S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నట గాయకుల పద్య పట్ట్భాషేకం

స రళమై, సుందరమై, మృదుమధురమైన మన తెలుగు పద్యం ఎవరూ వీలునామా వ్రాసి ఇవ్వవలసిన అవసరం లేని ఆంధ్రుల ఆస్తి. పద్య సాహిత్యం మన తెలుగు భాషకే ఔన్నత్యాన్ని తెచ్చిన అద్భుతమైన ప్రక్రియ.
నన్నయాదిగా ఎందరో కవిశేఖరులు పద్య శిల్పాన్ని రమణీయార్థమైన సొగసులతో, శే్లష యమకాద్యలంకారాలతో సుసంపన్నం చేసి పెట్టి లోకానికి అందించారు.
మనిషిని సన్మార్గం వైపు నడిపించటానికే ఈ సంగీత సాహిత్యాలు పుట్టాయి. ఇవే లేకపోతే ప్రతీదీ ఒక జడ పదార్థంగానే కనిపిస్తుంది. లలితకళల ఆవిర్భావం కూడా ఇందుకే. మనిషిని చైతన్యపరచటానికే పుట్టాయి. చెప్పే వాళ్లు లేక కాదు వినే వాళ్లు లేకనే ఈ సమాజం భ్రష్టు పట్టుతుందని వగచేవారు కూడా పుట్టారు.
ఈ జాతికి ధర్మం అంటే ఏమిటో? సత్యం అంటే ఏమిటో, మనిషికి నీతి నియమాలంటూ ఎందుకుండాలో చెప్పటానికే భారత, భాగవత, రామాయణాలుద్భవించాయి. భారతీయుల ఆత్మ ఈ మూడింటిపై కేంద్రీకృతమై ఉంటుంది. నల్లని వాడు, పద్మ నయనంబుల వాడు, కృపారసంబు పై చల్లెడువాడు, నవ్వురాజిల్లు మోముతో కనిపించే కృష్ణుడికీ, తెలుగు పద్యానికీ విడతీయలేని బంధం ఉంది.
అసలు కృష్ణుని విగ్రహమే ఆకర్షణీయం. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఆయన బోధనలతో ఉత్తేజితులు కాని వారెవ్వరు? పునీతులవ్వని వారెవ్వరు? కొన్ని అవతారాలకు బోధ కంటే జీవితమే ఎక్కువ. మరి కొన్నిటికి జీవితమూ, బోధ రెండూ ఎక్కువగానే ఉంటాయి. మొదటిదానికి శ్రీరామచంద్రుడు, రెండవ దానికి శ్రీకృష్ణుడు ఉదాహరణలు. ఈ లోకంలో మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఆ ఒక్క శ్రీకృష్ణుడే గతి. అన్యథా శరణం నాస్తి.
మన తెలుగు పౌరాణిక నాటకరంగమంతా ఈ కృష్ణుడి చుట్టూనే పరిభ్రమించిందంటే ఆశ్చర్యం లేదు. ఛందోబద్ధమైన అద్భుత పద్యాలన్నీ మకరంద మాధుర్యం నింపుకుంటూ, అలనాటి మహా గాయకుల కంఠాల్లో ప్రతిధ్వనించాయి. ఆబాల గోపాలాన్నీ ఉర్రూతలూగించాయి. ఒక్కొక్క నటుడూ ఒక్కొక్క మేరుశిఖర సమానుడు. వాళ్లు కేవలం నటులే కాదు, గంధర్వ గాయకులు.
గయోపాఖ్యానం, హరిశ్చంద్ర, పాండవోద్యోగ విజయాలు, చింతామణి, చిత్రనళీయం, శ్రీకృష్ణార్జున యుద్ధం, మైరావణ, తారాశశాంకం, రామాంజనేయ యుద్ధం, ప్రతాపరుద్రీయం లాంటి అనేక పౌరాణిక నాటకాలు, అందులోని పద్యాలు ఆ తరం వారికి కంఠోపాఠమే. ప్రత్యేకంగా పౌరాణిక నాటక రంగస్థలం మీద జీవిస్తూ నటించిన ఆ మహానటుల్ని తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. పీసపాటి, అబ్బూరి వరప్రసాదరావు, షణ్ముఖ ఆంజనేయ రాజు, బందా కనక లింగేశ్వర్రావు వంటి మహానటులు పద్య నాటక వైభవానికి ప్రధాన సూత్రధారులు.
