ప్రమోదంలో ప్రమాదం
Published Sunday, 14 August 2016ఆ వింతఆటలో లీనమైపోయిన ఓ కుర్రాడు చేతిలో ఉన్న స్టీరింగ్ వదిలేశాడు.. ఫలితంగా అతను నడుపుతున్న కారు అదుపుతప్పి ఓ స్కూల్‌లోకి దూసుకుపోయి నానా బీభత్సం సృష్టించింది.. అదృష్టవశాత్తూ అక్కడ ఎలాంటి ప్రాణహాని జరగలేదు.. ఇదీ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన తాజా సంఘటన.
***
ప్రకృతి వైపరీత్యాల వల్లనో, అనుకోని ప్రమాదాల వల్లనో ఆస్తి, ప్రాణనష్టం జరిగితే బీమా సంస్థలు పరిహారం చెల్లించడం సర్వసాధారణం. కానీ, వేలం వెర్రిగా ఆ వింత ఆటను ఆడుతున్న వారికి రష్యాలోని ఓ బ్యాంకు బీమా సౌకర్యాన్ని కల్పించాలని సంకల్పించింది. మొదట్లో ఇది బ్యాంకువారి ‘మోసపూరిత ప్రకటన’ అని రష్యన్లు భావించినా, ఆ తర్వాత- బీమా గురించి ఆ బ్యాంకు అధికారికంగా ప్రకటన చేయడంతో నిజమేనని నమ్మారు. ప్రపంచాన్ని పిచ్చెక్కిస్తున్న ఆ ఆటను ఆడేవారి సంఖ్య రోజురోజుకీ ఎంతగా పెరుగుతోందో దాని వల్ల ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటోంది. ఈ స్మార్ట్ఫోన్ గేమ్ ఆడుతూ ప్రమాదానికి గురైతే 50 వేల రూబుల్స్ బీమా కింద చెల్లిస్తామని రష్యాలోని ఎస్బర్ బ్యాంకు ప్రకటించిందంటే బ్యాంకులు, బీమా సంస్థలు సైతం పరిస్థితిని ఎలా వ్యాపారంగా మలచుకుంటున్నాయో అవగతమవుతుంది.
***
‘అగ్‌మెంటెడ్ రియాలిటీ’ ఆధారంగా రూపొందిన తొలి పాపులర్ గేమ్ ‘పోకెమాన్ గో’తో ఇపుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఊగిపోతున్నాయి. ఈ గేమ్ విడుదలైన క్షణంలోనే మొబైల్ గేమ్స్ అభిమానులను వెర్రెక్కించింది. ఆవిష్కరణ జరిగిన వెంటనే క్షణాల్లోనే వేలాది డౌన్‌లోడ్లు.. వారం తిరక్కుండానే అవి లక్షలు, కోట్లు మించిపోయాయి. అందుబాటులో ఉన్న వెబ్‌సైట్ల నుంచి ‘పోకెమాన్ గో’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం.. ఆ క్రీడానందంలో మమేకం కావడం ఇపుడు దేశదేశాల్లో కోలాహలంగా కనిపిస్తోంది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్‌ల నుంచి అత్యధిక డౌన్‌లోడ్లు చేసుకున్న గేమ్‌గా ఇది సరికొత్త రికార్డులను సృష్టించింది. రోజులు గడుస్తున్నకొద్దీ ఈ ‘డేంజరస్ గేమ్’ అనేక దేశాల్లోకి రంగప్రవేశం చేస్తోంది. ఆటలో నిమగ్నమైన వారు మొబైల్ ఫోన్లకు కళ్లు అప్పగించి రోడ్లపై పడుతున్నారు. ఫోన్లలో తలదూర్చి, రోడ్లపై విహరిస్తూ ఈ గేమ్ ఆడేవారు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. దీంతో అనేక దేశాల్లో పాలకులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని దేశాల్లో ఈ గేమ్‌ను నిషేధిస్తున్నారు. పిల్లలు, కుర్రాళ్లే కాదు, వాహనాలు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సైతం ఈ ఆటలో మునిగిపోతున్నందున మలేషియాలో పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ‘పోకెమాన్’ ఆడుతూ వాహనాలను నడపవద్దంటూ స్వయంగా మలేషియా రవాణామంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆటతో వాహనాలు నడిపేవారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ ఆట పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలో ముస్లిం మతపెద్దలు కూడా హెచ్చరికలు చేశారు.
