S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సిసలైన ‘షీ’రోలు

అందం ఆనందాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. సమాజంలో గౌరవాన్ని తీసుకొస్తుంది.
సాధికారత దిశగా తీసుకెళ్తుంది. వీటితోపాటు అందమైన జీవితాన్నీ ఇస్తుంది. - ఇది ఒక నమ్మకం!

వైకల్యం ఆత్మన్యూనతను పెంచుతుంది. స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తుంది. నలుగురిలో తిరగలేని స్థితికి తీసుకువెళుతుంది. వివక్షనూ వెంట తెస్తుంది. ఒంటరితనాన్ని చేరువ చేస్తుంది. ఉపాధినీ దూరం చేస్తుంది. బతికినంతకాలం నిస్సారంగా జీవించాల్సిందేనన్న బలమైన భావననూ తీసుకొస్తుంది. - ఇది ఒక భయం!

అందం అంటే - కంటికి కనిపించే రూపలావణ్యమే కాదు... స్వచ్ఛమైన మనసు, నిండైన ఆత్మవిశ్వాసం, సడలని మనోనిబ్బరం - ఇవన్నీ కలగలిసిన ఆత్మసౌందర్యమే అసలైన అందం. - ఇది ఉంటే ఎంతటి కురూపికైనా విజయం తథ్యం. - ఇది నిజం!

వితం వడ్డించిన విస్తరి కాదు, ఒడిదుడుకులమయం. ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు ఎంతటివారికైనా తప్పదు. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిన నాడే జీవితానికి సార్థకత. అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుని, అవరోధాలను దీటుగా ఎదుర్కొన్ననాడే విజయం చేరువ అవుతుంది. విజయానికి లింగభేదం లేదు, వివక్ష అంతకన్నా లేదు. ఆశావహ దృక్పథం, పట్టుదల, తపన ఉంటే అవకాశాల రాచబాట ఎల్లవేళలా స్వాగతిస్తూనే ఉంటుంది. ఇందుకు ఉదాహరణే ఆగ్రాలోని షీరోస్ హాంగవుట్. యాసిడ్ దాడులతో తమ కలల సౌధంలో చీకట్లు ముసురుకున్నా మొక్కవోని ధైర్యంతో సాధికారత సాధించి అందరి దృష్టినీ తమవైపు తిప్పుకున్నారు. ఒకప్పుడు తమని పలకరించడానికే జంకినవారు, ఎదురుపడగానే తల తిప్పుకున్నవారు ఇప్పుడు ఔరా అని ప్రశంసిస్తున్నారు. వారే - యాసిడ్ దాడి బాధితులు, షీరోస్ హాంగవుట్ సృష్టికర్తలు - లక్ష్మి అగర్వాల్, గీతా లోధి, నీతూ లోధి, రీతూ సైని, రూపా.
వీరు అందంగా కనిపించకపోవచ్చు, ఆకట్టుకోలేకపోవచ్చు, చూడగానే మొహం తిప్పేసుకునేలా ఉండవచ్చు, వారితో మాట్లాడటానికి మనసు నిరాకరించవచ్చు - ఎవరు ఎలా అనుకున్నా వారికొచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే వారు ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నారు. అవమానాలు వారికి కొత్త కాదు, వారిముందున్న అవకాశాలను అందిపుచ్చుకున్నారు, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచారు. దాని ఫలితమే - షీరోస్ హాంగవుట్. దేశ విదేశాల్లో దీని పేరు తెలియని వారు అరుదు. యాసిడ్ దాడి రూపాన్ని చెరిపేయగలదేమో కానీ, ఆత్మవిశ్వాసాన్ని రూపుమాపలేదని నిరూపించిన నిజమైన షీరోలు. సాధికారత భేరీ మోగించిన నవ శకం నారీమణులు.
