S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మురికికూపంగా నల్లమాడ!

నల్లమాడ, సెప్టెంబర్ 23:పారిశుద్ధ్యంపై ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పరిశుభ్రతా చర్యలు తీసుకుని ప్రజారోగ్యాన్ని కాపాడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో నల్లమాడ మాత్రం మురికి మాడగా మారుతోంది. మండల కేంద్రమైన నల్లమాడ విషయానికొస్తే బస్టాండ్ పరిసరాల్లో వున్న ప్రధాన దారి వంతెన వద్ద చెత్తాచెదారాలు, మురికినీటి నిల్వలు అధికమై దోమల అభివృద్ధి కేంద్రంగా మారింది. గ్రామంలోని సత్యమ్మవీధి, పాత మసీదు కాలనీ, ఎస్సీకాలనీ, గ్రామ సర్పంచ్ ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారాలు, మురికినీరు అధికంగా ఉంటూ దోమలు చెలరేగుతున్నాయి. గ్రామంలోని కుళాయిలు, ఇతర వ్యర్థనీరంతా ఎస్సీకాలనీలోకి వెళ్ళి ప్రవహిస్తుండటం నిరంతరంగా కొనసాగుతోంది. గత 15 సంవత్సరాలుగా మురికినీటితో ఎస్సీ కాలనీవాసులు రోగాలబారినపడి ఇబ్బందులకు గురవుతున్నారు. పాలకులు, అధికారులు పదుల సంఖ్యలో వచ్చి పరిశీలించడం పరిపాటిగా మారిందికానీ ఇంతవరకు అందుకు పరిష్కారం కోసం చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. అదేవిధంగా తహశీల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో పందుల పెంపకం చేస్తూ వాటిని విచ్చల విడిగా గ్రామంలోకి వదిలేస్తుండటం జరుగుతోంది. ఈవిషయమై పలుమార్లు గ్రామస్థులు ప్రభుత్వాధికారులకు విన్నవించినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలో ఎక్కడైనా సరే డెంగ్యూ, ఇతర జ్వరాలతో ఎవరైనా మృత్యువాత పడిన సందర్భాల్లో మాత్రమే మేల్కొనే అధికారులు కేవలం ఆరోగ్య సిబ్బందిపైనే ఒత్తిడి చేస్తున్నారు. అయితే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత వున్న పంచాయతీ పాలకులు, అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు సమావేశాలు పెట్టి ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ వర్కర్‌లపై అజమాయిషీ చేయడం తప్ప వారు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం సమావేశాలు, ర్యాలీలతో సరిపెట్టేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రమైన అనంతపురంలో డెంగ్యూ కారణంగా ఇద్దరు చిన్నారులు మృతిచెందిన విధంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా అటువంటి దుస్సంఘటన చోటు చేసుకోకూడదని కేవలం వైద్య ఆరోగ్య సిబ్బందిపైనే ఒత్తిడి చేస్తున్న అధికార గణం మురికి వాడలు, చెత్తాచెదారాలను పరిశుభ్రం చేయించడం, గ్రామాల్లో ఇళ్ళవద్దే తిరుగుతున్న పందులను గ్రామాలనుంచి బహిష్కరించడం చేస్తే కొంతవరకు ప్రజారోగ్యం మెరుగుపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నల్లమాడలోని 30 పడకల ఆసుపత్రిలో 24గంటలూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు. విధులు నిర్వహించే వైద్యులు, ఇతర వైద్యసిబ్బంది కొందరు కేవలం నల్లమాడ ప్రభుత్వాసుపత్రిలో మధ్యాహ్నం వరకే విధులు నిర్వహిస్తూ ఆ తర్వాత వాళ్ళు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్‌ఎంపీ డాక్టర్ల క్లినిక్‌లు మూసి వేయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది.
అయితే ప్రభుత్వాసుపత్రిల్లో విధులు నిర్వహించే వైద్యులూ అందుబాటులో లేక, ఆర్ ఎంపీ వైద్యుల క్లినిక్‌లనూ మూసివేయిస్తే తమ పరిస్థితి ఏంటని రోగులు ప్రశ్నిస్తున్నారు. ఆర్ ఎంపీ వైద్యుల క్లినిక్‌లను మూసివేయించే ముందు ప్రభుత్వాసుపత్రిల్లో 24గంటలూ వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని నల్లమాడ వాసులు కోరుతున్నారు.