తెర వెనుక నటీనట బృందమంతా కలిసి నీరాజనమిస్తూ ‘పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ’ అంటూ సాగే బృందగానం ప్రేక్షక జన హృదయాలను పరవశింపచేసేది. ఏమా వైభవం? తన జీవితమే కృష్ణ పాత్రగా జీవించి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటుడు పీసపాటి. నటన ఒకవైపు, సంభాషణలు మరోవైపు, ఆ రెంటినీ అనుసంధానం చేస్తూ సాగే కమనీయమైన పద్యగానం ఇంకొకవైపు.. ప్రేక్షకులకు కన్నులవిందు, వీనులవిందుగా సాగేవి.
ఆ రోజుల్లో పద్యం పాడటం ఆంధ్ర దేశంలో ప్రేక్షక జనానికి ఒక పెద్ద సంబరం. తెలుగు సాహిత్యానికి ఒక కొత్త సౌరభం. ఈ మహానటుల కోసమే తిరుపతి వేంకట కవులు పుట్టారేమో అనిపించేలా పాడేవారు.
పద్యం ఇలా ప్రారంభించాలి? ఎలా విస్తరిస్తూ భావాన్ని శ్రోతలకు అర్థమయ్యేలా పాడాలి? పసందైన సంగతులతో ఎలా ముగించాలో బాగా తెలిసిన ఆ నటుల ప్రజ్ఞను కొలవటానికి మాటలు సరిపోవు. ముఖానికి రంగు పూసుకుని వేషధారణ చేసినంత మాత్రాన నటులౌతారా? అలనాటి తరంలో పాత్రకు తగ్గ ఆహార్యం, దానికి తగ్గ శుద్ధమైన వాక్కు, సంగీత సాహిత్యాలతో పరిణతి పొందిన జ్ఞానంతో ఒక వెలుగు వెలిగిన నటశేఖరులు మన నాటక రంగాన్ని శాసించి బ్రతికారు. ‘గోపాలునితో భూపాలుడు’ అని 78ఆర్‌పిఎం గ్రామఫోన్ రికార్డులో అబ్బూరి వరప్రసాదరావు శ్రీకృష్ణ పాత్రలో పాడిన పద్యాలు ఆ రోజుల్లో ఇళ్లల్లో విపరీతంగా వింటూ ఉండేవారు.
‘చెల్లియో, చెల్లకో’ ‘బావా! ఎప్పుడు వచ్చితివీవు’ ‘సంతోషంబున సంధి చేయుదురే’ వంటి పద్యాలు.. రాగభావంతో, చక్కని చిక్కనైన గమకాలతో సుస్పష్టంగా పాడేవాడు. ఏమి శ్రుతిశుద్ధత? ఏమా గమకం? వేగంగా పాడే సంగతులన్నీ అతి స్పష్టంగా ఉండేవి. నాదం నాభి నుంచి బయలుదేరి వచ్చేది. కృష్ణ పాత్రలో షణ్ముఖి ఆంజనేయరాజు మరో ప్రసిద్ధుడైన నటుడు. షణ్ముఖికి అబ్బూరి మానసిక గురువు - ‘షణ్ముఖి ‘చారుకేశి రాగం’ వినండి. సమ్మోహితులౌతాం. రాగాన్ని సాగతీయకుండా, అసలు పద్యం ఎత్తుగడే ఒక సంభాషణలా ప్రారంభమవుతూ ‘రంగస్థల పద్యం ఇలా ఉండాలి’ అని చెప్పిన నటుడు పీసపాటి. విజయవాడ రేడియో కేంద్రానికి వచ్చినప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ చేసే భాగ్యం కలిగింది. రంగస్థలానికి గౌరవం తెచ్చిన సంస్కారమున్న అరుదైన నటుడు పీసపాటి. కాంట్రాక్టు నాటకాలాడే రోజులలో ఆయన రెండో కృష్ణుడు. అంటే రాయబారం సీనులో శ్రీకృష్ణుడన్నమాట. మొదటి కృష్ణుడు ‘ఈలపాట’ రఘురామయ్య.