యాసిడ్ దాడి ఎవరి జీవితంలోనైనా ఎంతటి ఉత్పాతాన్ని సృష్టిస్తుందో చెప్పనక్కర్లేదు. అందులోనూ భారత్ లాంటి సమాజంలో ఆడపిల్లల పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రేమ రూపంలో కావొచ్చు, ప్రతీకారం నుంచి కావొచ్చు - ఇతరత్రా ఏమైనా కావొచ్చు. కానీ యాసిడ్ దాడి బాధితురాలు మాత్రం మహిళే. ఆ దాడి ఆమె జీవితాన్ని తల్లకిందులు చేసేస్తుంది. భవిష్యత్తును చీకటిమయం చేస్తుంది. వివక్షకు గురిచేస్తుంది. అవకాశాల్నీ, కలల్నీ పాతాళానికి నెట్టేస్తుంది. మొత్తంగా ఆమె జీవితం అంధకారంలో పడిపోతుంది. నిందితులకు శిక్షలు పడినా, బాధితురాలు సాధారణ జీవనానికి అలవాటు పడటానికి జీవితకాలమే పడుతుంది. తాను చేయని తప్పుకు ఏ న్యాయస్థానమూ విధించలేని శిక్షననుభవిస్తూ నరకయాతన పడుతూనే ఉంటుంది. సమాజంలో ఈసడింపులు, అనుక్షణం ఆత్మన్యూనత ఆమెను ఒక్క అడుగు కదలనివ్వదు. అలాంటి పరిస్థితుల్లో తన కాళ్లమీద తాను నిలబడాలంటే భగీరథ ప్రయత్నమే చెయ్యాలి. అడుగడుగునా ఎదురయ్యే అడ్డంకులను, అవమానాలను నిబ్బరంగా ఎదుర్కొని విజయపథంవైపు పయనించడం చెప్పినంత తేలికా కాదు, ఊహించినంత సులువూ కాదు. ఒకపక్క న్యాయపోరాటం, మరోపక్క వైద్య చికిత్సలు, ఇంకోపక్క తనకాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నం - అన్నీ ఒక్కసారిగా జరిగేవి కావు. అలాగని జరిగినదానికి బాధడుతూ, కుమిలిపోతూ కూర్చుంటే జీవితం అంధకారబంధురమే. యాసిడ్ గాయాలకు ఎడతెగని వైద్య పరీక్షలు, వాటికయ్యే వ్యయం ఏ మనిషినైనా, ఏ కుటుంబాన్నైనా ఒక్కసారిగా కుంగదీస్తాయి. ఇలాంటి ఎన్నో ప్రతిబంధకాలను ధైర్యంగా ఎదుర్కొని సాధికారత సాధించడం ఎప్పటికీ స్ఫూర్తిదా యకం. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రతిక్షణం ఎదురయ్యే అవరోధాలను ఎదుర్కొంటూ, వాటిని తట్టుకుంటూ ఎలా పురోగమించాలో ఈ ఐదుగురే నిలువెత్తు ఉదాహరణ. వారంతా యాసిడ్ దాడి బాధితులే. తమకెదురైన ప్రతి చేదు అనుభవం వారిలో విశ్వాసాన్ని పెంచింది. జీవితంలో నిలదొక్కుకోవాలన్న తపన పెంచింది. సాధికారత సాధించి, సొంతకాళ్లపై నిలబడి ఆదర్శంగా నిలబడాలన్న పట్టుదలకు బీజం వేసింది.
