S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్చ్..వెనుకబడిపోయాం!

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమాభారతి సమక్షంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీ తదనంతర ప్రచార పరిణామంలో తాము పూర్తిగా వెనుకబడిపోయామని ఏపి మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో బాబు-కేసీఆర్ సమావేశంలో ఆంధ్ర వాదనలను తప్పని నిరూపించడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమయిందన్న ప్రచారం జరిగిందే తప్ప, తాము సమర్థవంతంగా వినిపించిన వాదనలకు తగిన ప్రచారం లభించకపోవడంపై సీనియర్లు సైతం పెదవి విరుస్తున్నారు. ఈ విషయంలో ఢిల్లీలో తాము మీడియాను ఆకట్టుకోలేకపోయామన్న విషయం స్పష్టమవుతుందని అంగీకరిస్తున్నారు. బాబు-కేసీఆర్ భేటీలో తెలంగాణ ప్రభుత్వం ఏమేమి వాదనలు వినిపించనున్న అంశాలను తెరాస కొద్దిరోజుల ముందు నుంచే మీడియాకు లీక్‌ల రూపంలో ప్రకటనలు విడుదల చేయగా, తాము మాత్రం ఆ పని చేయడంలో విఫలమయ్యామని చెబుతున్నారు. చివరకు ఉమాభారతి సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా తెలంగాణ ప్రభుత్వమే సమర్ధవంతంగా వాదనలు వినిపించిందన్న సంకేతాలే వెళ్లాయి తప్ప, తాము పడిన కష్టం గురించి ఆ స్థాయిలో ప్రస్తావనకు రాకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. తెలంగాణ మీడియాలో కేసీఆర్ వాదనకు అనుకూలంగా వస్తే, తమ రాష్ట్ర మీడియాలో అది కనిపించలేదని, ఢిల్లీలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకోవడంలో తాము విఫలమయ్యామని అంగీకరిస్తున్నారు. బాబుపై హరీష్ ఆగ్రహం వ్యక్తం చేస్తే కేసీఆర్ సర్ది చెప్పారని, సమావేశంలో ఏపి వాదనలు సమర్ధవంతంగా తిప్పికొట్టి ఉమాభారతికి విశ్వాసం కల్పించడంలో కేసీఆర్ సఫలమయ్యారన్న ప్రచారమే ఎక్కువ జరిగిందని గుర్తు చేస్తున్నారు. నిజానికి అధికారుల కంటే బాబు ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితి, కొత్త ప్రాజెక్టుల గురించి వివరంగా మాట్లాడితే, ఆ విషయం జాతీయ మీడియాను అటుంచి రాష్ట్రంలోని స్థానిక మీడియాలో కూడా ఆ స్థాయిలో ప్రచారానికి నోచుకోలేకపోయిందని మంత్రులు వాపోతున్నారు.
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో సమర్ధులను నియమించుకుందని, భేటీ జరిగిన అర్ధగంట తర్వాతనే భేటీలో తమ రాష్ట్ర సమర్థ వాదనను మీడియాకు విడుదల చేసి, అనుకూల ప్రచారం చేయించుకుంటే, ఆ విషయంలో తాము పూర్తిగా విఫలమయ్యామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇటీవలి కాలంలో ఢిల్లీలో ప్రచార వ్యవహారంలో పూర్తిగా వెనుకబడ్డామని మంత్రులు అంగీకరిస్తున్నారు. గోదావరి పుష్కరాలకు జాతీయ స్థాయి ప్రచారం లభిస్తే, కృష్ణా పుష్కరాలకు అందులో 5 శాతం కూడా లభించలేదని గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో సమన్వయలోపం, అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. రాష్ట్ర సమాచారశాఖ, మీడియావిభాగంతో ఢిల్లీ అధికారుల సమన్వయలోపం స్పష్టమవుతోందంటున్నారు. కాగా, చాలాకాలం నుంచి ఈ అంశంలో స్పష్టత కరవయినట్లు సమాచారశాఖ అధికారుల మాటలు స్పష్టం చేస్తున్నాయి.
‘ఎవరు ఎవరి కింద పనిచేయాలి? ఎవరి బాధ్యతలు ఏమిటి? ఢిల్లీ అధికారులకు మేము చెప్పవచ్చా? లేదా? అక్కడి అధికారులు రోజూ ఎవరికి రిపోర్టు చేయాలి? వారికి పనిచెబితే పార్టీపరంగా ఏమైనా ఇబ్బందులొస్తాయా? అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. వైఎస్ ఉన్నప్పుడు అధికారులు కమిషనర్ అధీనంలో ఉండేవారు. అప్పట్లో ఢిల్లీలో ప్రచారం కూడా బాగుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందువల్లే ఈ గందరగోళం. మేం కూడా సార్ దృష్టికి దీన్ని తీసుకువెళ్లే సాహసం చేయలేకపోతున్నాం. సందర్భం వచ్చినప్పుడే చూద్దామని వేచి ఉన్నామ’ని సమాచారశాఖ అధికారి ఒకరు అసలు విషయం వెల్లడించారు.