S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంగీతం ఎందుకు రాదు? (అమృతవర్షిణి)

సంగీతం పేరు చెబితే సప్తస్వరాలు మనసులో మెదులుతాయి. ఎవరు మాట్లాడినా, సాహిత్యం ఆలోచనామృతం, సంగీతమాపాత మధురం లాంటి మాటలు వింటూనే ఉంటాం.
సంగీతం గురించి తెలియకపోయినా, పాడకపోయినా మాట్లాడటం ఎంతో తేలిక. ప్రపంచంలో సంగీతమంతా ఏడు స్వరాల్లోనే ఉంది. షడ్జ, పంచమాలు, మినహాయిస్తే మిగతా స్వరాలు తేలికగా పట్టుకోవటం కష్టం. శ్రద్ధగా కూర్చుని ఏకాగ్రతతో పాడే ప్రయత్నం చేస్తే షడ్జ, పంచమాలు దొరుకుతాయి. స్థాయి నిలిపి ఈ రెండు స్వరాలు దమ్ము పట్టి, కాసేపు పాడే ప్రయత్నం చేస్తూ, శృతిలో నిక్కచ్చిగా వున్నాయనే నమ్మకం కుదిరితే నేర్చుకోవడానికి ముందుకు సాగవచ్చు. హాయిగా ఊపిరి తీస్తూ, నిలకడగా స్థాయి నిలుపుతూన్నప్పుడు ఎదురుగా గురువుండాలి. ఎలా పాడాలో తెలియాలిగా? మనం వాడే మందుల మీద ‘వైద్యుల సలహా మేరకు వాడండి’ అని సూచన ఉంటుంది చూడండి. సంగీతానికి కూడా సమర్థుడైన డాక్టర్ లాంటి గురువు ఉండాలి. డాక్టర్లు మనతో చాలా మితంగా మాట్లాడతారు. సంగీత గురువులు కూడా అంతే. అలా, మితంగానే మాట్లాడాలి. అమితంగా పాడాలి. పాడించాలి.
దేవాలయంలో అర్చకులు దర్శనానికి వచ్చిన వారందరికీ శటారితో అనుగ్రహిస్తూ, తీర్థ ప్రసాదాలిచ్చి పంపించినట్లుగా వైద్యులు కూడా అందరికీ వైద్యం చేసి పంపుతూంటారు.
చిన్నచిన్న రుగ్మతలున్నా, రోగనిరోధక శక్తి వున్న వాళ్లకి వైద్యం తేలిక. సాధనకు తట్టుకోగల వారికి సంగీతం కూడా తేలిక. యోగ్యత కలిగిన వారు ఎందరో ఉంటారు. సంగీత యోగం వున్నవారు తక్కువగా ఉంటారు. పద్ధతిగా నేర్చుకోపోయినా పసందుగా పాడేవారంతా అదృష్టవంతులు.
స్వరం, స్వర స్థానం అని రెండుంటాయి. కర్ణాటక సంగీతంలో, కొన్నికొన్ని స్వరాలు పక్క స్వరం నుంచి వస్తూంటాయి. కొన్ని స్వరాలు పొడిపొడిగా వినిపిస్తూంటాయి. ఈ రెండిటికీ వున్న తేడా తెలియాలి. పక్క స్వరంతో పాడే స్వరం ఎప్పుడూ బరువుతో తూకంగా వినిపిస్తుంది. అలా తయారైన పాటకు ఆకర్షణ ఎక్కువ. ఈ జ్ఞానం చెప్పగా చెప్పగా రాదు. పాడగా పాడగా వస్తుంది. అందుకే పాడుతూ, చెప్పే గురువులు దొరకాలి. అనుభవంలోకి వచ్చేంతవరకూ పాడాలి.