‘పోకెమాన్’ ఆటలో నిమగ్నమైన ఓ యువకుడిని దుండగుడు కాల్చి చంపిన సంఘటన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తాజాగా జరిగింది. ఆటలో లీనమైపోవడం వల్లే దుండగుడి రాకను ఆ యువకుడు పసికట్టలేకపోయి ప్రాణాలు కోల్పోయాడని, ఈ గేమ్ ఆడేవారు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలే కాదు, ప్రాణహాని కూడా సంభవించవచ్చని అమెరికా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘మద్యం తాగి వాహనాలు నడపరాదు’ అని ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తున్నట్లే- ‘పోకెమాన్ ఆడుతూ డ్రైవింగ్ చేయవద్దు’ అంటూ ఆస్ట్రేలియా నగరాల్లో ఎలక్ట్రానిక్ సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ని హెచ్చరికల చేస్తున్నా ఆటాడుతూ రోడ్లెక్కే వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇలా వివాదాలకు, ప్రమాదాలకు కారణమవుతున్నప్పటికీ ‘పోకెమాన్’ ఆడాలన్న ఆతృత భారతీయుల్లోనూ పెరుగుతోంది.
ఈ ఏడాది జూలై 6న విడుదలైన ‘పోకెమాన్ గో’ ఇపుడు ఓ సంచలనమై, సర్వత్రా విస్తరిస్తోంది. మొబైల్ గేమింగ్ స్వరూపానే్న సమూలంగా మార్చేసిన ఈ ‘డేంజరస్ గేమ్’లో నిబంధనలు, ఆటగాడి నైపుణ్యాన్ని బేరీజు వేసే విధానాలు అన్నీ వింతగానే అనిపిస్తాయి. నిజానికి ‘పోకెమాన్’ అంటే జపాన్ భాషలో ‘పాకెట్ మాన్‌స్టర్’కు సంక్షిప్త నామం. ఈ పేరుతో ఇదివరకే టీవీ షో, సినిమాలు వీక్షకులను అలరించాయి. ఇపుడు దేశదేశాల్లో విస్తరిస్తున్న ‘పోకెమాన్ గో’ అన్నది ఓ ట్రెయినర్ యాప్. ‘పోకెమాన్ మాస్టర్’ కావాలన్నదే దీన్ని ఆడేవారి లక్ష్యం. వీలైనన్ని పోకెమాన్లను సంపాదించి వాటిని ట్రెయిన్ చేసి ‘మాస్టర్’ కావడమే ఆటలో అసలు మజా. జంతుజాలం, మాయలు, అద్భుతాలు, ఊహలు.. ఇవన్నీ ఉండడంతో ఈ గేమ్ అంటే పిల్లలు, కుర్రకారులో మోజు పెరుగుతోంది.
‘బందీల’ను విడిపించడమే విజయం..
