న మనోజ్ గతకొంత కాలంగా జ్వరంతో బాదపడుతున్నాడు. చికిత్స కోసం తల్లిదండ్రులు విశాఖ కెజిహెచ్ ఆసుపత్రిలో చేర్పించగా వైద్య పరీక్షలు నిర్వహించిన అక్కడి వైద్యులు మనోజ్‌కు డెంగ్యూ జ్వరం సోకినట్లు నిర్థారించారు. అనంతరం బాలుని తల్లిదండ్రులు మెరుగైన చికిత్సకోసం మనోజ్‌కుమార్‌ను రాధాకృష్ణ ఆసుపత్రిలో చేర్పించినట్లు స్థానిక వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. గ్రామంలో డెంగ్యూ వ్యాధిని నిర్మూలించడానికి చర్యలు గైకొంటున్నామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మెండ ప్రవీణ్ తెలిపారు. గ్రామంలో దోమలు, లార్వా నివారించడానికి ఎటిట్ ఆయిల్‌ను మురికి, కాలువలలో చల్లించారు. అదే విధంగా దోమల నివారణకు మొలాయిసిస్ స్ప్రే చేయించి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయండి
జలుమూరు, జూలై 21: ప్రభుత్వం ప్రజల కోసం వైద్య సేవల నిమిత్తం అందిస్తున్న లక్షలాది రూపాయల నిధులను సద్వినియోగం చేయాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నూతనంగా నియామకం జరిగిన ఆసుపత్రి కమిటీ గురువారం జరిగిన ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చుచేస్తుందన్నారు. ఈకమిటీ సూచనలు, సలహాల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని, ప్రభుత్వం అందించే నిధులను రోగులకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలన్నారు. విషపూరిత పాము, కుక్కగాట్లు ఏర్పడేటప్పుడు రోగులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా నియమించబడ్డ కన్వీనర్ మురళీమోహన్‌రావు మాట్లాడుతూ ఇంతవరకు వైద్య సేవలు జరిగిన తీరు, పక్కన పెట్టి కమిటీ వారు సిబ్బంది కలిసి కట్టుగా రోగులకు సేవలందించేందుకు కృషి చేయాలని అభిప్రాయం వ్యక్తపరిచారు. జిల్లా ఇంచార్జ్ ఆరోగ్య శాఖాధికారి మెండ ప్రవీణ్, వైద్యాధికారిణి నిహారిక, ఎంపిడివో పి.వాసుదేవరావు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు వెలమలచంద్రభూషణ, జలుమూరు నీటి సంఘం అధ్యక్షులు అక్కా జోష్యుల ఉమాదత్తుబాబు, జన్మభూమి మండల కన్వీనర్ బగ్గు గోవిందరావు, తెలుగుదేశం నాయకులు దామోదరరావు, అప్పలనాయుడు, పొన్నాడ దాలయ్య, తర్ర బలరాం, తారకేశ్వరరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశానికి ఎంపికలు
బలగ, జూలై 21: స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో గురువారం స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు నిర్వహించారు. జిల్లా క్రీడాపాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుండి విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని వారి సత్తాను చాటుకున్నారు. స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశానికి బ్యాటరీ టెస్ట్‌లు నిర్వహించారు. ఇందులో అత్యధిక పాయింట్లు వచ్చిన విద్యార్థులకు రాష్టస్థ్రాయి జరిగే ఎంపికలకు ప్రవేశం కల్పిస్తారు. ఈ ఎంపికలు శుక్రవారం కూడా నిర్వహించి అర్హులైన వారికి రాష్ట్రా స్థాయిలో జరిగే స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలకు పంపించనున్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు పర్యవేక్షనలో ఎంపికలు జరగగా , జిల్లా పీ ఈటి సంఘం అధ్యక్షులు వై.పోలినాయుడు, కార్యదర్శి సాంబమూర్తి, సంఘ ప్రతినిధులు ఎన్ వి రమణ తదితరులు పాల్గొని ఎంపికల ప్రక్రియ నిర్వహించారు.

షిరిడి సాయినాథునికి ప్రత్యేక పూజలు
శ్రీకాకుళం(కల్చరల్), జూలై 21: నగరంలో గురువారం సందర్భంగా స్థానిక నానుబాలవీధిలో షిరిడిసాయి నాధ్ శ్రీరామమందిరంలో బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు ఆర్ వి రమణమూర్తి, సాయిఫల్గుణ ఆధ్వర్యంలో సాయంత్రం భజనాకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళాభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా అఫీషియల్ కాలనీ షిరిడి సాయి నాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపిహెచ్‌బి కాలనీలో ఉన్న షిరిడిసాయి ఆధ్యాత్మిక జ్ఞాన మందిరంలో కాగడ హారతితో మొదటి పూజ నిర్వహించి పెంటా శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో స్వామికి క్షీరాభిషేకాలు, అర్చనలు షిరిడి పద్దతిలో ప్రత్యేక హారతి నిర్వహించారు. విశాఖ ఏ కాలనీ లో ఉన్న షిరిడిసాయి ఆలయంలో భక్తులు పాల్గొని స్వామికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

పక్కాగా పొగాకు నియంత్రణ చట్టం అమలు
శ్రీకాకుళం(టౌన్), జూలై 21: జిల్లాలో పొగాకు నియంత్రణ చట్టం పక్కాగా అమలుచేయాలని జాయింట్ కలెక్టర్ - 2 పి.రజనీకాంతారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన చాంబర్‌లో జిల్లా స్థాయి పొగాకు నియంత్రణ కార్యక్రమం అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఏటా పది లక్షల మందికి పైగా పొగాకు సేవించడం వలన కాన్సర్ బారిన పడి మృత్యువాత పడుతున్నారని అన్నారు. పొగాకు నియంత్రణ చట్టం 2003 ప్రకారం సిగరెట్లు, సిగార్‌లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలాలు, ఖైనీ, తదితర పదార్థాలను ఆసుపత్రులు, విద్యాసంస్థలు, గ్రంథాలయాలు, ఆడిటోరియం, స్టేడియం, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్ వంటి ప్రాంతాల్లో అమ్మకం, సేవించడం నిషేధమన్నారు. వైద్యులు జిల్లా పొగాకు నియంత్రణ కార్యక్రమ అమలును పర్యవేక్షించాలని, దంత వైద్యులు నోడల్ అధికారులతో సమన్వయం చేసుకొని పొగాకు కారణంగా వ్యాధిబారిన పడిన వారికి చికిత్స అందించాలని, వాటిని సేవించడం వలన కలిగే నష్టాలపై అవగాహన కలిగించాలని తెలిపారు. సమావేశంలో ఇంచార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మెండ ప్రవీణ్, డిప్యూటీ డియంహెచ్‌వో జి.రత్నకుమారి, మున్సిపల్ ప్రజారోగ్య అధికారి డాక్టర్ దవళ భాస్కరరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.