S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో-మనం ఎడిటర్‌తో ముఖాముఖి

వరిగొండ కాంతారావు, హనుమకొండ
ఒక ఊహ: మాన్య ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌గారే ఢిల్లీలో ‘సరిబేసి’ ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు. బేసి రోజున 88 అన్న నెంబరున్న టాక్సీని పట్టుకొని ఫైన్ కట్టమన్నారు. అందుకా టాక్సీ డ్రైవర్ ఏకసంఖ్య చేస్తే 7 వస్తుంది. అది బేసి సంఖ్య కాబట్టి ఫైన్ కట్టక్కర్లేదు అన్నాడు. అప్పుడు కేజ్రీవాల్ ఏమంటారు?
మరునాడూ తిరగనీయం అంటాడు.

డి.ఎస్.శంకర్ (వక్కలంక)
ఇంట గెలవడం వేరు, రచ్చ గెలవడం వేరు అన్నది మోదీగారి విషయంలో నిజం అవుతున్నదంటారా?
గిట్టనివారు ఇంట్లో చేస్తున్న రచ్చను గెలవడమే కష్టం.

‘తిక్కరేగిందా’ ‘కోకెత్తుకెళ్లింది’ లాంటి పాటలు పాడిన గాయకుడు ఒకరు ఇప్పుడు వస్తున్న పాటల గురించి ఆవేదన వ్యక్తం చెయ్యడాన్ని ఏమనాలి?
వృద్ధనారీ పతివ్రత

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
ఏ మతస్థులకు వాళ్ల పండుగలకు సెలవలిస్తే పోలా. ఇప్పుడు చూడండి. బ్యాంకులకు నాలుగు రోజులు సెలవిచ్చారు. ఏటియంలలో సమృద్ధిగా డబ్బులు పెట్తే మాత్రం అందరికీ కార్డులుండద్దూ.
ఏ మతం పండగకైనా అన్ని మతాలవారూ సెలవు తీసుకోవటమే ఇండియన్ బ్రాండ్ సె(పె)క్యులరిజం.

భూత్‌పూర్ చంద్రశేఖర్, విశాఖపట్నం
కొందరు స్వార్థ రాజకీయ నాయకులు ఓటుకు నోటుతో పదవుల్ని డైరెక్టుగానే సీటు ఎక్కేస్తున్నారు. ఎలక్షన్లు నిర్వహించే బదులుగా ఎమ్మెల్యే, ఎం.పీ, ముఖ్యమంత్రి పదవులకు డబ్బు కట్టేసి కొంటే లక్షల కోట్లు ఎలక్షన్ ఖర్చు మిగిలిపోతుంది. ఆ డబ్బుతో నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గిస్తే బీదవారు కడుపునిండా ఓ రోజు అయినా మంచి తిండి తింటాడుగా?
నో ఛాన్స్. గడ్డి తినేవాళ్లకు లైసెన్సులిస్తే జనం చేత గడ్డి తినిపిస్తారు.

కాకుటూరి సుబ్రహ్మణ్యం, చెన్నై
ఎద్దులను తీవ్రంగా హింసించి బాధ కలిగిస్తున్నారనే కారణంగా సుప్రీంకోర్టు ‘జల్లికట్టు’ పద్ధతిని నిషేధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు తమిళనాడులో కొందరు ఇది మా సంప్రదాయం అని నిషేధం తొలగించాలని ఆందోళన చేస్తున్నారు. ఓటు బ్యాంక్ లక్ష్యంతో చాలా రాజకీయ పక్షాలు దీన్ని సమర్థిస్తున్నాయి. ఒక మంచి పనికి ప్రజలు ప్రోత్సాహం చెయ్యాలి కాని ఈ నిషేధం తొలగించాలని కేంద్రంపై ఒత్తిడి చెయ్యడం దుర్మార్గం కాదా?
అది మన రాజకీయ ‘కట్టు’

బి.చంద్రశేఖర్, సికిందరాబాద్
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోలేక ప్రభుత్వాలు చేతులెత్తేస్తే, అతడు తన వారసున్ని ప్రకటించడం మాత్రం టీవీల్లో చూయిస్తున్నారంటే, అతడి డాన్ సామ్రాజ్యం కొనసాగుతున్నట్లే లెక్క? ఐతే మన చట్టాలు చేతులెత్తేసినట్లేనా?
వాటి చేతులను ఎప్పుడో కట్టేశారు.

