S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంప్రదాయ సంగీత వారధులు (అమృతవర్షిణి)

భగవాన్ రమణ మహర్షిని ఒకసారి దర్శనం చేస్తే చాలు. సమస్యలతో, సందేహాలతో వచ్చేవారికి వెంటనే సమాధానం దొరికి, మరుక్షణం మాటాడకుండా వౌనంగా, తృప్తిగా వెళ్లిపోయేవారట - ఆధ్యాత్మిక ప్రపంచంలో అందుకే వారు యోగులు.
(గురోస్తు వౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు, చ్ఛిన్న, సంశయాః)
అలాగే సంగీతంలోనూ నాద యోగులున్నారు. సంగీతాన్ని గురించి మాట్లాడటం వేరు, పాడి వినిపించటం వేరు. సంగీతపు లోతులు తెలియక పోయినా అనర్గళంగా ఉపన్యాసాలు దంచేసేవారున్నారు. గమనించే ఉంటారు.
అలాగే ఎవరో, ఎప్పుడో పాడేసిన పాటల్ని ముక్కున పట్టి ఊదేసే గాయకులకు ‘సంగీతం’ ఎంతో తేలిక’ అని అనిపించవచ్చు. వారికి తగ్గ శ్రోతలు వారికుంటారు. కానీ అదే సంగీతం అనుకుంటే ఎలా?
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, ఇరవై నాలుగ్గంటలూ గురువునే ఆశ్రయించి ఏళ్ల తరబడి సంగీత సాధన చేసి కీర్తి ప్రతిష్టలున్నవారు అనవసర ప్రసంగాలు చేయరు. అధికంగా మాట్లాడరు. మా ఒక్కరికే సంగీతం తెలుసునని భావించరు. ఆధ్యాత్మిక రంగంలో యోగులైన వారి ఆలోచనలన్నీ ఎలా ఉంటాయో, ఈ సంగీత యోగులు కూడా అలాగే ఉంటారనటానికి సాక్ష్యం ‘సంగీత కళానిధి’ ‘సంగీత ఋషి’ డా.శ్రీపాద పినాకపాణి, సంగీత కళానిధి డా.నేదునూరి కృష్ణమూర్తి, సంగీత చూడామణి వోలేటి వెంకటేశ్వర్లు. ఈ ముగ్గురితోనూ నాకు రెండున్నర దశాబ్దాలకు పైగా అనుబంధం, నాకదో సుకృతం.
తమిళనాడులో బాగా ప్రచారమైన తంజావూరు బాణీ మన ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రచారమవ్వటానికి ఎంతగానో తపించిన సంగీత ఋషి’ డా.పినాకపాణి- అప్పట్లో పెద్దపెద్ద తమిళ్ విద్వాంసులంతా, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో కచేరీలు చేసేవారు. వారిలో ముఖ్యులు అరియక్కుడి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, టైగర్ వరదాచారి (జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం గురువు) చెంబై వైద్యనాథ భాగవతార్ మొదలైన అనేక మంది విద్వాంసుల గానం శ్రద్ధగా విన్నారు - యథాలాపంగా ఏదో కచేరీ విని ఇంటికి రావడం కాదు - వారు పాడిన కీర్తనల్లో నేర్చుకుని పాడతగిన అంశాలను, శ్రద్ధగా స్వర సహితంగా వ్రాసుకుని పాఠం చేసేవారు.
ఆయనకు ఎనభై ఏళ్ల వయసు వచ్చేవరకూ ఇంచుమించు ఇలాగే ఆయన దినచర్య సాగేది - తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోరిక మేర, శరీరం సహకరించకపోయినా ఎవరి సహాయం కోరకుండా, తనకు తానుగా, ఆయన కష్టపడి సేకరించిన కీర్తనల చిట్టలను (నొటేషన్స్) బాగా పరిశీలించి వాటికో రూపాన్నిచ్చి, ‘సంగీత సౌరభం’ పేరిట నాలుగు సంపుటాల్లో వెలువరించారు.
స్వరం చూసి పాడగలిగే వారికి ఇదో సంగీత నిఘంటువు.
