S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆ రోజుల్లో దుస్తులు ఇలా..

మనిషికి దుస్తులు ధరించాలన్న స్పృహ కలిగి చాలాకాలమైంది. ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచంలో దుస్తులు, డిజైన్లు, నాణ్యత మనిషి అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ప్రాచీనకాలంలో...అంటే రాజులకాలం, అంతకన్నా ముందు చలి, వేడి, గాలి నుండి రక్షణకోసమే దుస్తులు ధరించేవారు. ఆ తరువాతే అందానికి ప్రాధాన్యం ఇచ్చారు.
కాలానుగుణంగా దుస్తుల తయారీ, వాడకంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ రోజుల్లో దుస్తులు, వాటి తయారీ, వాటిలో రకాలు, పేర్లు ఇప్పుడు వింటే వింతగాను, ఆసక్తిరేపేవిగానూ ఉంటాయి. రక్షణను, హోదాను, ఆరోగ్యాన్ని చాటే దుస్తుల వినియోగం ఇప్పటిమాట కాదు. నిజానికి కొన్ని వందల ఏళ్ల క్రితమే మనిషి ఈ నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నాడు. మనిషికూడా జంతుసమాజానికి చెందినవాడే. కాకపోతే ఆలోచించే శక్తి మనకు ఉంది. ఆ ఒక్క లక్షణం మనల్ని విలక్షణజీవిగా మలిచింది. మనిషి ధరించే దుస్తులను బట్టి అతడి హోదా, ఆర్థికస్థితి, అతడి అంతరంగం కొంతవరకు ప్రస్ఫుటమవుతుంది. ఆధునిక ప్రపంచంలో వస్త్రాలు పెద్దవ్యాపార వస్తువులుగా మారిపోయాయి.
అప్పటిమాట...
సమాజంలో స్థాయి, ఆర్థిక స్థితిగతులు, చేసే పనినిబట్టి దుస్తులు ధరించడం మామూలే. ‘అంతరీయం’, ‘పరిధానం’, ‘అదొన్సుకమ్’ అనేరకం వస్త్రాలు నడుం కింది భాగంలో ధరించేవారు. అలాగే ‘ఉత్తరీయం’, ‘సమ్యయనమ్’, ‘ఉత్తరసంగ’, ‘బృహతిక’ అనే రకం దుస్తులు నడుము పైభాగంలో ధరించేవారు. వీటిలో కొన్ని ఇప్పటివారికీ పరిచయమే. పాదాలను తాగే పొడవైన అంచున్న ‘అపరదిన’ అనే ధోవతిని, తొడ మధ్యభాగంవరకు విస్తరించి ఉండేటటువంటి ‘అర్దౌరక’ అనే లోదుస్తులు (డ్రాయర్)ను అప్పటి ప్రజలు వాడేవారు. ‘కంచుక’ అనే పొడవైన కోటును వేటగాళ్లు, సైనికులు, సేవకులు ధరించేవారు. మోకాళ్లవరకు మాత్రమే వేలాడే ‘వరబాన’ అనే కోటును ప్రత్యేకంగా సైనికులు వాడేవారు. గుండీలు లేనటువంటి ‘చినకోళక’ అనే ఓపెన్‌కోటును ద్వారపాలకులు ధరించేవారు.
గుడ్లగూబ ఈకలతో దుస్తులు..
పురాతనకాలంలో సామాన్య ప్రజలు ధరించే దుస్తులు వేరేగా ఉండేవి. ‘ఉత్తరసంగ’, ‘ఉష్ణీన’ లేదా ‘పగది’, ‘అంతరవానక’ అనే మూడు రకాల దుస్తులు వాడేవారు. మహిళలు వృత్తాలు, అల్లికలతో కూడుకున్న ’చందతక’, ‘అనుచోళిన’, దాని దిగువ, ‘అంతరహ’ అనే దిగువ దుస్తులు ధరించేవారు. చలినుంచి కాపాడుకునేందుకు ఉన్ని, జంతు చర్మాలతో చేసే ‘ప్రవర’ అనే కంబళిని ఉపయోగించేవారు. గుడ్లగూబ ఈకలు, గుర్రంతోకలోని వెంట్రుకలతో తయారు చేసిన ‘బాలకంబళ’, మానవుల వెంట్రుకలతో చేసిన ‘కేశకంబళ’ అనే రగ్గులను నాటి ప్రజలు వాడేవారు. చెట్టుబెరడుతో చేసిన ‘దుకులుని’, ‘తిరితని’, నల్లజింక చర్మంతో తయారు చేసిన ‘అజినిక్కిప్పమ్’, ‘కున’, ‘బల్కల’ వస్త్రాలను బ్రాహ్మణులు, శ్రీమణులు వాడేవారు. జైనసాధువులు ‘కహసుమ’, ‘సంగతి’ అనే దుస్తులు ధరించేవారు.
