దీపావళి
Published Saturday, 29 October 2016ఎవరి బుగ్గలు చిదిమి పెట్టారో
ఈ చిట్టి దీపాలు
చిరుగాలికే అల్లల్లాడిపోతున్నాయి
ఎన్ని పాదులు వెదికి తెచ్చారో
ఈ కాకర పూలు
చిన్ని చేతుల్లో కాంతులీనుతున్నాయి
ఎన్ని రవాలణచి కట్టారో
ఈ టపాకాయలు
గాలే పేలి గూబలు పగులుతున్నాయి
ఎన్ని వెలుగులు కూరి చేశారో
ఈ మతాబులు
ముద్దలుగా కాంతి నొలకబోస్తున్నాయి
ఎన్ని చీకట్లు నలిపి కలిపారో
ఈ పాముబిళ్లలు
బుసబుస పొంగి నేలంతా పాకుతున్నాయి
ఎందరి చేతుల శ్రమైక ఫలాలో
ఈ వెలుగు జిలుగులు
కటిక అమావాస్య చీకటిని
వెలుగు దొంతరల దీపావళిగా చేస్తున్నాయి.
*