తమిళనాడులో ముమ్మరంగా సంగీత కచేరీలు వినే అలవాటున్న శ్రోతల్లో నలభై శాతం మంది పాడగలరు. వారికి రాగాలు తెలుసు. తెలియటమే కాదు రాగం ఎలా ఆరంభించాలి? ఎలా విస్తరించాలి? ఎలా ముగించాలి? - అనే సూత్రాలు కూడా తెలిసిన వారున్నారు. వారికి సంగీతం వృత్తి (ప్రొఫెషన్) కాదు. కానీ కేవలం శ్రోతల్లా, కూర్చుని శ్రద్ధగా కచేరీలు వింటారు.
అటువంటి సంగీత వాతావరణం మన దేశంలో పెరగాలనే వారు డా.పాణి. ‘దక్షిణాదిలో వున్న సంగీత రసికులంతా మూర్తిత్రయాన్ని ఆశ్రయించుకున్నవారే. కొంమతంది తెలుగువారూ నేర్చుకున్నారు. చెవికింపుగా వుండి, శాస్తబ్రద్ధంగా ఉంటూ పారంపర్యంగా వచ్చే పాఠాంతరాలు (కృతి చిట్టలు) పాడితే మంచి మనోధర్మం ఏర్పడుతుందనే వారు’ పాణిగారు.
మంచి సంగీత విత్తనాలు మొలకెత్తకపోతే, మంచి సంగీతం పుట్టదు. మంచి సంగీతం పాడేవారి సంగీత సంతతి పెరగాలి. పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకోవాలంటూ ఉండేవారు.
మనవారి సంగీత ప్రతిభను గురించి చెప్తూ, సుబ్రహ్మణ్య అయ్యర్ అని ఒక వైణికుడు విశాఖపట్నం కచేరీ చేయటానికి వచ్చాడు. ప్రక్కవాద్యంగా ద్వారం వెంకటస్వామి నాయుడుగార్ని పిలిచారు. ఏదో రాగం వీణపై పలికించి తానం చక్కగా వాయించాడు. నాయుడుగారి వంతు వచ్చింది. నాలుగు కమానులు లాగి తానం వాయించేసరికి, హాలు నిండా చప్పట్లే చప్పట్లు.
అదీ మన నాయుడిగారి ప్రతిభ.’
డా.పాణి, నడిచే ఓ సంగీత గ్రంథం. ఆయన విన్న సంగీతమంతా ఆయన మస్తిష్కంలో రికార్డై ఉందంటే అతిశయోక్తి లేదు. ఆయన ముందు ఎన్నో కీర్తనలు పాడేవాణ్ణి. ఎదురుగా కూర్చుని ఏ కీర్తన పాడినా, ఆ కీర్తన గతంలో పాడిన విద్వాంసుడు గుర్తుకొచ్చేవాడు. విలక్షణంగా వుండే సంగతులన్నీ గుర్తుకొచ్చేవి. అద్భుతమైన ధారణ శక్తి ఆయనది.
‘పల్లవి’, ‘గానసుధ’ అనే గ్రంథాన్ని వెలువరించారు. వివిధ తాళాల్లో, జాతులలో పల్లవులు ఇందులో వున్నాయి.
సంగీత విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉండే మనోధర్మ సంగీతానికి సంబంధించిన గ్రంథంలో రాగాలాపన పద్ధతి, నెరవు, స్వరకల్పనకు సంబంధించి ఎన్నో ‘మార్గదర్శకాలు’ అందించారు.
ముఖ్యంగా ‘నొటేషన్’ అనుసరించే విధానాన్ని విపులీకరించిన పద్ధతి ఈ ‘మనోధర్మ’ సంగీత గ్రంథంలో చూడవచ్చు. స్వరాన్ని ఎలా పలకాలి? కంటికి కనిపించే స్వరాన్ని రాగభావంతో అన్వయించేదెలా? అనే విషయాలన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వెలువరించిన నాలుగు సంపుటాల ‘సంగీత సౌరభం’లో 1200 సంగీత రచనలు, వర్ణాలు, ఆయన స్వయంగా స్వరపరచిన ‘అన్నమయ్య’ కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, జావళీలు, తిల్లానాలు మొ. వున్నాయి.
