S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జగన్ మహాధర్నా సక్సెస్

ఒంగోలు,డిసెంబర్ 9:జిల్లాకేంద్రమైన ఒంగోలులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా సూపర్ సక్సెస్ అయింది. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చినందుకు నిరసనగా మహాధర్నా జరిగింది. ఈ ధర్నాకు వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. వ్యాప్తంగా మహాధర్నాలు జరుగుతుండగా ఒంగోలులో జరిగిన ధర్నాకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. జగన్ హాజరుకానున్న నేపధ్యంలో జిల్లాలోని 12నియోజకవర్గాల నుండి వైకాపాముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఉదయం పదిగంటలనుండే కలెక్టరేట్ ప్రాంగణానికి వారు చేరుకోవటం జరిగింది. కాగా జగన్‌కు మంగమ్మ కాలేజి వద్ద పార్టీముఖ్యనాయకులు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడనుండి సభాప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత జోష్ చేసింది. ఈ మహాధర్నాను విజయవంతం చేయటంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి ప్రధానభూమిక పోషించారు. రెండురోజుల నుండి బాలినేని ఒంగోలులోనే తిష్టవేసి జగన్ మహాధర్నాను విజయవంతం చేసేందుకు తీవ్రంగా కృషిచేశారు. కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం వైకాపా శ్రేణులతో నిండిపోవటంతో పార్టీశ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. జగన్‌ను చూసేందుకు అన్నివర్గాలవారు పోటీపడ్టారు. జగన్ తొలుత మాట్లాడే సమయంలో ఒంగోల్ అని సంభోధించటంతో సభాప్రాంగణం మొత్తం జై జగన్ అంటూ నినాదాల హోరెత్తించారు. ప్రధానంగా ఆయన ప్రసంగం మొత్తం ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌మెంటు, గృహనిర్మాణ పథకంతో పాటు పలు సంక్షేమ పథకాలపైనే సాగింది. ఒక పక్క తనతండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే మరో పక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైఫల్యాలను వివరిస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుతెన్నులను ఆయన ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించి అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలుసభల్లో 108వాహనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చేవారు. ఈ సందర్భంగా ఆయన కుయ్, కుయ్, కుయ్ అంటూ 108వాహనాలను పరుగులు పెడుతున్నాయని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వివరించేవారు అదే పందాను జగన్ కూడా వివరిస్తున్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారని, కాని తీరా అధికారంలోకి వచ్చిన తరువాత జాబ్‌లు పోయాయని అనటంతో ఒక్కసారిగా సభలో కార్యకర్తలు కేకలు వేస్తూ సంఘీభావం తెలిపారు. మొత్తంమీద జగన్ మహాధర్నా సూపర్‌సక్సెస్ కావటంతో పార్టీ కేడర్ ఊపిరిపీల్చుకుంది. కాగా మహాధర్నా మొత్తం పోలీసు కెమెరా డ్రోన్ల నిఘాలో సాగింది. మహాధర్నా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం భారీగా పోలీసులను మోహరించింది. ఈ మహాధర్నాలో ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లాపరిశీలకులు డిసి గోవిందరెడ్డి, సంతనూతలపాడు,మార్కాపురం శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్, జంకె వెంకటరెడ్డి, మాజీశాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి, బూచేపల్లి శివప్రసాదురెడ్డి, పిడతల సాయికల్పనారెడ్డి, గిద్దలూరు, కనిగిరి, చీరాల, పర్చూరు, కందుకూరు, కొండెపి నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఐవి రెడ్డి, బుర్రా మధుసూదన్‌యాదవ్, యడం బాలాజి, గొట్టిపాటి భరత్, తూమాటి మాధవరావు, వరికూటి అశోక్‌బాబు, వైసిపి జిల్లానాయకులు బత్తుల బ్రహ్మానందారెడ్డి, కెవి రమణారెడ్డి, వైవి వెంకటేశ్వరరావు, వేమూరి సూర్యనారాయణ, బూచేపల్లి వెంకాయమ్మ, కుప్పంప్రసాదు తదితరులు పాల్గొన్నారు. జగన్ మహాధర్నా విజయవంతం కావటంతో వైకాపా తమ్ముళ్లల్లో నూతన జోష్‌వచ్చినట్లైంది.
పాత నోట్లను మార్చుకునేందుకే
జిల్లాలకు జగన్!