Divakaramk2004@gmail.com
‘వెన్నెల’ స్పెషల్ ఫేజీని శుక్రవారం నుంచి ఆదివారానికి మారిస్తే బాగుంటుందేమో. సినిమా రివ్యూలు వచ్చేప్పటికి, ఆయా సినిమాలు థియేటర్లలో కనిపించటం లేదు. ఈ రోజుల్లో పది రోజులంటే మరీ ఎక్కువ కదా.
మీ సూచన తప్పక పరిశీలిస్తాం.

బి.విజయలక్ష్మి, హైదరాబాద్
చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అని లొట్టలేసుకొని తినే ఈ మానవ జాతికి ఆ మూగ ప్రాణులను గొంతులు కోసే అధికారం ఎవరిచ్చారు? మరో జన్మలో గొంతులు కోసిన వారందరినీ కోళ్లు, మేకలుగా సృష్టిస్తే ఏం చేస్తారు?
మాంసాహారం ధర్మసమ్మతమే.

సి.సాయిమనస్విత, విజయవాడ
ఆంధ్రభూమిలో వివిధ శీర్షికలకు కార్డులు, ఇన్‌లాండ్ కవర్లలోనే తీసి పంపించాలన్న నిబంధనలను దయచేసి తొలగించండి. పోస్ట్ఫాసులో కార్డులు, కవర్లు అడుగుతుంటే ఆదిమ మానవుడిని చూసినట్లు చూస్తున్నారు. కాలంతోపాటు అప్‌డేట్ అవ్వండి అంటూ ఉచిత సలహాలను వారు ఇస్తున్నారు.
అలాంటి నిబంధనేమీ లేదు. ఎలాగైనా పంపొచ్చు.

మనం వంద రూపాయలకు వస్తు సేవలు పొందుతుంటే, అందులో 30 రూపాయలకు వివిధ పన్నులు చెల్లించవల్సి వస్తోంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇంత అత్యధికంగా పన్నులు చెల్లించుకునే వ్యవస్థ మనకు ఎందుకు ఏర్పడింది?
ప్రభుత్వాన్ని మేపడానికి.

ఎం.కనకదుర్గ, తెనాలి
తాము అధికారంలోకి వచ్చిన వంద రోజులలో విదేశాలలో పోగుపడ్డ నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని ప్రతిజ్ఞ చేసిన కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నరైనా ఆ దిశగా స్పష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నల్లధనం విషయంలో అన్ని పార్టీల వైఖరి దొందు దొందేనన్నట్లుగా ఉంది. ఎప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటారా?
అది ఈ పార్టీల వల్ల కాదు.

లౌకిక వాదమనగా హిందూ మతమును అదే పనిగా విమర్శించుట, వారి ఆచార వ్యవహారములలో తప్పులను వెదికి పట్టుకొని దానిపై రాద్ధాంతం చేయుట, మెజారిటీ ప్రజలను టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌లా వ్యవహరిస్తూ, మైనారిటీ ప్రజల పట్ల కపట ప్రేమ నటిస్తూ వారిని రాజకీయావసరాల కోసం వాడుకొనుట, పరమత సహనం అంటూ నీతులు చెబుతూ హిందూ మతమును అదే పనిగా ద్వేషించుట అని నిర్వచనం మార్చేస్తే బాగుంటుందేమో కదా?
మార్చక్కర్లేదు. ఉన్నదే అది.

ఎస్.ఎం. విజయవాడ
గత రెండు సంవత్సరాలుగా కార్మికులకు ప్రభుత్వం జీతభత్యాలు పెంచడం లేదు.్ధరలు మాత్రం ఎన్నోరెట్లు పెరుగుతున్నాయి. ప్రజా సంక్షేమం చూడాల్సిన ప్రజా ప్రతినిధుల జీతభత్యాలు నాలుగింతలు పెరిగాయి. సమాజంలో ఆర్థిక అసమానతలకు ఇటువంటి అహేతుక చర్యలు దారితీయవా?
వాళ్లతో పోలిక ఏమిటి? వాళ్లు మన వ్యవస్థకు అల్లుళ్లు. *

**************************

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : bhoomisunday@deccanmail.com

***************************