S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాబుపై చెరుగుతున్న ముద్ర!

హైదరాబాద్: బాబు వస్తే వర్షాలు రావు. రిజర్వాయర్లు నిండవు. కరవు విలయ తాండవం చేస్తుంది! ఇదీ గత కొనే్నళ్ల నుంచి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉన్న సెంటిమెంటుకు సంబంధించిన ముద్ర!! గత రెండేళ్ల నుంచి ఏపిలో సరైన వర్షాలు కురవకపోవడం, అంతకుముందు తొమ్మిదేళ్లు సీఎంగా చేసినప్పటి కరవును దృష్టిలో పెట్టుకుని విపక్షాలు చేసిన విమర్శలు, కొందరు స్వాములు చేసిన వ్యాఖ్యలు ఒక సెంటిమెంటుగా మారాయి. తాజాగా కురుస్తున్న భారీ వర్షా లు ఏపి భారీ రిజర్వాయర్లు, చెరువులను నింపేయడం జలకళ ఉట్టిపడుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 140 టీఎంసీల నీరు ఎక్కువగా ప్రాజెక్టుల్లో చేరింది. ఫలితంగా బాబుపై ఇప్పటివరకూ ఉన్న ఈ సెంటిమెంటు విమర్శకు వచ్చే ఏడాది వరకూ తెరపడినట్లే. గత కొద్దిరోజుల నుంచి కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపిలోని అన్ని ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు నీటితో పొంగి పరవెళ్లుతున్నాయి. గత 16 ఏళ్ల తర్వాత ఏనాడూ కురవనంత భారీ వర్షాలు రిజర్వాయర్లను నింపేస్తున్నాయి. దీనితో వచ్చే ఏడాది వరకూ రాష్ట్రంలో తాగు-సాగు నీటికి ఢోకా ఉండదు. ఖరీఫ్ కష్టాలు తీరడంతోపాటు, ఈ వర్షాల వల్ల ఇంకిపోయిన భూగర్భ జలాలుపైకి రావడంతో రబీకి సైతం సమస్యలుండకపోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా రాజధాని గుంటూరు జిల్లాను పులిచింతల ప్రాజెక్టు ఆదుకుంది. ఇది పల్నాడు సహా పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. ఈ ప్రాజెక్టులో 30 టీఎంసీల నీరు చేరింది. అటు పట్టిసీమతో ఇప్పటికే 10 లక్షల ఎకరాలను సాగులోకి రాగా, కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మొత్తం రాష్ట్రంలో ఇప్పటికి నిండిన రిజర్వాయర్ల పరిస్థితి పరిశీలిస్తే వచ్చే ఏడాది వేసవి వరకూ నీటి కష్టాలు ఉండకపోవచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది. దీనితో గత ఏడాది వరకూ చంద్రబాబు వస్తే వర్షాలు రావన్న సెంటిమెంటుతో కూడిన విమర్శకు తెరపడినట్లయింది. ఈ వానలు వేసవిని ఆదుకుంటున్నందున వచ్చే వేసవి సీజన్‌లో ప్రభుత్వం విమర్శల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. భారీ సాగునీటిపారుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఈ విమర్శకు సంబంధించి తాజాగా చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, కురుస్తున్న భారీ వర్షాలు అధికార పార్టీలో ఏ స్థాయి ఉత్సాహం నింపుతున్నాయో స్పష్టమవుతోంది. బాబు వస్తే వర్షాలు రావన్న విపక్షాలు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని మంత్రి ఎదురుదాడి చేశారు. కాగా, భారీ వర్షాలతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్ల వాస్తవ సామర్థ్యం 815.83 టీఎంసీలు కాగా, ఇప్పటివరకూ వాటిలో 488.30 టీఎంసీల నీరు చేరింది. ఇంకా 327.53 టీఎంసీల నీరు చేరవలసి ఉంది. గతేడాది ఇదే సమయానికి 346.61టీఎంసీల నీరు ఉంది. అంటే గతేడాది కంటే ఈసారి 140 టీఎంసీల నీరు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధికారపార్టీ నేతలు, మంత్రులకు ఈ గణాంకాలే ఉత్సాహం ఇస్తున్నాయి. శుక్రవారం వరకూ కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలో కరవు పరిస్థితి తొలగిపోతుందని, ఫలితంగా బాబుపై వ్యక్తిగతంగా కొనసాగుతున్న ‘సెంటిమెంటు విమర్శల’దాడికి ఏడాదిపాటు తెరపడవచ్చంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీశైలం నిండే అశకాశం ఉంది.
ఇదీ రిజర్వాయర్ల పరిస్థితి
ఏపిలో ప్రస్తుతం వివిధ రిజర్వాయర్లలో చేరిన నీరు పరిశీలిస్తే తుంగభద్ర మినహా మిగిలినవన్నీ సంతృప్తికరంగానే ఉన్నట్లు జలవనరుల శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. కృష్ణా బేసిన్ పరిథిలోని శ్రీశైలం 215.81 టీఎంసీలకు గాను 164.75 టీఎంసీలు, నాగార్జునసాగర్ 312.05కి 139.26 టీఎంసిలు; పులిచింతల 45.77కి 30టీఎంసీలు; తుంగభద్ర 100.86కి 41.10 టీఎంసీలు; ఏలేరు 24.10కి 8.18 టీఎంసిలు; పెన్నా బేసిన్‌లోని సోమశిల 78కి 23.60 టీఎంసి; కండలేరు 68.03కి 22.17; వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 16.95కి 15.38టీఎంసీల నీరు చేరింది. ఇందు లో తుంగభద్ర ఒక్కటే నిరాశ కలిగిస్తుండగా, సాగర్ పరిస్థితి కొంతమేరకు ఫర్వాలేదని అధికారులు చెబుతున్నారు.