S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రా.. రమ్మని

కొత్త ఎప్పుడూ వింతగానే ఉంటుంది...
వింత ఎప్పుడూ ఆసక్తిని, ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటుంది..
అలా కొత్త విషయాలను, కొత్త ప్రాంతాలను, కొత్త రుచులను, కొత్త సంస్కృతిని, కొత్త అందాలను చూస్తే తనివి తన్మయత్వంతో మురిసిపోతుంది. ఆ మురిపెం కొత్తశక్తిని ఇస్తుంది.
కాస్తంత చొరవ, సాహసం, డబ్బు, కోరిక ఉండాలే కానీ- ఈ ప్రపంచంలో కొత్తకోణాల్ని చూడడానికి కొదువేముంది? అందుకే ప్రపంచంలో చాలా దేశాలకు ఇప్పుడు పర్యాటకం ఒక పెద్ద ఆదాయవనరైపోయింది. ఆహ్లాదకరమైన దృశ్యాలే కాదు, శారీరక ఆరోగ్యం కోసం తపన కూడా పర్యాటకానికి కారణమైపోయింది.
చారిత్రక చిహ్నాలేకాదు...్భయానక అనుభవాల
గుర్తులూ చూసి రావలసిన ప్రాంతాలైపోయాయి.
కరిగిపోతున్న మంచు ఫలకాలను చూసేందుకు తరలివచ్చిన పర్యాటకులతో ఓ దేశం ఆర్థికంగా బలపడుతోందంటే నమ్ముతారా?
కిలిమంజారో పర్వత శిఖరంపై మంచుదుప్పటి జారిపోతున్న దృశ్యాన్ని చూసివచ్చే వారితో ఆ ప్రాంతం కళకళలాడుతోందంటే విశ్వసిస్తారా?
వందలాది మందిని క్రూరంగా చంపి పాతిపెట్టిన భయానక ప్రాంతాన్ని చూసేందుకూ పర్యాటకులు ‘క్యూ’ కడుతున్నారంటే ఎందుకు నమ్మకూడదు.
ఓ అందమైన సరస్సు
ఓ భయంకరమైన జ్ఞాపకం
ఓ మధురమైన ఊహాలోకం..
ఓ బాధాకరమైన చిహ్నం...
ఓ ఆరోగ్యధామం..ఇలా అన్నీ తమను చూడటానికి రా రమ్మని పిలుస్తున్నాయ్..
ఆ పిలుపే...పర్యాటక రంగానికి ఆయువుపట్టుగా మారిపోయింది.
కొత్త దంపతులు ఏకాంతంగా గడపి రావడానికి వెళ్లే
హనీమూన్ పర్యటనలు పాతమాట.
వయసుమీరిన వారు ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లిరావడమూ అలనాటి ఆనవాయితీయే.
సెలవుల్లో పిల్లాపాపలతో కలసి యాత్రాస్పెషల్‌కు చెక్కేయడం మనకు కొత్తేమీకాదు. కానీ ప్రపంచం తీరుతెన్నులు మారిపోయాయి.
మానవుడి కోరికలు పరుగెత్తే గుర్రాలే. కొందరికి ప్రకృతి సోయగాలు చూడటం ఇష్టం. మరికొందరికి వింతలూ, విడ్డూరాలు చూడటం ఇష్టం. కొందరికి సముద్ర తీర ప్రాంతాల్లో విహరించడం ఇష్టం. మరికొందరికి ప్రపంచంలో విభిన్న సంస్కృతులను దగ్గరనుంచి చూడటం, అక్కడి వంటలూ, అలవాట్లను పరిశీలించడం ఇష్టం. ఇలా ఇష్టానికి తగ్గట్లు, కొత్తదనాన్ని చూడాలనుకుంటున్న మనవాళ్లు.. దూరతీరాలకు వెళ్లిరావడానికి జంకడం లేదు. సౌకర్యాలు, ప్రయాణ సాధానాలూ పూర్వం కన్నా సరసమైన ధరలకు అందుబాటులోకి రావడంతో పర్యాటకరంగం కళకళలాడుతోంది. ప్రపంచం అంతటా ఆర్థిక సంక్షోభం తలెత్తినపుడు కాస్త కుంగినా, ఇప్పుడు పర్యాటక రంగం మళ్లీ తలెత్తుకుని నిలబడగలిగింది. కొత్త ఆశలతో.. కొంగత్త రూపులతో..
పర్యాటక దినోత్సవం ఎందుకంటే..
