S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత్స్యకారులను ఆదుకోవాలి: ఎంపి

శ్రీకాకుళం, నవంబర్ 22: రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా తడ నుంచి ఇచ్ఛాపురం వరకు సువిశాల తీరం వెంబడి వేటే జీవనాధారంగా కుటుంబాలను నెట్టుకొస్తున్న మత్స్యకారులను ఆదుకునే కార్యక్రమాలు అమలు చేయాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్‌నాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్ సింగ్‌కి వినతిపత్రం అందించారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం ఎంపి రామ్మోహన్‌నాయుడు వెళ్లి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల స్థితిగతులను వివరించారు.

సక్రమంగా పనిచేసి ప్రాజెక్టును కాపాడుకోండి

సారవకోట, నవంబర్ 22: సక్రమంగా విధులను నిర్వహించి ప్రాజెక్టును కాపాడుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలకు స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి చింతాడ ఇందిర కోరారు.

నోట్ల మార్పిడిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి

విజయవాడ, నవంబర్ 22: రాబోయే 10 రోజులలో జిల్లాలో ఉన్న అధికారులంతా టీమ్ కృష్ణా స్ఫూర్తితో పనిచేయాలని కలెక్టర్ బాబు ఎ చెప్పారు. మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులు, తహశీల్దార్లు, బ్యాంకు మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్లకు నోట్ల రద్దుపై క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా ప్రోత్సహించాలో వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో ఉన్న పరిస్థితులు, వివిధ బ్యాంకుల్లో ఉన్న జన్‌ధన్ ఖాతాలు, రూపే కార్డుల గురించి బ్యాంకు మేనేజర్లతో, మండల తహశీల్దార్లతో మాట్లాడారు.

పులివెందులకూ సాగునీరు టిడిపి ఘనతే..

మైలవరం, నవంబర్ 22: పట్టిసీమ ప్రాజెక్ట్ శుద్ధ దండగనీ, కమీషన్ల కోసమే నిర్మిస్తున్నారని ఆరోపణలు చేసిన వైసిపి నాయకులు దానిద్వారా వచ్చిన సాగునీటితోనే పంటలు పండించుకుంటున్నారని, పులివెందులకూ సాగునీరిచ్చి చీనీతోటలు కాపాడిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టీకరించారు. టిడిపి జనచైతన్య యాత్రల్లో భాగంగా మంగళవారం ఆయన మండలంలోని వెల్వడం, తోలుకోడు, గణపవరం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.

బ్యాంక్ లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా!

మచిలీపట్నం, నవంబర్ 22: ఇప్పటివరకు బ్యాంకుల్లో సిసి కెమెరాలు నిఘా నేత్రాలుగా పనిచేశాయి. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆదాయ పన్నుల శాఖ అధికారులు కూడా బ్యాంకుల్లో నిఘా పెట్టారు. సామాన్య ప్రజానీకం మాదిరిగా బ్యాంక్‌ల్లోనే సంచరిస్తూ ఆర్థిక లావాదేవీలపై కనే్నశారు. పరిమితికి మించి నగదు డిపాజిట్లు చేస్తున్న బ్యాంక్ ఖాతాదారులను గుర్తించే పనిలో ఐటీ అధికారులు నిమగ్నమయ్యారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజల బ్యాంక్ ఖాతాల్లో ఇబ్బడిముబ్బడిగా సొమ్ము వచ్చి పడుతోంది.

వారంలో వైద్యుల పోస్టులు భర్తీ

కూచిపూడి, నవంబర్ 22: ప్రజలకు ఉత్తమ వైద్యసేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలో రూ. 1.18 కోట్లతో ఏడు పిహెచ్‌సిలు అదనంగా నిర్మించినట్లు డిఎంహెచ్‌వో డా. ఆర్ నాగమల్లేశ్వరి తెలిపారు. జిల్లాలోని గంపలగూడెం, చింతలపాడు, వీరంకిలాకు, రుద్రపాక, ముదినేపల్లి, వీరులపాడు, జలదేవరపల్లి గ్రామాల్లో పిహెచ్‌సిల నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను వారంరోజుల్లో ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

పేదల అభ్యున్నతే చంద్రబాబు ధ్యేయం

తోట్లవల్లూరు, నవంబర్ 22: రాష్ట్రంలోని పేదల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్, పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల రామయ్య అన్నారు. మండలంలోని గరికపర్రు, కుమ్మమూరు, యాకమూరు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఆయన పార్టీ నాయకులతో కలిసి జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. తొలుత గరికపర్రులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా రామయ్య మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.

టిడిపికి రికార్డు స్థాయ భారీ సభ్యత్వాలు ఖాయం

పామర్రు, నవంబర్ 22: ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక వ్యక్తి అయినా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని, ఈసారి రికార్డు స్థాయిలో జిల్లాలో సభ్యత్వం నమోదు కానుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు ఉత్సాహంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. పార్టీ సభ్యుని కుటుంబానికి పార్టీ కట్టే జీవిత బీమా రక్షణగా వుంటుందన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్త, నాయకుణ్ని పార్టీ గుర్తిస్తుందన్నారు.

కారు ఢీకొని వృద్ధుడి మృతి

హనుమాన్ జంక్షన్, నవంబర్ 22: బాపులపాడు మండలం వేలేరులో మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. సైకిల్‌పై వెళుతున్న వృద్ధుడ్ని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. హనుమాన్‌జంక్షన్ ఎస్‌ఐ తులసిధర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దోనవల్లి త్రినాథరావు(60) పంచాయతీ కార్యాలయం వద్దకు సైకిల్‌పై వస్తున్నాడు. ఈ సమయంలో రేమల్లె వైపు నుంచి హనుమాన్ జంక్షన్ వస్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో త్రినాథరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మణికంఠకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్డం కోసం మృతదేహాన్ని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాంగ్రెస్ దేశాన్ని లూఠీ చేస్తే... బిజెపి డ్యూటీ చేస్తోంది

విజయవాడ, నవంబర్ 22: కాంగ్రెస్ పార్టీ దేశాన్ని లూటీ చేస్తే, భారతీయ జనతా పార్టీ డ్యూటీ చేస్తోందని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి చల్లపల్లి నరసింహారెడ్డి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం విలేఖర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఏళ్ల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజాధనాన్ని లూటీ చేయగా, భారతీయ జనతా పార్టీ డ్యూటీ చేస్తూ ప్రజల కోసం పాటుపడుతోందన్నారు. నల్ల కుబేరుల వద్ద మూలుగుతున్న నల్లధనాన్ని బయటకు రప్పించేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు.

Pages