S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గెలుపు దైవాధీనం కాదు.. ప్రజాధీనం!

‘నన్ను అన్యాయం చేశావు కదూ? పైన దేవుడున్నాడు.. అన్నీ చూస్తుంటాడు’- స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎవరైనా మోసం చేస్తే వెంటనే బాధిత బాలుడి నుంచి వచ్చే మాట ఇది! అప్పుడు లోకజ్ఞానం లేక, అమాయకంగా బతికే చిన్నతనపు ఊహల్లో చెప్పే మాటలవి. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా దాదాపు ఊహతెలియని పిల్లాడి మాటల మాదిరిగానే కనిపిస్తున్నాయి. ‘దేవుడు కరుణిస్తే వచ్చే ఏడాది మనం అధికారంలోకి వస్తాం. లేకపోతే రెండేళ్లు ఓపికపడతే రాజన్న పాలన వస్తుంద’ని ఆయన తాజాగా సెలవిచ్చారు. జగన్ ఇప్పుడే కాదు. ఇప్పటికి అనేక డజన్లసార్లు ‘పైన దేవుడున్నాడు.. అన్నీ చూస్తున్నాడ’ని అన్నారు. రాజకీయం కూడా ఆట లాంటిదే. అందులో ఆడి గెలవాలే తప్ప రిఫరీలు గెలిపించరు. ఎన్నికలు కూడా అంతే! ఎవరిని గెలిపించాలన్నది ఓటరు దేవుళ్లు నిర్ణయించాలి తప్ప, మనకు కనిపించని దేవుళ్లు కాదు. మరి జగన్ ఎందుకు ఇలాంటి భ్రమల్లో జీవిస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత- తొమ్మిదవ నెల నుంచీ తాను సిఎం కావడం ఖాయమని ఎమ్మెల్యేలతో జగన్ బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. అసలు ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు రావు. పోనీ తెదేపాకు ఎమ్మెల్యేల సంఖ్య ఏమైనా తక్కువ ఉందా? అంటే అదీ లేదు. అధికార పక్షానికి,ప్రతిపక్షానికి సంఖ్యాబలం విషయంలో కొన్ని కిలోమీటర్ల దూరం తేడా ఉంది. చంద్రబాబు నాయకత్వంపై తిరుగుబాటు చేసేంత ‘సీన్’ ఇప్పటి ‘తెలుగు తమ్ముళ్ల’లో ఉందా? అంటే అదీ లేదు. మరి ఏ అంచనా, ఏ ధీమాతో జగన్ తాను త్వరలో సిఎం అవుతానంటున్నారో ఆయనకే తెలియాలి.
తెదేపా గెలిచిన 9 నెలలకు కొందరు జ్యోతిష పండితులు- ‘త్వరలో బాబు ప్రభుత్వం కూలిపోయి, మీరు సిఎం అవుతార’ని జగన్‌కు చెప్పినప్పటి నుంచీ ఆయనలో ఈ ధోరణి బాగా పెరిగింది. చిలుకజోస్యం చెప్పేవాడికి ఆ చిలుకే జీవనాధారం. పంజరంలోని చిలుక చెప్పే జోస్యం నిజం కాదని చూపించుకునే వారికీ తెలుసు. కానీ, అదొక నమ్మకం. ఆ నమ్మకంతోనే బతికేస్తుంటారు. కోయదొరలు కూడా అంతే. వారికేమీ తెలియదని తెలిసినా కొందరు వారు చెప్పే జోస్యం విని, తమ ఊహలకు దానిని జోడించుకుని సొంత ప్రపంచంలో తేలియాడుతుంటారు. ఇంకొంతమంది పనేమీ చేయకుండా ఫలానా ‘రాళ్లు’ పెట్టుకుంటే జాతకం మారిపోతుందనుకుని ఆ భ్రమల్లో బతుకుతుంటారు. ఇప్పుడు జగన్ తీరు కూడా అందుకు విరుద్ధంగా ఏమీ లేదు.
