S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాటి వైభవానికి ఆనవాలు ... దోమకొండ గడికోట

నలువైపులా ఎత్తయన బురుజులు, నేటికీ చెక్కుచెదరని శిల్ప, చిత్రకళకు దోమకొండ గడికోట సజీవ సాక్ష్యం. రాజరికానికి గుర్తుగా, రాజుల అభిరుచులకు, పాలనకు అనువైన రీతిలో నిర్మితమైన ఈ కోట నాటి ప్రావీణ్యానికి, వైభవానికి ఓ ఆనవాలు. అత్యంత సుందరంగా నిర్మితమైన అద్దాలమేడ గడికోటకు ప్రత్యేక అందాలను తీసుకొచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం నిజాం కాలంలోని పెద్ద సంస్థానాలలో దోమకొండ సంస్థానం ఒకటి. గద్వాల, వనపర్తి, సిర్నాపల్లిలో దోమకొండ సంస్థానానికి ప్రత్యేక స్థానం ఉండేది. తెలంగాణ రాష్ట్రంలోనే చారిత్రక ప్రసిద్ధి కలిగిన కోటగా గడికోట ఖ్యాతి గాంచింది.
హైదరాబాద్‌కు 107 కి.మీ దూరంలో కామారెడ్డి జిల్లాలో గడికోటగా పేరుగాంచిన దోమకొండ చారిత్రక కట్టడం ఉంది. 36 ఎకరాల 20 గుంటల స్థల విస్తీర్ణంలో 17వ శతాబ్ద కాలంలో రేచర్ల గోత్రికులు అయిన కామినేని వంశానికి చెందిన రాజన్న చౌదరి ఈ గడికోటను పాలించినట్లు తెలుస్తోంది. గడికోట చుట్టూ భారీ కందకాలు తవ్వించి అందులో మొసళ్లతో పాటు వివిధ రకాల జంతువులను కూడా పెంచేవారు. కోట ఆవరణలోని కొలనులో సొరంగ మార్గాలను కూడా తవ్వించారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం వరకు ఒక సొరంగ మార్గం, కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం సిద్దరామేశ్వరాలయం వరకు మరో సొరంగ మార్గం ఉందని చెబుతారు. గడికోటకు తూర్పు, పడమరలో రెండు వైపుల ఎత్తయన ద్వారాలను ఏర్పాటు చేశారు. ఏనుగులు ఢీకొన్నా చెక్కుచెదరని రీతిలో వాటిని రూపొందించారు. కోట నలువైపుల అర ఫర్లాంగు దూరంలో ఎత్తయన బురుజులను నిర్మించి ప్రతి బురుజుపైనా నగరా సిబ్బంది రాత్రింబవళ్లు పహరా కాసేవారు. చరిత్ర కల్గిన గడికోటను 10 శతాబ్ద కాలంలో రాష్ట్ర కూటులు నిర్మించగా, కళ్యాణీ చాళుక్యుల ఆధీనమైనట్లు చెప్పడానికి గడికోట ఆవరణలో దొరికిన కళ్యాణ చాళుక్యుల శాసనమే దీనికి నిదర్శనం. గడికోటను రేచర్ల గోత్రీకులైన కామినేని వంశానికి చెందిన రాజన్నచౌదరి భిక్కవోలు, భిక్కనూరును ముఖ్యకేంద్రంగా రాజ్యపరిపాలన చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయ. ఆ తర్వాత కాలంలో దోమకొండ గడికోట నిర్మాణం పూర్తయిన తరువాత దోమకొండను ముఖ్యపట్టణ కేంద్రంగా చేసుకుని పరిపాలన సాగించారని, కోట ఆవరణలో వారి అభిరుచికి తగ్గట్టుగా ప్రజాదర్బారు హాలు, అంతఃపుర నాట్యశాలలు ఇందులో అద్దాల మేడను అత్యంత సుందరంగా 1933లో నిర్మించారు. వీటి సమీపంలోనే అందమైన నీటి కొలనులు, ఫౌంటెన్లు, తోటలతో పాటు గజ ఏనుగు, ఆశ్వాలు ఉండేందుకు వాటి కోసం ప్రత్యేక గదులు నిర్మించారు. సంస్థాన దొరల పాలనలో గ్రామస్థాయి, సమాచార నిఘా వ్యవస్థలు చాలా పటిష్టంగా ఉండేవి. చట్టాలను ధిక్కరించే ప్రజల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించేవారు. సంస్థానాధీశులు తెలుగు భాషాసాహిత్య పండితులను ఎక్కువగా గౌరవించేవారు. ముఖ్యంగా రాజేశ్వర్ బహుదూర్ సంస్థానాన్ని అందరికంటే ఎక్కువ కాలం పాలించినట్లు చెబుతారు. భారత, రామాయణాలను ఈయన ఉర్దూ భాషల్లోకి అనువదించాడని ఇక్కడి ఆధారాలు స్పష్టం చేస్తాయి. క్రీ.శ.13వ శతాబ్దం పూర్వ భాగంలో సంస్థానాధీశులైన రేచర్ల గోత్రంవారు కామినేని వంశస్థులు ఈ సంస్థానాన్ని ఆంధ్రభారతిగా తీర్చిదిద్దారు. కామినేని వంశానికి కామిరెడ్డి మూలపురుషుడు. పలు గ్రంథాలలో ఈయన పేరు కామినేని చౌదరిగా ఉన్నాయి. తర్వాత వంశీయుడు కాచారెడ్డి. ఈయనకు కామారెడ్డి, ఎల్లారెడ్డి, జంగారెడ్డి అనే ముగ్గురు కుమారులు ఉన్నట్లు చరిత్ర స్పష్టం చేస్తుంది. ఇప్పుడున్న కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి డివిజన్ వారి పేర్లతోనే ఏర్పాటు జరిగినట్లు ప్రచారంలో ఉంది. 1949లో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి జాగీరులను రద్దు చేసి సంస్థానాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది.
