S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వజ్రాల వేట

వజ్రాల గనుల్లో పనిచేసేవారు పనయ్యాక బయటికి వచ్చేప్పుడు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కాని పంపరు. అలాగే సందర్శకులని కూడా. వజ్రాల గని నించి ఎవరూ వజ్రాలు తీసుకెళ్లకూడదని ఈ భద్రతా చర్యలు చేపడతారు. కానీ ప్రపంచంలో ‘నీకు దొరికిన వజ్రం నీదే’ అనే ఆదర్శంతో ఓ వజ్రాల గని నడుస్తోంది!
దాని పేరు ‘ది క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్’ అమెరికాలో ఆర్కన్సాస్ రాష్ట్రంలోని ముర్‌ఫ్రీస్ ఐరోలో ఈ గని ఉంది. సందర్శకులు ఈ గనిలోకి వెళ్లి వజ్రాల కోసం వెదికి ఎవరికి దొరికినవి వారు వెంట తీసుకెళ్లచ్చు. పార్క్ అధికార లెక్కల ప్రకారం సందర్శకులు ఏటా సగటున 600 వజ్రాలు కనుగొని తీసుకెళ్తున్నారు. అవన్నీ అనేక రంగులు, గ్రేడ్స్‌కి చెందిన వజ్రాలు.
1906లో ఈ వజ్రాల గనిని కనిపెట్టారు. అప్పటి నించి ఇక్కడ 75 వేల వజ్రాలు లభ్యమయ్యాయి. వాటిలో 1972 నించి 19 వేల వజ్రాలు ఈ పార్క్‌ని సందర్శించిన వారికి లభించాయి. అంటే 1972 నించే ‘ఎవరికి దొరికినవి వారు వెంట తీసుకెళ్లచ్చు’ అనే పద్ధతి ప్రవేశపెట్టబడింది.
శాస్తజ్ఞ్రుల అభిప్రాయం ప్రకారం ఈ వజ్రాలు 300 కోట్ల సంవత్సరాల క్రితం భూమికి 60 నించి 100 మైళ్ల లోతున ఏర్పడ్డాయి. 10 కోట్ల సంవత్సరాల క్రితం వజ్రపు రాళ్లు భూమి ఉపరితలానికి చేరుకున్నాయి. ఓ పెద్ద అగ్ని పర్వతం బద్దలై దాని 80 ఎకరాల విస్తీర్ణం గల శిఖరం నించి, భూగర్భం లోంచి వెలువడ్డ లావా, బూడిద, రాళ్లతోపాటు ఈ వజ్రాలు కూడా బయటికి వచ్చాయని వారి భావన. ఈ పది కోట్ల సంవత్సరాల్లో రాళ్లు అరిగిపోయినా, వజ్రాలు మాత్రం చెక్కుచెదరకుండా మట్టిలో కలిసి ఉన్నాయని వాళ్లు నమ్ముతున్నారు.
1906లో జాన్ అడుల్‌స్టోన్ అనే రైతు పొలం మధ్యలో ఈ ఓపెన్ వజ్రాల గని ఉండేది. ఓ రోజు అతను భూమిలో రాక్ సాల్ట్‌ని చల్లుతూంటే, మెరిసే రెండు తెల్ల రాళ్లు కనిపించాయి. వాటిని తీసుకుని పరిశీలించి అవి వజ్రాలై ఉండచ్చని ఆశపడ్డాడు. ఓ స్థానిక బేంక్ కేషియర్ దగ్గరికి వాటిని తీసుకెళ్తే, వాటిని 50 సెంట్లకి కొంటానని అతను చెప్పాడు. తెలివిగల జాన్ వాటిని న్యూయార్క్‌లోని వజ్రాల నిపుణుడికి పంపాడు. అవి నిజమైన వజ్రాలే అని, ఒకటి మూడు కేరెట్ల తెల్లవజ్రం అని, మరొకటి ఒకటిన్నర కేరట్ల పసుపుపచ్చ వజ్రం అని సమాధానం వచ్చింది.
