S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇదే చివరి క్యూ

మొరాదాబాద్, డిసెంబర్ 3: దేశంలో నల్లకుబేరులకు ఎక్కడికక్కడ ముకుతాడు వేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తాజాగా మరో షాక్ ఇచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తమ దగ్గర ఉన్న నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు తెలివిగా జన్‌ధన్ ఖాతాలలో పెద్ద ఎత్తున జమ చేసుకున్న వారికి తల బొప్పికట్టించే నిర్ణయాన్ని మోదీ శనివారం ప్రకటించారు. జన్‌ధన్ ఖాతాలలో అక్రమంగా, చట్టవ్యతిరేకంగా నగదు డిపాజిట్ చేసిన వారందరినీ జైలుకు పంపడం ఖాయమని ప్రకటించారు. అక్రమంగా జమ అయిన నగదు మొత్తాన్ని పేదలకు అందజేస్తామని మోదీ విస్పష్టంగా తేల్చిచెప్పారు. ఇందుకు ఏ రకమైన కార్యాచరణ అమలు చేయాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో బిజెపి నిర్వహించిన పరివర్తన్ యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘‘దేశంలో ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం అంతా తొందర్లోనే మాయమవుతుంది. జన్‌ధన్ ఖాతాదారులందరికీ చెప్తున్నా. మీ ఖాతాల్లో ఇతరులు జమ చేసిన సొమ్మును వెనక్కి ఇవ్వవద్దు. అలా చేస్తే మీకు నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా. అక్రమంగా మీ ఖాతాల్లో డబ్బులు వేసిన వాళ్లను జైలుకు పంపిస్తా. జన్‌ధన్ ఖాతాల్లోని నగదునంతా పేదల ఇళ్లకు చేరేట్లు చేస్తా’’ అని మోదీ పిలుపునిచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక ప్రచారం ద్వారా మోదీ జన్‌ధన్ ఖాతాలను ప్రారంభింపజేసిన సంగతి తెలిసిందే. దేశంలో అవినీతి సంపన్నులు ఎవరికీ ఎలాంటి మేలు చేయటం లేదని.. ఇన్నాళ్లుగా దేశాన్ని దోచుకుంటున్నారని మోదీ విమర్శించారు. ‘‘పొడవాటి క్యూలలో ఓపిగ్గా నిలుచుంటున్న ప్రజలకు నేను నమస్కరిస్తున్నా. ఈ క్యూలను విమర్శిస్తున్న రాజకీయనాయకులను నేనడుగుతున్నా. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ గోధుమల కోసం, కిరోసిన్ కోసం ప్రజలు క్యూలు కడుతూనే ఉన్నారు. ఇదిగో ఇప్పుడు నిలుచున్నది చివరి క్యూ అవుతుంది. నిజాయితీపరులు మాత్రమే బ్యాంకుల ముందు క్యూలో నిలుచుంటున్నారు. అవినీతి సొమ్ము, నల్లడబ్బు ఉన్న వాళ్లు పేదల గుమ్మాల ముందు క్యూ కడుతున్నారు.’’ అని వ్యాఖ్యానించారు. అవినీతిపై పోరాడటం తాను చేస్తున్న నేరమా? దేశ అభివృద్ధికి 70 ఏళ్ల పాటు ప్రధాన అడ్డంకిగా మారిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించటం తప్పా? అని మోదీ ప్రశ్నించారు. తనకు ఎవరూ హైకమాండ్ లేరని, ప్రజలే తన నేతలని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ లోపలా, బయటా ఆందోళనలు చేస్తున్న విపక్షాలపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. అవినీతిపై తన పోరాటాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఆపేది లేదని, ఈ క్రమంలో ఏ చిన్న నేరం పొరపాటున చేసినా, ఒక ఫకీరులా జోలె పట్టుకుని వెళ్లిపోతానని మోదీ వ్యాఖ్యానించారు.
‘ప్రస్తుతం మనం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండవచ్చు. కానీ పరిస్థితులు తొందరగానే మెరుగుపడతాయి. మీరు డబ్బులు విత్‌డ్రా చేసుకోవటానికి క్యూలో నిలబడటం కష్టమే కానీ, అవినీతి నిర్మూలనకు ఈ ఇబ్బందులు తప్పవు’ అని మోదీ అన్నారు.
‘దేశంలో దాదాపు 40 కోట్ల స్మార్ట్ ఫోన్‌లు వినియోగంలో ఉన్నాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అన్ని చోట్లా ఆందుబాటులో ఉన్నాయి. ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే 40 కోట్ల మంది ప్రజలు బ్యాంకుల గడప తొక్కకుండానే నగదు లావాదేవీలు చేసుకోవచ్చు’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వ నిర్ణయంతో చాలామంది ముఖాల్లో వెలుగు మాయమైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఒకప్పుడు మనీ మనీ అన్నవాళ్లు ఇప్పుడు మోదీ మోదీ అంటున్నారన్నారు. తన నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యం పేదరికం నిర్మూలనే అని ఆయన అన్నారు.