చంద్రబాబు పదేళ్లు విపక్షంలో ఉన్న సమయంలో జగన్ తండ్రి వైఎస్‌ఆర్ తెదేపాను చీల్చేయత్నం చేశారు. చాలామందిని ‘ఆపరేషన్ ఆకర్ష’ పేరుతో ప్రలోభాలు పెట్టారు. అయినా కుంగిపోకుండా బాబు పదేళ్లు పార్టీని కాపాడుకున్నారు. ఆ పదేళ్ల సమయంలో బాబు ఎప్పుడూ బేలతనంగా మాట్లాడలేదు. వైఎస్ కూడా బాబు సర్కారుపై పోరాడి, ప్రాణాలు పణంగా పెట్టి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారే తప్ప, ఏనాడూ ఆత్మవిశ్వాసం విశ్వాసం కోల్పోయి, దేవుడిపై భారం వేసిన దాఖలాలు లేవు. మరి జగన్ ఎందుకిలా తనపై తానే నమ్మకం కో ల్పోయి దేవుడిపై భారం వేస్తున్నారో? ముందుగా తన చుట్టూ ఉన్న వారిలో తనపై విశ్వాసం పెంపొందించుకుని, ఆత్మస్థైరం నింపితే మంచిది. నిజానికి జగన్ మొండిఘటం. అనుకుంటే ఏమైనా చేస్తారు. హాయిగా తండ్రి పేరుతో చేసిన సంపాదన, కీర్తి, అధికారంతో చాలామంది మాదిరిగా జల్సాగా బతకాల్సిన వయసులో.. తెగించి కాంగ్రెస్ అధినాయకత్వంతో తగాదా పెట్టుకుని, ‘ఓదార్పు’తో రాష్టమ్రంతా తిరిగి, జైలుపాలై ఎంతో విలువైన జీవితాన్ని వృథా చేసుకున్న నాయకుడు జగన్ ఒక్కరే కనిపిస్తారు. అలాంటి యువనేత సంయమనంతోపాటు, తన పరణతిని ప్రపంచానికి ప్రదర్శించాలే తప్ప, తనపై నమ్మకం కోల్పోయి ఇలా దేవుడిపై భారం వేసి బేలగా మాట్లాడితే, అంతా ఆయనను చిన్న పిల్లాడి మాదిరిగానే చూస్తారు.
* * *
చిన్నప్పుడు ‘దేవతావస్త్రాల కథ’ చాలామంది చదివే ఉంటారు. అందులో రాజుగారు బట్టల్లేకుండా తిరుగుతున్నా- ఆ విషయం ఆయనకు చెబితే ఎక్కడ శిరచ్ఛేదం చేయిస్తాడన్న భయంతో, అంతా ‘దేవతావస్త్రాలు అద్భుతంగా ఉన్నాయ’ని భజనచేస్తారు. కానీ, లోలోపల నవ్వుకుంటారు. ఆధునిక భారత రాజకీయాల్లోనూ ఇలాంటి భజనపరులు దర్శనమిస్తున్నారు. తమ పాలనపై ప్రజలేమనుకుంటున్నారో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఒకప్పుడు ఏలికలు మారువేషాల్లో దేశాటన చేసేవారు. ఇప్పుడు నియోజకవర్గానికి లక్షన్నర ఖర్చు చేస్తే జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు బోలెడన్ని సర్వే కంపెనీలున్నాయి కాబట్టి, ఏలికలకు ఆ ‘రిస్కు’ తప్పింది. దానికితోడు భట్రాజులు ఎటూ ఉండనే ఉంటారు. పాలకులను హితైషులెవరూ తప్పుమార్గం పట్టించరు. విదురుడు కూడా పాలకుడు ఎలా ఉండాలో చెబుతాడు. విభీషణుడూ అంతే. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలంటారు. అంటే.. పాలకుల నిర్ణయాల్లోని తప్పొప్పులను నిక్కచ్చిగా విశే్లషించడం వల్ల ఏలికలు తమ వైఖరి మార్చుకుంటారు. అలాకాకుండా ప్రభువులను గుడ్డిగా పొగడటం వల్ల- వారిని ప్రమాదంలోకి నెడుతున్నట్లే లెక్క. దీనివల్ల భట్రాజుకు అనేక రూపాల్లో లబ్థి కలుగుతుంది. రాజుకు తాత్కాలికంగా మానసిక ఉపశమనం దక్కుతుంది. పొగడ్తలు ఎప్పుడూ వినసొంపుగానే ఉంటాయి. కానీ- దానివల్ల పాలకులకు నష్టమే తప్ప లాభం ఉండదు. ఎపి రాజకీయాల్లో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది.