అందుకే త్యాగయ్య ‘సీతావర సంగీత జ్ఞానము ధాతన్రాయనవిరా!’ అంటారు. పిసినారిగా పేరు పొంది పిల్లిక్కూడా బిచ్చమేయని వజ్రాల వ్యాపారం చేసే పురందర దాసునకు సంగీత యోగం పట్టడం విధాత చేసిన పనే - అంతేనా? ‘కర్ణాటక సంగీత పితామహుడయ్యాడు’ అందుకే సంగీత యోగం లభిస్తే, ఏదైనా వదిలేస్తాడు మనిషి అనటానికి సాక్షి పురందరదాసు. ‘నవకోటి నారాయణుని’గా పిలవబడే ఈ మహానుభావుడు అన్నీ వదిలేసి సంగీతాన్ని పట్టుకున్నాడు. అందుకే ఓ కవి.. ‘్ధనమా! నిత్యము కాదు, వైభవమబద్ధంవౌ, శరీర స్థితుల్ క్షణికంబుల్, స్థిరమొక్కటే జగమునన్, సంగీత సాహిత్య సంజనితానంద సుధా ప్రవాహము విశిష్ట ప్రాజ్ఞులీ వెల్లువన్, తనువుల్ ముంచి పవిత్రులౌదురు సుధా ధారాబ్ధినిన్ గోలుచున్’ అన్నాడు.
పురందరదాసు మొత్తం, సంగీత లోకానే్న తరింపజేశాడు. ఆయన పిళ్లారి గీతాలతో ప్రారంభించిన సంగీతం విశ్వవ్యాప్తమై, పాడేవారందరికీ భుక్తికీ, ముక్తికీ లోటు లేకుండా చేస్తోంది.
సంగీతానికి మూలాధారాలు రెండే రెండు. అందరికీ తెలిసినవే. ఒకటి శృతి, రెండోది లయ.
స్వర స్థానాలు ఉనికిని మనస్సే గ్రహించాలి. దగ్గర దారులు ఏమీ వుండవు. కొలిచే సాధనాలంటూ ఏమీ వుండవు. ఉన్నా తాత్కాలికమైనవే.
‘షడ్జ’ ‘పంచమాల’ దారిని చెయ్యి పట్టుకుని చూపించే ప్రయత్నం చేసేది గురువు. ఒక్కోసారి గురువును అడ్డం పెట్టుకుని, వారంతట వారే ఒక్కసారి చెప్పగానే దారి తెలిసి, మిగతా స్వరాలను జాగ్రత్తగా పాడేసేవారుంటారు. ఆ శిష్యులకు సంగీత మార్గం సుగమమై పోతుంది. అలాటి ప్రజ్ఞ వున్నవారికి సంగీతం స్వాధీనమయ్యే అవకాశాలు మెండు.
రిషిభం, గాంధారం, మధ్యమం, ధైనతం, నిషాదాదులన్నీ కోలాహలంగా కనిపించే స్వరాలే. పైగా వాటిలో చాలా రకాలు. ఇవన్నీ పక్క స్వరంతో ప్రకాశిస్తూ వుంటాయి. పాశ్చాత్య సంగీతంలో స్వరాలకు పక్క స్వరాల సహాయం ఉండదు. సమూహంగా కనిపిస్తాయి. ఒంటరిగానే వినిపిస్తూంటాయి. గమకాలుండవు. అదీ తేడా.
సంగీతం పట్ల భక్తి గౌరవాలుండి, నియమ నిష్టలతో సంగీతాన్ని ఉపాసించిన సద్గురువులు, చాలా కొద్దిమంది ఉంటారు. ప్రతి వారినీ కూర్చోబెట్టి, వాళ్లు పాఠం చెప్పరు. సంగీతమూర్తి త్రయంలో చిన్నవాడైన ముత్తుస్వామి దీక్షితుల వారు అఖండ జ్ఞాన స్వరూపుడు. సంగీతం ఒక్కటే కాదు. ఆయన సంస్కృతాంధ్రములలో పండితుడు. గొప్ప వాగ్గేయకారుడు. ముద్దు కుమారస్వామి వరప్రసాదిగా జన్మించిన కారణజన్ముడు.
కృతులు పాడగలిగే స్థాయి కల్గిన వారు మాత్రమే ఆయన శిష్యరికం చేసేవారు.
