S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొత్త జిల్లాల్లో పదవుల సందడి

ఖమ్మం, సెప్టెంబర్ 22: జిల్లాల విభజన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కొత్త కమిటీలను వేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కొత్త జిల్లాల్లో నేతలకు పార్టీల పదవులు దక్కే అవకాశం ఉండటంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. పార్టీలో కీలక పదవులు దక్కించుకునేందుకు అనేక మంది పోటీ పడుతుండగా ఆయా పార్టీల ప్రధాన నేతలు మాత్రం ఆయా జిల్లాల్లో నియమించే ప్రధాన బాధ్యులను ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలుగా విభజించబడుతున్న నేపథ్యంలో రెండు జిల్లాలకు వేరు వేరు కమిటీలను ఈ నెలాఖరులోగా నియమించడమే కాకుండా దసరా నుంచి కొత్త జిల్లాల్లో కొత్త కమిటీలు పని ప్రారంభించేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌తో పాటు తెలుగుదేశం, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఆయా జిల్లాల్లో కొత్త నేతలను బాధ్యులుగా నియమించనున్నారు. ఈక్రమంలో వామపక్ష పార్టీలు కొంత ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ప్రస్తుతం బాగం హేమంతరావు పనిచేస్తుండగా కొత్తగూడెం జిల్లా ఏర్పడిన వెంటనే ప్రస్తుతం పార్టీ జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్న సాబీర్‌పాషాను ఆ జిల్లా కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది. అలాగే సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పోతినేని సుదర్శన్‌రావు పనిచేస్తుండగా కొత్తగూడెం జిల్లాకు ఏజె రమేష్‌ను కార్యదర్శిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శిగా పోటు రంగారావు కొనసాగుతుండగా కొత్తగూడెం జిల్లాకు ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి రామయ్యను కార్యదర్శిగా నియమించనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం తుళ్ళూరు బ్రహ్మయ్య కొనసాగుతున్నారు. ఆయన స్వస్థలం కొత్తగూడెం జిల్లా పరిధిలోని రానుండటంతో ఆయన ఆ జిల్లాకే పరిమితమయ్యే అవకాశం ఉంది. దీంతో ఖమ్మం జిల్లాకు కొత్త అధ్యక్షుడు రానున్నారు. అలాగే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా అయితం సత్యం కొనసాగుతుండగా కొత్తగూడెం జిల్లాకు మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్ర, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతరావులలో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక అధికార టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బేగ్ ఖమ్మం జిల్లాకు పరిమితం కానుండగా కొత్తగూడెం జిల్లాకు అక్కడి శాసన సభ్యుడు జలగం వెంకట్రావు అనుచరులలో ఒకరు జిల్లా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోనున్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి పాల్వంచ వాసి కావడంతో ఆయన కూడా కొత్తగూడెం జిల్లాకు పరిమితమయ్యే అవకాశం ఉండటంతో ఖమ్మం జిల్లాకు కొత్త నేతలు అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. ఇదే తరహాలో ఆయా పార్టీల అనుబంధ సంఘాలు, కార్మిక సంఘాల బాధ్యులను కూడా నియమించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల్లో అనేక మంది నేతలకు కొత్త పదవులు దక్కే అవకాశం ఉండటంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.