తాజ్‌మహల్ - షాజహాన్ ప్రేమకు చిహ్నం. చారిత్రక కట్టడంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ సుందర కట్టడం దేశ విదేశీ సందర్శకులతో నిత్యం కళకళ లాడుతుంటుంది. ఆగ్రా అనగానే గుర్తుకొచ్చేది తొలుత ఇదే. దీని తర్వాత అక్కడి సమీపంలోనే ఉన్న ‘షీరోస్’కూ సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుందంటే ఆశ్చర్యం కలిగించక మానదు. యాసిడ్ దాడి బాధితులు స్వయంగా నెలకొల్పిన ఈ రెస్టారెంట్ లాంటి హాంగవుట్‌ను సందర్శించడం ఆనవాయితీగా మారింది. విదేశీ యాత్రికులు, పరిశోధకులు, డాక్యుమెంటరీ చిత్రాలు తీసేవారు, కళాకారులు వంటివారితో షీరోస్ ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. ఇందులో టీ, స్నాక్స్, బ్యూటీపార్లర్, డిజైనర్ డ్రెసెస్ వంటి వాటితో పాటు పుస్తకాలు చదువుకునే సౌలభ్యం కూడా ఉంది. పెయంటింగ్స్ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇందులో దేనికీ నిర్దిష్టమైన ధర లేదు. ఎవరికి తోచినంత వారు ఇవ్వవచ్చు. వచ్చిన సొమ్మంతా షీరోస్ నిర్వహణకు, యాసిడ్ బాధితుల పునరావాస కేంద్రం కోసమే. ఐదుగురు యాసిడ్ బాధితుల ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ షీరోస్‌ను వెదుక్కుంటూ ప్రత్యేకంగా వస్తున్నారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
ఇదీ అంకురార్పణ
షీరోస్ హాంగవుట్‌కు బీజం వేసింది చాన్వ్ ఫౌండేషన్ డైరెక్టర్ ఆశిష్ శుక్లా. యాసిడ్ దాడి బాధితులైన తల్లీ కూతుళ్ల బతుకుదెరువు కోసం ఓ చిన్న దుకాణాన్ని నెలకొల్పాలన్న ఆలోచన నేడు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తీసుకొస్తుందని, ప్రపంచంలోనే ఇది ప్రత్యేకతను సంతరించు కుంటుందని ఆయనకు అప్పట్లో తెలియదు.

1992లో భర్త చేతిలో యాసిడ్ దాడికి గురైన గీత, ఆమె కుమార్తె నీతూ కోసం ఓ దుకాణాన్ని నెలకొల్పేందుకు ఆశిష్ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇతర ప్రాంతాలనుంచి కూడా యాసిడ్ బాధితులు సంప్రదించడంతో ఐదుగురిని ఒక బృందంగా ఏర్పాటుచేసి షీరోస్ హాంగవుట్ అని నామకరణం చేశారు. తాజ్‌మహల్ ఉన్న ఫతేబాద్ రోడ్‌లో 2014 అక్టోబర్‌లో లాంఛనంగా ప్రారంభమైనా డిసెంబర్ 10న పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆకర్షణీయమైన చిత్రాలతో, యాసిడ్ దాడి బాధితుల ఫ్యాషన్ షో చిత్రాలు, గోడల మీద దర్శనమిచ్చే పెయంటింగ్స్ ఆ రోడ్డున వెళ్లే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుం టాయ. యాసిడ్ బాధితులు నెలకొల్పిన స్టాల్ కావడం, ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం లభించడంతో షీరోస్ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. టీవీల్లో ఇంటర్వ్యూలు ప్రసారం కావడం, ఫ్యాషన్ షోల్లో పాల్గొనే అవకాశం కూడా ఈ బాధితులకు దక్కడం విశేషం. ఈ ఐదుగురు వనితలు ఇంతటితో ఆగకుండా యాసిడ్ దాడుల నిరోధానికి, బాధితుల పునరావాసానికి చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. వారిలో స్థైర్యాన్ని నింపి, తమ కాళ్లమీద తాము నిలబడేలా, జీవితంలో నిలదొక్కుకునేలా కృషి చేస్తున్నారు.
నారీశక్తి అవార్డు
దేశంలోనే కాక విదేశాల్లోనూ ఖ్యాతిగాంచిన షీరోస్ హాంగవుట్ ఈ ఏడాది నారీశక్తి అవార్డును సాధించింది. మహిళా దినోత్సవం నాడు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నుంచి యాసిడ్ దాడి బాధితులైన ‘షీరోస్’ నిర్వాహకులు ఈ అవార్డును అందుకుని మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. రూపం చెదిరినా, చీకట్లు అలుముకున్నా మరెందరికో స్ఫూర్తిగా నిలిచిన వారి జీవన ప్రస్థానానికి ఈ అవార్డు నిలువెత్తు ప్రతీక. తమలాంటి బాధితుల జీవితాల్లో వెలుగులు ప్రసరించే దిశగా వారు చేస్తున్న కృషికి ఈ అవార్డు అరుదైన గుర్తింపును తీసుకొచ్చింది.
బాధితులం కాదు..