మరో వాగ్గేయకారుడు శ్యామశాస్ర్తీ. ఆయన కొడుకు సుబ్బరాయ శాస్ర్తీ త్యాగయ్య వద్ద కూడా సంగీతాన్ని అభ్యసించారు. ఈయన కీర్తనలు రాశిలో తక్కువే. వాసిలో గొప్పవి. సంగీత త్రయం తర్వాత అంతవాడుగా చెప్పుకోతగినవాడు.
మిగతా వారందరికంటే త్యాగరాజుకున్న శిష్య ప్రశిష్య పరంపర ఎక్కువ. వణకుప్పయ్యర్, మానాబుచావిడి వెంకటసుబ్బయ్య, తిరువత్తియూర్ త్యాగయ్య, పల్లవి శేషయ్య, వాలాజీపేట వెంకటరమణ భాగవతులు వంటి వారితోబాటు మైసూర్ సదాశివరావు, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, సుందర భాగవతార్, కృష్ణ భాగవతార్ మొదలైనవారు గురువులకు పేరు తెచ్చి, వారు కీర్తిని పొందారు.
చెప్పగలిగే స్తోమత కలిగి శిష్యుణ్ణి మనస్ఫూర్తిగా తీర్చిదిద్దగలిగే గురువులే సంగీతాన్ని వృద్ధి చేసి, విద్వాంసుల్ని తయారుచేస్తారు. సంగీతం పట్ల అభిరుచి ఒక్కటే సరిపోదు. అర్హత ఉండాలి. గురువు యందు పూర్తి నమ్మకం ఉండి, నీవే తప్ప ఇతః పరంబెరుగ’ అన్న భావన కలిగి, గురువును తల్లీ, తండ్రిగా భావించాలి.
ఆశ్రయించిన శిష్యులకు, సంగీత విద్య కరతలామలకం. కొంతమంది సంగీతం పట్ల ఆసక్తి గల తల్లిదండ్రులు పిల్లల్ని చూపిస్తూ,
‘విన్న సినిమా పాట అచ్చం అలాగే, ఏమీ తేడా లేకుండా పాడేస్తాడండీ - పాటలంటే బాబుకి ఎంత పిచ్చో!’ అంటూ గురువులకు పరిచయం చేస్తూంటారు. అటువంటి వారి సంగీతం బుద్ధిగా కొన్నాళ్లు సాగినా, ఆ తర్వాత, మళ్లీ మనస్సు తేలికైన ఆ పాటల వైపే పోతుంది.
తెలిసిన దానితో తృప్తిపడతారు. తెలియనిది అలా మిగిలే ఉంటుంది. రానిది రాదు. పోనిది పోదు’ అంటారందుకే, త్యాగయ్య.
‘మా ఊళ్లో ఓ సంగీతం మాష్టారుండేవారు. ఎంత శ్రద్ధగా నేర్పేవారో? కొన్నాళ్లు బాగా పాడేదాన్ని. సంసారంలో పడ్డ తర్వాత నేర్చుకున్న సంగీతం కాస్తా అటకెక్కిందని’ వాపోయేవార్ని ఎందరినో చూస్తూంటాం.
డాక్టరు కావలసిన వాళ్లు యాక్టర్లు, యాక్టర్లవవలసిన వాళ్లు డాక్టర్లూ ఉంటూనే ఉంటారు.
సంగీతం ఏదో ఆషామాషీగానో, కాలక్షేపంగానో నేర్చుకునేది కాదు, నేర్పేదీ కాదు. కొందరి ప్రవృత్తులకూ, వృత్తులకూ సంబంధం ఉండదు. లక్ష్యసాధనకు అవరోధాలెక్కువ. ఆనాటి రోజుల్లో కొన్ని దశాబ్దాల పాటు తన మధురమైన కంఠంతో యావద్భారత దేశంలోని సంగీత అభిమానులను అలరించిన కె.ఎల్.సైగల్ (కుందన్‌లాల్ సైగల్) గాయకుడవకముందు, టైపు మిషన్లు బాగు చేస్తూ ఉండేవాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ మాత్రం సంబంధం లేని వృత్తి అది. సుస్వర సంగీతానికి అడ్డుకాలేదు.