రఘురామయ్య పద్య ధోరణి మరో రకం. హిందూస్థానీ రాగచ్ఛాయలబ్బిన నటులలో రఘురామయ్య ప్రముఖుడు. ఆయన రాగం ఎంతసేపు పాడినా ప్రేక్షకులు ఆనందంగా వినేవారు. అపశృతి పొరబాటున వచ్చేది కాదు. పీసపాటి వారి కృష్ణ పాత్రకు అంతటి ప్రత్యేకతకు కారణం సంభాషణలు పలకటంలో స్పష్టం, పద్యం పాడటంలో విలక్షణమైన శైలి, హావభావాల ప్రదర్శనలో, ఇతర పాఅతలను సమన్వయం చేయటంలో మేటి.
తల్లి గర్భంలో ఉన్నప్పుడే నటనలో ప్రావీణ్యతను సొంతం చేసుకుని, అష్టవంకరలు తిరుగుతూ కుప్పిగంతులు వేయగలిగే విద్యను కూడా కరతలామలకం చేసుకుని హీరోలై, ఆ కళామతల్లి సేవలో తరిస్తున్న వారికి కొత్తగానూ, చాదస్తంగానూ అనిపించవచ్చు.
కానీ, పీసపాటి, తిరుపతి వేంకట కవులు పద్యాలొక్కటే కాదు. వ్యాస భారతమూ, తిక్కన భాగవతమూ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, శ్రీకృష్ణ పాత్ర స్వభావాన్ని కూలంకషంగా వొంటబట్టించుకున్న మహానటుడు.
గత శతాబ్దం మధ్యలో కుర్చీలు, టెంటులూ, సకల ఏర్పాట్లతో ఊరూరా టిక్కెట్టు నాటకాలాడించి, అదేదో సర్కస్ కంపెనీల్లా నాటక సమాజాలు నడిచేవి. కేవలం నాటకాల పిచ్చితో, ఏలూరు మోతేవారి సమాజం, మైలవరం బాలభారతి సమాజం, గద్వాల, అద్దకి, హిందూ నాటక సమాజం, తెనాలి శ్రీకృష్ణ విలాస సభ, గుంటూరు స్టార్ థియేటర్ ఇలా ఎనె్నన్నో... సమాజాలు వెలిశాయి. నటుల్ని అడ్డం పెట్టుకుని దోచుకు తిందామనే అత్యాశ ఏమీ లేని ఆ రోజుల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని దెబ్బతిన్న వారూ వున్నారు. ఆనాటి నటుల దృష్టి కాసుల మీద కాదు కళ మీదే - అంకిత భావంతో నాటకానే్న నమ్ముకున బ్రతికారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వారి పెట్టుబడిగా శాశ్వత కీర్తిని మూట గట్టుకున్న వారిలో కపిలవాయి రామనాథ శాస్ర్తీ ప్రముఖుడు.
1930-40 ప్రాంతాల్లో పౌరాణిక నాటక రంగాన్ని ఉత్తుంగ శిఖరాలపై ప్రతిష్ఠించి, పద్య గానానికి నిర్వచనాన్ని చెప్పి ‘మెలొడీ కింగ్ ఆఫ్ ఆంధ్ర’గా ప్రసిద్ధి చెందిన కపిలవాయిని గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు. ఆ రోజుల్లో దక్షిణ దేశంలో శాస్ర్తీ రికార్డు వినబడని హోటల్ ఉండేది కాదు. కొలంబో, రంగూన్‌లలో దాక్షిణాత్యులకు అత్యంత ప్రేమపూర్వకమైన పాటలు రామనాథ శాస్ర్తీవే.
లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఆడియో ఫంక్షన్లు డాబుగా నిర్వహిస్తున్న ఈ రోజుల్లో, ఐదు పైసలు ఖర్చు లేకుండా రసిక జన హృదయాల్లోనే శాశ్వతమైన స్థానాన్ని ఆక్రమించిన ఆ మహా గాయకుల ప్రజ్ఞా ప్రాభవాలకు సరితూగే అవార్డులూ, రివార్డులూ లేవు.