ఎన్‌టిఆర్ వైద్యసేవ కింద ఇప్పటివరకు రూ.1860 కోట్లు ఖర్చు
హైదరాబాదు నుండి సినీహీరోలా వచ్చిన బాలినేనికి అభివృద్ధి కనిపిస్తుందా?
ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్
ఒంగోలు అర్బన్,డిసెంబర్ 9: పాతనోట్లను మార్చుకునేందుకే వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలకు తిరిగి పార్టీనేతలకు పాతనగదును ఇస్తున్నారని జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు,ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఆరోపించారు. శుక్రవారం రాత్రి స్థానిక జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షకోట్ల రూపాయలను సంపాదించిన జగన్ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయటం అర్ధరహితమన్నారు. 15నెలలపాటు జైలులో చిప్పకూడు తిన్న వ్యక్తి కూడా ముఖ్యమంత్రిని విమర్శించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు తీర్పు చెప్పినా, శాసనసభ్యులు పార్టీమారుతున్న జగన్‌లో ఎలాంటి మార్పురాలేదన్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేయటం తప్ప మరో సమస్య తెలియదన్నారు. రాష్టవ్రిభజన అనంతరం బస్సులో నుండి పరిపాలన సాగించిన ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. జగన్ ఒక సైకోలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రతిపక్షనేత ఆంధ్రప్రదేశ్‌కు ఉండటం దౌర్భాగ్యమన్నారు. ఎన్‌టిఆర్ వైద్యసేవకింద 2014-17వరకు 13జిల్లాలో ఇప్పటివరకు 1860కోట్లరూపాయలను ఖర్చుపెట్టినట్లు చెప్పారు. వైఎస్ హయాంలో మిగులుబడ్జెట్ ఉన్నప్పటికీ కేవలం23జిల్లాల్లో 11వందల కోట్లరూపాయలు మాత్రమే ఖర్చుచేశారన్నారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్‌టిఆర్ వైద్యసేవగా ఆరోగ్యశ్రీగా పేరుమార్చారని, గతంలో ఆరోగ్యశ్రీ కింద 938వ్యాధులు ఉండగా అదనంగా 106వ్యాధులను కలిపి 1044 వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు. వైద్యపరీక్షల కింద 63రకాల పరీక్షలను ఉచితంగా అందిస్తూ నాలుగుకోట్లమంది ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. రిమ్స్‌వైద్యశాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని, గతంలో 250 ఓపిలు వచ్చేవని, ప్రస్తుతం 2500 ఒపిలు వస్తున్నాయన్నారు. వీటన్నింటిని పూర్తిగా మర్చిపోయి ఆరోగ్యశ్రీలో ఏదో అన్యాయం జరిగిపోయిందంటూ జగన్ ముఖ్యమంత్రిపై నోరుపారేసుకోవటం మంచిదికాదన్నారు. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షపార్టీనేత ధర్నాలను కూడా అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు.
బాలినేనిపై తీవ్రస్థాయిలో ధ్వజం
ఒంగోలు అభివృద్ధిపై ఏ డివిజన్‌కైనా రావాలని దామచర్ల జనార్దన్ బాలినేనికి సవాల్ విసిరారు. రోడ్లుపై రోడ్లువేస్తూ,కాల్వలపై కాల్వలు వేస్తున్నారని బాలినేని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏ డివిజన్‌లోకి వెళ్లినా ఉద్యోగుల దగ్గర నుండి సామాన్యప్రజల వరకు అభివృద్ధి గురించి మాట్లాడతానని తెలిపారు. ఒంగోలులో ఏ కాల్వ, ఏ రోడ్డు ఎక్కడ వేయాలో కూడా తెలియని బాలినేని తన గురించి మాట్లాడటం మంచిదికాదన్నారు. మూడసార్లు పొరపాటున గెలిచారే తప్ప ఇక నుండి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బాలినేనికి ఓటమితప్పదన్నారు. ఆరునెలలకొకసారి హైదరాబాదు నుండి సినిమా హీరోలాగా వచ్చిన బాలినేనికి అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుందని ప్రశ్నించారు. ఒంగోలు నగరంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలని, ఒక్కరూపాయి అవినీతి జరిగినా తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్‌విసిరారు. 30వేలమంది జనాభా ఉన్నప్పుడు వేసిన కాల్వలు, రోడ్లుతప్ప మూడులక్షలు దాటినా ఒంగోలులో ప్రస్తుతం చిన్నపాటి వర్షంపడినా చుక్కనీరు పడినా నిల్వఉండదన్నారు. ఏదోఒక డివిజన్‌లో అభివృద్ధిపై చర్చకు సిద్ధంకావాలని దామచర్ల పిలుపునిచ్చారు. ఈవిలేఖర్ల సమావేశంలో కందుకూరు,మార్కాపురం మాజీ శాసనసభ్యులు దివి శివరాం, కందుల నారాయణరెడ్డి, నాయకులు శింగరాజు రాంబాబు, కొమ్ము రవిచంద్రతదితరులు పాల్గొన్నారు.