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఏడాదికో లక్ష్యంతో సభ్యదేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ సరికొత్త ఆకాంక్షకు అద్దం పట్టేలా ఉంది. ‘టూరిజం ఫర్ ఆల్...ప్రొవైడింగ్ యూనివర్సల్ యాక్సెసబిలిటి’. వయసు, మతం, లింగ, భాష ఇలా ఏ బేధాలూ లేకుండా ప్రపంచం అందరికీ ఈ భూగోళంలోని అన్ని ప్రాంతాలకూ వెళ్లివచ్చేందుకు వీలుగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దడం ఈ నినాదం లక్ష్యం. అందుకు వీలుగా సభ్య దేశాల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించనుంది.
ఇదీ వృద్ధి
ఐక్యరాజ్యసమితి
పర్యాటక విభాగం లెక్కల ప్రకారం గతేడాదితో పోలిస్తే ప్రపంచంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. 2014 కన్నా ఈ ఏడాది 4.6 శాతం అభివృద్ధి నమోదైంది. 1,184 మిలియన్ల పర్యాటకులు రాకపోకలు సాగించారు. 1.5 ట్రిలియన్ డాలర్ల ఎగుమతి ఆదాయం లభ్యమైంది. 2016లో 3.5 నుంచి 4.5 శాతం అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. 1.8 బిలియన్ పర్యాటకులు ప్రపంచాన్ని చుట్టిరావాలన్నది లక్ష్యం.
కొత్త పంథాలో టూరిజం
ఆధునిక ప్రపంచంలో మనిషి ఆలోచనలు, అభిలాషలు, ఆకాంక్షలు మారిపోతున్నాయి. పెరిగిన ఆదాయం, కుగ్రామంగా మారిపోయిన ప్రపంచం, రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, ప్రపంచంలో విభిన్న ప్రాంతాల గురించి విస్తృత ప్రచారం జరగడం, ప్రభుత్వాలు కూడా రాయితీలతో కూడిన టూరిస్ట్ ప్యాకేజీలను ప్రకటించడంతో పర్యాటకుల రాకపోకలు పెరుగుతున్నాయి. ప్రకృతి అందాలు, చారిత్రక ప్రాంతాలే ఇంతకాలం పర్యాటక రంగానికి వెన్నుదన్నుగా నిలిచాయి. ఇప్పటికీ వాటి స్థానం చెక్కుచెదరలేదు. కాకపోతే- అన్ని ప్రాంతాల్లోనూ అదే ఒరవడి ఉండదు. దీంతో ఎప్పటికప్పుడు పర్యాటక రంగం కొత్తరూపు సంతరించుకుంటోంది. సెలవులు, విశ్రాంతి, వివాహం, ఇతర శుభకార్యక్రమాల కోసం పర్యటనలు చేయడం మామూలే. చారిత్రక ప్రాంతాలపై ఆసక్తి, కొత్త సంస్కృతుల పరిశీలనా మామూలే. ఇప్పుడు కొత్త అంశాలపై పర్యటనలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఒకటిన్నర దశాబ్దంగా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అతి పేద దేశాల్లో పర్యటించి అక్కడున్న పేదలను ఆదుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఇలా వెళ్లే పర్యాటకులను ‘ప్రో-పూర్’ టూరిస్ట్‌లుగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు వీరి రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. దీనిని ప్రొపూర్ టూరిజంగా పిలుస్తున్నారు. టాంజానియా, లావోస్, లాంగప్రబాంగ్ వంటి దేశాలు ఈ టూరిజంపైనే బతుకు వెళ్లదీస్తున్నాయి. ఫిజి వంటి అతిచిన్న దేశాలు ప్రకృతి సోయగాల ఆధారంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక క్రియేటివ్ టూరిజం అనేది సరికొత్త కానె్సప్ట్. సృజనాత్మకతో కూడిన ఏర్పాట్లతో ఉంటే పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం అన్నమాట. ఓ థీమ్ పార్క్, సముద్ర తరంగాలపై తేలియాడే గృహాల్లో షికార్లు..ఇలా సరికొత్త ఆలోచనలకు అద్దంపట్టే ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. జర్మనీ, స్పెయిన్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, యుకె, బహమాస్, ఇటలీ, న్యూజిలాండ్, జమైకా ఈ తరహా పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నాయి. ఇక ఎడ్యుకేషనల్ టూరిజం పాత పద్ధతే. చారిత్రక ప్రాంతాలు, ఎతె్తైన పర్వతాలు, గ్లేసియర్స్ ఉంటే ప్రాంతాల్లో పర్యటకానికి ‘డూమ్ టూరిజం’గా పేరుపెట్టారు. ఇది సరికొత్త ఆకర్షణ.