హెచ్‌ఎంవి (హిజ్ మాస్టర్స్ వాయిస్) కంపెనీ భారీ నష్టాల్లో కూరుకుపోయినప్పుడు ఆ కంపెనీ నష్టాలను భర్తీ చేయటానికి రామనాథ శాస్ర్తీగారు పాడిన పాటలు, పద్యాల రికార్డులు (40) విడుదల చేశారు. ఒక్క గాయకుడు అన్ని రికార్డులివ్వటం ఆ రోజుల్లో పెద్ద రికార్డు. అంతే ఆ కంపెనీ లాభాల బాట పట్టింది.
అప్పట్లో యడవల్లి సూర్యనారాయణ పెద్ద నటుడు. ఆయన ధరించిన పాత్రలన్నీ తాను వేస్తూ మైలవరం బాల భారతి సమాజాన్ని నిర్వహిస్తూ ‘సతీ సావిత్రి’లో సత్యవంతుడు, ‘కృష్ణలీలలు’లో కంసుడు, కృష్ణుడు, రామదాసు, శాకుంతలం, పాదుకా పట్ట్భాషేకం, రాధాకృష్ణ మొదలైన నాటకాలలోని ప్రధాన పాత్రలలో జీవించి అమోఘమైన తన గాత్ర సంపత్తితో ఉర్రూతలూగించిన శాస్ర్తీ పాట అనితర సాధ్యమని మా నాన్నగారు (మల్లాది శ్రీరామమూర్తి) చెప్తూండేవారు. పద్యానికి తగుమాత్రంగా రాగాన్ని జోడించి సందర్భ శుద్ధిగా అప్పటికప్పుడు తన మనోధర్మాన్ని మేళవించి, ప్రేక్షకుల వన్స్‌మోర్ కేకలతో పొంగిపోయి, తన ఆరోగ్యాన్ని సైతం లక్ష్యపెట్టకుండా చిన్నతనంలోనే కనుమరుగైన గాన గంధర్వుడు శాస్ర్తీ. తెలుగు వారి రంగస్థలం పాటలతో, పద్యాలతో రాగరంజితమైన ‘గానమే నటన’ అనే భావనలో నటులు, ప్రేక్షకులు భావించే రోజుల్లో వచ్చిన నటుడు సి.ఎస్.ఆర్. ఆంజనేయులు.
శ్రీకృష్ణ తులాభారం, రాధాకృష్ణ నాటకాల్లో కృష్ణుని పాత్ర, రామదాసులో, భక్తతుకారాం నాటకాల్లో ప్రధాన పాత్రలు చేస్తూ, తనకంటే పాడగలిగే నటుల మధ్య ప్రతిభతో రాణించిన నటుడు, ఐదు పదులు నిండకుండానే నిష్క్రమించటం దురదృష్టం.
కొన్ని వేషాలు ఆయా నటుల వల్ల గౌరవాన్ని పొందుతాయి. నాటక కళాప్రపూర్ణుడైన అద్దంకి శ్రీరామమూర్తి పేరు చెబితే దశరథుడు గుర్తుకొస్తాడు. ఆ పాత్రలో లీనమై, నిండుతనంతో పాడే ఆయన పద్యాలను విజయవాడ రేడియో కేంద్రంలో రికార్డు చేసే అదృష్టం కలిగింది. శృతి మాధుర్యం నిండిన గాత్రం ఆయనది. విజయవాడలో, పాలుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర సంగీతం నేర్చుకుని, పాదుకా పట్ట్భాషేకంలో దశరథుడి పాత్రతో ప్రసిద్ధమై, ఆ రోజుల్లో యడవల్లి, ఉప్పులూరి సంజీవరావు, కపిలవాయి, జొన్నవిత్తుల వంటి ఉద్దండులతో దీటుగా నటించిన మేధావి.