నల్లకుబేరుల కబంధ హస్తాల్లో
కొత్త కరెన్సీ!
* బ్యాంకుల్లో డబ్బులు అందక పేదల కష్టాలు
* అక్రమ మార్గంలో తరలింపునకు సూత్రధారులెవరు..?
మార్కాపురం, డిసెంబర్ 9: కేంద్రప్రభుత్వం నల్లధనాన్ని వెలికితీయాలనే ధ్యేయంతో పెద్దనోట్లు రద్దుచేసి 2వేల రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురాగా అప్పుడే నల్లకుభేరుల కబంధ హస్తాల్లో నూతన కరెన్సీ చేరడం ఆశ్చర్యంగా మారింది. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడితే 2వేల రూపాయలు సంపాదించడం కష్టంగా మారిన ఈ తరుణంలో కోట్లాది రూపాయల కొత్త కరెన్సీని నల్లకుభేరులు ఎలా సాధిస్తున్నారో అర్థం కావడం లేదు. ఎక్కడ చూసినా 2వేల రూపాయల నోట్లు లక్షల్లో పట్టుబడటం ప్రభుత్వ పెద్దలకు కూడా అర్థం కావడం లేదు. బ్యాంకు అధికారులే నల్లకుభేరులకు సహకరిస్తున్నారన్న అనుమానం కూడా పేదల్లో వ్యక్తం అవుతోంది. ఏ బ్యాంక్‌కు ఎంత కొత్త కరెన్సీ వచ్చింది, అది ఎంతమంది ఖాతాదారులకు ఎన్ని 2వేల రూపాయల నోట్లు ఇచ్చారన్న దానిపై పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. మరికొందరైతే సమాచార హక్కు చట్టం ద్వారా బ్యాంకు అధికారులను వివరాలు అడిగేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. మార్కాపురం ప్రాంతంలో పలు ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకులు, మరికొన్ని ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకులు ఉన్నప్పటికీ ఇవన్నీ ఆర్‌బిఐ పరిధిలోకి చేరినప్పటికీ కొన్ని బ్యాంకుల అధికారులు తమ పెద్ద ఖాతాదారులను మెప్పించేందుకు అత్యంత రహస్యంగా కొత్త కరెన్సీని కట్టబెట్టి చేతులు దులుపుకుంటున్నట్లు సమాచారం. పేదవారికి 2వేల రూపాయలు ఇచ్చేందుకు అనేక నిబంధనలు పెడుతున్న బ్యాంకుల సిబ్బంది నల్లకుభేరులకు ఏ నిబంధనలకు అనుగుణంగా లక్షల రూపాయల కొత్త కరెన్సీని కట్టపెడుతున్నారో అర్థం కావడం లేదు. ఇందుకు ఉదాహరణ గురువారం రాత్రి తమిళనాడులోని ఓ కాంట్రాక్టర్ వద్ద 10కోట్ల రూపాయల మేర 2వేల రూపాయల కొత్త కరెన్సీ దొరకడం విశేషం. నెలరోజుల వ్యవధిలో కుటుంబం అంతా బ్యాంకుల వద్ద పడిగాపులు కాసిన లక్షా 50వేల రూపాయలకు మించి వచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఆ కాంట్రాక్టర్ వద్ద 10కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నల్లకుభేరులకు సహకరిస్తున్న బ్యాంకు ఉద్యోగులపై నిఘా పెంచి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రాష్ట్రంలో అరాచకపాలన
- మాజీ మంత్రి బాలినేని ధ్వజం
ఒంగోలు అర్బన్,డిసెంబర్ 9:రాష్ట్రంలో అరాచకపాలన సాగుతుందని మాజీమంత్రి, వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద బాలినేని అధ్యక్షతన ఆరోగ్యశ్రీ పథకం అమలుపై మహాధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి, ఫీజురీయింబర్స్‌మెంటు పథకానికి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. వైఎస్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పేదప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం వరంగా మారితే ఆ పథకాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 1999లో తాను శాసనసభ్యునిగా ఎన్నికైన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉందన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రిలీఫ్‌పండ్‌కోసం చంద్రబాబు వద్దకు వెళ్తే సంతకాలు చేసినా కూడా ముఖ్యమంత్రి రిలీఫ్‌ఫండ్ రాలేదన్నారు.