పోరాటయోధులం
యాసిడ్ దాడి అనంతరం జీవితం ముగిసినట్లేననుకునేవారు ఎందరో. వారిని అంటరానివారుగా, పలకరిస్తే సహాయం అడుగుతారేమోనన్నంతగా అటు బంధువులు, ఇటు స్నేహితులు, ఇరుగుపొరుగువారు - ఒక్కరనేమిటి సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా చూసేవారే. అలాంటి విషమ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడినవారు కొందరైతే... తమలో తామే కుమిలిపోతూ జీవితాన్ని వెళ్లదీసేవారు మరికొందరు. ‘నిన్ను చూస్తే భయపడతారు’ వంటి మాటలను విని, భరించి నిలదొక్కుకున్నవారిలో లక్ష్మీ అగర్వాల్ ఒకరు. ‘యాసిడ్ దాడి బాధితులు’ అనే పిలిస్తే ఆమె ఊరుకోదు. ఎందుకంటే మేమంతా బాధితులం కాదు, పోరాటయోధులం అని సగర్వంగా ప్రకటిస్తోంది. యాసిడ్ దాడి అనంతరం ఆమె అనుభవించిన నరకం ప్రతి ఇంటర్వ్యూలోనూ కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఆమె మాటల్లోనే...
నా స్నేహితురాలి సోదరుడి ప్రేమను, పెళ్లిని నిరాకరించానని 2005లో నాపై యాసిడ్ దాడి చేశాడు. భయ్యా అని పిలిచినా వినిపించుకోలేదు. అతనిలో అంత కర్కశత్వం ఉందని అనుకోలేదు. యాసిడ్ ధాటికి 45 శాతం శరీరం కాలిపోయింది. ఏడు సర్జరీలు జరిగాయి. 2009లో జరిగిన చివరి ఆపరేషన్ భారత్‌లో అప్పటివరకు ఎవరికీ జరగలేదు. ఆ తర్వాత కోలుకున్నాను. స్నేహితులు, బంధువులు మొహం చాటేశారు. అప్పుడే వారి అసలు రూపం బయటపడింది. మూడేళ్లపాటు బయటికి రాలేకపోయాను. కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో నైపుణ్యం సంపాదించాను. అయినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఓ స్కూల్ యాజమాన్యం అయితే ఏకంగా ‘నిన్ను చూస్తే పిల్లలు భయపడతారు’ అని మొహానే చెప్పేశారు. ఎందుకు భయపడాలి అని ప్రశ్నించుకున్నాను. సమాజంలో ఈ రకమైన ధోరణి తొలగిపోవడానికి తన ఎదుగుదలే మార్గమని నిర్ణయించుకున్నాను. తలెత్తుకు తిరిగేలా, సమాజం గౌరవించే స్థితికి చేరాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలో యాసిడ్ దాడుల నిరోధానికి పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాను. తొలి అడుగుగా మరో బాధితురాలు రూపాతో కలిసి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాను. యాసిడ్ అమ్మకాలను నియంత్రించాలని, బాధితులకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నది ఆ పిల్ లక్ష్యం. మా పోరాటానికి ‘స్టాప్ యాసిడ్ అటాక్స్’ స్వచ్ఛంద సంస్థకు చెందిన సామాజిక కార్యకర్త అలోక్ దీక్షిత్ మద్దతు పలికారు. ఆ సంస్థలో క్యాంపెయిన్ కోఆర్డినేటర్‌గా పనిచేసేందుకు అవకాశం ఇచ్చారు. నా తండ్రి సహకారం, అలోక్ మద్దతు నాలో మరింత స్థైర్యాన్ని నింపాయ. మా పిల్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2013లో మార్గదర్శకాలు జారీచేసింది. 18 ఏళ్లలోపు వారికి యాసిడ్ అమ్మకాలు జరపరాదనీ, గుర్తింపుకార్డు ఉన్నవారికే యాసిడ్ అమ్మాలనీ ఆదేశాలు జారీచేసింది. మా పోరాటానికి ఇది తొలి విజయం.