పాకిస్తాన్‌లో ఘజల్ చక్రవర్తి మెహదీ హసన్ ఓ కారు మెకానిక్‌గా కాలక్షేపం చేసేవాడు. ఏ వృత్తిలో వున్నా, ప్రవృత్తి బలంగా ఉంటే లక్ష్య సాధన కష్టం కాదు అని నిరూపించారు.
దక్షిణ హిందూ స్థానంలో సంప్రదాయ సంగీత బాణీల రుచిని చూపించిన ప్రముఖ సంగీత దర్శకుడు నౌషద్ అలీ - హార్మోనియాలు రిపేరు చేసే షాపుల్లో ఎక్కువ కాలం గడిపేవాడు. శృతి, మాధుర్యపు రుచిని అనుభవించేవాడు. ఆయన వృత్తి, ప్రవృత్తీ, రెండూ ఏకమైయ్యాయి. సంగీతానందాన్ని కడుపారా అనుభవించి ధన్యుడయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో!
సుప్రసిద్ధ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ బాల్యంలో- దేవాలయాల్లో వినిపించే డోలు వాద్యంలోని లయ, సౌందర్యానికి, నాదస్వర వాద్యానికి ఆకర్షితుడౌతూ, గంటలకొద్దీ రోజూ, ఆలయాల్లోనే కూర్చుని లయను వింటూండేవాడు.
తమిళ సినిమా రంగంలో నేపథ్య గాయకుడిగా, నటుడుగా ప్రఖ్యాతి చెందిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్, బంగారు నగల తయారీలో సిద్ధహస్తుడట.
తేనె, పంచదార, చెఱకు రసం వంటి అమృత తుల్యమైన పదార్థాలతో పోల్చతగినవి ఆయన పాటలు - ఒక తరాన్ని ఊపేశాయి.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టి పెరిగి బాలమేధావిగా పేరు సంపాదించి, మాండలిన్ వాద్యానే్న ఇంటి పేరుగా చేసుకున్న ‘పద్మశ్రీ’ శ్రీనివాస్, తండ్రితో పెళ్లిళ్లకూ, శుభకార్యాలకూ బ్యాండ్ మేళంతోపాటు అందర్నీ ఆకర్షించేవాడు. చెంబై వైద్యనాథ భాగవతార్ శిష్యుడైన రుద్రరాజు సుబ్బరాజు అనే సంగీత విద్వాంసుడు శ్రీనివాస్‌కు మార్గదర్శక గురువై, మద్రాసుకు తీసుకుపోయాడు. సంగీత విద్వాంసుల మధ్య తిప్పాడు. సంప్రదాయ సంగీతం పట్ల శ్రీనివాస్‌కు చిన్నతనంలోనే ‘రుచి’ని కల్గించాడు. సినిమా పాటలే వాయిస్తూ ఉండి ఉంటే ఇంత పేరెక్కడ?
గమకాలు పలికించే వీలులేని ఒక చిన్న వాద్యాన్ని స్వాధీనం చేసుకుని, సంప్రదాయ సంగీతంతో, అత్యున్నత శిఖరాలధిరోహించిన మాండలిన్ శ్రీనివాస్, సంగీత రంగంలో ధృవతారగా నిలిచిపోయాడు. పాశ్చాత్య సంగీత విద్వాంసులతో కలిసి దేశ విదేశాలలో చేసిన సంగీత కచేరీలు, పొందిన సత్కారాలు, సన్మానాలు అసంఖ్యాకం. సంగీతం కోసం, ముఖ్యంగా మాండలిన్ కోసం పుట్టి, ఐదు పదులు నిండకుండానే సంగీత లోకం నుంచి నిష్క్రమించాడు.