ముఖ్యమంత్రి చేస్తున్న సంతకాల్లో కూడా తేడాలున్నాయని, ఆరోజే గమనించినట్లు చెప్పారు. మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్‌ను ముఖ్యమంత్రి చేస్తేనే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో పాలన కుంటుపడిందన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను తొలగిస్తూ చంద్రన్న పేరుతో పథకాలను ప్రవేశపెట్టిన ఆ పథకాలు ప్రజలకు చేరటం లేదన్నారు. నియోజకవర్గాలకు నిధులు కావాలని ఇటీవల ముఖ్యమంత్రిని తమపార్టీ శాసనసభ్యులు కలిసినట్లు చెప్పారు. కనీసం ముఖ్యమంత్రి స్పందించిన పాపాన కూడా పోలేదన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి వెయ్యికోట్లరూపాయలను కేటాయించాల్సి ఉండగా కేవలం ఐదువందల కోట్లరూపాయలను మాత్రమే కేటాయించి ఐదుకోట్లమంది ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేశారన్నారు. మామకు వెన్నుపోటు పొడిచిన విధంగానే ముఖ్యమంత్రి ప్రజలను కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. పేదప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకంపై రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్ కూడా అవగాహన లేకపోవటం బాధాకరమన్నారు. ఈ ధర్నాలో వైకాపా నాయకులు పాల్గొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి
అవినీతి నిర్మూలనకు చర్యలు
- ఎస్‌పి త్రివిక్రమవర్మ
ఒంగోలు,డిసెంబర్ 9: సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అవినీతిని పారద్రోలేందుకు చర్యలు తీసుకున్నామని ఎస్‌పి త్రివిక్రమవర్మ తెలిపారు. శుక్రవారం స్థానిక సిపివో సమావేశ మందిరంలో అంతర్జాతీయ అవినీతి నిరోధక వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్‌పి మాట్లాడుతూ భారతదేశంలో అవినీతిని నిరోధించేందుకు ప్రభుత్వం డిసెంబర్ 9వతేదీ 2003సంవత్సరంలో చట్టం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారులు చట్టాల్లో ఉన్న లొసుగులను వినియోగించుకుని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. జిల్లాలో అవినీతిని తగ్గించేందుకు వాట్స్ అప్ నెంబర్‌ను వినియోగంలోకి తెచ్చామన్నారు. జిల్లాలో అవినీతిని, సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. ఐ క్లిక్ ద్వారా ప్రజలు ఎక్కడ నుండి అయితే పేపరు స్కాన్ చేసినట్లు సమస్యలు పంపినట్లయితే తమ కార్యాలయానికి అందుతుందన్నారు. అవినీతిని నివారించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సంయుక్తకలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ భారతదేశంలో అవినీతిని తగ్గించేందుకు భారతప్రధానమంత్రి అనేక ఆర్ధిక సంస్కరణలు చేపట్టారన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈపోస్ విధానాన్ని అమలుచేసి ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఎసిబి డిఎస్‌పి మూర్తి, డిఆర్‌ఒ భక్తవత్సలంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిపిఎస్ రద్దుకు కృషి
* ఎమ్మెల్సీ విఠపు స్పష్టం
కందుకూరు, డిసెంబర్ 9: ఉద్యోగ, ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన సిపిఎస్ రద్దు కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లాపరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు అతీతం అని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఉపాధ్యాయుడుగా పోటీచేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపారులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావన్నారు. ఉపాధ్యాయులు ఆలోచించి సరైన నాయకునికే మద్దతుగా నిలవాలన్నారు. కార్పొరేట్ శక్తులకు ఆసరాగా నిలిచిన రాజకీయ పార్టీల నాయకులకు అడ్డుకట్ట వేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా నాయకులు సిహెచ్ ఉమామహేశ్వరరావు, మండల అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వర్లు, నాయకులు పి వెంకటేశ్వర్లు, కె వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు కుమార్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయ, ఉపాధ్యాయినులు తదితరులు పాల్గొన్నారు.