కిలిమంజారో పర్వతశిఖరాలపై పేరుకున్న మంచు కరిగిపోతున్న దృశ్యాన్ని దగ్గరినుంచి చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. అతిపేద దేశమైన టాంజానియాలో పర్యాటక రంగమే పెద్దదిక్కుగా మారిపోయింది. పర్వతారోహకులతోపాటు పర్యాటకులనూ ఇది బాగా ఆకర్షిస్తోంది. నిజానికి ఇది వాల్కనిక్ పర్వతం. అర్జెంటినాలోని అతిపెద్ద గ్లేసియర్ పటగ్మియా కరిగిపోతోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు పెద్దఎత్తున పర్యాటకులు వస్తూండటం ఆ దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెడుతోంది. ఈ సరికొత్త డూమ్ టూరిజం ప్రపంచంలో కొత్త డెస్టినేషన్స్‌కు దారిచూపిస్తోంది. ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయిన దేశాలకు కాస్తకోలుకున్నాక పర్యాటకులను ఆకర్షించే సరికొత్త పాచిక- ‘రెసిషన్ టూరిజం’. ఈ ఆలోచన అద్భుతంగా పనిచేసింది. చౌకగా, రాయితీలతో ఆకట్టుకునే ప్యాకేజీలు అటు పర్యాటకులకు భారం తగ్గేలా చేస్తే, మరోవైపు నిధుల కోసం తహతహలాడే దేశాలకు ఆదాయమార్గాన్ని చూపిన ఆలోచన ఇది.
మెడికల్ టూరిజం...్భరత్ హవా
పర్యాటక రంగం ద్వారా భారత్ జిడిపిలో 6.5 శాతం వాటా లభిస్తోంది. 2014తో పోలిస్తే ఈ ఏడాది భారత్‌కు భారీసంఖ్యలో పర్యాటకులు వచ్చారు. 36.315 వేల ఉద్యోగాలను కల్పిస్తున్న ఈ రంగం గతేడాది 8.31 లక్షల కోట్ల ఆదాయాన్ని అందించింది. 2013తో పోలిస్తే ఈ రంగం అభివృద్ధి పదిశాతానికి పైగానే ఉంది. ముఖ్యంగా మనదేశానికి వచ్చేవారిలో వైద్యం కోసం వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ విషయంలో భారత్‌లో చౌకగా, మేలైన, నాణ్యమైన వైద్యసేవలు అందడం ప్రధాన ఆకర్షణ. భారత్‌కు వచ్చే పర్యాటకుల్లో అత్యధికులు అమెరికా నుంచి వస్తూండగా వారిలో ఎక్కువమంది మెడికల్ టూరిస్టులే. ‘ది ట్రావెల్ అండ్ టూరిజమ్ కాంపిటేటివ్‌నెస్’ నివేదిక ప్రకారం 141 దేశాల్లో భారత్‌కు 12వ స్థానం దక్కగా, నాణ్యమైన సేవలు, ప్రగతి అంశాల్లో 32వ స్థానం లభించింది. మెడికల్ టూరిజం ద్వారా భారత్‌కు గతేడాది 300 కోట్ల యుఎస్ డాలర్ల ఆదాయం లభించింది. 2020 నాటికి 700-800 కోట్ల డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
ఆ నాలుగు నగరాలే కీలకం
మనదేశంలో పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్న రాష్ట్రాలు మూడు. మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కాశ్మీర్, కేరళ, రాజస్థాన్ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, ముంబయి, దిల్లీ, ఆగ్రా, కోల్‌కతాలకు విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువ. విదేశాల నుంచి వచ్చేవారిలో ఎక్కువమంది ముంబయిలో విడిది చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. వారి దేశాలతో పోలిస్తే ఇక్కడ ఫైవ్‌స్టార్ హోటళ్ల ఆతిథ్యం నాణ్యంగా, చౌకగా లభ్యమవడమే అందుకు కారణం. విదేశీ పర్యాటకులు ఎక్కువమంది వస్తే దేశానికి విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా వస్తుంది. అంతర్గత పర్యాటక రంగం వల్ల కొత్తగా ఉపాధి, ఉద్యోగాలు సృష్టించబడి వేలాది కుటుంబాలు జీవించగలుగుతాయి. అందువల్లే పర్యాటక రంగంపై ఇప్పుడు రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు దృష్టి సారించాయి.
