S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. మీరే డిటెక్టివ్ 12

ఆ ఆదివారం కూడా ఆశే్లష ఉత్సాహంగా రామాలయానికి వెళ్లి హరికథని వినసాగాడు. ఆయన ఇలా కొనసాగించాడు.
‘మనం ఇవాళ నలభై రెండు, నలభై మూడు సర్గలు చెప్పుకుందాం. విశ్వామిత్రుడు రాక్షస సంహారం చేసి, తాటకి మొదలైన వారిని చంపిన రాముడికి ఇలా చెప్తున్నాడు. ‘రామా! భగీరథుడు కాలి బొటన వేలి మీద నిలబడి శివుడి కోసం తపస్సు చేశాడు. వందేళ్ల తర్వాత శివుడు ప్రత్యక్షమై చెప్పాడు.
‘నీ తపస్సుకి సంతోషించాను. భూమి మీదకి జారే గంగని నేను భరిస్తాను’
ఆ తర్వాత గంగ శివుడి నెత్తి మీదకి ఉరుకుతూ తన వేగంతో శివుడ్ని పాతాళంలోకి అణచి, అణచి, తను కూడా అక్కడికి వెళ్లాలని అనుకుంది. అది గ్రహించిన శివుడు ఉగంగ గర్వాన్ని అణచడానికి, తన తల మీదకి ఉరికిన గంగ ఎంత ప్రయత్నించినా తన జటాజూటం లోంచి భూమి మీదకి ఎన్ని ఏళ్లయినా జారనివ్వలేదు. దాంతో మళ్లీ భగీరథుడు శివుడి గురించి గంగని విడువమనే కోరికతో తీవ్ర తపస్సు చేస్తే, శివుడు గంగని వదిలాడు. గంగ అతని తల మీంచి ఆరు పాయలుగా కిందకి ప్రవహించింది. తూర్పు వైపు నించి ప్రవహించే మూడు పాయలకి ‘హ్లాదిని, పావని, నళిని’ అని పేర్లు. పశ్చిమం వైపు ‘సుచక్షువు, సీత, సింధు’ అని పేర్లు. ఏడో ప్రవాహం భగీరథుడి రథాన్ని అనుసరించింది.
అలా ఆకాశం నించి శివుడి నెత్తి మీదకి, అక్కడ నించి భూమి మీదకి గంగ పెద్ద శబ్దంతో ఉరుకుతూంటే చేపలు, తాబేళ్లు, మొసళ్లు కూడా మెరుపుల్లా మెరుస్తూ ఆ నీటితోపాటు కిందకి జారాయి. విమానాలు, గుర్రాలు, ఏనుగుల మీద వచ్చిన దేవతలు, ఇంకా ఋషులు, గంధర్వులు, యక్ష, సిద్ధులు మేఘాలు లేని ఆకాశం లోంచి ఆశ్చర్యంగా ఆ గంగావతరణాన్ని చూస్తూంటే వారి ఒంటి మీది ఆభరణాల మీద సూర్యకాంతి మెరుస్తూ ‘వంద సూర్యులు ఆకాశంలో ఉన్నారా?’ అనిపించింది.
గంగా ప్రవాహం కొన్ని చోట్ల వేగంగా, కొన్ని చోట్ల వంకరగా, కొన్నిచోట్ల సూటిగా, కొన్నిచోట్ల కిందకి, కొన్నిచోట్ల నీటిని నీరు ఢీకొని పైకి చిమ్మి మళ్లీ కిందకి పడసాగింది. శివుడి శరీరం నించి వచ్చిన ఆ జలం పవిత్రమైందిగా భావించి దేవ, ఋషి, గంధర్వులు, భూలోక వాసులు ఆ నీటిని ముట్టుకున్నారు. శాపాలతో స్వర్గలోకం నించి భూలోకానికి వచ్చిన వారు ఆ స్పర్శతో పాపాలని పోగొట్టుకుని ఆకాశంలోకి ఎగిరి పై లోకాలకి వెళ్లారు. చాలామంది ఆ గంగానదిలో స్నానాలు చేశారు.
భగీరథుడి రథం వెంట గంగే కాక ఋషులు, రాక్షసులు, దేవతలు, గంధర్వులు, యక్ష, కినె్నర, మహోరగ, అప్సరసలు కూడా వెళ్లారు. దారిలోని జహ్ను మహర్షి ఆశ్రయాన్ని గంగ ముంచేసింది. గంగ గర్వాన్ని చూసి కోపంతో మండిపడ్డ ఆయన దాన్ని మొత్తం తాగేశాడు. అంతా జహ్ను మహర్షిని పూజించి, గంగని విడవమని ప్రార్థిస్తే, ఆయన దాన్ని నోట్లోంచి ఉమ్మేశాడు. ఆయన శరీరంలోంచి వెలువడ్డ గంగ జహ్ను కూతురు అవడంతో దానికి ‘జాహ్నవి’ అనే పేరు వచ్చింది.
చివరికి తమ తాతల చితాభస్మాలని చేరి, వాటిని చూసి భగీరథుడు కొద్దిసేపు దుఃఖించాడు. భగీరథుడి వెంట వెళ్లిన గంగ సముద్రంలో కలిసి, సగరుడి అరవై వేల మంది మనవల చితాభస్మాలని తడిపి తరింపజేసి పాతాళానికి వెళ్లిపోయింది.
పాపాలు నశించిన ఆ అరవైవేల మందీ స్వర్గలోకానికి వెళ్లారు. తర్వాత బ్రహ్మదేవుడు భగీరథుడి దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు.
‘సగర చక్రవర్తి, అంశుమంతుడు, ఆయన కొడుకు, నీ తండ్రి ఐన దిలీపుడు చేయలేని పనిన నువ్వు చేసావు. భూలోకంలో సాగర జలం ఉన్నంతకాలం సగర కుమారులు స్వర్గంలో ఉంటారు. ఈ గంగ నీకు పెద్దకూతురై భాగీరథి అనే పేరుతో పిలువబడుతుంది. అంతేకాక స్వర్గలోకం, భూలోకం, పాతాళంలోకి ప్రవహించినందుకు గంగ త్రిపథ అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ఈ గంగలో స్నానం చేసి పవిత్రుడివై పుణ్యం సంపాదించు.’
సగర కుమారులు అందరికీ భగీరథుడు శాస్త్ర ప్రకారం జలతర్పణాలని అర్పించాడు. తన కోరిక తీరడంతో విచారం పోయిన ఆయన తిరిగి తన రాజధానికి వెళ్లి ప్రజలని మళ్లీ పాలించసాగాడు. రామా! సంధ్యాకాలం దాటిపోతోంది. సంధ్యావందనం చేయి’
ఈ గంగావతరణం వినడం వల్ల ఐశ్వర్యం, కీర్తి, ఆయుర్దాయం, పుత్ర సంతానం, స్వర్గం లభిస్తాయి. దీన్ని బ్రాహ్మణులకి, క్షత్రియులకి, ఇతరులకి వినిపిస్తే వారి పితృదేవతలు, దేవతలు సంతోషిస్తారు. వారి అన్ని కోరికలు తీరి చెప్పే వాడి పాపం నశిస్తుంది. (బాలకాండ సర్గ 43-44)
ఎప్పటిలా హరికథని చెప్పే కథకుడు ఏడు తప్పులని చేశాడు. దాన్ని శ్రోతలు ఎవరూ గమనించలేదు. మీరు గమనించారా?