నాటకాలైనా, సినిమాలైనా సంభాషణలే ముఖ్యం. పాత్రల మధ్య సమన్వయంతో కథను నడిపేవీ సంభాషణలే. సాంకేతిక జ్ఞానం బాగా పెరిగి పెరిగి చివరకు.. నటించేది ఒకరు, వారికి డైలాగులు చెప్పేది మరొకరు, పాడేది ఎవరో? పెదవులు కదిపేది మరొకరు - ఇదీ ప్రస్తుతం మనం చూస్తున్న చోద్యం. ‘సహజ నటులు’ అనే మాట అందరికీ వర్తించదు.
1895-1955 సం. మధ్య వేమూరు గగ్గయ్య అనే నటుడు అటు నాటక రంగంలోనూ సినిమా రంగంలోనూ సమానంగా ప్రేక్షకామోదం పొందిన అతి కొద్ది మందిలో ఒకడు. ఆయన పేరు చెబితే పిల్లలు భయపడేవారు. రంగస్థలం మీద వస్తూంటేనే భయం కలిగేదట. రెండు తరాల పాటు సతీ సావిత్రిలో యముడుగా, ద్రౌపదీ వస్త్రాపహరణంలో శిశుపాలుడుగా, ప్రహ్లాదుడులో హిరణ్య కశిపుడై ఆయన వేసిన వేషాలన్నీ న భూతో న భవిష్యతి. ‘కృష్ణలీలలు’లో ‘్ధక్కారముం సైతునా’ సావిత్రితో ‘పోబాల పొన్మికన్ ఈ మృగారణ్యమున రావలదు, రాతగదు’ పాటకు ఈయనే ఆద్యుడు.
‘మనం చూసే దృష్టిని బట్టే సృష్టి’. వేలాదిమంది వెర్రిగా చూస్తున్నారని కుప్పిగంతులతో, వెకిలి వేషాలతో చేసే నటనకు ఆ కాసేపు స్పందన ఉంటుంది. ఆ తర్వాత కాలగర్భంలో ఊరూ పేరూ లేకుండా పోతుంది. తాము చేసే పాత్రలకు న్యాయం చేస్తూ ఇతర నటీనటులతో సమన్వయం చేసుకుంటూ, అప్పటికప్పుడు వారివారి మనోభావాలను అభినయం ద్వారా వ్యక్తపరుస్తూ ప్రేక్షక హృదయాలలో శాశ్వత స్థానాన్ని పొందిన ఆ నటుల స్థిరాస్తి వారి అభినయ కళా కౌశలం. అద్వితీయ గాన మాధుర్యం కాంభోజి, తోడి, శహన, కల్యాణి రాగాలలో వారు పాడే పద్యాలు, కర్ణాటక శాస్ర్తియ సంగీతం మాత్రమే పాడే సంగీత విద్వాంసులు సైతం తలలూపుతూ కూర్చుని వినేవారు.
‘గుత్తి వంకాయ్ కూరోయ్ బావా! కోరి వండినానోయ్ బావా!’ అంటూ హొయలొలకబోస్తూ సమ్మోహపరచిన మరో నటుడు బందా కనక లింగేశ్వర్రావు. ‘బందా’ శ్రీకృష్ణుని పాత్రకు ప్రసిద్ధి. అయినా బాహుకుడు, కాళిదాసు, బిల్వమంగళుడు, ప్రతాపరుద్రుడు, కర్ణుడు మొదలైన పాత్రలు నటించటంలో ఆయనకు ఆయనే సాటి.
కూచిపూడి కళాక్షేత్ర వైభవానికి ఆయన ముఖ్య కారకుడు. విజయవాడ ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా ఆయన నిర్వహించిన ‘వరవిక్రయం’ నాటికి నేడు, ప్రతాపరుద్రీయం తెలుగు నాటక వైభవాన్ని దశదిశలా చాటాయి.
‘పదిమంది ముందూ, ఈ మాట పలికితే గౌరవంగా ఉంటుందా? ఇలా పాడితే జనం ఊరుకుంటారా?’ అని ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. శరీర సౌష్టవానికి, అంగాంగ (బాడీ లాంగ్వేజ్) ప్రదర్శనకు తగ్గపాటలు వ్రాయించటం, పాడటం, కుప్పిగంతులతోనూ, స్టెప్పులతోనూ, వెర్రెక్కించటం ఆ రోజుల్లో లేవు.