మహామహోపాధ్యాయుడైన డా.నూకల చినసత్యనారాయణ డా.పాణిగారి మొదటి శిష్యుడు. ఆ తర్వాత గురుకుల పద్ధతిలో నేదునూరి ఎక్కువ కాలం ఆయనతో గడిపారు.
‘సంప్రదాయ సంగీతం’ అంటే ఇలా ఉండాలి. ఇలా పాడాలి అనిపించుకున్న విద్వాంసుడు నేదునూరి. కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో నేదునూరి పాటను, విద్వాంసులు, సంగీత రసికులూ బ్రహ్మరథం పడ్తారు. ఒక్కమాటలో సంప్రదాయ సంగీతానికి వారధి ఆయన.
మద్రాసు మ్యూజిక్ ఎకాడెమీలో 5,6 దశాబ్దాలపాటు వరుసగా కచేరీలు పాడే అదృష్టం దక్కిన ఏకైక తెలుగు విద్వాంసులు.
నేదునూరికి అన్నమయ్యకు విడదీయరాని బంధం ఉంది. ఆయన తిరుపతిలో వున్నప్పుడు మొదటిసారిగా ‘అన్నమాచార్య కీర్తనలకు’ బాణీ కూర్చే అవకాశం కలిగింది. దైవ ప్రేరణగా భావించిన నేదునూరి అన్నమాచార్య కీర్తనలకు సంగీత గౌరవమిస్తూ అనేక కీర్తనలు స్వరపరిచారు ఆయన. స్వరపరచిన ‘్భవములోన బాహ్యమునందును.. గోవింద గోవిందయని కొలువవో మనసా’ సప్తగిరి సంకీర్తనలలో పాడబడే మొదటి కీర్తన (శుద్ధ్ధన్యాసి రాగంలో) రేవతి రాగంలో ‘నానాటి బ్రతుకు’ కీర్తన విని పరవశురాలైన ‘్భరతరత్న’ శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి స్వయంగా వెళ్లి ఆ కీర్తన నేర్చుకుని పాడి రికార్డు చేయటం.. నేదునూరి సంగీతం పట్ల ఆమెకున్న గౌరవానికి తార్కాణం. ఆయనకు ముందూ, తర్వాత కూడా పద కవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలకు ఎందరో విద్వాంసులు బాణీలు చేశారు - చేస్తూనే ఉన్నారు.
కానీ - శాస్ర్తియ సంగీత గౌరవంతో వున్న బాణీలు తక్కువే - వాసి కంటే రాసికే ప్రాధాన్యం ఇవ్వటం వల్లనో, గమకయుక్తంగా, సంప్రదాయ సంగీత ధోరణిలో వుంటే అన్నమాచార్య కీర్తనలు ఎక్కువ మంది వినరు’ అనే ఒక వింత వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
ప్రతి గాయకునికీ పదేసి పాటలిచ్చి, ఏదో విధంగా టి.టి.డి. వారు పాడించి ప్రచారం చేయనారంభించారు. ఈ కీర్తనలు బహుళ ప్రచారమవటం జరిగి, అన్నమయ్య కీర్తనలపై మోజు పెరిగింది.
అంతవరకూ బాగానే ఉంది. కీర్తనలకు విస్తృతమైన ప్రచారమైతే జరుగుతోంది కానీ క్రమంగా శాస్ర్తియ సంగీత ధోరణి కంటే భిన్నంగా అన్నమయ్య కీర్తనలు వినబడుతూ వస్తున్నాయి - రకరకాల బాణీల్లో వినిపిస్తూ వస్తున్నాయి.
