S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దుర్బలత్వం నుండి ధీరత్వానికి...

‘స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ’ - స్వజనుల్ని హతమార్చి మనం సుఖించగలమా? సుఖించలేం అన్నది అర్జునుడి వివేక జ్ఞానం. అయితే కురుక్షేత్రంలో ‘సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయ’ - కౌరవ పాండవ సేనల నడుమ కృష్ణుడు రథాన్ని నిలిపిన తర్వాత, పాండవ మధ్యముడైన అర్జునుడు ఇరు సేనలను కలయచూసిన తర్వాత కలిగిన మనో వికార ఫలితం విషాదయోగం. అందుకే ‘న కాంక్షే విజయం.. న చ రాజ్య సుఖాని చ’ అన్న వివేక యోగం కలిగింది.
విషాదాన్ని వెన్నంటిన వివేకంతో విజయం వద్దనుకున్నాడు. రాజ్యం అక్కర్లేదనుకున్నాడు... ఇక, సుఖాలు మాత్రం ఎందుకనుకున్నాడు. అప్పటి వరకు తన గత జీవితం ‘రాజ్య సుఖలోభం’తోనే సాగుతూ వచ్చిందని అర్థమయ్యాక తనపై తనకే విరక్తి పుట్టింది. ఆ విరక్తి ఎంతటిదంటే.. ప్రతీకార వాంఛ లేకుండా, అస్తశ్రస్త్రాలు లేకుండా మిగిలిన తనను కౌరవ సంతతి సంహరించినా, తనకు మేలే అని అర్జునుడు కృష్ణుడి ముందు ‘శోక సంవిగ్నమానసు’ డయ్యాడు.
‘యది మా మప్రీతికార మశస్త్రం శస్తప్రాణయః’ అన్న అర్జునుడి మాటలు తాను అప్పటివరకు శస్తధ్రారుణ్ణనీ, ప్రతీకార వాంఛా ప్రేరేపితుణ్ణనీ ధ్వనిస్తున్నాయి. అది క్షాత్ర తత్వం... అదే రణక్షేత్ర తత్వం కూడా. అయితే కురుక్షేత్రంలో ఇరుసేనల మృత్యుస్థితిని మానసిక క్షేత్రంలో దర్శించాక తన భవిష్యత్తు శూన్యమే అని గ్రహించాడు. ఆ శూన్య స్థితి అనుభూతించాడు.
కాబట్టే కురుక్షేత్ర సంగ్రామం జరగకుండానే ఆత్మీయుల సహజీవనంతో తాను ‘శూన్య జీవనం’ గడపాలన్న నిర్ణయానికి వచ్చాడు. మొత్తానికి రాజ్య సుఖ లోభ తత్వమే తన విషాద యోగానికి నేపథ్యమని తెలుసుకో గలిగాడు. కాబట్టి కేవలం సుఖం, లోభం వెంట పరుగులెత్తే వారికి, ఆ రెండింటికే జీవితాన్ని అంకితం చేసేవారికి మిగిలేది విషాద యోగమే అన్నది స్పష్టం.
‘యద్యప్యేతే న పశ్యంతి లోభోప హత చేతసః
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్’ (1-38)
నిజానికి కౌరవులదే కాదు పాండవులదీ లోభభూయిష్ఠ మనస్కతే. అంతెందుకు, మానవ పుటకతో లోభం లేని వారెవరు? అర్జునుడు కౌరవులను లోభులు అన్నట్టుగా మనం కూడా ఎదుటి వారిని లోభులనే అంటుంటాం. అది మానవ నైజం. అయితే మానవ సహజ స్వభావం నుండి కాస్తకాస్తగా అర్జునుడు బయటపడుతున్నాడు. పొరలు పొరలుగా అజ్ఞానం ప్రిదిలిపోతోంది. తెరలు తెరలుగా జ్ఞానం విప్పారుతోంది. శత్రు సంహారమే లక్ష్యంగా జీవిక సాగించటం తొలి దశ. అక్కడి నుండి బయటపడి సంహరించటం తగదనుకోవటం మలి దశ. ఆపై శత్రువుల్ని సైతం ప్రేమించటం ఉన్నతత్వం.