త్వరలోనే ఈ సంగతి దావానలంలా వ్యాపించింది. జాన్ ‘డైమండ్ జాన్’గా ప్రఖ్యాతి పొందాడు. వేల మంది ప్రజలు ముర్‌ఫ్రీస్‌బరోలోని అతని పొలం చూడడానికి రాసాగారు. వారందర్నీ అతను తిప్పి పంపాడు. ఐతే వజ్రాల గని వ్యాపారం మీద జాన్‌కి ఆసక్తి లేకపోవడంతో అతను తన పొలాన్ని 36 వేల డాలర్లకి పెట్టుబడిదారులకి అమ్మాడు. వారు వజ్రాల మైనింగ్ వ్యాపారం చేపట్టారు. కాని సరైన ఫలితం దక్కలేదు. తమ పెట్టుబడిని ఎలా తిరిగి పొందాలా అని ఆలోచించారు. దాంతో ఆ పొలానికి ‘క్రేటర్ ఆఫ్ డైమండ్స్’ అనే పేరు పెట్టి 1952లో దాన్ని ప్రజలకి తెరిచారు. కొంత డబ్బు చెల్లించి, లోపలికి వెళ్లి కొంత కాల పరిమితితో వారు వజ్రాల కోసం వెదకచ్చు. ఎవరికి దొరికినవి వారు వెంట తీసుకెళ్లచ్చు. ఇలా పెట్టుబడిదారులు కొంత లాభం పొందారు.
ఇరవై ఏళ్ల తర్వాత 1972లో రాష్ట్ర ప్రభుత్వం క్రేటర్ ఆఫ్ డైమండ్స్‌ని కొని స్టేట్ పార్క్‌గా అభివృద్ధి చేసింది. నేడు ఏటా కొన్ని లక్షల మంది ఔత్సాహికులు ఈ పార్క్‌ని సందర్శించి జాగ్రత్తగా నేలని తవ్వి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎక్కువ మంది వేళ్లతోనే తవ్వుతూంటారు. కొందరు మాత్రం సెరూకా అనే జల్లెడని ఉపయోగిచి రాళ్లని జల్లెడ పడుతూంటారు. అదృష్టవంతులకి వాటిలో వజ్రాలు దొరుకుతాయి. ఇంతదాకా దొరికిన అతి విలువైన వజ్రం పేరు ‘అంకుల్ సామ్’. ఇది నలభై కేరట్ల వజ్రం. దాని తర్వాతి స్థానం ‘స్టార్ ముర్‌ఫ్రీస్‌బరో’. ఇది ముప్పై నాలుగు కేరట్ల వజ్రం. తర్వాతి స్థానం పదహారు కేరట్ల ‘అమరిలో స్టార్ లైట్’ది.
1975లో దీన్ని ఓ సందర్శకుడు కనుగొన్నాడు. అలాగే మరొకరికి ‘స్టార్ ఆఫ్ ఆర్కన్సాస్’, ఎనిమిది కేరట్ల ‘స్టార్ ఆఫ్ ష్రెవేపోర్ట్’ దొరికాయి. చాలామందికి మూడు, ఐదు కేరట్ల డైమండ్స్ లభ్యమయ్యాయి. వాటి ధర వేలల్లోనే ఉంటుంది. దొరికిన విలువైన డైమండ్‌తోపాటు, ఈ గని యాజమాన్యం సర్ట్ఫికెట్‌ని కూడా ఇస్తుంది. అందులో వజ్రం బరువు, దాని పేరు, ఎవరికి దొరికింది మొదలైన వివరాలు నమోదు చేసి ఉంటాయి. ఐతే ఇప్పుడు విలువైన వజ్రం దొరికే అవకాశాలు చాలా తక్కువ. ఎక్కువ మందికి దొరికిన వజ్రాలు అగ్గిపుల్ల తల పరిమాణంలో ఉన్నాయి. అవి కట్ చేసి, నగలో పొదగడానికి అనువుగా ఉండవు. కాని వినోదంతోపాటు ఇక్కడ ఐశ్వర్యవంతులయ్యే అవకాశం కూడా ఉండడంతో వేల మంది వీకెండ్స్‌లో దీన్ని సందర్శించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అమెరికాలో ఇలాంటి ఓపెన్ డైమండ్ మైన్స్ మరికొన్ని ఉన్నాయి. మోంటానాలోని ఫిలిప్స్‌బర్గ్, న్యూయార్క్ రాష్ట్రంలోని హెర్క్‌మెర్, నెవేడాలోని వర్జిన్ వేలీ, నార్త్ కరోలినాలోని ఫ్రాంక్లిన్, హిడెనైట్, కాలిఫోర్నియాలోని జేమ్స్ టౌన్ (ఇది బంగారు గని) మొదలైనవి. ఇవన్నీ కూడా వంద లేదా నూట ఏభై ఏళ్లలోపు కనిపెట్టబడినవి. కెనడాలో కూడా ఇలాంటివి కొన్ని ఉన్నాయి.

పద్మజ