అనుస్వరంతో కూడన గమకంతో పాడే సంగీతమూర్తి త్రయం వారి కీర్తనలు ఎన్నిసార్లు విన్నా విసుగు అనిపించదు. అందుకే సమర్థులైన గాయకులు శాస్ర్తియ సంగీతాన్ని ఆశ్రయించి, పేరు తెచ్చుకున్నారు. ఏమీ కష్టపడకుండా తేలిగ్గా పాడాలనే తాపత్రయంతో, శాస్ర్తియ సంగీతాన్ని సరళం చేసి, లలిత శాస్ర్తియ సంగీత రీతిలో కొందరూ, దాన్ని మరింత సరళం చేసి లలిత శాస్ర్తియ బాణీల్లో మరి కొందరూ లలిత సంగీత ధోరణిలో ఇంకొందరూ, ఇవేవీ కాకుండా చివరికి సినిమా ధోరణిలో మరికొందరూ అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి పూనుకోవటంతో క్రమేపీ అన్నమాచార్య కీర్తనల స్వరూప స్వభావాలే మారిపోతూ వస్తున్నాయి - నాదలోలుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, ఏడుకొండల వేంకటేశ్వరుడికి ఎటువంటి సంగీతం వినిపించాలో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి వేరొకరు చెప్పే అగత్యం లేదు - వారికి తెలియదనీ కాదు.
ఆరంభంలో ఒకప్పుడు అన్నమాచార్య కీర్తనలన్నీ చక్కగా సంప్రదాయ సంగీత బాణీలల్లోనే ప్రచారమయ్యాయన్న విషయం వారికి తెలుసు - తెలియదా? డా.శ్రీపాద పినాకపాణి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్య శర్మ, డా.మంగళంపల్లి బాలుమురళీకృష్ణ, పశుపతి, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, శ్రీరంగం గోపాలరత్నం, వోలేటి, నేదునూరి వంటి హేమాహేమీల వల్ల ఈ కీర్తనలకు సంగీత గౌరవం దక్కింది. కొంతకాలం తర్వాత ఎందుకో మరి దశ, దిశ నిర్దేశం చేసేవారు లేక, సంప్రదాయ సంగీత నియమాలన్నీ దూరమవ్వటం ప్రారంభమై, ఎవరికి తోచిన పద్ధతిలో వారు పాడటం ప్రారంభించారు. ఎవరెవరు ఏయే కీర్తనలు స్వరపరుస్తున్నారో తెలియని స్థితి ఏర్పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య సాహిత్యంపై పెట్టిన శ్రద్ధ సంగీతంపై పెట్టలేదు’ అని సంగీతజ్ఞులంతా అనుకునే మాట.
డా.శ్రీపాద పినాకపాణి గారు స్వరపరచిన సుమారు 100కు పైగా అన్నమయ్య కీర్తనలు, దేవస్థానం వారే విడుదల చేసిన ‘సంగీత సౌరభం’లో పొందుపరిచారు.
ఇవే కీర్తనలు వేర్వేరు బాణీలలో వినిపించటం ఆశ్చర్యాన్ని కల్గించే విషయం.
అన్నమయ్య పాట నాలుగు బాణీలలో వుంటే ఏ బాణీని అనుసరించాలి? వీటిని నియంత్రించే వ్యవస్థ దేవస్థానంలో లేకపోవటం దురదృష్టం. దక్షిణాది విద్వాంసులూ, సంగీత రసికులూ సంప్రదాయ సంగీత ధోరణిలో వున్న కీర్తనలకే విలువ ఇస్తారు. తేలికపాటి ట్యూన్లు వారికి నచ్చవు. కచేరీలలో పాడరు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పదిలంగా రాగి రేకుల నుండి వెలికితీసి, అందుబాటులో తెచ్చే విశ్వప్రయత్నం చేసిన తి.తి.దేవస్థానం, కాస్త సంగీతం మీద శ్రద్ధ పెట్టి వుంటే అన్నమాచార్య కీర్తనల పద్ధతి మరోలా ఉండేది.
తిరువాన్కూర్ మహారాజైన స్వాతి తిరునాళ్ అనంత పద్మనాభ స్వామిపై ఎన్నో కృతులు రచించిన వాగ్గేయకారుడు. బహు భాషావేత్త. త్యాగరాజుకు సమకాలికుడు.
