S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

పుష్యమీసాగర్, హైదరాబాద్
నోట్ల రద్దు వివాదం సద్దుమణగక ముందే సినిమా థియేటర్‌లలో జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలి అన్న రూల్ పెట్టిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఈ దేశపు మేధావులు చాలామంది తప్పు పడుతున్నారు.. సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. హేళన, వ్యంగ్యంతో చిన్నపుచ్చుతున్నారు. ఇంతకీ జాతీయ గీతం స్వచ్ఛందంగా మనసు నుంచి రావాలా, లేక చట్టం చెప్తుంది కదా అని మొక్కుబడిగా చదివేసి నలుగురితో నారాయణ అనుకోవాలా... నిజానికి జాతీయ గీతం పాడటం కూడా అసహనంగా ఫీల్ అయ్యే జనాభా తామరతంపరగా పెరిగిపోవడాన్ని చూస్తూ బాధపడాలా? స్వేచ్ఛ పాళ్లు మరి ఎక్కువయింది అని నా అభిప్రాయం ఏమంటారు?
జాతీయ గీతం పాడుతూంటే గొంతు కలపడానికి, నిమిషంపాటు గౌరవసూచకంగా నిలబడటానికి గింజుకునేవాడు ఈ దేశంలో ఉండటానికి, ఈ దేశ పౌరుడిగా గుర్తించబడటానికి అయోగ్యుడు.

పి.వి.శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
రెండు వేల నోటు చిల్లర కష్టాలు సామాన్య ప్రజానీకానికి ఎప్పుడు తీరతాయి?
ఇప్పట్లో తీరేట్టు లేవు.

పాత నోట్ల రద్దు వ్యవహారంలో ప్రతిపక్షాల ఆందోళన పట్టు చూస్తుంటే వారి వద్ద కూడా నల్లధనం నోట్లు భారీ స్థాయిలో ఉండవచ్చంటారా?
అందుకు సందేహమా?

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
గాంధీగారి విగ్రహం ఎదురుగా బ్రాందీ షాపు ఆరంభం అవుతుంటే దాని గురించి నోరు విప్పని నేటి సమాజం ఏ దశలో ఉందంటారు?
బ్రాందిషాపుకు గాంధి పేరు పెట్టినా అడిగేవారు లేరు.

చందన రవీంద్ర, పొందూరు, శ్రీకాకుళం జిల్లా
తెలంగాణలో 10 జిల్లాలను 31 జిల్లాలకు పెంచారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచితే ప్రయోజనకరంగా ఉంటుందా?
వారూ ఆ దారిలోనే ఉన్నారు-ట!

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
1200 కోట్లంటే మాటలా? విజయ్‌మాల్యా చెల్లించని ఈ డబ్బును రైట్ ఆఫ్ చేయడం అన్యాయం కాదా?
దుర్మార్గం.

లోన్ తీసుకుని తిరిగివ్వని వారిని కూడా కఠినంగా శిక్షించాలి. ఈ మేరకు మోదీ చర్యలు తీసుకుంటే దేశం బాగుపడుతుంది కదండి.
ఔను. కాని ఆ దమ్ము కనపడటం లేదు.

డొక్కా పినాకపాణి, వక్కలంక
స్వర్గీయ బాలమురళీకృష్ణ ఒకసారి ‘బాలసుబ్రహ్మణ్యం’ ప్రయత్నిస్తే నాలాగా పాడగలడు. కాని నేను అతనిలా పాడలేను అన్నారుట. ఇది అభినందనా, అభిశంసనా?
మొదటిది కాదు.

నాగ్‌రాజ్ ఆచార్ కె., నెల్లూరు
నోట్ల మార్పిడి సంఘటనల్లో, క్యూలలో అశువులు బాసిన వ్యక్తులకు ప్రభుత్వం పరిహారం (ఎక్స్‌గ్రేషియా) ప్రకటించాలని కొందరి డిమాండ్. ఈ విషయంలో మీ విలువైన అభిప్రాయం సార్?
ఇవ్వాల్సిందే.

అపోలో హాస్పిటల్‌లో 75 రోజుల సుదీర్ఘమైన ట్రీట్‌మెంట్ ఇచ్చినాక కూడా జయలలిత కోలుకోకపోవడం, డిశ్చార్జ్ చేస్తున్నారు అన్న సమయంలో గుండెపోటు రావడం.. హఠాత్తుగా చనిపోయారు అని ప్రకటించడం దీని వెనుక ఏదైనా కుట్ర ఉంది అంటారా..? దేనికైనా అతిగా స్పందించే అలవాటు వున్నా తమిళనాడు ప్రజలు అసలు నోరు మెదపకపోవడం ఏమిటి? ‘అమ్మ’ మరణం తరువాతా అయినా సాగిలపడిపోయే సంస్కృతి ఆగుతుందా? కొనసాగుతుందా?
కుట్ర కాదు.. సర్దుబాటు! నిజానికి అమ్మ ప్రాణం ఎప్పుడు పోయిందో చిన్నమ్మకెరుక.

పి.వి.ఎస్.ప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
మోదీ ‘యాప్’ సర్వేలో టెక్నాలజీ చేతిలో వున్నవారు పాల్గొంటారు. మరి టెక్నాలజీ తెలియని గ్రామీణ జనం, ఇతరుల అభిప్రాయాలు ఎలా తెలుస్తాయి? వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలిగా! మొదటి నుండి ఇబ్బందులు పడేది వీరేగా! వీరి అభిప్రాయాలు కీలకం కాదా?
‘యాప్’ లేనివాడు, స్మార్ట్ఫోను చేతపట్టనివాడు మన డిజిటల్ సర్కారు కంటికి ఆనడు.

అడ్డగట్ల శివప్రసాద్, సంగారెడ్డి
ఇటీవల ఓ ప్రీమియం షోలో క్రీడాకారుల జట్టులో దేశభక్తిని స్ఫురింపచేయడం కోసం ప్రఖ్యాత పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ చేత జాతీయ గీతాన్ని పాడించారు. ఆమె జన్మతః భారతీయ సంతతికి చెందుతుంది గనుక సబబే అంటారా లేక తృతీయ శ్రేణి నటితో పాడించడం తప్పని అంటారా?
తప్పున్నర తప్పు.

ఎ.వి.సోమయాజులు, కాకినాడ
వెయ్యి నోటు రద్దు చేసి 2వేల నోటు తేవడం వల్ల బ్లాక్‌మనీ రద్దు ఎలా అయింది? కొత్త కరెన్సీ భారత్‌లో కంటే, విదేశీ శక్తులకే ఎక్కువ అందుబాటులో ఉండడం ద్వారా రద్దు ప్రయోజనమేమిటి?
అది మోదీకే ఎరుక!

ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
అయిదు వందల నోట్లను రెండు వేల నోటుతో బాటు సమంగా సరఫరా చేయకపోవడానికి కారణాలేమయినా ఉన్నాయా?
ఒకటే కారణం. చేతకానితనం.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
మనలో మనం, ఆదివారం అనుబంధం,
ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్,
సికిందరాబాద్-500003.
e.mail : bhoomisunday@deccanmail.com