S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వదలని వర్షం..పెరిగిన వరదనీటి ఉద్ధృతి

ఉప్పల్, సెప్టెంబర్ 23: హైదరాబాద్ మహానగరం ప్రజల్ని జడివాన వెంటాడుతూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లోని లోతట్టు ప్రాంతాలు జల దిగ్భందమయ్యాయి. రహదారులు చెరువు, కుంటలుగా తలపించాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఉధృతికి మూసీ మురికి నీటి పిల్ల కాలువలు ఏరులై పారుతూ పొంగి పొర్లుతున్నాయి. ఇరుకైన కల్వర్టుల వద్ద రహదారిపై నుంచి వరద నీళ్లు వెళ్తుండటంతో సమీపంలోని కాలనీలలోని ఇళ్లలోకి చేరుకుని జన జీవనం స్తంభించింది. వరద నీటితో ప్రవహిస్తున్న చిల్కానగర్, స్వరూప్‌నగర్ మురికి నీటి కల్లర్టుల రహదారిలో బయటకు వెళ్లలేక వాహనాదారులు భయపడి అక్కడే ఆగిపోయారు. అర కిలోమీటర్ పొడవునా నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. గమనించిన వాహనాదారులు వెనుకకు తిరిగి ఇతర దూర ప్రాంతాల నుంచి గమ్యాన్ని చేరుకున్నారు. జిహెచ్‌ఎంసి నియమించిన సహాయక ప్రత్యేక బృందం సభ్యులు, కాలనీ యువకులు వాలంటీర్లుగా రంగంలోకి దిగి వాహనాలను జాగ్రత్తగా నీటిలో నుంచి బయటకు మల్లించేందుకు శ్రమించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ, ఇఇ నిత్యానందరావు, అధికారులు పోలీసుల సహకారంతో కాలనీల యువకులతో కలిసి చిల్కానగర్ రహదారిలో వర్షం నీటిని బయటకు మల్లించే పనులను మరీ దగ్గరుండి చేయించారు. స్వరూప్‌నగర్ రహదారిలో సౌత్ స్వరూప్‌నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు లేతాకుల రఘుపతిరెడ్డి, టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి బేతి సుభాష్‌రెడ్డి, కాలనీ యువకులతో కలిసి వర్షం నీటి ఉద్ధృతి నుంచి వచ్చే వాహనాదారులను సురక్షితంగా బయటకు పంపించారు. చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ డివిజన్లలోని లోతట్టు ప్రాంతాలలోని ప్రధాన రహదారిలో, ఇళ్ల మధ్య చేరిన వరద నీటిని సహాయక బృందాలు ఎప్పటికప్పుడు స్పందిస్తూ జెసిబి యంత్రాల సహాయంతో బయటకు మల్లించేందుకు శ్రమించారు. ప్రధాన రహదారిలో వచ్చిపోయే వాహనాదారులకు ఇబ్బందులు కలుగకుండా కల్వర్టు వద్ద ప్రహారి గోడలను మరీ కూల్చేసి వర్షం నీటిని బయటకు మల్లించారు. పోలీసులు సైతం సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ఓయూ క్యాంపస్‌లో కూలిన పది ఇళ్లు
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా ముంచెత్తిన భారీ వర్షాలతో హైదరాబాద్ అంతా అతలాకుతలమైంది. మహానగరంలోని ఉప్పల్ సర్కిల్‌లోని అన్ని డివిజన్లలోని లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ఒకవైపు వరద నీటితో జలమయమైన రహదార్లలో మరొకవైపు మురికి కాలువలు, భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లడంతో దుర్వాసన, దుర్గందం వెదజల్లుతూ కాలనీ ప్రజలను ఇబ్బందులు పెట్టాయి. రామంతాపూర్ కెసిఆర్‌నగర్, సాయికృష్ణకాలనీ, లక్ష్మినారాయణకాలనీ, చర్చికాలనీ, టివికాలనీ, రాంరెడ్డినగర్, వాసవీనగర్, భరత్‌నగర్, రాజేంద్రనగర్ వంటి లోతట్టు ప్రాంతాలను వర్షం నీరు ముంచెత్తాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారు. రాత్రంతా వర్షం కురుస్తుండటంతో హబ్సిగూడ డివిజన్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నెంబర్ 4లో వర్షంతో పురాతనమైన 10 ఇళ్లు నేలకొరగడంతో నిరుపేద కుటుంబాలు వీధినపడ్డాయి. అప్రమత్తమైన ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, కార్పొరేటర్ బేతి స్వప్న సుభాష్‌రెడ్డి, డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ సంఘటన స్థలాన్ని సందర్శించారు. కూలిన ఇళ్లతో నిరాశ్రయులైన వారితో పాటు, నిలువ నీడలేని 30 కుటుంబాలను హబ్సిగూడ రవీంద్రనగర్, గిరిజనబస్తీలోని కమ్యూనిటీ హాళ్లకు తరలించారు. వీరికి ఆహారం, వౌలిక సదుపాయాలు కల్పించారు. బాదితులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టిఆర్‌ఎస్, బిజెపి నేతలు సైతం వర్షం బాదితులకు అండగా నిలిచి సహాయక చర్యలు చేపట్టారు.