పోకెమాన్లను గురి చూసి కొట్టాక ఆటగాడికి క్యాండీస్, స్టార్‌డస్ట్ అనే రెండు రకాల పాయింట్లు వస్తాయి. పోకెమాన్ పోరాట పటిమను పెంచుకునేందుకు ఆటగాడు ఈ రెండురకాల పాయింట్లను వాడుకోవచ్చు. అయితే, అన్ని పోకెమాన్ల శక్తి ఒకే తీరులో ఉండదు. ‘స్థాయి’ పెరిగేకొద్దీ వాటి శక్తికూడా పెరుగుతుంది. ఆటగాడు తాను కొట్టిన పోకెమాన్‌ను వెనక్కిపంపి మరో పోక్‌మాన్‌ను సృష్టించుకుని, పాయింట్లను పెంచుకునేందుకు ముందుకు సాగవచ్చు. ఈ ఆటలో మొత్తం 151 పోకెమాన్ ర్యాంకింగ్స్ ఉంటాయి. ప్రతి దానికీ ఓ నిర్దిష్టమైన పేరు ఉంటుంది. మొదటి పోకెమాన్ పేరు ‘పికాచు’. ఆ తర్వాత మ్యూ, చార్మెండర్, హంటర్, జుబట్, రట్జాటా.. ఇలా అనేకం. ‘పోకెడెక్స్’లో బందీలుగా ఉన్న పోకెమాన్లను విడిపించడంతో ఆట ముగుస్తుంది. ఆటలో అయిదు ‘లెవెల్స్’ దాటాక ఆటగాడు వలోర్ రెడ్ టీమ్, మైస్టిక్ బ్లూ టీమ్, ఇన్‌స్టింక్ట్ ఎల్లో.. అనే మూడు జట్లలో చేరవచ్చు. ఈ స్థాయి సాధిస్తే పోకెమాన్ జిమ్‌లో తలపడేందుకు అర్హత లభించినట్టే. ఈ జిమ్‌లు కూడా రియల్ లొకేషన్లలో ఉంటాయి. ఫోన్‌లో ఫాలో అవుతూ అక్కడికి వెళితే ఇవి కనిపిస్తాయి. ‘జిమ్’లోకి అడుగుపెట్టే ఆటగాడు తన నైపుణ్యంతో పోకెమాన్లను శక్తిమంతం చేసుకునే వీలుంటుంది.
గుంపుల్లోనే పెడతారు..
ఆటగాళ్లకు ప్రమాదాలు జరగకుండా పోకెమాన్లను బహిరంగ ప్రదేశాల్లో బదులు నిర్మానుష్య ప్రాంతాల్లో పెట్టవచ్చన్న సందేహం ఎవరికైనా వస్తుంది. కానీ, గూగుల్ ఎపిఐ ద్వారా నావిగేట్ చేసిన పోకెమాన్లను సమూహాలు, గుంపులు ఉన్నచోటే పెడుతున్నారు. వీటిని మాన్యువల్‌గా పెట్టడం కుదరదు గనుక బస్టాండ్లు, పార్కులు, హోటళ్లు, ఆస్పత్రులు, ఇతర రద్దీ ప్రాంతాలను గేమ్ డెవలపర్లు ఎంచుకున్నారు. గూగుల్ అప్లికేషన్ ప్రోగ్రాం ఇంటర్‌ఫేస్ (ఎపిఐ) ద్వారా పోకెమాన్లను పెడతారు. గూగుల్ మ్యాప్స్, ఎపిఐ నావిగేషన్స్ కచ్చితంగా ఉన్నపుడే వీటిని బంధించవచ్చు.
నకిలీలూ ఉన్నాయ్..
దేశదేశాల్లో ‘పోకెమాన్ గో’ యూజర్ల సంఖ్య ఇప్పటికే 40 మిలియన్లకు చేరుకుందని ఓ అంచనా. రానురానూ ఇదొక వేలం వెర్రిగా మారడంతో ఇందులో నకిలీలు సైతం విస్తరిస్తున్నాయి. పోకె రాడార్, హెల్పర్ ఫర్ పోకెమాన్ గో... ఇలా అనేక పేర్లతో 200 పైచిలుకు నకిలీ యాప్స్ రంగప్రవేశం చేశాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకుంటే ఆటలో మజా సంగతి అటుంచితే పలురకాల వైరస్‌లు మొబైల్స్‌లో చేరుతున్నాయి. నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తం కావాలంటూ సైబర్ సెక్యూరిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. జిపిఎస్, కెమెరా, ఫోన్‌లోని దిక్సూచి ఆధారంగా రియల్ లొకేషన్లలొ భౌగోళిక ప్రాంతాల్ని గుర్తిస్తారు. ఇందులో అగ్‌మెంటెడ్ రియాలిటీ ద్వారా పోర్టల్స్‌ను ట్రాక్ చేసి ఉంచుతారు. వీటిని కనుగొనాలంటే- వాస్తవ ప్రపంచంలోనే వాటి వద్దకు వెళ్లాలి. ఫోన్‌లో దిక్సూచి, సెన్సర్లు అనుసంధానం అయి ఉంటాయి గనుక పోకెమాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న మొబైల్‌లో ఆటగాళ్లు తల దూర్చాల్సిందే.
