S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనవసర రాద్ధాంతం

భాన్సువాడ, డిసెంబర్ 9: అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహరహం శ్రమిస్తున్న తెరాస ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు చేస్తూ అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్ర చేపట్టి సిపిఎం నాయకులు చేస్తున్న విమర్శల్లోనూ ఎలాంటి వాస్తవం లేదని, విమర్శలు చేసే ముందు సదరు పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు శుక్రవారం వర్ని మండల కేంద్రంలో మంత్రి పోచారం 51వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ ఒక్క సెగ్మెంట్ పరిధిలోనే మొత్తం 355మంది లబ్ధిదారులకు కోటీ 81లక్షల రూపాయల పైచిలుకు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు బిసిలు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు చెందిన వారిని కూడా పై పథకాల కింద లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఆర్థిక సహాయం మంజూరు చేయించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో ఎస్సీ లబ్ధిదారులు 31మంది, ఎస్టీలు 26, బిసి/ఓబిసి వర్గానికి చెందిన 171మంది, మైనార్టీలు 127మందికి షాదీముబారక్, కల్యాణలక్ష్మి ద్వారా లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ, పేదల అభ్యున్నతే పరమావధిగా భావిస్తూ సిఎం కెసిఆర్ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని తరహాలో ఎంతో సాహసోపేత నిర్ణయాలతో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే, ప్రజలకు ఇవ్వని వాగ్ధానాలను కూడా అమలు చేస్తున్నారని చెప్పారు. ఇందుకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలే నిదర్శనమని మంత్రి పోచారం పేర్కొన్నారు. పెళ్లీడుకు వచ్చిన యువతుల వివాహాలు జరిపించే ఆర్థిక స్థోమత లేక పేద కుటుంబాలకు చెందిన వారు తల్లడిల్లాల్సి వచ్చేదని, దీనిని గమనించి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున చేయూతను అందిస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీలే కాకుండా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థిక సహాయం చెక్కులను వధువు తల్లి పేరిట అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ కంకణం కట్టుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారని పోచారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు తెరాస నాయకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వికటించిన
విందు భోజనం
పచ్చలనడ్కుడలో పలువురికి అస్వస్థత
వేల్పూర్, డిసెంబర్ 9: వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో విందు భోజనం వికటించి శుక్రవారం పలువురు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 40 మంది అస్వస్థతకు గురికాగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది చికిత్సలు అందించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న పోసాని, నవనీత్, శ్రీ్ధర్, అఖిలను 108 అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గురువారం రాత్రి పచ్చలనడ్కుడ గ్రామంలో వివాహ విందు భోజనం జరిగింది. ఈ విందులో భోజనం చేసిన వారు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురికావడంతో గ్రామస్థులు వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వగా వైద్యాధికారి అశోక్ ఆధ్వర్యంలో పచ్చలనడ్కుడలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌ఓ రమేష్, తహశీల్దార్ సోమేశ్వర్‌లు శిబిరాన్ని సందర్శించి సంఘటన వివరాలు తెలుసుకున్నారు.

అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్‌లు
బాన్సువాడ, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని, ఇందులో భాగంగా 2016-17 సంవత్సరానికి గాను 14వేల కోట్లతో 2లక్షల ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని అంగన్‌బజార్, బీడీ కార్మికుల కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను మంత్రి సందర్శించి పరిశీలించారు. అనంతరం మత్స్యకార్మికుల కోసం 10లక్షల రూపాయలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే బాన్సువాడ గ్రామ పంచాయతీలో బిఆర్‌జిఎఫ్, 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన కార్యాలయంలో అదనపు గదులను మంత్రి పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా డబ్బుల్ బెడ్‌రూమ్ ఇంటిని నిర్మించి ఇస్తుందన్నారు.
అలాగే మత్స్యకార్మికులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం పటీష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 100శాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలోని మత్స్యకారులు మధ్యదళారుల చేతిలో మోసపోయి, దుర్భర జీవితాలను వెళ్లదీయడం జరిగిందన్నారు. అలాంటి మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. తాను మత్స్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో 100శాతం సబ్సిడీపై మత్స్యకార్మికులకు చేప పిల్లలను అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఇందుకు అంగీకరించిన సిఎం అంగీకరించి 100శాతం రాయితీతో 45కోట్ల వ్యయంతో చేప పిల్లలను అందించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకార్మికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పోచారం సూచించారు. బాన్సువాడ పట్టణ అభివృద్ధి కోసం సిసిరోడ్లు, డ్రైనేజీల కోసం 4కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని, మరిన్ని నిధుల మంజూరీకి కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.