ప్రముఖ విద్వాంసులైన సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్, హరికేశనల్లూర్, ముత్తయ్య భాగవతార్‌ల కృషి వల్ల ఆ కీర్తనలు చక్కగా సంప్రదాయ రాగాలలో విద్వాంసులందరూ పాడుకుంటున్నారు. వీటిని ఎవరూ మార్చే ప్రయత్నం చేయరు. స్వర సహితంగా ఉండటమే కారణం-
అన్నమాచార్యులకూ అటువంటి సంగీత గౌరవం వుండవద్దా? ఆలోచించవలసిన విషయం.
ఆకాశవాణికి ఆడిషన్ బోర్డ్ అని ఒకటుంది. స్థానిక రేడియో కేంద్రాల పరిధిలో ప్రతిభగల కళాకారులను ఎంపిక చేసి, తుది నిర్ణయం కోసం, వారి రికార్డింగులను న్యూఢిల్లీ పంపుతారు. విద్వాంసులు విని గ్రేడింగ్ నిర్ణయిస్తారు.
జాతీయ సంగీత కార్యక్రమాల్లోనూ, సంగీత సమ్మేళనం కార్యక్రమాల్లోనూ అత్యుత్తమ శ్రేణి గాయకులకే అవకాశం కలిగిస్తారు. పాటలు కంపోజ్ చేయాలన్నా, ఆడిషన్ అవసరం. ఎవరు పడితే వారు పాటలు కంపోజ్ చేయరు.
చౌకబారు ట్యూన్‌లకూ, సినిమా పాటల వరుసలకూ, అనుకరణలకూ చోటులేదు. అవి నిషిద్ధం. అంతేకాదు. ఆడిషన్‌లో ‘తంబురా’ శృతిలోనే పాడాలి. ప్రక్క వాద్యాలేమీ ఉండవు.
సినీ గాయకుల్ని అనుకరిస్తూ పాడే వీర గాయకులు ఈ తంబురా శృతిలో, శృతిశుద్ధంగా పాడలేక వెనుతిరిగిన వారెందరో.
సంప్రదాయ సంగీత ప్రమాణాలను నిర్దేశించుకున్న ఆకాశవాణికి అప్పుడూ, ఇప్పుడూ ఇదే గౌరవం ఉంది. గుర్తింపు ఉంది. దూరదర్శన్‌లో పాడేవారికి సైతం, ఆకాశవాణిలో గ్రేడింగ్ ఉండి తీరాలి.
ఇదే తరహాలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రసిద్ధమైన సంగీత విద్వాంసులతో కూడిన ఒక సాధికార కమిటీ (ఎక్స్‌పర్ట్ కమిటీ) ఏర్పడి ఉండి ఉంటే అన్నమాచార్య సాహిత్యానికి, సరైన సంగీత గౌరవం లభించి ఉండేదని సంగీతజ్ఞులందరూ అనుకునే మాట.
ప్రాచీన సంప్రదాయంపై శ్రద్ధ లేక, ఎవరికి ఏ పద్ధతి అనుకూలంగా, వేడుకగా, లాభకారిగా తోస్తే ఆ బాణీలో గానం చేస్తున్నారు. ఇటువంటి అసంపూర్ణ బాణీలపై అమర్యాద చూపించనక్కర్లేదు. ఎవరి సామర్థ్యాన్నిబట్టి వారు పాడుకోవచ్చు. కానీ, నిండు సంప్రదాయ సంగీతం క్రమంగా రూపురేఖలు కోల్పోదా?
త్యాగయ్యగారి దివ్య నామ సంకీర్తనలైనా, ఉత్సవ సంప్రదాయ కీర్తనలైనా, రాగ రసంతోనే నిండి ఉంటాయే?!
సాహిత్యానికి తగిన సంగీతమే శాశ్వత కీర్తిని అందిస్తుందనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
ప్రచారమే ముఖ్యమో, పరిణతితో కూడిన సంగీతమే ముఖ్యమో దేవస్థానం వారు తేల్చుకోవాలి.

చిత్రాలు.. డా.పినాకపాణి, నేదునూరి

-మల్లాది సూరిబాబు 9052765490