S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి జగదీశ్‌రెడ్డిని అడ్డగించిన రైతులు

నల్గొండ: పిల్లాయిపల్లి కాల్వ ద్వారా తమ పొలాలకు సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డిని శుక్రవారం అడ్డుకున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద రైతులు మంత్రి కాన్వాయ్‌ను నిలిపివేసి తమ సమస్యలను తెలిపారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మంత్రిని రైతులు అడ్డగించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అనుమానాలు

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. తమ పొలాలకు నీళ్లు వస్తాయా? రావా? అని కొందరు, తమ ప్రాంత భూములకు తగిన నష్టపరిహారం ఇస్తారా? ఇవ్వరా? అని ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బలవంతంగా భూసేకరణ జరిపినా, నష్టపరిహారంలో అన్యాయం జరిగినా నిర్వాసిత రైతులకు తాము అండగా ఉంటామన్నారు.

రూ. కోటితో ఉడాయించిన మహిళ..!

విజయవాడ: చిట్టీల పేరుతో కోటి రూపాయలు వసూలు చేసిన ఓ మహిళ కనిపించకుండా పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నూజివీడులో నాగరత్నం అనే మహిళ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ కొంతమంది నుంచి కోటిరూపాయల మేరకు వసూలు చేసింది. ఆమె ఆచూకీ లేకపోవడంతో బాధితులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగరత్నం ఇంటి ముందు వారు ధర్నాకు దిగారు.

అక్రమ హోర్డింగ్‌లు కనిపిస్తే చర్యలు తప్పవు: కెటిఆర్

హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అక్రమ హోర్డింగ్‌లు, బ్యానర్లను తక్షణం తొలగించాలని మున్సిపల్ మంత్రి కెటిఆర్ శుక్రవారం నాడు జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. తన హోర్డింగ్‌ల విషయంలోనూ మినహాయింపు ఇవ్వనక్కర్లేదన్నారు. అక్రమ హోర్డింగ్‌ల వల్ల ప్రమాదాలు జరిగితే అందుకు అధికారులే బాధ్యత వహించాలన్నారు.

బిజెపికి గుణపాఠం ఖాయం: కేజ్రీవాల్

గాంధీనగర్: గుజరాత్‌లోని ఉనాలో దళితులపై దాడి ఘటన ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం నాడు ఉనాలో బాధిత దళితులను పరామర్శించారు. దళిత వ్యతిరేక విధానాలతో వ్యవహరిస్తున్న బిజెపి నాయకులకు త్వరలో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. గోవుల చర్మాన్ని తరలిస్తున్నారనే నెపంతో నలుగురు దళిత యువకులను కారుకు కట్టేసి గోసంరక్షణ సమితి కార్యకర్తలు చితకబాదడం దారుణమని కేజ్రీవాల్ విమర్శించారు.

టిడిపి, బిజెపి ఎంపీలకు విప్ జారీ

దిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఎపికి ప్రత్యేకహోదా కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుపై ఈరోజు రాజ్యసభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నందున తమ పార్టీ ఎంపీలు సభలోనే ఉండాలని టిడిపి, బిజెపి విప్ జారీ చేశాయి. తన పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ ఇదివరకే విప్ జారీ చేసింది. ప్రైవేటుబిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు టిడిపి నేతలు ఇప్పటికే ప్రకటించగా, బిజెపి వైఖరి ఇంకా బహిర్గతం కాలేదు. కాంగ్రెస్ ఎంపీ ప్రవేశపెట్టిన బిల్లు బిజెపి సహకరిస్తుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఓటింగ్ జరిగినపుడు బిజెపి వైఖరి బయటపడే అవకాశం ఉంది.

అట్రాసిటి కేసులు సత్వరం పరిష్కరించాలి

విజయనగరం, జూలై 21: జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ కాళిదాసు పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డిఎస్పీలు, సిఐలతో జిల్లావ్యాప్తంగా నమోదైన అట్రాసిటీ కేసులపై సమీక్ష నిర్వహించారు. అట్రాసిటీ సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందించి అవసరమైన ఆధారాలు, సాక్ష్యాలు సేకరిస్తే కేసుల సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని, బాధితులకు న్యాయం జరిగితే చట్టాలపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. అట్రాసిటీ కేసుల విషయంలో పోలీసు అధికారులు పక్షపాత వైఖరి లేకుండా వ్యవహరించాలని తెలిపారు.

మహిళా సంఘాలకు చేపల పెంపకం బాధ్యత

విజయనగరం, జూలై 21: జిల్లాలో చేపల పెంపకానికి అనువైన వాతావరణం, అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. గ్రామ పంచాయతీల తీర్మానంతో ఆయా గ్రామాల పరిధిలోని చెరువులను మహిళా సంఘాలకు అప్పగించి అక్కడ చేపల పెంపకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో మత్స్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 417 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న 1593 చెరువులను గుర్తించి గ్రామ పంచాయతీల తీర్మానంతో మహిళా సంఘాలకు కేటాయించామని కలెక్టర్‌కు అధికారులు తెలిపారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి

విజయనగరం, జూలై 21: జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అధికారులు సహకరించి అనుమతులు త్వరగా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశంలో చైర్మన్ హోదాలో పాల్గొన్న కలెక్టర్ నాయక్ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులు, పరిశ్రమలు ఏర్పాటుచేస్తే ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు, వౌలిక వసతుల కల్పన, భూ కేటాయింపులు అంశాలపై ఆయాశాఖల అధికారులతో చర్చించారు.

అభివృద్ధి పనులపై శే్వతపత్రం విడుదల చేయాలి

విజయనగరం(టౌన్), జూలై 21: మున్సిపాలిటీలో ఈ రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై శే్వతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు డిమాండ్ చేశారు. గడపగడపకూ వైకాపా కార్యక్రమంలో భాగంగా గురువారం 19వ వార్డు స్టేడియంపేటలో పాదయాత్ర నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రూపొందించిన ప్రజా బ్యాలెట్‌ను ఇంటింటికి పంపిణీ చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. పాదయాత్రలో అనేక సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని తెలిపారు.

Pages