రెండున్నరేళ్ల పరిపాలనపై రాజగురువులుం గారు చేయించిన సర్వే చూసి, తెలుగుతమ్ముళ్లు తమకు తామే చక్కలిగింతలు పెట్టుకుంటున్నారు. కాపులు సహా అన్ని వర్గాలూ సైకిల్‌కు ఓటేశాయని, జగన్‌కు-బాబుకు మధ్య చాలా దూరం ఉందని, పవన్ కల్యాణ్‌కు ఇంకా అంత ‘సీన్’ లేదన్న వారి సర్వే ఫలితాలపై, తెలుగుశిబిరం కూడా మురిసిపోయిందట! ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మళ్లీ తెదేపా గద్దెనెక్కుతుందనేది ప్రభువులను మెప్పించేందుకు చేయించిన ఆ సర్వే నివేదిక ప్రధాన సారాంశం. అయితే, దానిని నమ్మవలసిన వాళ్లు నమ్మకపోగా, నమ్మనివారు ఎటూ నమ్మకపోవడం ఇంకో విచిత్రం. ఏనాడూ నియోజవకర్గంలో ఉండకుండా వజ్రాల వ్యాపారం చేసుకునే ఒక ఎమ్మెల్యే- బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్లు ఆ సర్వేలో రావడమే దానికి కారణమట. పోనీ తమ్ముళ్లు సంబరపడుతున్నట్లు తెదేపా-వైకాపాకు ఎంత తేడా అంటే కేవలం తొమ్మిది శాతమే. రెండున్నరేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం మీదైనా వ్యతిరేకత పెరిగేదే కానీ తరిగేది కాదు. ఆ లెక్కన 9 శాతం తేడా తగ్గడానికి ఎంతకాలం పడుతుంది? 2009కు ముందు వైఎస్, 1989లో ఎన్టీఆర్ లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తే ఎన్టీఆర్ ఓడిపోగా, వైఎస్ అత్తెసరు మార్కులతో బయటపడ్డారు. 2004 ఎన్నికల్లో దాదాపు మీడియా అంతా మళ్లీ తెదేపానే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పగా- వచ్చిన ఫలితాలు అందుకు భిన్నం!
నిజానికి రాజధాని కూడా లేకుండా పుట్టిన రాష్ట్రానికి సీఎంగా ఎన్నికైన నాటి నుంచీ బాబు విశ్రమించకుండా, నడుం వాల్చకుండా కష్టపడుతున్నారన్నది ప్రజలు గుర్తించారు. ఇప్పటికీ ఆయన జమానాలోనే రాష్ట్రం రూపుమారుతుందన్న నమ్మిక లేకపోలేదు. అలా అని బాబు పాలనలో లోపాలు లేవనుకుంటే అంతకుమించిన అమాయకత్వం మరొకటుండదు. తెలంగాణతో పోలిస్తే ఎపిలో అవినీతి భయంకరంగా ఉందని తెదేపా నేతలే అంగీకరిస్తుంటారు. తెలంగాణలో అది కొందరు వ్యక్తుల చుట్టూ కేంద్రీకృతం కాగా, ఏపిలో మాత్రం సర్వాంతర్యామి. నేతల కుటుంబ సభ్యులు పైనుంచి కిందవరకూ ‘కౌంటర్లు’ తెరిచారు. మళ్లీ అధికారం రాదన్నట్లు వారు దోచుకుంటున్న వైనం ప్రజలకే కాదు, సొంత పార్టీ శ్రేణులకూ మింగుడుపడటం లేదు. ‘పాము తన పిల్లలను తానే తిన్న’ట్లు పదవుల్లో ఉన్న తమ్ముళ్లు, సొంత పార్టీ శ్రేణులనూ విడిచిపెట్టడం లేదు. నిజంగా తెదేపా పాలన పట్ల అన్ని వర్గాలూ ఆ స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తే రావలసిన మార్కులు అవి కాదు కదా? బాబు ఈ రెండున్నరేళ్లలో వివిధ కులాలు, మతాలు, వర్గాలకు అనేక పథకాలు అమలుచేశారు. చివరకు ‘సిఎం రిలీఫ్ ఫండ్’ నుంచి కూడా నిధులను చేతికి ఎముక లేకుండా ఇస్తున్నారు. పించన్లకయితే కొదవ లేదు. హెల్త్‌స్కీములతో వేలమంది లబ్థిపొందుతున్నారు. రాత్రి 11 గంటల వరకూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా వచ్చింది ‘46 శాతం’ సంతృప్తికర స్థానమంటే అది విజయమా? విఫలమా? నిజంగా ఆ పథకాలన్నీ జనంలోకి వెళితే 70 శాతం కదా రావలసింది? జగన్‌తో పోలిస్తే బాబును సిఎంగా కోరుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కారణం అనుభవం. మరి అంత అనుభవం ఉన్న నేత సరైన దారిలో వెళుతున్నారా? తన పార్టీని సరైన దిశగా తీసుకువెళుతున్నారా? లేదా? అన్నది విశే్లషించకుండా అన్నీ బ్రహ్మాండమని చెప్పడం భట్రాజులనూ ఈర్ష్యపరచడమే కదా? నిజంగా అన్ని వర్గాలూ బాగున్నాయని చెప్పినప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిపించాలన్న విపక్షాల డిమాండుపై వౌనమెందుకు? ఇన్ని ‘కఠోర నిజాలు’ వెల్లడించిన మరుసటి రోజునుంచే, ఎప్పుడూ లేనిది సదరు మీడియాలో జగన్ వార్తలు వరసగా మొదటిపేజీలో రావడం వెనుక ఉన్న మర్మమేమిటి చెప్మా?! *

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144