S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు

హైదరాబాద్, డిసెంబర్ 9: హెరిటెజ్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో వందల ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక భవనాలు నేటికీ ఎంతో ధృడంగా ఉన్నా, నగరంలో నిర్మాణంలో ఉన్న భవనాలు వరుసగా కూలటం, పొట్ట్టతిప్పల కోసం కూలీ పనికి వచ్చిన అమాయకులు బలికావటం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా బిల్డర్లు, కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి కారణంగా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం, అలాగే అక్రమంగా నిర్మిస్తున్న భవనాలకు సంబంధించి ఫిర్యాదులొస్తే అడ్డదారిలో లక్షలాది రూపాయలు వచ్చినట్టేనని మురిసిపోయే అధికారుల అవినీతే సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసేందుకు కారణమా? ఇలాంటి తతంగాలకు చరమగీతం పాడేదెపుడు, అమాయకులైన కూలీల ప్రా ణాలకు రక్షణ కలిగేదెపుడు అన్నది నానక్‌రాం గూడ భ వనం కూలిన ఘటన నేపథ్యంలో నగరంలో జరుగుతున్న చర్చ. తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించి కూడా పాలకులు తీసుకున్న చర్యల్లో వివక్ష స్పష్టంగా కన్పిస్తోంది. నిర్మాణ రంగంపై అవగాహన లేని ఇంటి యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటుండగా, అడ్డదారిలో అందినంత దండుకుని, ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టిన అధికారులపై చర్యలను మాత్రం సస్పెన్షన్‌కే పరిమితం చేశారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినపుడు మృతుల ప్రాణాలకు నష్టపరిహారంతో వెలకట్టడటం, ఘటన ఎలా జరిగిందో తేలుస్తామంటూ ఓ కమిటీని నియమించి, అంతటితో ఆగకుండా బాధ్యులెంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ ఓ ఘాటు డైలాగ్ కొట్టడం మన పాలకులకు మామూలైపోయింది. కళ్ల ముందు అక్రమంగా, నాసిరకం సామాగ్రితో బహుళ అంతస్తు భవనాలు నిర్మిస్తున్నా, జిహెచ్‌ఎంసి అధికారులు కనీసం ప్రశ్నించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. గత జూలై మాసంలో ఇదే తరహాలో జూబ్లీహిల్స్ ఫిల్మ్‌క్లబ్‌లో కొత్తగా నిర్మిస్తున్న పోర్టికో కూడా కుప్పకూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో కూడా స్థానిక ఏసిపిపై సస్పెన్షన్ వేటు, మృతుల ప్రాణాలకు పరిహారం ప్రకటించి పాలకులు చేతులు దులుపుకున్నారే తప్పా, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా పటిష్టమైన, పకడ్బందీ చర్యలు చేపట్టలేకపోయారు. అదే చేసి ఉంటే నేడు నానక్‌రాం గూడలో ఏడు అంతస్తుల మరో భవనం కూలేది కాదని, కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసేవి కావన్న వాదనలున్నాయి.
ఒక్కో దుర్ఘటనకు ఒక్కో సాకు
కొద్ది నెలల క్రితం పాతబస్తీలోని హుస్సేమీ ఆలంలో ఓ ట్రస్టుకు చెందిన భవనానికి అక్రమంగా నిర్మిస్తున్న అదనపు అంతస్తులు కూలి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి తమదేమీ తప్పులేదంటూ జిహెచ్‌ఎంసి అధికారులు వివరణ ఇచ్చారు. ట్రస్టు నిర్వాహకులు కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని నిర్మించుకున్నారని జిహెచ్‌ఎంసి చేతులెత్తేసింది. ఆ తర్వాత కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఆర్చీ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అయితే ఇక్కడి కాలనీలో ఇప్పటికే వందల సంఖ్యలో ఫ్లాట్లతో నిర్మించిన బహుళ అంతస్తు భవనాలకు కూడా మున్ముందు ముప్పు పొంచి ఉందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి. అంతకు ముందు కూడా సికిందరాబాద్ సిటీలైట్ హోటల్ భవనం ఉన్న ఫలంగా కుప్పకూలి పధ్నాలుగు మంది దుర్మరణం పాలైనా, అపుడు కూడా పాలకులు, అధికారులు ఇలాంటి ప్రగల్బాలు పలికి కాలం గడిపారే తప్ప, చారిత్రక భవనాల పరిరక్షణ, శిథిలావస్థకు చేరిన పాతకాలం భవనాలు, అలాగే నిర్మాణ దశలోనే భవనాలు కూలటాన్ని నిర్మూలించటంలో జిహెచ్‌ఎంసి అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు.