మహిళల్లో...
శరీరం అంతటినీ కప్పిఉంచేందుకు పొడువైన కొంగున్న చీరలను ధరించేందుకు మహిళలు ఇష్టపడేవారు. ఎదను కప్పుకోవడానికి ‘కచుక’, ‘్భజకుర్పన’,‘కంచ’, ‘కంచుళిక’లను వాడేవారు. కాశ్మీరీ రాణులు ‘చందతక’ అనే పెట్టీకోట్‌లను వాడేవారు. ప్రాచీనకాలంలోని రాజులు ముదురు నీలిరంగు దుస్తులను ఇష్టపడేవారు. వంగ, కళింగ, చైనా, సింహళ దేశాలను ఇవి తెప్పించుకునేవారు. రాణులు మెరుపుగల కాషాయరంగుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. రాజవంశపు పిల్లలకు నీలి, పసుపు, ముదురు రంగుల దుస్తులు వాడేవారు. వౌర్యవంశంలో ఈ రంగులున్న దుస్తులు వాడటం ప్రత్యేకత. కౌటిల్యుని కాలంలో దుప్పట్లు, రగ్గులు, కార్పెట్ల వాడకం మొదలైంది. సిల్కు, మస్లిన్ రకాలకు ప్రాధాన్యం పెరిగింది. బింగిని, అపసర్క అనే దుప్పట్లకు ఎంతో విలువ ఉండేది.
యాగాల వేళ...
రాజసూయయాగం చేసేటపుడు ‘కదలి’ అనే జంతుచర్మంతో చేసిన దుస్తులను కాంభోజరాజ్యంనుంచి తెప్పించుకుని రాజులు వాడేవారు. రాజకుటుంబాలు ధరించే వస్త్రాలకు కెంపులు, రత్నాలు పొదిగేవారు. ముదురు, మెరుపు, అరుదైన రంగులున్న దుస్తులనే వారు వినియోగించేవారు. వస్త్రాల తయారీకి వాడే ముడిసరుకును విధవలు, అంగవికలురు, మహిళలు, భిక్షగాళ్లు, వేశ్యల తల్లులు, వృద్ధమహిళలు సేకరించి తెచ్చేవారు. ఇంటికే పరిమితమైన వనితలు, దూరదేశాలకు వెళ్లిన మగవారి భార్యలు, దారీతీయడం, నూలు వడకటంవంటి పనుల్లో నిమగ్నమయ్యేవారు.
ఇవీ పరికరాలు..
ఆధునికయుగంలో రాట్నంతో నూలువడకటం, మగ్గంతో వస్త్రం తయారీ చాలామందికి తెలుసు. ఇక మిల్లులు వచ్చాక పరిస్థితి మారిపోయింది. వందలఏళ్లక్రితం ఈ పని చేయడానికి ‘సూచీ’ అనే సూదిని, ‘సత్తక’ అనే కత్తెరను, ‘అకతిన’ అనే ఫ్రేమ్‌ను పనిముట్లగా ఉపయోగించేవారు. మంజిష్ట, రోచన, నీలిమందువంటి రంగులను వినియోగించేవారు. రంగులద్దిన వస్త్రాల తయారీ పూర్తయ్యాక వాటిని ‘సజ్జికార’ అనే పొడి కలిపిన నీటిద్రావణంలో ఉడకబెట్టి, ఆ తరువాత వాడకానికి సిద్ధం చేసేవారు. ఇక దుప్పట్లు, సిల్క్, ఉన్ని, లినన్ వస్త్రాల నాణ్యత పెంచడానికి ‘అరిష్టాటక’ అనే సోప్ మెటీరియల్‌ను వాడటం ప్రాచీనకాలంలో విస్తృతంగా వినియోగంలో ఉండేది. ఇప్పుడు మనిషి జీవనశైలి మారిపోయింది. ఆహార్యమూ మారిపోయింది. కానీ ఈనాటి దుస్తులలో రసాయనాల పాత్ర అధికం. ప్రకృతి ప్రసాదించిన వాటితోనే తయారుచేసిన ఆనాటి వస్త్రాలు ఆరోగ్యానికి, రక్షణకు, అందానికి ఉపయోగపడటంతోపాటు మన్నికకూ పేరెన్నికగన్నాయి.

-బడబాగ్ని శంకరరాజు చరిత్ర అధ్యాపకులు (సెల్ నెం: 94405 08511)