పెద్దవాళ్ల అనుభవాలు, ఆలోచనలే సమాజానికి శ్రేయోమార్గాన్ని చూపెట్తాయి అనటానికి నిదర్శనంగా నిలిచి సంస్కారవంతమైన రసికులను, ప్రేక్షకులను తయారుచేసిన నటులు వారు.
పౌరాణిక, సాంఘిక, చారిత్రక నాటకాలలోని స్ర్తి పాత్రలకు శాశ్వతత్వాన్ని కలిగించిన ప్రజ్ఞాశాలి స్థానం నరసింహారావు ‘మీరజాలగలడా సత్యాపతి వ్రత విధాన మహిమన్’ పాట ఎవరు మరవగలరు? కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డు, పద్మశ్రీలు ఒకదాని తర్వాత మరోటి ఆయన ఖాతాలో చేరటంలో ఎవరూ ఆశ్చర్యపోలేదు. గోవిందరాజుల సుబ్బారావు, మాధవపెద్ది, పిల్లలమర్రి, పెద్దిబొట్ల, చలపతి లాంటి దిగ్గజాలతో నటించిన మేటి ఆయన ‘రోషనార’కు జోహార్లు అర్పించింది ప్రేక్షక లోకం. ఖంగుమనే కంఠంతో ‘తారా!’ అనే పిలుపుతో ప్రేక్షకులను సమ్మోహపరుస్తూ, కంచుకంఠంతో ఐదు దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటుడు పువ్వుల సూరిబాబు. రాజరాజేశ్వర నాట్య మండలి ద్వారా కొప్పరపు సుబ్బారావుగారి ‘తారాశశాంకం’ ఆయనను ధృవతారగా నిలబెట్టేసింది.
శృతి మాధుర్యం, కమ్మని గానం, ఆ గానంలో రకరకాల గమక సౌందర్యం.. అన్నీ కలబోసుకున్న నటుడు.
కర్ణాటక, హిందూస్థానీ బాణీలు రెంటినీ కలిపి పాడగలిగేవారు మనకు ఇద్దరున్నారు. ఒకరు రఘురామయ్య. మరొకరు జొన్నవిత్తుల శేషగిరిరావు. 20వ శతాబ్దపు తొలి రోజుల్లో నాటక రంగంలో దూసుకొచ్చిన జొన్నవిత్తుల మహరాష్ట్రుల సంగీత శైలిని వొంటబట్టించుకుని ‘ఆంధ్ర గంధర్వ’గా ప్రసిద్ధుడయ్యాడు. ఆ రోజుల్లో మహావిద్వాంసులైన కోనేరి రాజపురం వైద్యనాథయ్యర్, తిరుచ్చి గోవిందస్వామి పిళ్లై వంటి వారి ఎదురుగా కూర్చుని గంటల తరబడి ‘కృష్ణ కర్ణామృతం’ శ్లోకాలు రాగమాలికలుగా వినిపించేవాడంటే ఆలోచించండి.
భావాలకు తగ్గ శైలి ఏ సంగీత పుస్తకాలలోనూ వ్రాయబడదు. ఎవరికి వారే అనుభవంతో తెలుసుకోవాల్సిందే. రాత్రికి రాత్రే నటులై వెలిగిపోతున్న వారిని చూస్తున్నాం. వారు చాలా అదృష్టవంతులు.
కానీ ఈ మహానటులతో పోల్చతగిన వారిని లెఖ్క పెట్టాలంటే మన చేతివ్రేళ్లు ఎక్కువే. వీరిలో చాలామంది కృష్ణా, గుంటూరు జిల్లా వాసులవటం మన భాగ్యం. క్రమశిక్షణ, కఠోర సాధన, అంకిత భావం, అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక వెలుగు వెలిగిన వీరిని ఎన్ని తరాలైనా ఈ తెలుగు జాతి మరచిపోగలదా.
*

- మల్లాది సూరిబాబు 9052765490