S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇంద్రియ క్షోభనే మానసిక దౌర్బల్యం

దైన్యం దేహానిదే కానీ ఆత్మస్వభావానిది కాదు. కార్పణ్యం దోషమే కాబట్టి ఆ కార్పణ్య స్వభావం మనల్ని మూఢుల్ని చేస్తుంటుంది. మనం మూర్ఖశిఖామణులం అవుతుంటాం. అసలు మానసిక ప్రసన్నత మాత్రమే ప్రశాంతమయ జీవితాన్ని అందించగలదు. అది సాధ్యం కానప్పుడు మిగిలేది శోక జీవనమే. నిజానికి శోక స్థితి కూడా ఇంద్రియాతీతమైన ఆత్మస్థితి కాదు. అది ఇంద్రియ శోషనే. కాబట్టి అర్జునుడు శాంతిస్తే తప్ప ఇంద్రియాలు క్షోభించటం మానవు. నిజానికి ఇంద్రియ క్షోభనే మానసిక దౌర్బల్యం. ఇంద్రియ అనురక్తి తరిగితే తప్ప భౌతిక భోగత్వంపై విముఖత్వం కలగదు. భౌతిక ఆసక్తులు తగ్గుముఖం పడ్తే తప్ప అతీత మానసిక స్థితి సాధ్యంకాదు. మొత్తానికి అర్జునుడు ప్రాపంచిక అనురక్తి నుండి విడివడటానికి సిద్ధమయ్యాడు. అదే గిక సిద్ధత్వానికి మెదటి మెట్టు. అంటే భౌతిక ధారణల నుండి దృష్టి మరలాలి. ధ్యాస బాహిరంపై కాక అంతరంగంపై ప్రసరించాలి... నిలవాలి.
మొత్తానికి అర్జునుడు దైహికంగా, మానసికంగా వౌనముద్ర వహించాడు. మనం సైతం ప్రాపంచికంగాను, దైహికంగాను, మానసికంగాను నిశ్శబ్ద ప్రాంగణంలోకి అడుగుపెట్టాలి. అప్పుడే కృష్ణుడో లేదా మన అంతరంగమో శబ్దించటం చూడగలం. ఆ నిశ్శబ్ద క్షేత్రంలో వినికిడి సమస్య ఉండకూడదు. దృష్టి మాంద్యం ఉండకూడదు. అప్పుడు కానీ శోకానికి నిర్వచనం అందదు.
‘అశోచ్యా నన్వశోచ స్త్వం ప్రజ్ఞావాదాం శ్చ భాషసే
గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః’
(2-11)
అని కృష్ణుడు అన్నాడంటే శోకించదగని వారి కోసం శోకించటం అన్నది బాహ్యేంద్రియాలకు అర్థమయ్యేవే! కానీ అంతరింద్రియానికి ‘శోకం’ అనేది అంటదు. దాని భాషలో శోకం అన్న పదమే లేదు. జ్ఞానానికి ఎమోషన్ ఉండదు... జ్ఞానం మనకు అందించేది ప్రమోషన్. బ్రతుకుతున్న వారి కోసం లేదా బ్రతుకు చాలించిన వారి కోసం శోకింపకపోవటమే జ్ఞానప్రకాశనం. అంటే జ్ఞానికి జీవిక సాగిస్తున్న వారైనా, జీవిక ముగించిన వారైనా ఒక్కటే. శోకానికి అతీతమైన స్థితి వారిది. ఈ ఎరుకనే జ్ఞానయోగం.
అంతరాత్మ - ఈ దేహాన్ని ఆవరించుకుని ఉన్నది.
పరమాత్మ - ఈ విశ్వాన్ని పొదువుకుని ఉన్నది.
అంతరాత్మ అయినా, పరమాత్మ అయినా ఆత్మనే.
అయితే అంతరాత్మది దేహసాంగత్యం.. పరమాత్మది సృష్టి సాంగత్యం.