మీకో ప్రశ్న
రామాయణంలో గంగానదికి ఎన్ని పేర్లు ఉన్నాయి?

మీకో ప్రశ్నకి జవాబు
పంచాగ్ని తపస్సు అంటే ఏమిటి?
గ్రీష్మ ఋతువులో (వేసవిలో) నాలుగువైపులా అగ్నిని రాజేసి, ఆకాశంలోని మండే సూర్యుడ్ని చూస్తూ చేసే తపస్సు.

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.ముప్పై తొమ్మిదో సర్గ నించి నలభై రెండో సర్గ దాకా కాదు. హరిదాసు 40 నించి 42వ సర్గ దాకా చెప్పాడు.
2.తూర్పు దిక్కున భూమిని మోసే ఏనుగు భద్రం కాదు. విరూపాక్షం.
3.ఉత్తరం వైపు విరూపాక్షం కాదు. భద్రం.
4.కపిలుడు శపించలేదు. హూంకారం చేయగానే సగర కుమారులు బూడిద అయ్యారు.
5.ఆ నాలుగు ఏనుగులని దిగ్గజాలు అంటారు. అది హరిదాసు చెప్పలేదు.
6.సగరుడు మూడు వేల సంవత్సరాలు కాదు. ముప్పై వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు.
7. భగీరథుడుతపస్సు చేసింది ఐదు వేల సంవత్సరాలు కాదు. వాల్మీకి కొన్ని వేల సంవత్సరాలు అని మాత్రమే రాశాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి