S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలుగు వర్శిటీ, అకాడమీ విభజనపై ఏపి దృష్టి

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆస్తుల పంపకానికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో షెడ్యూలు 10 బిలోని విద్యాసంస్థలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిసారించింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమి, ఉన్నత విద్యా మండలి, సంస్కృత విశ్వవిద్యాలయం, ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయం, వైద్య విశ్వవిద్యాలయం, న్యాయ విశ్వవిద్యాలయం, ఆర్‌జియుకెటి వంటి రాష్టస్థ్రాయి, జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, జాతీయ సంస్థలు ఈ షెడ్యూలులో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయం, న్యాయ విశ్వవిద్యాలయం, ఉన్నత విద్యామండలి వంటి సంస్థల విభజన ప్రక్రియ పూర్తయింది. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమి వంటి సంస్థల విభజన జరగలేదు. ఆస్తులకు సంబంధించి పెద్దగా స్థిర నిల్వలు లేని వర్శిటీల విషయంలో రెండు రాష్ట్రాల నుండి ఎలాంటి అభ్యంతరం రాకపోయినా, వందల కోట్ల రూపాయల ఆస్తులున్న సంస్థల విషయంలో మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకున్న తరుణంలో సుప్రీంకోర్టు దామాషా ప్రకారమే ఆస్తులను సైతం పంచుకోవల్సిందేనని స్పష్టం చేసింది. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమి విభజనకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ భాషా సంస్కృతి, అభివృద్ధికి సంబంధించి కూడా ఒక నివేదికను ఈ వారం అందజేయనుంది. ఈ అధ్యయన కమిటీకి చైర్మన్‌గా పల్లె రఘునాథరెడ్డి వ్యవహరిస్తారు. సభ్యులుగా ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, డాక్టర్ పరకాల ప్రభాకర్, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్, పురావస్తుశాఖ సంచాలకుడు డాక్టర్ జివి రామకృష్ణారావు వ్యవహరిస్తారు. కమిటీకి సభ్య కార్యదర్శిగా భాషాసాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ డి విజయభాస్కర్ నియమితులయ్యారు.
అన్నింటికీ మించి విభజన చట్టానికి సంబంధించి తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమి వంటి సంస్థల విభజన, విద్యారంగంలో తెలుగు బోధించడానికి కార్యాచరణ ప్రణాళిక, పాలనారంగంలో పూర్తి స్థాయిలో తెలుగు వాడకాన్ని అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక, సమాచార సాంకేతిక రంగంలో తెలుగు వినియోగంలో సిఫార్సులను ఈ కమిటీ చేస్తుంది.
అనంతరం తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేయాలని, అదే విధంగా విశిష్ట భాషా కేంద్రాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.