యుద్ధం వల్ల కులం అంటే వంశం నశిస్తుంది. ఆ కులక్షయ దోషం తనదే అవుతుంది. స్నేహితుల్ని సంహరించటం మిత్రద్రోహమే. ఆ ద్రోహ పాతకం తనకే ప్రాప్తిస్తుంది. ఇవన్నీ లోభప్రవృత్తులే. లోభభూయిష్ఠ మనస్కుడైన అర్జునుడికి గత క్షణం వరకు ఇటువంటి వివేచన లేదు. నిజానికి పోరు భూమిలోకి రాజ్యసుఖ లోభంతో స్వజన సంహారానికి సిద్ధమయ్యే వచ్చాడు. మృత్యువు కళ్లముందు నర్తిస్తే తప్ప, మృత్యువు తన విశ్వరూపాన్ని చూపిస్తే తప్ప అర్జునుడ్ని కప్పేసిన లోభం తొలగలేదు. అయినా అర్జునుడిలో తాను నిరాయుధుడనని, అప్రతీకారుడనని అనిపించుకోవాలన్న దుగ్ధ లాంటి ‘అహం’ ఇంకా ఉంది. అందుకే సాయుధులైన ధృతరాష్ట్ర తనయులు అప్రతీకార వాంఛ లేక నిరాయుధంగా మిగిలిన తనను సంహరించినా ఆ మరణం ‘క్షేమతరం’ అనే అనుకున్నాడు. ‘షాలో సెంటిమెంట్’ అంటే ఇదే! మొత్తానికి వ్యాకులచిత్తం నుంచి ఉదయించిన వివేకాచిత్త ఫలితం ఇది.
నిజానికి అర్జున వివేక చిత్తాన్ని నిరహంకారత్వం పరిపూర్ణంగా పొదువుకుందా అన్నది ప్రశ్న. ఫలితం ఆవిష్కృతం కానున్న సమయంలో మరణశయ్యపైన వివేకోదయమైనట్లు మాట్లాడినంత మాత్రాన గత జీవితం తుడిచిపెట్టుకుపోదు. పైగా అది క్షుద్రమైన హృదయ దౌర్బల్యమే అవుతుంది. అసలు డెత్‌బెడ్‌పైన జరిగే సెల్ఫ్ రియలైజేషన్ వల్ల వొరిగేదేముంది! ఒక విధంగా అపకీర్తికి ఆ స్థితి తావలమవుతుంది. జీవితమంతా తీపి పదార్థాలతో రుచిమరిగి మధుమేహ వ్యాధి సంక్రమించాక తీపి వొంటికి మంచిది కాదని కబుర్లు చెబితే మరణశయ్య నుండి వేదాంతం బోధించినట్లయినా జీవితం మాత్రం వెక్కిరిస్తుంది. కాబట్టి సెల్ఫ్ రియలైజేషన్ అనేది అన్ని విధాల అనుకూలంగా ఉన్నప్పుడే సుఖలోభాల నడుమ భోగ జీవితం గడుపుతున్నప్పుడే కలగాలి. ఏ ముప్పై నలభైలలోనో సెల్ఫ్ రియలైజేషన్ వల్ల ప్రయోజనం ఉంటుందే తప్ప డెబ్బై ఎనభైల రియలైజేషన్ వల్ల ప్రయోజనం? ఆ విషమ సమయంలో విషయ సంగ్రహం వల్ల ఫలితం! నిజానికి కురుక్షేత్రంలో అస్త్రాలు విసర్జించిన అర్జునుడి మనస్కత పౌరుష హీన స్వభావానికి గురైనదే. అది అర్జునుడికి విషమ సమయం.. తన సెల్ఫ్ రియలైజేషన్ తన మానసిక సంసిద్ధతను తెలియజేసేది మాత్రమే! పాండవులలో నడిమివాడయిన అర్జునుడు నడివయస్కుడు కూడా! కాబట్టి నడిమి వయసులో సెల్ఫ్ రియలైజేషన్ వల్ల అర్జునుడికి మునుముందు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
‘గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే
హత్వార్థ కామాంస్తు గురూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్’ (2-5)
మహానుభావుల్ని, గురువుల్ని వధించటం కంటే భిక్షాటన బెటర్. ఆ మహాత్ముల నెత్తురోడిన మరణంలో విజయులకు ప్రాప్తమయ్యే అర్థకామాల, భోగభాగ్యాలు శాంత జీవనాన్ని ప్రసాదించలేవు... ప్రశాంతచిత్తాన్ని అందించలేవు. ఎవరిని హతమార్చి అందలం ఎక్కాలని జీవితకాలమంతా పరితపిస్తూ వచ్చాడో ఎమోషనల్ అయి వివేక సంపన్నుడు కావటంతో నౌతిక సంపన్నతను మించిన ఆత్మ సంపన్నతను చూడగలిగాడు. అంతేకదా, ఎక్కువ తక్కువలు, స్వవర్గీయులు, పర వర్గీయులు, అధికులు, అధములు - ఇవన్నీ దేహ రూపులకే కానీ ఆత్మస్వరూపులకు కాదు. ఆంటే ఆత్మలతో సన్నిహితం కాగలిగితే ఈ సుఖభోగాల స్నేహం మాయమవుతుంది. కార్పణ్య దోషం అంటని స్వభావ స్థితిలోనే ఇలా ఆత్మదర్శనం సాధ్యమయ్యేది. *

-డా.వాసిలి వసంతకుమార్ 93939 33946