సంకల్ప బలం గట్టిగా ఉంటే సాధించలేనిది ఏమీ వుండదని నిరూపించాడు. పాడిన కొద్దీ పెరిగేవి రాగం. నేర్చిన కొద్దీ పెరిగేది జ్ఞానం. శ్రీనివాస్ వయసుతోబాటు జ్ఞానం కూడా పెరిగి విశ్వవ్యాప్తమైంది. సంగీతంలో, అందరూ కారణజన్ములు అవ్వరు. సంగీత విభూతి లభించిన వారికి సద్గురు వొక్కడే దిక్కు. ఈశ్వరుడే గతి. గురువు చెప్పే దానికంటే శిష్యుడు వింటూ, సాధనతో సంపాదించేదే ఎక్కువ.
మాండలిన్ శ్రీనివాస్ లాంటి వాళ్లను ఈ తరం ఆదర్శంగా తీసుకుంటూ సాగితే చేసే సాధనకు అర్థం సంగీత పరమార్థం బోధపడ్తుంది. సంప్రదాయ సంగీతం నేర్చుకునేందుకు రాజమార్గం ఒక్కటే. పక్కదారుల్లో పాడాలనుకునే వారికి సమస్యలుండవు. కష్టమైనా, యిష్టంగా సాధన చేసేవారే కీర్తి శిఖరాలపై ఉంటారు.
నాకింకా గుర్తే. శ్రీనివాస్ 15వ ఏట, విజయవాడ రేడియో కేంద్రంలో ఇంటర్వ్యూ చేశాను. తన సంగీత కచేరీ అనుభవాలెన్నో చెప్పాడు. పక్కనే తండ్రి సత్యనారాయణ కూడా ఉన్నారు. ఓసారి బిందుమాలిని రాగం వినిపించమన్నారు ప్రేక్షకులు. ఆ రాగంతో పరిచయం లేదు, శ్రీనివాస్‌కు.
కచేరీ ముగించుకుని- తనకు బాగా పరిచయం కలిగిన విద్వాంసుడింటికి వెళ్లి ‘బిందుమాలిని’ రాగ స్వరూప స్వభావాలన్నీ, పాడించుకుని విన్నాడు. రాత్రికి రాత్రే బాగా సాధన చేశాడు. స్వాధీనమై పోయిందా రాగం. అంతే. ఆశ్చర్యం!!
మరుసటి రోజు కచేరీలో, శ్రోతలు అడక్కుండానే ‘బిందుమాలిని’ రాగం సర్వాంగ సుందరంగా వాయించేశాడు. ఎంత ముద్దో, ఎంత సొగసో అనే త్యాగరాజ కీర్తన ఒక్కటే ఈ రాగంలో చాలా ప్రసిద్ధమైనది. అంత ముద్దుగా, సొగసుగా వినిపించాడు.
‘బిందుమాలిని’ రాగంలో గంటసేపు రాగం, తానం, పల్లవి వాయించి, వేలాది శ్రోతల కరతాళ ధ్వనులందుకున్నాడు. లక్ష్యశుద్ధి ఉంటే లక్ష్యం సిద్ధిస్తుంది. పట్టుదల, విశ్వాసం, భక్తి గౌరవాలు పుష్కలంగా నిండుగా కలిగిన మేధావి శ్రీనివాస్. ఒకప్పుడు సంగీతం గగన కుసుమం - ఈవేళ ప్రసార మాధ్యమాలతోపాటు సాంకేతిక విజ్ఞానం పెరిగింది. సంగీతం, అందరికీ చేరువై పోయింది.
అర్హులైన వారికి అవకాశాలు దొరుకుతున్నాయి. ప్రతిభావంతులకు గుర్తింపు లభిస్తోంది. సంగీతాభ్యాసానికి సదుపాయాలు దండిగా ఉన్నాయి.
మనకు విద్వాంసులకు లోటు లేదు. ప్రతిభ కలిగిన వారూ లేకపోలేదు. చిత్తశుద్ధిగా నేర్పాలనే దృఢ సంకల్పం వున్న సంగీత సద్గురువులకు దీక్షతో, నిజాయితీతో, గురువు పట్ల, సంగీతం పట్ల, భక్తి గౌరవాలు కల్గిన శిష్యులు దొరికితే ‘సంగీతం’ ఎందుకు రాదు?
*

- మల్లాది సూరిబాబు 9052765490