సరికొత్త ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయి. తెలుసుకోవాలన్న ఆరాటం, అవకాశం ఉన్నవారిని ప్రపంచం ఇప్పుడు ఆహ్వానిస్తోంది. రా.. రమ్మని. మన ఆలోచనలను, ఆసక్తి, ఆర్థిక శక్తిని బట్టి మనం కదలాల్సిందే. పుట్టిన ఊరు, దేశం కాకుండా మరో కొత్త ప్రపంచాన్ని చూస్తే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేం. అది స్వయంగా ఎవరికివారు అనుభవించాల్సిందే. అందుకే పెట్టెబేడా సర్దుకుని బయలుదేరమని చెబుతోంది ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఇందుకు మీరు సిద్ధమేనా.. ?
ఇవీ విశేషాలు
ప్రపంచంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రాంతాల్లో లండన్ (యుకె) మొదటి స్థానంలో ఉంది. బ్యాంకాక్ (్థయ్‌లాండ్), పారిస్ (్ఫన్స్), దుబాయ్, (యుఎఇ), ఇస్తాంబుల్, న్యూయార్క్ సిటీ (యుఎస్), సింగపూర్, కౌలాంలంపూర్ (మలేసియా), సియోల్ (ద.కొరియా), హాంగ్‌కాంగ్ (చైనా) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
*ప్రపంచం మొత్తంమీద ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షిస్తున్నది పారిస్‌లోని ఈఫిల్ టవర్. పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తున్న దేశాల్లో ఫ్రాన్స్, చైనా ప్రస్తుతం ముందంజలో ఉన్నాయి.
*్భరత్‌లో ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించే కట్టడం తాజ్‌మహల్.
*యుఎఇ, ఈజిప్ట్, గ్రీస్, థాయ్‌లాండ్, బహమాస్, ఫిజి, మాల్దీవులు, సీషెల్స్ వంటి దేశాలు కేవలం పర్యాటక రంగం ఆధారంగా మనుగడ సాగిస్తున్నాయి.
డార్క్ టూరిజం
విషాదానికి మారుపేరుగా, సాక్షీభూతాలుగా నిలిచిన ప్రాంతాల సందర్శనను డార్క్ టూరిజంగా పిలుస్తున్నారు. 1996నుంచి ఈ ఆలోచన కార్యరూపంలోకి వచ్చింది. స్కాంట్లాండ్ దీనికి శ్రీకారం చుట్టింది. ప్రకృతి సహజంగా (్భకంపాలు, వరదలు, సునానీ, అగ్నిపర్వతాల విస్ఫోటనం వగైరా), నియంతలు, యుద్ధాల కారణంగా మారణహోమం జరిగిన ప్రాంతాలు, కుతంత్రాలు, కుట్రల కారణంగా నరమేథం జరిగిన స్థలాలు, విషాద సంఘటనలకు కేంద్రంగా నిలిచిన అలనాటి ఆనవాళ్లను సందర్శించడానికి అవకాశం కల్పించిన ఆలోచనే- ఈ ‘డార్క్ టూరిజం’. దీనినే బ్లాక్ టూరిజం అని కుడా పిలుస్తున్నారు. ఇటీవలి కాలంలో దీనికి ఆదరణ పెరిగింది. అమెరికాలో ట్విన్ టవర్స్‌పై దాడి ఘటనలో వేలాది మంది మరణించిన విషయం తెలిసిందే. అక్కడ నిర్మించిన గ్రౌండ్ జీరో ఇప్పుడు పెద్ద టూరిస్ట్ స్పాట్. అలాగే స్కాట్‌లాండ్‌లోని కల్లొడిన్ యుద్ధ్భూమి, రుమేనియాలోని బ్రామ్ కేస్ట్లే, పొయనాస్ కేస్ట్లే, జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి పీస్ మెమోరియల్ పార్క్, లండన్‌లోని డంగన్ మ్యూజియం, జాక్ ది లిప్పర్ ఎగ్జిబిషన్, అంగ్లెస్సిలోని బీమారిస్ జైలు ఈ టూరిజం కింద పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. వాషింగ్టన్ డిసిలోని హోలాకాస్ట్ మెమోరియల్‌కూడా డార్క్ టూరిజంకు పర్యాయ పదంగా మారిపోయింది.
*

-ఎస్.కె.ఆర్.