వ్యక్తిగత జీవితానికి వస్తే - నేను ఈ స్థాయికి రావడానికి సహకరించిన అలోక్ దీక్షిత్ సహజీవనం. మాకు ఓ పాప. నా జీవితం ఇప్పుడు హాయిగా, ఆనందంగా సాగిపోతోంది. యాసిడ్ దాడులు జరగకుండా చైతన్యం తీసుకువచ్చేందుకు, బాధితులకు పునరావాసం కోసం పోరాడటమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం అంటుంది లక్ష్మీ అగర్వాల్.
1920లోనే తొలి యాసిడ్ దాడి
భారత్‌లో యాసిడ్ దాడులు ఏయేటికాయేడు పెరుగుతూనే ఉన్నాయి. 2011లో 83 కేసులు నమోదుకాగా, 2015 నాటికి దాడుల సంఖ్య 349కు పెరిగింది. ఈ దాడులను నిరోధించడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందిందనడానికి ఈ గణాంకాలే ఓ ఉదాహరణ. తొలి యాసిడ్ దాడి 1920లో ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. బ్రిటిష్ పాలనా కాలంలో ముంబై ప్రెసిడెన్సీలో 1920 సెప్టెంబర్ 6న తొలి సల్ఫ్యూరిక్ యాసిడ్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. భారత యాసిడ్ దాడి బాధితుల ఫౌండేషన్ (ఎఎస్‌ఎఫ్‌ఐ) గణాంకాల ప్రకారం 2010-2015 మధ్యకాలంలోనే 882 యాసిడ్ దాడులు జరిగాయి. ఇవి కేవలం ప్రభుత్వ దృష్టికి వచ్చినవి మాత్రమే. లెక్కలోకి రానివి మరెన్నో. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న యాసిడ్ దాడుల సమాచారం ఈ గణాంకాల్లో చోటుచేసుకోవడం లేదు. ప్రతి ఏటా కనీసం 500 యాసిడ్ దాడులు జరుగుతున్నాయని అంచనా. 2013 నాటి సవరణ చట్టాన్ని కఠినంగా అమలుచేస్తే యాసిడ్ దాడులను నియంత్రించేందుకు అవకాశముంది. అసంఘటిత రంగంలో యాసిడ్ లభ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా వుండటంతో ఈ దాడుల సంఖ్య పెరుగుతోంది. యాసిడ్ ఆధారిత పరిశ్రమల్లో వలస కార్మికులు, గ్రామీణులు పనిచేస్తుండటంతో రసాయనాలు చేజిక్కించుకోవడం తేలికగా మారింది.
యాసిడ్ దాడుల వికృత చేష్టలు ఒక్క భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవి ఒక ప్రాంతానికో, ఒక దేశానికో పరిమితం కాదు. దక్షిణాసియా దేశాలతో పాటు లావోస్, చైనా, జపాన్, ఇథియోపియా, నైజీరియా, కెన్యా, మెక్సికో, జమైకా, గయానా, అల్జీరియా, ఉగాండా, అఫ్గానిస్తాన్, ఇరాన్, గ్రీస్, టర్కీ, అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, కంబోడియా యాసిడ్ దాడులు జరుగుతున్నాయి.
కక్ష, హింసించడం వంటి ప్రధాన కారణాలు యాసిడ్ దాడులకు పురికొల్పుతున్నాయి. ఎదుటి వ్యక్తి జీవితకాలం హింస అనుభవించేలా చేయడం, తన ప్రతీకార చర్య జీవితాంతం గుర్తుండిపోయేలా చేయడం, ఒక మనిషిగా సమాజంలో నిలదొక్కుకునే స్థితి లేకుండా చేయడం - వంటివి ఈ దాడుల నేపథ్యంగా మారుతోందని నిపుణులు విశే్లషిస్తున్నారు. సల్ఫ్యూరిక్, నైట్రిక్, హైడ్రోక్లోరిక్ యాసిడ్‌లు విరివిగా లభ్యం కావడం కూడా ఈ దాడుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయని వారంటున్నారు. చిన్న చిన్న కారణాలు సైతం ఈ దాడులకు పురిగొల్పుతున్నాయంటే వారిలో హింసాత్మక ధోరణులు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించడం కష్టమని వివరిస్తున్నారు. ప్రేమికురాలు పెళ్లికి నిరాకరించడం, భార్యపై అనుమానం, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు - కారణం ఏదైనా కావొచ్చు. ప్రత్యర్థిని జీవితంలో కోలుకోలేని దెబ్బతీయడమే ఈ దాడుల లక్ష్యమని స్పష్టమవుతోందని వారంటున్నారు. యాసిడ్ తీవ్రతను బట్టి శాశ్వత అంధత్వం, ముక్కు, పెదాలు, కనుబొమ్మలు కరిగిపోవడం, సత్వర వైద్యం అందకపోతే ఎముకలపైనా యాసిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, తద్వారా శాశ్వత వైకల్యానికి దారితీస్తుందని వైద్యులు విశే్లషిస్తున్నారు. నిందితులు శిక్షల నుంచి తప్పించుకోవడం, బాధితులకు, వైద్యం, పునరావాసంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడం వంటి లోపాలు బాధితులకు శాపాలుగా మారాయి.