వర్షాలతో ఉప్పొంగుతున్న చెరువులు
తాండూరు: భారీ వర్షాలతో తాండూరు డివిజన్‌లోని చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. డివిజన్‌లోని 247 చెరువులు, వాగుల్లో 189 అలుగువెళ్లాయి. రోడ్డు రవాణ పూర్తిగా స్తంభించిపోయింది. రైలు సదుపాయం ఒక్కటే అందుబాటులో ఉంది. తాండూరు - హైదరాబాద్ రహదారిలోని మంతెనపల్లి వద్ద వంతెన దెబ్బతింది. డివిజన్‌లోని బషీరాబాద్, యాలాల, పెద్దెముల్ మండలాల్లో 30 పురాతన ఇళ్లులు నేలకూలాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డివిజన్‌లో 13సెం.మీ వర్షపాతం నమోదైంది. కాగ్నా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. కొటపల్లి చెరువు కట్ట తెగిందనే పుకార్లతో 40 కుటుంబాలు వలస వెళ్లాయి. యాలాల మండలంలోని జుంటుపల్లి ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం 17 ఫీట్లకు చేరింది. శివసాగర్ ప్రాజెక్ట్‌లో నిల్వ సామర్థ్యం 13 ఫీట్లకు చేరింది. అల్లాపూర్ ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం 19 ఫీట్లు కాగా 18 ఫీట్లకు నీరు చేరింది. మంగళ, బుధవారాల్లో తాండూరు జిల్లా కోసం బంద్, గురు, శుక్రవారాల్లో వర్షాలతో ఆర్టీసీ బస్సులు సరిగా నడవక డిపోకు రూ.30లక్షల నష్టం వాటిల్లిందని మేనేజర్ పేర్కొన్నారు.
మురుగుకాల్వలో బాలుడి గల్లంతు
కర్ణాటక చిక్కాపూర్‌కు చెందిన సంపత్, కల్యాణి దంపతులు వలసవచ్చి తాండూరు అయ్యప్పనగర్‌లో నివసిస్తూ స్థానికంగా పాలిషింగ్ పరిశ్రమలో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిని పవన్‌కుమార్, పునిత్‌కుమార్(2) కుమారులు. శుక్రవారం ఉదయం ఇంటి వద్ద మలవిసర్జనకు కూర్చుగా ప్రమాదవశాత్తు మురగుకాల్వతో పడి గల్లంతయ్యాడు.
