S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం, ప.గో.జిల్లా
గోవధ చేసే వాళ్లని హెచ్చరించవలసిన ప్రధాని నరేంద్ర మోదీ, గోరక్షకులను హెచ్చరించడం వెనుక ఆంతర్యమేమిటి?
రాజకీయ అవసరం.

బి.సత్యప్రకాష్, సూర్యాపేట
‘సంస్కారం’ అంటే సభ్యత, మంచి నడవడి. ఇది రెండు పదములు కలిసిన సంయుక్త పదము. మళ్లీ దీనికి ముందు ‘కు’ చేర్చి విరుద్ధ అర్థములో ప్రయోగించడం ఏమిటండీ? అట్లే సంస్కృతికి ‘కు’ చేర్చటం, సభ్యతకు ‘అ’ చేర్చటం జరుగుచున్నది.
ఈ రోజుల్లో భాష, వ్యాకరణ నియమాలు రాసేవారికీ తెలియవు. చదివేవారికీ తెలియవు. కాబట్టి ఎవరికీ పట్టవు. (మీలాంటి బహుకొద్దిమందికి తప్ప)

బి.ఆర్.సి.మూర్తి, సూర్యాపేట
తన సెక్స్ పరిజ్ఞానాన్ని ఉపాథిగా పరమావధిగా ఎంచుకున్న ఒకానొక ముదుసలి వైద్యుడు పుష్కర స్నానం మూఢాచారం అంటే స్నానమాచరించిన స్వాములు ఖండించక మిన్నకుండటం విడ్డూరం కదూ?
పిచ్చికూతల్ని పట్టించుకోకపోవటమే మేలు.

క్రైస్తవుడైన రాజశేఖరరెడ్డి తనయుడు గుళ్లకు, గోపురాలకు వెళ్లడం ఆశ్చర్యంగా లేదూ? ఇది కూడా రాజకీయాల్లో భాగమేనంటారా?
అంతేమరి.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
76 ఏళ్ల నజ్మాహెఫ్తుల్లా వయసు మీద పడిన కారణంగా మంత్రిగా పనికిరాలేదు. మణిపూర్ గవర్నరు ఎలా అయ్యారు? వయసు ఈ పదవికి అడ్డం కాదా? మంత్రిలాంటి బాధ్యతలు గవర్నరుకు ఉండవా?
రాజ్‌భవన్‌లు రాజకీయ పునరావాస కేంద్రాలు. వాటికి వయసుతో పనిలేదు.

ఒక్క రజత పతకానికే భారత జాతీయ పతాక రెపరెప లాడిస్తున్నాం. ఎంత అల్ప సంతోషులమండి మనం.
ఇన్నాళ్లూ అదీ లేదుగా. అందుకే ఈ అతి.

కొయిలాడ బాబు, బెంగళూరు
ఒలింపిక్ మెడల్స్ పొందిన క్రీడాకారులకు కొన్ని ప్రభుత్వాలతోపాటు, సంస్థలు కూడా భారీఎత్తున కోట్లాది రూపాయలు నగదు బహుమతులు ప్రకటించాయి. క్రీడాకారులను ప్రోత్సహించడం మంచి విషయమే. అభ్యంతరం ఏమీ లేదు. అయితే క్రీడారంగం తప్పితే ఇలాంటి ప్రోత్సాహకాలు ఇతర రంగాలకు ప్రభుత్వాలు ఎందుకు వర్తింపజేయవు. మిగతా రంగాల్లో అదే స్థాయిలో పనిచేసేవారు ఉన్నారు కదా.. ఉదాహరణకు సైన్స్ రంగంలో యువ శాస్తవ్రేత్తలు, సాహితీ రంగంలో అంతర్జాతీయ స్థాయి రచనలు చేస్తున్న మన రచయితలు, అలాగే పరిశోధకులు, కళాకారులు, నిపుణులు... ఇలాంటి వారు కూడా మన దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన సందర్భాల్లో ఇదే స్థాయి ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చు కదా?
ఇవ్వాల్సిందే. ఒలంపిక్ స్థాయిలో ఇతర రంగాల్లో ఘనత సాధిస్తే...