అంతరాత్మ పర ఆత్మగా పరిణమించటమంటే ద్వైత ప్రవృత్తి నుండి అద్వైత ప్రవృత్తికి చేరుకోవటమే. అదే జ్ఞాన వర్ఛస్సు.
‘న త్వేవాహం జాతు నాసం, న త్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామః సర్వే వయ మతః పరమ్’ (2-12)
కృష్ణుడు పర ఆత్మనే. రూపం వేరు.. దేహం వేరు. కృష్ణుడి ప్రవృత్తి అర్జున ప్రవృత్తి కంటే భిన్నం. అర్జున ఆత్మప్రవృత్తికి పరంగా ఉన్న ఆత్మ ప్రవృత్తి కృష్ణ ఆత్మగా కనిపిస్తుంది. ఆ పర ఆత్మ ఆవిష్కరిస్తున్న జ్ఞానాన్ని నిశ్శబ్ద క్షేత్రంలోని మానవ ఆత్మ అందుకుంటోంది. ‘నేను’ లేని ‘కాలం’ లేదు. అంటే ఆత్మ, కాలమూ సహవాసులని అర్థం. రెండూ అదృశ్యాలే... అయినా సహ ప్రయాణీకులే. కాలానికి ఆయుష్షుంటే ఎంతని చెప్పగలం? అది ఏ కాలమానానికీ అందేది కాదు. ఓ ఏడాదికాలం అన్నామనుకోండి - అది సంపూర్ణ కాలాన్ని ప్రతిబింబించటం లేదు కదా - అది కాలగమనంలో వొదిగిన వొక కాలగమనికనే. అలాగే రూపంలోని ఆత్మసైతం వర్తమాన రూపంలో వొదిగేదే తప్ప శాశ్వతత్వానికి ప్రతీక కాదు. కాబట్టి మన ఈ జన్మ ఆత్మవిస్తీర్ణంలో ఒక చిరునామా మాత్రమే.
‘ఆత్మ’కు మన ఈ జన్మ ఒక టెంపరరీ అడ్రస్. అందుకే మనమైనా, అధినేతలైనా కాలయానంలో ప్రయాణిస్తూనే ఉంటాం. రైలు సాగుతుంటుంది... ఎక్కేవారు ఎక్కుతుంటారు.. దిగేవారు దిగుతుంటారు... అంతమాత్రాన దిగిన వారి ప్రయాణం ఆగినట్లు కాదు... కంపార్ట్‌మెంట్‌లో ఉన్న మనకు దిగినవారు కనిపించరు... అయినా వారి ప్రయాణం సాగుతూనే ఉంటుంది.. మన ప్రయాణమూ సాగుతుంటుంది.. రైలూ సాగుతుంటుంది. కాబట్టి ఇప్పుడు వున్నాం.. రేపు ఉండం.. మునుముందు ఉండమేమో అనుకోవటం వృధా భ్రమ. అంటే వర్తమానంలోని ఫిజికల్ ఫామ్ భవిష్య కాలంలో ఉండకపోయినా, ఆత్మ ఈ దేహం నుండి తప్పుకున్నాక, దేహం అదృశ్యమైనా ఆత్మ నిరంతరం కాలంతోపాటు అస్తిత్వాన్ని కలిగే ఉంటుంది. అంటే వర్తమానంలో ఈ దేహస్థితిలో ఆత్మది వ్యక్త స్థితి. భవిష్యత్తులో ఈ దేహాన్ని త్యజించిన తర్వాత ఆత్మకు వ్యక్త స్థితే ఉంటుంది... కానీ దేహం మాత్రం ఇటువంటిదే అయి ఉండదు.. రూపం వర్తమానానిదే కాకపోవచ్చు... స్థితి భౌతిక స్థితి కాకపోవచ్చు. కాబట్టి వ్యక్తంగానైనా అవ్యక్తంగానైనా ఆత్మకు సదా అస్తిత్వమే. నిజానికి ధీరత్వం కలవారికే ఈ ఆత్మజ్ఞానం అందుతుంది.

-డా.వాసిలి వసంతకుమార్ 93939 33946