S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మిస్టర్ హేపీమేన్

అతని పేరు జాన్ జేమ్స్ రేండాల్ఫ్ అడోల్ఫస్ మిల్స్. 23 జూన్ 1923న బెర్ముడాలో పుట్టిన ఇతన్ని జానీ బార్నెస్ అని పిలుస్తారు. బెర్ముడాలోని హేమిల్టన్ అనే ఊళ్లో ఈయన నివసించేవాడు. బెర్ముడా ట్రావెల్ గైడ్‌బుక్స్‌లో సందర్శించే అంశాల జాబితాలో ఈయన పేరు కూడా ఉంటుంది.
జానీ బార్నెస్ సోమవారం నించి శుక్రవారం దాకా ప్రతీ ఉదయం 3.45 నించి 10 దాకా ‘్ఫట్ ఆఫ్ ది లేన్’ అనే ట్రాఫిక్ ఐలండ్ దగ్గర నిలబడి చేతిని ఊపుతూ, వెళ్లే వారందరికీ గట్టిగా అరిచి చెప్పేవాడు. ‘గుడ్‌మార్నింగ్ ఐ లవ్ యూ. గాడ్ లవ్స్ యూ’.
బెర్ముడా ద్వీపంలోని రోడ్లు ఎలా ఉన్నాయంటే, పశ్చిమం నించి తూర్పుకి వెళ్లే ప్రతీ డ్రైవర్ ఈ ట్రాఫిక్ ఐలండ్ మీద నించే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతీ కారు డ్రైవర్ నిత్యం రద్దీ సమయంలో ఇతన్ని చూస్తూండేవారు.
1986లో ఓ రోజు బార్నెస్‌ని మొదటిసారి వారు చూశారు. అప్పటి నించి అతను నిత్యం ఆ సమయంలో అక్కడ నిలబడి అందరితో ఆ మాటలు పదేపదే చెప్తూండేవాడు. అతను ప్రజలకి నిత్యం ఎంతగా అలవాటు అయ్యాడంటే, ఏ రోజైనా అతను కనపడకపోతే చాలామంది జానీ బార్నెస్ ఏమయ్యాడని ట్రాఫిక్ పోలీసులకి ఫోన్ చేసి అడిగేవారు. మొహంలో చెరగని చిరునవ్వుతో, విసుగూ విరామం లేకుండా బార్నెస్ వారందర్నీ గ్రీట్ చేస్తూనే ఉండేవాడు. వర్షం పడుతున్నా, ఎండ కాస్తున్నా ప్రతీ నిత్యం అతను దాదాపు ఆరు గంటలపాటు హేమిల్టన్ పౌరులకి దర్శనం ఇస్తూండేవాడు.
బెర్ముడాలోని సెయింట్ కిట్స్‌లో బార్నెస్ జన్మించాడు. అతను బెర్ముడా రైల్‌రోడ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. తర్వాత 1948లో బస్ డ్రైవర్‌గా చేరాడు. బస్‌లో వెళ్తూ అతను దారిలో కనిపించే పాదచారులని, కారు డ్రైవర్లని చూసి చేతిని ఊపడానికి ఇష్టపడేవాడు. పనికి వచ్చేప్పుడు, బస్ సర్వీస్ విరామాల్లో కూడా ఇతను చేతిని ఊపేవాడు.
బార్నెస్‌కి దైవభక్తి అధికం. సెవెన్త్ డే ఎడ్వెంటిస్ట్ క్రిస్టియన్ అయిన ఈయన, అందర్నీ ప్రేమించాలనీ, జీసస్ బోధని అనుసరించి ఈ పనిని చేసేవాడు. అడపాదడపా ఎవరైనా ఇతని పక్కన నిలబడి కొద్దిసేపు చేతులు ఊపుతూండేవారు.
‘కొద్దిసేపటికే మాకు ఈ పని చేయడానికి విసుగేస్తుంటుంది. అలాంటి బార్నెస్ నిత్యం ఆరు గంటలపాటు ఎలా ఈ పని చేయగలుగుతున్నాడో ఆశ్చర్యంగా ఉంది. అతనిది నిజమైన ప్రేమ కాకపోతే ఈ పని చేయలేడు’ వాళ్లు చెప్పేవారు.
కొందరు ఇతని పక్కన నిలబడి విరాళాలు కోరేవారు.
ఇతనికి హేమిల్టన్ ప్రజలు ‘మిస్టర్ హేపీమేన్’ అనే పేరు పెట్టారు. కష్టాల్లో ఉన్నవారితో కలిసి ఇతను దైవప్రార్థన కూడా చేసేవాడు. ఓ బేక్‌పేక్, గడ్డిటోపీ, చేతిలో ఓ ట్రాన్సిస్టర్, జెర్కిన్ ఇదీ అతని ఆహార్యం. బార్నెస్ ఎప్పుడూ మొహంలో చిరునవ్వుతో, ఆనందంగా కనిపించేవాడు.
తన అరవయ్యవ ఏట ఆధ్యాత్మికంగా అతనికి ఏదో జరగడంతో ఈ పనిని మొదలుపెట్టానని, తోటివారిని చూసి, చేతిని ఊపి గ్రీట్ చేస్తూంటే, తన హృదయం ఆనందంతో నిండిపోతుందని చెప్పాడు. మొదట్లో ప్రజలు ఇతన్ని పిచ్చివాడని భావించారు. ఇతను ‘ఏంజెల్ ఆఫ్ లవ్’ అని గ్రహించాక, ఆగి అతనితో కరచాలనం చేయడం, పుష్పగుచ్ఛాలని ఇవ్వడం మొదలైనవి చేసేవారు.
బార్నెస్ కాంస్య విగ్రహాన్ని అతను నిలబడే చోట ఆవిష్కరించారు. ప్రజలు అతన్ని ఎంతగా ప్రేమించారంటే, అతను అరుదుగా ఏ రోజైనా రాకపోతే అతను ఏమయ్యాడని వేల కొద్దీ ఫోన్‌కాల్స్ స్థానిక రేడియో స్టేషన్స్‌కి, పత్రికాఫీసులకి వచ్చేవి.
2011లో బెర్ముడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. దీని కోసం ఇక్కడ ప్రదర్శనకి అమెరికన్ సినీ నిర్మాత మోరిస్ బార్నెస్ మీద ‘మిస్టర్ హేపీమేన్’ అనే డాక్యుమెంటరీని తీశాడు. ఇది ప్రపంచంలోని చాలా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి, 2011లో నీష్‌విల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బహుమతిని కూడా పొందింది.
మే 2016 దాకా బార్నెస్ తన పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు. 9 జూలై 2016న 93వ ఏట ఇతను మరణించాడు.

-పద్మజ