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
ఆంధ్రను విడగొట్టిన పాపం (తెలంగాణాను చేసిన మంత్రి) అంతా సోనియాగాంధీ గార్కి దక్కడం, సుష్మాస్వరాజ్‌గార్కి (చిన్నమ్మ), వెంకయ్యగారు, అరుణ్ జైట్లీగార్లకు మరియు మోదీగార్కి దక్కుతుంది. కాని ఈ పాపం సోనియాగాంధీ గారి మీదే వేసేస్తున్నారు వారి అద్భుతమైన ఉపన్యాసాల ద్వారా. ఇప్పుడు కూడా హోదా విషయమై కాంగ్రెసు మీదకే తోసేస్తున్నారు. హోదా ఇవ్వడానికి పూర్తి అధికారం ఉన్నా మీనమేషాలు లెక్కపెడ్తున్నారు.
బతక నేర్చినవాళ్లు.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
పాక్-చైనాలు భారత భూభాగాలు ఆక్రమించి నిత్యం ఉగ్రవాద ఘాతుకాలకు ప్రేరేపించి భారత్ భగ్నానికి పాల్పడుతున్నా ఐక్యరాజ్యసమితి, అలీన రాజ్యాల సమితి, భద్రతా మండలి, సార్క్ దేశాల సమితి, ఎన్.ఎస్.జిలు లాంటివి ఎందుకు చర్య గైకొనుట లేదు?
వాటికేమి పట్టింది? కదలవలసింది మన ప్రభుత్వం.

సిహెచ్.సాయి ఋత్త్విక్, నల్గొండ
‘వెనె్నల’లో సినిమా సమీక్షలలో మీ అంచనాలు కాస్త తప్పుతున్నాయనిపిస్తోంది. రెండు స్టార్‌లు ఇచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా సూపర్‌హిట్ అయ్యింది... కబాలి గురించి రివ్యూ బాగా రాయలేదు...
సినిమా ఎలా ఉందో చెప్పడమే సమీక్షకుడి పని.

‘వెనె్నల’లో మీవ్యూస్ శీర్షికలో ఇంతకు ముందు కొత్త సినిమాలపై ప్రేక్షకుల అభిప్రాయాలను ప్రచురించేవారు. రానురాను సినిమా ఇండస్ట్రీలో పోకడలు, సినీతారల గాసిప్స్, పత్రికలలో వచ్చే టిట్‌బిట్స్ వంటివి ఎక్కువై పోతున్నాయి. పాత పద్ధతిని పునరుద్ధరించమని మనవి.
మీ సూచన ఆలోచిస్తాం.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
జి.ఎస్.టిని ఏదో ఒక ప్రభుత్వం లేదా పార్టీకి విజయంగా భావించరాదు. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని జి.ఎస్.టి. బిల్లును గట్టెక్కించడంలో మోదీకి పూర్తి క్రెడిట్ ఇవ్వాలని నా అభిప్రాయం. మీరేమంటారు?
ఔను.

వై.వి.శివకాంత, అచ్యుతాపురం, శ్రీకాకుళం జిల్లా
రోజూ ఒక పేజీ అంతా సినిమా వార్తలు ప్రచురించి దండుగ పెడుతున్నారు. దినపత్రిక పెద్దవారు తప్ప, విద్యార్థులు చదువరు. వారికి తీరిక ఉండదు. దాని బదులు బాలలకు, స్ర్తిలకు ఉపయోగపడే శీర్షికలు ఇతర పత్రికలలో ప్రచురించినట్లు ప్రచురించవలెను.
ఇతర పత్రికలలోనూ సినిమా వార్తలు పూర్తి పేజీ ఇస్తున్నారు.

పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
‘ఉత్తరాయణం’ శీర్షికలో మేము ఎంత బాగా లేఖలు వ్రాసినా కనీసం చూచుకొందామన్నా వేయటం లేదు. ఇద్దరు ముగ్గుర్ని ‘పర్మినెంట్’ చేసుకొన్నారనిపిస్తోంది ఈ మధ్య పేపర్ చూస్తూంటే. ఎందువలన? దీనికేమైనా ప్రామాణికాలు ఉంటే తెలుపండి.
ప్రచురణార్హతే ప్రామాణికత. అందరూ సమానమే.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com