సృష్టికర్తలు..
నేడు ప్రపంచాన్ని ఊపేస్తున్న ‘పోకెమాన్ గో’ సృష్టికర్తలుగా డెన్నిస్ హ్వాంగ్, జునిచీ మసూదా కీర్తి గడించారు. అమెరికాలోని నాక్సివిల్ రాష్ట్రంలో జన్మించిన హ్వాంగ్ జియాంగ్ మాక్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం (కాలిఫోర్నియా) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేసి, గ్రాఫిక్ ఆర్టిస్ట్‌గా, గూగుల్‌లో వెబ్‌మాస్టర్‌గా పనిచేశారు. జపాన్‌కు చెందిన జునిచీ మసూదా పోకెమాన్ సిరీస్‌కు నిజమైన రూపశిల్పిగా గుర్తింపు పొందారు. పోకెమాన్ వీడియో గేమ్‌తో గుర్తింపు పొందాక అనేక నూతన ఆవిష్కరణలు తెరతీశారు. పోకెమాన్ రెడ్, గ్రీన్, రూబీ, సఫైర్ వంటి గేమ్స్ సృష్టించారు.
నవంబర్‌లో మరో ఆవిష్కరణ..
పోకెమాన్ రెడ్ అండ్ బ్లూతో 1996లోనే ఈ సిరీస్ మొదలైంది. ఈ ఏడాది జూలై 6న ‘పోకెమాన్ గో’ విడుదలైంది. వచ్చే నవంబర్‌లో ‘పోకెమాన్ సన్ అండ్ మూన్’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎలా ఆడతారు..?
‘పోకెమాన్ గో’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ‘లాగిన్’ అయినవారిని ‘పోకెమాన్ ట్రైనర్’ అంటారు. ముందుగా కళ్లు, జుట్టు, దుస్తులు, స్టయిల్ ఆధారంగా ఒక అవతార్ (క్యారెక్టర్)ను ఎంచుకోవాలి. స్మార్ట్ఫోన్‌లో లొకేషన్ ఆన్ చేస్తే మీరున్న ప్రాంతం గూగుల్ మ్యాప్ ద్వారా తెలుస్తుంది. అదే మ్యాప్‌లో కొన్ని చోట్ల పోకెమాన్లు కూడా కనిపిస్తుంటాయి. అవి ఎక్కడున్నాయన్నది కచ్చితంగా తెలియక పోయినా ఏ ప్రాంతంలో ఉన్నాయన్నది తెలుస్తుంది. ఫోన్ పట్టుకుని, కెమెరాలోనుంచి చూసుకుంటూ పోకెమాన్ కోసం అనే్వషిస్తుండాలి. పోకెమాన్ ఉన్న ప్రాంతంలోకి మనం చేరుకోగానే కెమెరా, గైరోస్కోప్ ఆధారంగా అగ్‌మెంటెడ్ రియాలిటీ ద్వారా అవి మన మొబైల్‌లో కనిపిస్తాయి. మనకు కనిపించిన పోకెమాన్‌ని- ఫోన్‌లోని పోకెబాల్‌తో గురిచూసి కొట్టాలి. ఇవి మనకు ఎక్కడైనా తారసపడొచ్చు. ఫోన్‌లో నిమగ్నమైపోయి ఈ గేమ్‌ను నడుస్తూ, పరుగెడుతూ, వాహనాలను నడుపుతూ ఆడతారు గనుక ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలి. రోడ్లపైన, రెస్టారెంట్ల వద్ద, అడవుల్లో, కొండలపైన, ఆస్పత్రుల వద్ద, రైల్వే స్టేషన్ వద్ద, బస్టాప్‌ల వద్ద.. ఏ చోటనైనా పోకెమాన్లు ఉండవచ్చు. సరైన సమయంలో ఫోన్‌లోని పోకెబాల్‌తో వాటిని కొట్టడంలోనే ఆటగాడి నైపుణ్యం దాగి ఉంటుంది.