గడికోట ఆవరణలో మహాదేవుని ఆలయాన్ని కుటుంబీకులు నిర్మించారనడానికి ఆలయ ప్రవేశ ద్వారంమీద ఉన్న రేఖ, శికర లక్షణాలే నిదర్శనంగా కన్పిస్తాయి. కళ్యాణ చాళుక్యులు జైన ఆలయంగా తీర్చిదిద్దారని అనడానికి ఈ ఆలయం చుట్టూ చూడముచ్చటగా పద్మశిల్ప చిత్రాలు నిదర్శనాలు. ఆలయ గర్భగుడిలో శివలింగం, మండపంలో నంది చాలా ఎత్తుగా ఉంటాయి. ముఖ్యంగా కాకతీయ రాజులు దీనిని శివాలయంగా మార్చి ఆ కాలంలోనే గొప్ప వాస్తుశిల్పకళా నైపుణ్య రీతిలో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. కామినేని వంశ రెడ్డిరాజులు దోమకొండను రాజధానిగా చేసుకుని మహాదేవున్ని ఇంటి ఇలవేల్పుగా భావించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. కాకతీయుల కాలం నాటి సప్తమాత్రికల శిల్పకళా దృశ్యాలు ఇక్కడ కన్పిస్తాయి. 1979లో దోమకొండ కోటగోడలను మహాదేవుని ఆలయాన్ని ఆలయ పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది.
సాహితీసేవ
సంస్థాన రాజుల కళాపోషణ, పాలకుల ధర్మకార్యాలు సాహితసేవలు చిరస్మరణీయం. ప్రముఖ కవి ఎల్లారెడ్డి రాసిన శివధర్మోత్తరం, పద్మపురాణం, పట్టమెట్ట స్వామినాథ సమయాజసుత సంహిత బ్రహ్మోత్తర ఖండం, లక్ష్మీపతి కవి రచించిన క్రిష్టవిలాసభద్ర చరిత్రను పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మకుటాయమానంగా వెలుగొందిన పాలెం జిల్లాలోని గద్వాల సంస్థానం పిదప అంతటి ఖ్యాతిని దోమకొండ సంస్థానం సంపాదించింది. తెలంగాణ రాష్ట్రంలోనే దోమకొండ గడికోటకు ప్రత్యేక ఖ్యాతి సంపాదించుకుంది. ఒకవైపు వ్యవసాయానికి పెద్దపీట వేస్తూనే సాహిత్యాన్ని ఠక్షించడానికి ఆనాడే నడుం బిగించారు. దోమకొండ పరిసర ప్రాంతాలలో వివిధ రకాలైన దేవాలయాలను నిర్మించి దక్షిణకాశీగా వెలుగొందుతున్న భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం, రామారెడ్డిలోని శ్రీ కాలభైరవ ఆలయాలు, దోమకొండ శివాలయం, చాముండేశ్వరీ ఆలయం, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరాలయం నిర్మించబడినట్లు చరిత్ర తెలుపుతోంది. ఇంతే కాకుండా ఆనాడు దోమకొండ సంస్థానాధీశుని పరిధిలో ఉన్న ఎల్లారెడ్డి, కామారెడ్డిలో సైతం అనేక ఆలయాలు నిర్మించిన సాక్ష్యాలున్నాయి. 1950లో గడికోటలోని అద్దాల బంగ్లా ఆవరణలో అప్పటి జనతా ప్రభుత్వం జనతా కళాశాలను భారత్‌సేవక్ సమాజ్ నిర్వహించి స్థానిక నిరుద్యోగ యువకులను సంఘసేవ, శరీరక శ్రమ, నూలు తయారు, వస్త్రాల తయారిలో శిక్షణ ఇచ్చారు. ఇదే కళాశాలలో ప్రముఖ కవి అభినవ పోతన బిరుదాంకితుడైన వానమామలై వరదాచార్య విధులను నిర్వహించడం గమనార్హం. దోమకొండ గడికోటలోని పూరాతన భవనాల ఆనవాలు ముందు తరాలకు తీపి గుర్తులుగా కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి అప్పటి ప్రభుత్వాలు పూర్తిస్థాయి మరమ్మతులు చేయించారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 2011లో రాజావారి కుటుంబ వారసులు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఉమాపతిరావు ముందుకు రావడంతో కోట పునర్ వైభవానికి కృషి జరుగుతోంది. గడికోటకు పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా పర్యాటక శాఖ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. త్వరలో పర్యాటకులకు గడికోట కనువిందు చేయనుంది.

- వుక్కల్‌కర్ రాజేందర్‌నాథ్