సకాలంలో మరుగుదొడ్ల నిర్మాణం
గాంధారి, డిసెంబర్ 9: గ్రామంలో ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి తప్పని సరిగా నిర్మించుకునేలా గ్రామ సర్పంచ్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం మండలంలోని జువ్వాడి గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పని సరిగా నిర్మించుకునేలా సర్పంచ్, సమాఖ్య అధ్యక్షురాలు చొరవ చూపాలన్నారు. మరుగుదొడ్డి నిర్మించుకుంటే వారికి కలిగే లాభాలు, నష్టాలు వివరించాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకోకుండా బహిరంగ మలవిసర్జన చేయడం మూలంగా ప్రజలు రోగాల బారిన పడడం జరుగుతుందని ఆయన గ్రామస్థులకు తెలియజేశారు. గ్రామంలో ఇప్పటి వరకు 80 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని, మరో ఇరవై శాతం మిగిలి ఉన్నాయని, వాటిని కూడా త్వరగా పూర్తి చేస్తామని సర్పంచ్ సంగయ్య కలెక్టర్‌కు వివరించారు. ఈ నెల చివరి వరకల్లా నిర్మాణం పూర్తి చేసి వంద శాతం లక్ష్యాన్ని అధిగమించాలని వివరించారు. ఈ విషయంలో సంబంధిత ఎంపిడిఓ అందుబాటులో ఉంటారని ప్రజలకు తెలిపారు. అనంతరం గ్రామంలో రిలయన్స్ ఆధ్వర్యంలో కొనుగోళు చేస్తున్న సోయా కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్థార్ లక్ష్మణ్, ఎంపిడిఓ సాయాగౌడ్, గ్రామ సర్పంచ్ సంగయ్య తదితరులున్నారు.
బిల్లు చెల్లింపు పై ఆందోళన పడద్దు
సదాశివనగర్: అన్ని గ్రామాలలోని ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని పద్మాజివాడి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల బిల్లులు ఇప్పటి అందలేదని, అందుకే మరుగుదొడ్లు నిర్మించుకోవడం లేదని తెలిపారు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ, బిల్లుల చెల్లింపులపై ప్రజలు ఆందోళన చెందవద్దని మరుగుదొడ్లు నిర్మించుకున్న తర్వాత కూడా బిల్లులు వస్తాయన్నారు. అలాగే గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లకు మొదటి బిల్లు వచ్చిన వారందరికి త్వరలోనే పూర్తి బిల్లులు అందుతాయన్నారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, మైదానం, మొక్కలను, హాజరు పట్టికలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి రోజు తరగతి గదిలో ఉపాధ్యాయులు భోదించే సబ్జెక్టుల వివరాలను రికార్డులలో పొందుపర్చాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం డిఇఓతో ఫోన్‌లో ఈ విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అమీన్‌సింగ్, ఎంపిడిఓ చంద్రశేఖర్, ఎపిఓ ఓంకార్, ఎపిఎం సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

సోనియాకు రుణపడి ఉంటారు
మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి
ఆర్మూర్, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికి తినిపించారు. అనంతరం సోనియాగాంధీ చిత్రపటానికి సురేష్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగాలను గుర్తించిన సోనియాగాంధీ 29వ రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించారని ఆయన చెప్పారు. సోనియాగాంధీకి తెలంగాణ ప్రాంతం ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందన్నారు. గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో టిఆర్‌ఎస్, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పిసి బోజన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుమీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్తు
నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ
కమ్మర్‌పల్లి, డిసెంబర్ 9: క్రీడలతో యువకులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ పేర్కొన్నారు. శుక్రవారం కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో ఫ్రెండ్లీ పోలీసు కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి, భీమ్‌గల్, మోర్తాడ్ మండలాల యువజన సంఘాల సభ్యులకు నిర్వహించిన వాలీబాల్ పోటీలను కమిషనర్ సర్వీస్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. అలాగే క్రీడాకారుల మధ్య స్నేహ బంధాలు పెంపొందడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందన్నారు. యువత సెల్‌ఫోన్లలో కంటే క్రీడా మైదానంలో ఆడే ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసు వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. గతంలో ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్లాలంటే భయపడేవారని, ప్రస్తుతం నిర్భయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు.
పోలీసులు సైతం ప్రజలతో మమేకమై పని చేస్తున్నారని కార్తికేయ పేర్కొన్నారు. ప్రజలు నేరాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా, వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు. పోలీసులంటే భయం వీడి, వారి సమస్యల పరిష్కారానికి స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదులు చేయాలన్నారు. ఈ సందర్భంగా కమ్మర్‌పల్లి, మోర్తాడ్, భీమ్‌గల్ మండలాల్లోని యువజన సంఘాల వారికి కమిషనర్ కార్తికేయ, వాలీబాల్, క్రికెట్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎన్‌ఐబి ఎసిపి రవీందర్, ఆర్మూర్ ఎసిపి శివకుమార్, భీమ్‌గల్ సిఐ రమణారెడ్డి, కమ్మర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్, మోర్తాడ్ ఎస్‌ఐ అశోక్‌రెడ్డి, భీమ్‌గల్ ఎస్‌ఐ జితేందర్‌రెడ్డి, బహీరాబాద్ సర్పంచ్ బోడ జమునతో పాటు క్రీడాకారులు, పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో ముందుండాలి
జాయింట్ కలెక్టర్ సత్తయ్య

కామారెడ్డి, డిసెంబర్ 9: యువతతో పాటు క్రీడాకారులు అన్ని రంగాల్లో ముందుండాలని జాయింట్ కలెక్టర్ సత్తయ్య అన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో యువజన క్రీడోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల్లో తమ ప్రతిభను చాటి రాష్టస్థ్రాయి, దేశస్థాయిలో గుర్తింపు పొందాలన్నారు. క్రీడాకారులు తమకు నచ్చిన జానపద, క్రీడ రంగాల్లో ఆసక్తి ఉన్న వారు వాటిపై దృష్టి సారించి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌లకు చెందిన 200మంది కళాకారులు 10అంశాలలో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన కళాకారులకు సర్ట్ఫికెట్లు, మెమోంటోలను అందించారు. జానపద సంగీతంలో మొదటి విజేతగా రాజుకుమార్ గ్రూప్, ద్వితీయ విజేతగా నిహరిక, తృతీయ విజేతగా అనితలు నిలిచారు. గీటార్‌లో అభినయ్‌కుమార్, హర్మోనియం రణ్‌ధీర్, కూచిపూడిలో శివయ్య, కర్నాటక సంగీతంలో వెంకటేశ్, హిందుస్తానీ గాత్ర సంగీతంలో రిషి, తబాలలో అనిల్‌కుమార్, నాటికలో బాలక్రిష్ణలు, వక్తృతంలో కుమారస్వామి గ్రూప్‌లు విజయం సాధించాయి. ఈ కార్యక్రమంలో క్రీడల అధికారి దామోదర్‌రెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.