మేడ్చల్‌లో అలుగులు పారిన చెరువులు
మేడ్చల్: మేడ్చల్‌లో గురవారం రాత్రి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలు తడిసిముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షం నీరు వరదలా ప్రవహించింది. మురుగు కాలువలు డ్రైనేజీలు పొంగిర్లాయి. వాగులు వంకలు కూడా పొంగపొర్లడంతో పాటు మండలంలోని కుంటలు చెరువులు నిండుకుండలా నిండుకున్నాయి. అంతేకాకుండా మేడ్చల్ పెద్ద చెరువుతో పాటు మండలంలోని అన్ని గ్రామాల చెరువుల అలుగులు పారాయి. రాయిలపూర్, గుండ్లపోచంపల్లి, నూతన్‌కల్, డబిల్‌పూర్ తదితర గ్రామాలలోని చెరువులు అలుగులు పారాయి. 12 సంవత్సరాల తరువాత మేడ్చల్ పెద్ద చెరువు అలుగు పారడం విశేషంగా చెప్పవచ్చు. అలుగు పారుతున్న అపూరూపదృశ్యాలను వీక్షించడానికి ప్రజలు వందల సంఖ్యలో కుటుంబసమేతంగా తరలివచ్చారు. అలుగు పారుతున్న దృశ్యాలను తమతమ సెల్‌ఫోన్‌లలో బంధించడానికి పోటీపడ్డారు. అలుగు పారుతున్న దృశ్యాలను తిలకించిన తన్మయత్వంతో హర్షం వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి అలుగు పారడంతో తెల్లవారుఝాము నుండి శుక్రవారం సాయంత్రం వరకు సందర్శకుల తాకిడితో మేడ్చల్ పెద్ద చెరువు ప్రాంతం వద్ద ప్రత్యేకత సందడి నెలకొంది. ఎమ్మేల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి టిఆర్‌ఎస్ నాయకులతో కలిసి చెరువును పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాలలో ఎక్కడ చూసినా రోడ్ల వెంబడి వర్షం నీరే కనిపించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షం తెరిపి ఇవ్వడంతో ప్రజలు ఇళ్లల నుంచి బయటకు వచ్చి చెరువుల వద్దకు చేరుకున్నారు. గుండ్లపోచంపల్లిలోని నారాయణపూర్ చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టడంతో ఇళ్లలోకి వర్షం నీరు చేరుకుంది. సర్పంచ్ బేరీ ఈశ్వర్ నీటిపారుదల అధికారులతో కలిసి నారాయణపూర్ చెరువు కింది భాగాన జెసిబి కాలువను తీసి నీటిని కిందకు పంపించే ఏర్పాట్లు చేశారు. గ్రామంలో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పూడూరు అనుబంధ గ్రామమైన అర్కల్‌గూడ కోమటికుంట చెరువుకు లీకేజీలు ఏర్పడటంతో గ్రామస్థులు వార్డు సభ్యులు మరమత్తులు చర్యలు చేపట్టినప్పటికీ అవి కాస్త ఫలించలేదు. నీరు వృధాగా పోతూనే ఉన్నాయి.
తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం నుంచి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. గండ్లు పడిన చెరువుల వద్ద వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు. మేడ్చల్ నగర పంచాయతీ పరిధిలో శిధిలావస్థలో ఉన్న పురాతన ఇళ్లను అధికారులు సిబ్బందితో దగ్గరుండి మరి కూల్చి వేయించారు. ఎటువంటి ఆస్తినష్టం ప్రాణనష్టం సంభవించలేదని ఎప్పటికప్పుడ అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకుంటున్నట్లు తహశీల్దార్ పేర్కొన్నారు. మేడ్చల్- కిష్ఠాపూర్ వాగు వద్ద రాకపోకలను నిలిపివేసి ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగర పంచాయతీ కమిషనర్ రామిరెడ్డి తన సిబ్బందితో పట్టణంలో పరిస్థితిని పరిశీలించి తగు చర్యలు చేపట్టారు.
భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం
చేవెళ్ల: వారం రోజుల నుంచి ఎడతెరపకుండ చేవెళ్ల రెవెన్యూ డివిజన్‌లో భారీ వర్షం కురిసింది. గురువారం సాయవత్రం నుండి శుక్రవారం సాయంత్రం వరకు కుండపోతగా కురిసిన వర్షనికి జనజీవనం అస్తవ్యస్తమైంది. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎవరూ బయటకు రాలేదు. మధ్యాహ్నం తర్వాత కొంత తెరపి ఇవ్వడంతో రోడ్లపై ప్రజలు కనిపించారు. వర్షానికి చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ, బస్తేపూర్, చన్‌వళ్లి, పామెన అల్లావాడ, చేవెళ్ల, మల్లారెడ్డిగూడ, కుమ్మెర, దేవారంపల్లి, ఆలూర్, ఖానపూర్, రేగడిఘనపూర్ తదితర గ్రామాల్లో క్యారెటు, టామాట, పత్తి, బంతిపూవ్వు, జొన్న, మొక్కజొన్న, కంది, బెండ, వంకాయ తదతర పంటలు నీట మనిగి పోగ, క్యారేట్, టామాట పంటలు నీట మునిగి మురిగిపోయాయి. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
ఈసి, మూసి నదులు ఉప్పొంగి పొర్లాయి. వాగు పరివాహక ప్రాంతాల్లో పంటలు కొట్టుకుపోయాయి. చేవెళ్ల మండల పరిధిలోని ఆయ గ్రామాల్లో వర్షానికి పొలాలకు వెళ్లే రోడ్లు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఇబ్బందులకు ఎదురుకోవాల్సి వచ్చింది. వాగులు వంకలు పొర్లడమే కాకుండా ఆర్‌ఆండ్‌బి, పంచాయతీ రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. చేవెళ్ల మండల కేంద్రం నుండి వెళ్లే జాతీయ రహదారిపై లెక్కలెనాన్ని గుంతలు ఏర్పడ్డాయి. చేవెళ్లలో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వర్షానికి చేవెళ్ల మండల పరిదిలోని అంతరం గ్రామానికి చెందిన చాకలి చంద్రమ్మ ఇల్లు కూలింది. కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరగపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలని కోరారు. చేవెళ్ల మండలంలో 8.5సెం.మీ వర్షం కురిషింది.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
భారీ వర్షానికి పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలని, పరిహారం ఇప్పించాలని మీర్జాగూడ గ్రామానికి చెందిన నర్సింలు కోరారు. అతనికి ఉన్న రెండు ఎకరాల్లో క్యారేట్ పంట వేశాడు. భారీ వర్షానికి పూర్తిగా మురిగిపోయింది. సుమారు రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టానని పేర్కొన్నాడు.
పరిగిలో
పరిగి: పరిగిలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రాత్రి, పగలు ఏకధాటిగా వర్షాలు పడుతుండటంతో కుంటలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మండల పరిధిలోని మిట్టకోడూరు చెరువుపది సంవత్సరాల తరువాత ఇప్పుడు నిండి పొర్లుతోంది. గడిసింగపూర్, రూఫ్‌ఖాన్ పేట్ చెరువు, సుల్తాన్‌పూర్, రాఘవపూర్, చిగురాల్‌పల్లి చెరువు, రంగంపల్లి చెరువు, ఇబ్రహీంపూర్ చెరువులలో నీరు నిండి పొర్లుతున్నాయి.
చిన్నచిన్న కుంటలు, చెరువులు నిండి పొర్లుతూ లఖ్నాపూర్ ప్రాజెక్టులోకి నీరు చేరుతోంది. దీంతో లఖ్నాపూర్ ప్రాజెక్టులో స్థాయికి మించి నీరు చేరుకుంది. ప్రాజెక్టు అలుగులో నుంచి నీరు ఉద్ధృతంగా వెళుతోంది. ప్రాజెక్టుకు సంబంధించి కుడి, ఎడమ కాలువలలో నీరు లెక్కకు మించి వెళుతోంది. ప్రాజెక్టు ముందు లఖ్నాపూర్ గ్రామం ఉంది. గ్రామం పక్కనుంచి కాలువ ఉంది. ప్రాజెక్టులో సామర్ధ్యానికి మించిన నీళ్ళు ఎన్ని వచ్చినా ఈ కాలువ నుంచే వెళుతుంటాయి. ఈసారి ఉద్ధృతంగా నీరు రావడంతో కాలువ నిండుకుండలా ప్రవహిస్తోంది.
కూలిన ఆరు ఇళ్లు
నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని ఖుధవంద్‌పూర్ గ్రామంలో కోట బుచ్చయ్య ఇల్లు ఒక పక్క కూలిపోయింది. అదేవిధంగా కుల్కచర్ల మండల పరిధిలోని కొంతపల్లి పుర్సంపల్లి గ్రామంలో అద్దని శివశంకర్, హరిజన్ బాలయ్య, బోయిని వెంకటమ్మల ఇళ్లు ఒకపక్క కూలి పోయాయి. ఉన్న ఇల్లు కూలిపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.