జనా‘గ్రహం’

టోలీచౌకీ బ్యాంకు ముందు ఖాతాదారుల ఆందోళన
రాస్తారోకోతో మూడు గంటలు స్తంభించిన ట్రాఫిక్
నేటి నుంచి బ్యాంకులకు మూడు రోజులు సెలవు
మరింత పెరగనున్న కరెన్సీ కష్టాలు
బ్యాంకులు..ఏటిఎంల వద్ద కిక్కిరిసిన జనం

హైదరాబాద్, డిసెంబర్ 9: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దుతో నెలరోజుల పాటు నగదు కోసం అష్టకష్టాలు పడ్డ నగరవాసుల్లో శుక్రవారం ఒక్కసారిగా ఓపిక నశించింది. ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాలు ఖాతాల్లో జమ అయినా, అవసరాలకు తగిన విధంగా డ్రా చేసుకోలేని దుస్థితి నెలకొంది. ప్రతి నెల మొదటి వారంలో నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు, ఇంటి అద్దెలు, స్కూల్, కాలేజీల ఫీజులు వంటివి చెల్లించాల్సి ఉండటంతో జీతం మొత్తం డ్రా చేసుకునేందుకు బ్యాంకు వెళ్లే ఖాతాదారులకు బ్యాంకులు రూ. 4 వేలకు మించి, మరికొన్ని బ్యాంకులు రూ. 10 వేల వరకు మాత్రమే నగదు ఇస్తున్నాయి. అది కొంత మందికి మాత్రమే పరిమితమవుతోంది. పగలంతా ఉద్యోగాలు చేసుకోవటం, రాత్రంతా ఏటిఎంల వద్ద క్యూ కట్టడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుఝమునే బ్యాంకుల ముందు బారులు తీరినా, నగదు అందుతుందో లేదోనన్న ఆందోళన ఖాతాదారులను ఇబ్బందుల పాల్చేస్తుంది. ఇక శనివారం రెండో శనివారం, ఆ మరుసటి రోజు ఆదివారం, సోమవారం మిలాద్ ఉన్ నబీ కావటంతో సోమవారం వరకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావటంతో శుక్రవారం బ్యాంకులు, ఏటిఎంల ముందు జనం కిక్కిరిసిపోయారు. ఇందులో భాగంగా టోలీచౌకీలోని టోలీచౌకీ ఎస్‌బిఐ ముందు నగదు కోసం ఖాతాదారులు పడిగాపులు కాశారు. కొద్దిగంటలు గడిచిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో బ్యాంకు అధికారులు నగదు లేదని సమాధానం చెప్పటంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపివేశారు. బ్యాంకు ముందు గంటల తరబడి నిలబెట్టుకున్న తర్వాత నగదు ఎలా ఇవ్వరో చూస్తామంటూ కొందరు ఖాతాదారులు బ్యాంకు సిబ్బందితో వాదనకు దిగారు. సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఖాతాదారులు ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేయటంతో దాదాపు అయిదారు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీలకు పనిజెప్పాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, మరికొన్ని ఏటిఎం వద్ధ రాత్రి వరకు చలిని లెక్కచేయకుండా ఖాతాదారులు డబ్బు కోసం క్యూ కట్టడం కన్పించింది.