యాసిడ్ దాడి నాటి చీకటి రోజులనుంచి అవార్డులు, ప్రశంసలు అందుకునే స్థాయికి ఎదిగిన లక్ష్మి అగర్వాల్ వంటివారి జీవన పోరాటం స్ఫూర్తిదాయకం. అలాగే షీరోస్ హాంగవుట్‌లో తనతో కలిసి అడుగులు వేస్తున్నవారి జీవితాలు కూడా దాదాపుగా ఇదే స్థాయి దుర్భరంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వారు మొహాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయి. ఒకప్పుడు చీకట్లు కమ్ముకున్న వారి జీవితాల్లో ఇప్పుడు వెలుగులు విరజిమ్ముతున్నాయి. నారీ శక్తి అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిన ఆ ఐదుగురు ఎంతోమంది బాధితులకు మార్గదర్శకం.

అందం అంటే...?!
అందం అంటే ఏమిటి? బాహ్య సౌందర్యమే అసలైన అందమా? ఈ ప్రశ్నలు వేసింది ఎవరో కాదు యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ మహిళా సదస్సుకు హాజరైన ఆమె ఈ ప్రశ్నలు సంధించారు. అందం అంటే ఏమిటో సమగ్రంగా నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. స్వచ్ఛమైన మనసు, ఆత్మసౌందర్యం, నిండైన ఆత్మవిశ్వాసమే అసలైన అందమని ఆమె నిర్వచించారు. అందాన్ని నిర్వచిస్తే, దానిపై అవగాహన కల్పిస్తే సమాజంలో వివక్షను, దాడులను నిరోధించగలమన్నారు. యువతులను అందవిహీనంగా చేసి పైశాచిక ఆనందాన్ని పొందేందుకు దుండగులు యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారని, మహిళలను ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు. పెళ్లి చేసుకోవాలంటూ తన వెంటపడిన పోకిరీ మాట వినలేదని తనపై యాసిడ్ పోశాడని లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను శిక్షించడం వరకే సరిపోదని, బాధితులకు పునరావాసం కల్పించడం పైనా దృష్టి పెట్టాలని అన్నారు. దేశ విదేశీ మహిళా ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో లక్ష్మీ అగర్వాల్ ప్రసంగానికి, సాధికారత సాధించిన తీరుకు ఆహూతులంతా లేచి నిలబడి ప్రశంసించడం విశేషం.

పురుషులూ బాధితులే
యాసిడ్ దాడులు కేవలం మహిళలపైనా కాదు, పురుషులకూ ఆ బెడద ఉంది. మొత్తం దాడుల్లో 85 శాతం మహిళలపై జరుగుతుండగా, మిగిలిన 15 శాతం పురుషులపైనే. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో గత ఏడాది జరిగిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. తన ప్రేమ నిరాకరించాడని, పెళ్లికి ఒప్పుకోలేదని పంతొమ్మిదేళ్ల బాలిక ఓ యువకుడిపై యాసిడ్ పోసింది. దీంతో అతను గాయాలతో బయటపడ్డాడు. విదేశాల్లోనూ పురుషులపై మహిళలు యాసిడ్ దాడులకు పాల్పడిన సంఘటనలున్నాయ.

- ఎస్. మోహన్‌రావు